1
చైనా యుద్ధ కాంక్ష వార్తలు చూస్తూ నిద్రపోయింది ఊరు.. నులక మంచం మీద మదారు, నవారు పట్టెల పక్కలో దానేలు, పట్టె మంచంపై వెంకన్న…నిద్దురలో అందరిదీ ఒకే కల పిల్లల చేతుల్లో బంతిలా గ్లోబు గుండ్రంగా కనపడుతున్నట్టు..దేశాలమధ్య కంచెలు పీకి తోటలు నాటినట్టు.. తుపాకులొదిలిన చేతులు పూలు సాగు చేస్తున్నట్టు…కోళ్ళ కొక్కొరొకోతో ఎప్పటిలానే తెల్లారాక…అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుంటూ ఒకరు, నీళ్ళు పుక్కిలిస్తూ ఒకరు, మంచమెత్తి నిలబెడుతూ ఒకరు…అందరిదీ ఒకేమాట కల..బంగారం లాంటి కల.. ఆరోజు పొలాలు గట్లు తెగి ఏక ఖండమయ్యింది.. రాబోయే ఎన్నికలకు ఏక గ్రీవ తీర్మానమయ్యింది.. గ్రామ శివార్లలో ఆకుపచ్చ బొర్డుపై… కక్షలు, కంచెలు ఊళ్ళలో ఉండకూడదు..స్నేహాలు మాత్రమే.. పంటలెండటమే తట్టుకోలేనోళ్ళు ప్రాణమెవరిదైనా పచ్చగా ఉండాలనే కోరుకుంటారు.
2
బోర్డో లోని మెరినాక్ వైమానిక స్థావరం నుంచి హరియాణాలోని అంబాలాలో దిగాయి అయిదు రఫెల్ లు.. వీధుల్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనుగోలు చేస్తూ దేశ ప్రజలు.. యుద్ధ సన్నద్ధ ఖర్చు యాభై తొమ్మిదివేల కోట్లు, స్నేహ కాంక్ష ఖరీదు రెండు రూపాయలు.. అవును యుద్ధం చేయటంకన్నా స్నేహం చేయటమే తేలిక.. ఇది మనమంతా యుద్ధం చేస్తున్న సమయం..మనమే సైన్యం ఆ సైన్యం పేరే స్నేహం
3
నగరంలో ఒకడు వైరస్ పాజిటివ్… బంధువులు భయపడి మొఖం చాటేశారు.. స్నేహితులు మాత్రం ఐసోలేషన్లో వైద్య సాయాలకు అదనంగా బయట నుంచి వీడియో కాల్స్, జూం కాన్ ఫరెన్స్ భరోసా.. వాళ్ళ బ్యాచ్ పేరు ఫ్రెండ్స్ ఫరెవర్.. పోరాడాల్సింది వ్యాధితోనే రోగిపై కాదు…ఇది వాళ్ళ ట్యాగ్ లైన్.. బంధువులకన్నా స్నేహితులకు ధైర్యమెక్కువ స్నేహితులుంటే ప్రతి ఒక్కరికీ ధైర్యమెక్కువ..
4
శతృ దేశాల యుద్ధ సమయం.. ఆగస్టు మొదటి ఆదివారం అటు ఓబాలిక, ఇటు ఓ బాలుడు.. రంగు పతంగులురెండూ బోర్డర్లకు సమాంతరంగా ఎగురుతున్నాయ్.. గాలి వాటుకు అవి సరిహద్దుల పైనుంచి అటు ఇటు గిరికీ కొడుతున్నాయ్. దారాలు రెండు చరఖాలు దాటాక మాటాడుకుంటుంటాయ్.. పతంగులెగరేస్తున్న పిల్లల ముఖాల్లో సంతోష పూరిత చిరునవ్వుల కేరింతలు.
యుద్ధానికింకా వయస్సుంది ఇప్పటికి ఈస్నేహం ఎగరనీయ్ అని క్యాప్షన్..ఇదేదో ఇరానీ ఇరాకీ లఘు చిత్రం.
*
Superb narration
లఘు చిత్రం కథ, బాగుంది.సర్!👌.నిజంగా, ఈ సినిమా ఉందా?ఉంటే చూడాలి..!లేక మీరు రాసారా. సర్.💐
చాలా బాగుంది అండి❤️
నేటి ప్రపంచానికి ప్రతిబింబం ! వసుధైకకుటుంబం !!!అన్ని కట్లు తెంచుకుని కలసి జీవించె కల!!