మూలాలు ఎక్కడో వున్నా, తెలుగు భాషా సాహిత్యాలతో నిండా ప్రేమలో పడ్డవాడు పరేశ్ దోశి. సొంత భాష ఎల్లలు దాటి, తెలుగును అక్కున చేర్చుకున్న ఇలాంటి వ్యక్తిత్వాలు మనకు చాలా తక్కువగా తెలుసు. వాళ్ళకి తెలిసినన్ని భాషా రహస్యాలు నిజంగా ఆ భాషలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలియకపోవచ్చు. పరేశ్ ని చూసినప్పుడల్లా ఎవరికైనా ఇదే ఆశ్చర్యం. ఇంత ప్రేమా, ఇంత తపనా, ఇంత నిలకడగా కృషి చేయడం వెనక పరేశ్ ని నడిపిస్తున్న శక్తి ఏమిటా అనిపిస్తుంది. “వరదగుడి” మొదటి ప్రచురణ 2021 లో “ఛాయ” ప్రచురించినప్పుడు అమితమైన ఆదరణ దక్కింది. ఇప్పుడు రెండో ముద్రణ కూడా వెలువడింది. అనువాద సాహిత్యంలో ఇది కొత్త జయకేతనం! ఈ సందర్భంగా సారంగ పరేశ్ దోశి ని పలకరించింది.
ఈ అనువాదాలు రెండో ముద్రణకి వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తోంది?
సహజంగానే సంతొషంగా వుంది. పుస్తకాలు చదవడం తగ్గిన కాలంలో రెండో ముద్రణ అంటే ఎవరికైనా సంతోషమే కదా. అనువాదాలు చేస్తున్నప్పుడు ఎక్కువ ఆలోచన లేదు గానీ ఇప్పుడు మాత్రం అనువాదం ఒక విలువు వున్న పనిగా గుర్తిస్తాను. ఒక పాఠకుడిగా నా ప్రపంచాన్ని మరింత విశాలం చేసింది కూడా ఇంతమంది చేసిన అనువాదాలే కదా.
చాలా అనువాదాలు చేసిన అనుభవం మీకుంది కదా?! అనువాదం గురించి మీ ఆలోచనలు యేమిటి?
నేను ఇంటర్మీడియేట్ లో వుండగా అనువాదాలు మొదలు పెట్టాను. అప్పుడు టీనేజ్. సహజంగానే నా పేరు అచ్చులో చూసుకోవాలి అన్న ఆసక్తి ఒక కారణం అయితే, నాకు నచ్చిన కథ, అది చదువుతున్నప్పుడు నాలో కలిగిన ప్రకంపనలు ఇతరులతో పంచుకోలేకుండా వుండలేనితనం సృష్టించాయి. నా మిత్రులతో చర్చలు సరే, కానీ అది సరిపోదు. తెలుగు వొచ్చు. చేతికి వ్రాయాలనే దురద ఉండనే ఉంది. ఇక అనువాదాలు చేయడం మొదలు పెట్టాను. తెలుగులో కేవలం అనువాద కథల కోసమని ప్రత్యేకంగా విపుల అనే పుస్తకం వుండడం కూడా కలిసొచ్చింది. నేను చాలా అంటే చాలా విరివిగా అనువాదాలు చేసే వాడిని. ఒకటో రెండో ప్రచురణకు తీసుకుంటే కార్డు మీద టైప్ చేసి త్వరలో ప్రచురిస్తామని కబురు పంపే వారు. ఎక్కువ వుంటే లెటర్ హెడ్ లో మీ ఈ దిగువ కథలు వీలు వెంబడి ప్రచురిస్తాం అని తెలిపేవారు. ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటే నాకు రెండు విషయాలు అర్థం అవుతున్నాయి. ఒకటి ఏమిటంటే ఇలాంటి కథలు చదవడం వల్ల నా ఆలోచనా పరిథి, appreciation పెరిగాయి. రెండోది : నాకు వ్రాయడం అనే అభ్యాసంగా ఆ శ్రమంతా పనికొచ్చింది. వాక్య నిర్మాణాలు మెరుగు పడుతూ వచ్చాయి.
“వరద గుడి”లో మీకు బాగా నచ్చిన రెండు కథలు? ఎందుకు నచ్చాయి?
నా మొదటి అనువాద కథ అమృతా ప్రీతం గారిది “జల్లెడ”. పూర్తి పేరు ఒక రూమాలా, ఓ ఉంగరం, ఓ జల్లెడ. వాళ్ళు దాన్ని కుదించి జల్లెడ అని పెట్టారు. ఆ కథ నాకు అప్పుడు ఎంత నచ్చిందో ఇప్పుడూ అంతే ఇష్టం. అమృతా ప్రీతం కవి, అయితే ఆమె కథలు కూడా చాలా బాగా వ్రాసింది. వీలు చిక్కినప్పుడంతా కవితాత్మక వచనం. మనిషి మనసు లోతుల్లోకి వెళ్ళిపోయి కథలు చెబుతుంది ఆవిడ. Straight from heart to heart. కథంతా ఇద్దరు స్త్రీల మధ్య నడిచిన ఉత్తరప్రత్త్యుత్తరాల ద్వారా చెప్పారు. ఇద్దరూ బడిలో కలిసి చదువుకున్న వారు. ఇద్దరికీ ప్రేంలు ఉన్నా ప్రేమించిన వ్యక్తితో కాకుండా ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరిగాయి. తమ బాధ ఎవరితోనూ చెప్పుకోలేరు, పరస్పరం తప్ప. కథకురాలికి తన ప్రేమికుని నుంచి చేతిరుమాలా బహుమతిగా వచ్చింది. అతని పేరులోని మొదటి అక్షరం కుట్టి వున్న చేతిరుమాలా. అత్తవారింట్లో దాన్ని ఎలా దాయడం? బంతీ (స్నేహితురాలు) సలహా మీద ఆ అక్ష్రం కుట్లు విప్పేస్తుంది. అంతకంటే ఏం చేయగలదు ఈ దేశంలోని మామూలు స్త్రీ. బంతీ పెళ్ళి కూడా ప్రేమించిన మనిషితో కాకుండా వేరే వ్యక్తితో జరిగింది. తన దగ్గర కూడా ప్రియుని జ్ఞాపకంగా వున్న జల్లెడ, ఉంగరం ఉన్నాయి. వాటిని ఒక కుంపటిలో దాచి పెట్టి, నెలకో సారి ఆ కుంపటిని పగల గొట్టి కొత్తగా మట్టి తో కుంపటి తయారు చేస్తుంది, మూసివున్న గదిలో. ఆ కాసేపు ఆ దాచిన వస్తువులను గుండెలకు అదుముకుంది తనివి తీఆ. ఇద్దరు స్త్రీల తిరుగుబాటు లేదు, కోప ప్రకటన లేదు. వ్యథ మాత్రం వుంది. వాస్తవం ఎలాంటి అలంకరణ లేకుండా ఉంది. చదువరి గుండెలను ద్రవింప చేసేలా వుంది. చదువరిలో మార్పు తెచ్చే పధ్ధతే ఇది కూడానూ.
నాకు నచ్చిన రెండో కథ బెంగాలీ కథ “దుఃఖం “. రచయిత సంతోష్ కుమార్ ఘోష్. ఆమె పెళ్ళి ఏమీ తెలీని చిన్నతనంలోనే అయిపోయింది. భర్త మిత్రుడు సతీష్ కలవడానికి వస్తుండేవాడు. ఆమె చేత కూడా పుస్తకాలవీ చదివించేవాడు. తనలాగే తయారు చేసాడు. అతని సాన్నిధ్యంలో ఆమెకు బాగుండేది. కానీ అత్తగారికి, భర్తకీ నచ్చ్హేది కాదు. భర్తకు బదిలీ అయ్యింది. కొన్నేళ్ళకి అనిల్ పుట్టాడు. సతీష్ రాకపోకలు తగ్గాయి. క్రమంగా భర్త తన భార్య సతీష్ ల మధ్య స్నేహాన్ని అర్థం చేసుకునేంతగా ఎదిగాడు. అనిల్ కి మాత్రం తేడాగా అనిపించేది, విసురుగా మాట్లాడేవాడు, సతీష్ మామయ్య ఎందుకు రావాలి మనింటికి? నాకంతా తెలుసులే అనేవాడు, తండ్రి చేత దెబ్బలు తినేవాడు. కొన్నేళ్ళకి భర్త చనిపోయాడు. నేనిక రాను, మీ పిల్లలకు నచ్చదు అంటాడు సతీష్. అదేం కుదరదు ఇది నా ఇల్లు, నా ఇష్టం నువ్వు రావాల్సిందే అంటుందామె. ఒక వాక్యం చూడండి ఎంత క్లుప్తతో : ” మా వయసు పెరిగింది. సతీష్ కు చేతికర్ర నాకు కళ్ళద్దాలు వచ్చాయి.” అలా 50లు 60లు కూడా దాటిపోయాయి. ఆమె మేడ మీద గదిలో వుండేది. సతీష్ కి గుండె పోటు వచ్చినప్పటినుంచీ డాక్టరు మెట్లు ఎక్కవద్దన్నాడు. ఆమెకు కీళ్ళ నొప్పులని కిందకు దిగలేదు. ఏది ఎలా వున్నా సతీష్ రోజు హాజరు వేయించుకునే వాడు. ఆమె అతని చేతి కర్ర చప్పుడు కోసం ఎదురు చూసేది. ఒక రోజు బాత్రూంలో కాలు జారి పడి మరి ఇక లేవడు సతీష్. అతని మరణవార్త తల్లికి తెలీకూడదని పిల్లలు ప్రయత్నిస్తారు, ఆమె తట్టుకోలేదని. దుఃఖం చాలా రకాలుగా వుంటుంది కదా. ఇప్పుడామె ఏడుస్తుంది మరణించిన సతీష్ కోసం కాదు. తన మరణం కూడా దగ్గరలోనే వుందన్న ఆలోచనతో. దీంట్లో రకరకాల జీవిత సందర్భాల్లో దుఃఖం ఎలా వుంటుందో బాగా వ్రాశారు.
ఇందులో మీరు గుజరాతీలో రాసిన కథ వుంది. ఆ భాషలో మీ కృషి గురించి చెప్పండి
చెప్పాగా అప్పుడు టీనేజ్ కుర్రాడినని. చాపల్యం ఎక్కువ. Tried to eat more than I can chew. కొన్ని తెలుగు కథలు గుజరతీలో అనువదించాను. సినిమా రివ్యూ ఒకటి వ్రాసాను. ఒక కథ వ్రాసాను. నేను ప్రవాస గుజరాతీని. గుజరాతీ స్కూల్లో మూడో తరగతి వరకే గుజరాతీ నేర్పేవారు. మనకు వచ్చిన భాష సంకర భాష. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వుంటుంది కదా భాష. భాష వచ్చినా రానట్టే. పైగా ఎక్కువ ఆలోచించేది తెలుగులోనే. కాబట్టి తెలుగే నా మాతృ భాష. ఇంగ్లిషులో కూడా ఒక కవిత Indian Express లో వచ్చింది. త్వరలోనే విషయం అర్థం చేసుకుని తెలుగు మీద ఫోకస్ పెట్టాను. త్రిపురనేని శ్రీనివాస్ పరిచయమయ్యాక కవిత్వం కూడా వ్రాసాను. అతను హెచ్చరిస్తూనే వున్నాడు రెండు పడవల ప్రయాణం మంచిది కాదు అని. వచనం విస్తృతికి అవకాశం ఇస్తే, కవిత్వం క్లుప్తతకి. రెంటి నిర్మాణాలు కూడా భిన్నం. కొందరు మహానుభావులు రెండూ చేసి ఒప్పించగలిగారు. నీకా నమ్మకం వుంటే అలానే సాగిపో, నిర్ణయం నీదే అన్నాడు. కానీ నేను పప్పులో కాలేసినట్టే. చాలా త్వరగా పెన్ సన్స్యాసం చేసాను. అటూ ఇటూ కాకుండా పోయాను.
ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునేది మీ వచనం- ఇలాంటి వచనం మీకు ఎలా అబ్బింది?
నేను చిన్న పిల్లల పుస్తకాలు చదవలేదు. మొదలు పెట్టడమే యద్దనపూడి నవలలతో, సీరియళ్ళతో మొదలు పెట్టాను. మిత్రులు అందరూ తెలుగు వాళ్ళే. వూరు విజయవాడ. ఇక తెలుగు రాక చస్తుందా? నేను చదివిన పుస్తకాలే నా తెలుగును తీర్చి దిద్దాయి. ఒక్కటే రెగ్రెట్. చదివి నేర్చుకున్నాను గానీ విని నేర్చుకోలేదు. అందుకే నేను అందంగా సహజంగా సంభాషణలు వ్రాయలేను. క్లుప్తత, సరళత, ముక్కుసూటిగా వచనం : ఇవి నాకు ఇష్టం. ఇలాంటివే చదివి ఎంజాయ్ చేసా. ఇలాగే వ్రాస్తాను. అంత కంటే ఎక్కువ నాకు తెలీదు.
*
వరద గుడికి నేను ముందుమాట రాసిన రోజులు గుర్తొస్తున్నాయి అందులో ప్రతి కథ ఆణిముత్యం అనే భావన నాది. పreష్ గారు ఇలాగే మరిన్ని కథలు రాయాలి
క్లుప్తత, సరళత, ముక్కుసూటిగా వచనం : ఇవి నాకు ఇష్టం. ఇలాంటివే చదివి ఎంజాయ్ చేసా. ఇలాగే వ్రాస్తాను. అంత కంటే ఎక్కువ నాకు తెలీదు…congratulations to పరేశ్ దోశీ garu.
Good Interview by saaranga.