(కవి, మంచి మిత్రుడు అయిల సైదాచారి కనుమూసి ఇవాళ్టికి ఏడాది)
నిన్ను గుర్తు చేసుకొనే సందర్భం ఏదయినా చిరునవ్వు, ఉత్సాహం, ఆప్యాయత మట్టి అంటని సజీవ దృశ్యం. అనంతపురం రోడ్లల్లోనో, చెరువుకట్ట మీదో, ఇల్లు కప్పు కిందనో చేసిన చర్చలు ఆకాశాన్ని, చెట్లకొమ్మల శిఖరాల్ని తాకి వర్షం కురవకుండా వృథా అయినది లేదు ఆ తొలినాళ్ళల్లో. అలాగే ఊరకే అట్లా మౌనంగా కూడ నడిచాము. దేహాల్ని మరిచి నడిచాము. దృష్టిలేని దృక్పథాలు జొరబడనీని దృక్కులు తాకనీని ఎరుకతోనూ నడిచాము.
మనం ఏ పూటకు ఆ పూట బతికే జీవితాల జీతాల డాబు వుద్యోగాల్లో వూర్లు పట్టుకొని తిరగడం ఓ దరిద్రపు తల్లి చంకలో తిరుగుతున్న లోకాన్ని చూసిన బిడ్డ సంభ్రమాన్ని పొందుతున్న రోజులు అవి. స్వజీవితాల తలపులలో మెదిలే గుర్తులు. అలాగే విశ్వం నుండి జారిపోతున్న మనల్ని, మన నుండి జారిపోతున్న విశ్వాన్ని సీరియస్‌గా పట్టుకోవడానికి చెడుగుడు ఆడుతున్న రోజులు కూడా. ఆకాశంలో హరివిల్లుకు నేల నుండి వుబికి పైకి లేచే వూటకు మధ్య కవిత్వాన్ని అందంగా శృతి చేసి ఎక్కుబెట్టే విద్యను అభ్యసిస్తున్న రోజులు.
ఇంట్లో జుట్టును దువ్వుకొని బయటికి వెళ్ళేటప్పుడు చెరుపుకొని – రహస్యంగా మన ఆస్తుల్ని కీర్తుల్ని, ఎవరి జేబులోకో విసిరి వున్న గుడ్డి దీపాల్ని ఆర్పుకొని, చీకట్లో నైనా దారి తెలియకున్నా నడిచిపోదాం. సరళరేఖల్ని, గానుగ వృత్తాల్ని వుమ్మినద్దిన వ్రేళ్ళతో చెరిపేద్దామని అచ్చం ఇప్పటి నీపాదాల్లో ఆలోచించాము.. నీకు నాకు మధ్య మన వుద్యోగాలు సరిహద్దుల్ని తెంచేశాయి. ఆ తరువాత అప్పట్లోలా గడిపింది. తడిసింది, పెద్దగా లోతులు చరిచింది పెద్దగా లేదు. నిన్ను కవిత్వంలోనే బాగా చూస్తూ వచ్చాను. మన నుంచి నీవు తప్పిపోయావా? తప్పించుకో చూసావా? అని గుండెకు దగ్గరగా నీ కవిత్వాన్ని హత్తుక్కొనేవాన్ని.
** **
అమాంతం అందుకొని అదుముకొనే దగద్ధగాయమానమైన స్త్రీమోహాన్ని తపించావు విముక్త ప్రపంచపు దారులలోకి ద్వారం తెరిచే లిబరేటెడ్ వుమెన్ ను స్వప్నించావు. సున్నితమైన స్త్రీలు వీణల్ని వాయిస్తున్నప్పుడు ఆ మునివేళ్ళ చివరన వొరుగుతూ ఫెమినైన్ స్వరాలల్తో చిత్రకారులు కుంచెల్నుంచి జారుతుతున్న దేహాల్లో మ్యాస్కులిన్ రంగులై నగ్నంగా కాన్వాసుల మీద విశ్రమించావు. లోకం నిన్ను వారి కళాకారుడిగా, వ్యర్ధుడిగా నిన్ను నిందుతున్ని చేయవస్తే ఏమి?! కవిత్వాన్ని సాహిత్యాన్ని వుద్యమంగా తెలివిగా లాకెళ్ళి సొంతగణం నాయకత్వానికో, కొత్తగా వచ్చే ప్రభుత్వాల ఆధిపత్య పార్టీలకు జనాన్ని పెట్టుబడి చేసే వెంచర్ క్యాపిటలిస్టుగా – చాలామందిలా నీవు ఆలోచించలేక పోయావు గదా! ఏవో నిందలు, గుసగుసలు తప్పవేమో.
సకలలోక నివాసువుడవయి, హశ్శరభశ్శరభుడయి, విభూదిపెట్టుకొని వ్యవస్థను శపించావు. కానీ ప్రేమ నిండిన మనష్యుల మీద, ఆకలిగొన్న కడుపుల మీద పొలి చల్లుతూ వచ్చావు. కులవృత్తిలో, వృత్తికలలో పేదరికం రాజేసిన కొలమి నిప్పుల్లో కూడా నీ వర్గం తల్లివేరును నీవు మరిచి పోకుండా చూశావు- మధ్యతరగతి బడాయి మైకం కమ్మకుండా.
అఖండ సృజన కొన్ని క్షణాల అనుభవ విలాస హాసాన్ని వినపడలేదని అక్షరాలలో కలగంటూ కనడం చూస్తూ వేయి పాలిండ్లతో పాలు గుడపటం చేశావు. దాని పుటుక మొదలు అదిపోయేదాకా దాని వొళ్ళోనే వూయలు వూగావు. పుడుతున్నప్పుడు ఏడ్వనీయక, పోయేదాకా నవ్వనీయక వుండే ఆ అఖండ సృజన ఆనందానుభవాన్ని ఆస్వాదించావు.
గడ్డం వెంట్రుకల ఆగంతకున్ని పట్టుకోవటంలో ఎన్నో ఏళ్ళుగా శోధిస్తూ ప్రపంచాన్ని, నిన్ను విస్తృతపరుచుకొంటూ కొంత రంగుల్లో సరికొత్త సమన్వయరాగాలతో కవిత్వాన్ని తేజోవంతం చేస్తూ వచ్చావు. ఆ ఆగంతకుడు నీవు ప్రవేశించే దేహంలోకే జొరబడి వాడి నెత్తుటి కణాలు, వీర్యపు చుక్కల్ని బహుముఖాల్లో నిన్ను నీ సమాధి నిర్మాణానికి సిద్ధం చేయాటాన్ని గ్రహించావు. నీవు దాన్ని నిలువరిస్తూ అంతఃసీమల్లో కవిత్వాన్ని ధ్వజస్తంభంగా నిలపడానికి ప్రయత్నించావు. “ఆమె నా బొమ్మ ‘ నుండి నీలంమాయ..’ వరకు ఎంత జీవితం . ఆ పూర్వం ఆ తర్వాత…. ఆగని ఎంతటి దుర్భర బీభత్స క్షణాల బాధను అనుభవించావు, ఇంటా బయటా.
** **
బొమ్మని కాలదన్నిన అపరాధానికి దేశదిమ్మరి అయ్యావని తెలిసినవాడివి. మొదటి అనుభవాలన్నీ చివరి అనుభవాలు. వాటిని మరింత పొడిగించటం. అనుభవం ముందు అద్దాలు పెట్టి పునర్బింబాలుగా, ప్రతిబింబాలుగా చూడటంలోని దు:ఖం ఎరిగిన వాడివి. ద్వేషాలు కురిసిన కాలాల్ని రహస్యంగా దాచుకొన్నావని ఎరుక గలిగిన వాడివి. ప్రేమించలేక పారియొచ్చిన వాడు మరో స్త్రీ నుండి కూడా తప్పించుకోగలడనే సత్యాన్ని గ్రహించటానికి మనో శ్మశానాల వెంట, ధ్యానాల వెంట మళ్ళీ తిరగాలని గ్రహించిన వాడివి. బతుకంతా ఇలా ఒకే బావినే తవ్వుతూ రకరకాల రంగుల మట్టి అస్థికలు, పంజరాలు, చీకటి శూలాలకు కళ్లు బైర్లుకమ్మి జల పడిందాకా తవ్వలేక అన్య ప్రపంచాన్ని ఆస్వాదించలేనని తెలిసిన స్వజ్ఞానివి కూడా. బురద అంటని సరస్సును, బూడిద అంటని శ్మశానాన్ని, విముక్త బంధ స్త్రీత్వాన్ని స్వప్నిస్తూ దు:ఖంగా కరగటంలో ఉపశమిస్తూ కవిత్వంలో తప్ప వూపిరి పీల్చలేని వాడివి.
తీరని కోర్కెలు, ఉద్వేగ పూరిత కలలు, ఆచరణలేని ఆదర్శాలు, మేధోపరభ్రమలు ఎప్పుడో ఒకప్పుడు దాటి ‘శూన్యద్వారం’లోకి అడుగులేసి ఆవలి అనుభవాన్ని తాకినవాడివి అక్కడ నిలవలేక సౌందర్యం, ఆనందం, శాంతి స్వప్నంగా మిగిలినవాడివి. నీవు విశ్వరూప మృత్యు బీభత్సాన్ని చిరాక్షరాలతో కవిత్వంగా జపిస్తూ ‘మహా పాదముద్ర’ వేస్తే జిమ్మిన నీటి బుగ్గమీద నడిచి వెనక్కు తిరగకుండా మబ్బుల్ని దాటి నిన్ను నిన్నుగానే మిగుల్చుకొన్న వాడివి.
** **
స్త్రీని అర్థం చేసేకొనేందుకు స్త్రీని ఆవాహన చేశావు. దేహాన్ని చదివేందుకు దేహాన్ని రద్దు చేసుకొన్నావు. నిన్ను మాయం చేసుకొని మహాశూన్యం ముందు మోకరిల్లావు. స్త్రీని ఉపాసిస్తూ బహుముఖాల శృతిస్తూ అర్ధనారివి కూడా అయ్యావు. నీలోని స్త్రీకి తాకిన మచ్చను, నీకు అంటిని మచ్చను, నీవైన మచ్చను నీ ఏ తాంత్రిక భావనా శ్రద్ధో, ఏ మ్యూటేషన్ నో జరిగి దాన్ని కరిగించేసింటే ఎంత బాగుండుననే ఆలోచన వస్తుంది- నిన్ను స్మృతిస్తుంటే. అలాగే అన్నమయ్య కీర్తన స్ఫురణకు వస్తోంది.
అన్నమయ్య స్త్రీ అయి, స్త్రీ అయిన పురుషుడై బహువిధ వుద్వేగాలతో, రెండూ తానయి సహస్రాది కీర్తలనతో తన చుట్టూ తిరిగే ‘తనను’ అధిగమించేందుకు ప్రయత్నం చేశాడు. అందులో ఒక్కటి ఆనాటి శృంగార తాత్త్విక మార్గాన్ని కీర్తన గుర్తు చేస్తుంది. ఒక్కసారిగా అదేదో పొందకుండా ఇంకా ఇంకా అందుకొనే యాతనలోనే పొందేందుకు చేసే వెతుకులాట తొలగిపోయే వలపుసిరి మార్గం బోధపరిచే కొన్ని ప్రధాన పాదాలు-
అంత సిగ్గువడకువే అతివ నీవు
పంతమునఁ దెలియవే పాయమెల్ల గడువు
గొంది నొక్కసింహమట కొండలు మోచినదట
ఇందుముఖులనడుమె యిరవట
కందువ యీ పొడుపుడుఁగత యిది నీవు నాకు
అందముగ నానతీవే ఆరునెల్ల గడువు
మొగి నొక్కక తామరలో మోవిపండు వండెనట
జిగిఁదేనె వావాతఁ జిందెనట
మగువ యీయారచి మతి నీవు దెలియవే
తొగరు నీపలుకుల తుదదాకా గడువు
కంతునిగురుతు రెండుగంబముల మేడట
దొంతి వలపులసిరి దొలఁకునట
ఇంతి నేను శ్రీవేంకటేశుడ యీకత
మంతనాన నిన్నుఁ గూడి మరపించేగడువు
(1. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగార కీర్తనలు, సంపుటం – 24, పుట – 3)
కామదహనాన్ని గొప్పగా చెప్పుకొనే శైవమార్గంలో కామోత్సవాన్ని కూడా యోగంగా చెప్పిన అన్నమయ్య కీర్తనను నేను శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడను కాకుండా (భక్తున్నే కాని ఏ స్వామికి కాదు) అందులోని భావార్థశోధనను వ్యక్తం చేయడం అనౌచిత్యం కాదనుకొంటూ ముగిస్తున్నాను.
*
” సైదాచారి కవిత్వం సగపాలు ప్రేమ, మోహంతోనూ; తతిమ్మాభాగం దగాచేసిన కులవృత్తి, స్వస్థలం మీద బెంగ, ఆగమ మృత్యుస్పృహ ఇత్యాది స్మృతులు, అనుభూతి తంతువులగానూ అల్లుకుని ఉంటుంది. కవి ప్రకటించిన ఆరుపదులలోపు కవితలలో తొలిపదం ‘దుఃఖం’ కాగా ఆఖరి శీర్షిక ‘చరమశాంతి’ ” ~ నామాడి శ్రీధర్
” సైదాచారి చిక్కటి కవిత్వం రాశాడు. ఈ తరానికి చెందిన కవులు కొందరిని కొన్ని కోవలుగా విభజిస్తే అనంత్, నామాడి శ్రీధర్, సిద్ధార్థ, ఎం.ఎస్.నాయుడు, సీతారాం, దెంచనాల శ్రీనివాస్‌ల కోవకు చెం దినవాడు అయిల సైదాచారి. అయిల సైదాచారి కవిత్వం కొత్తదనానికి, లోతైన తాత్త్విక ఆలోచనలకు చిహ్నం. స్త్రీ మీద అపారమైన గౌరవంతో, ప్రేమతో ఆయన కవిత్వాన్ని రాశాడు.
సైదాచారి కవితలను కె.శ్రీనివాస్, అఫ్సర్, ప్రసేన్ లాంటి సాహితీ వేత్తలు ఇష్టంగా అచ్చువేశారు. “