‘హేమంత గాన చిరులేత ఎండల కళ్ల మోహనా! వరి మొవ్వులోని మంచుబిందువా!’ అని 1984లో శివారెడ్డి ‘మోహనా! ఓ మోహనా!’ శీర్షికతో రాసిన కవిత చదివి వినిపిస్తున్నప్పుడు ‘ఎవరీ మోహనా.. ఆమె ఎవరు?’ అన్న ప్రశ్న నాలో తలెత్తినా అడగలేకపోయాను. ‘చేదైన వేపచెట్టు చిగురించిన వసంతకాలంలా నువ్వు…అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురువనంలా నువ్వు… నా జ్ఞాపకాల్లో మెదులుతున్న మోహనా!’ అని రాసిన వాక్యాల్లో ‘మోహనా’ అని ఆయన ఎవర్ని పిలిచారు?
శివారెడ్డి ఈ కవితా సంకలనాన్ని ప్రచురించినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో చిత్రించిన స్త్రీ తల ( విమెన్స్ హెడ్ ) దాన్ని తన పుస్తకం కవర్ పేజీపై ప్రచురించాడు. పాబ్లో పికాసో తాను దేవతగా ప్రేమించిన, తనతో కొంతకాలం సహచరిగా గడిపిన డోరా మార్ పై గీసిన చిత్రమిది. మరి శివారెడ్డి తన పుస్తకం అట్టకు ఈ చిత్రాన్ని ఎంచుకున్న మోహనా ఎవరు?ఎవరు శివారెడ్డిని సమ్మోహనపరిచిన ఈ మోహన!
నాలుగు దశాబ్దాల తర్వాత ఈ కవితను చదివితే ఈ మోహనా ఒక స్త్రీయే అయినప్పటికీ శివారెడ్డి వాక్యాలు నిర్దిష్టమైన ఒక స్త్రీని వర్ణించలేదా అన్న అనుమానం నాకు కలిగింది. ఎందుకంటే ‘మోహనా! ఓ మోహనా!’ లోని వాక్యాలు ఈ దుర్భర ప్రపంచంలో జీవించలేని ఏ స్త్రీకైనా వర్తిస్తాయేమో అనిపించింది. ఆ స్త్రీ తననుంచి తనను విడదీసి తనను సంహరించే క్రూరత్వానికి బలి అవుతుంది.ప్రతి దాన్నీ వస్తువు కింద మార్చి అమ్ముకునే క్రూరత్వానికి గురి అవుతుంది. అద్దం మీద బల్లికి ఎరవుతున్న సీతాకోక చిలుకను చూసినప్పుడు శివారెడ్డికి ఆమె గుర్తుకు వస్తుంది. ఏ ఆడపిల్లను చూసినా రాత్రికీ,పగటికీ మధ్య కొట్టుకుంటున్న నల్లని తెరలా నాలో ఎప్పుడూ కదుల్తూనే ఉంటావు..అని ‘మోహనా! ఓ మోహనా!’ కవిత ముగుస్తుంది. అవును ఆమె ఏ ఆడపిల్లయినా కావచ్చు.. శివారెడ్డి ‘మోహన’ ఒక సర్వనామం.
బతుకు మోహనా! బతుకు
బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన
బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన
బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన
ఈ సుందరమయ వ్యవస్థలో
బతుకు మోహనా! బతుకు!
అన్న వాక్యాలు ఎప్పటికైనా వర్తిస్తాయి.
‘మోహనా! ఓ మోహనా!’ శీర్షికతోనే 1988లో శివుడు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అందులో తొలి కవిత అదే. ఆయన ఈ కవిత్వం రాసిన కాలం నేను హైదరాబాద్ లో నివసించిన కాలం. 1990లో ‘మోహనా! ఓ మోహనా!’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విషయం తెలియగానే ఆరోజు నన్ను మా సంపాదకుడు పతంజలి గారు శివారెడ్డిని ఇంటర్వ్యూ చేయమన్నారు. శివారెడ్డి ని ఫోన్ లోనే ఇంటర్యూచేశాను. ఆ ఇంటర్వ్యూ కూడా సంచలనం సృష్టించింది.ఆ తర్వాత రెండేళ్లకు నేను ఢిల్లీ వెళ్లిపోయాను.
‘మోహనా! ఓ మోహనా!’ పుస్తకంలో 1984 నుంచి 1987 వరకు ఆయన రాసిన కవితలుంటాయి. ఆయన ప్రతి కవితా సంకలనానికీ మధ్య కొన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది. భారమితి కవితా సంకలనం ప్రచురించిన అయిదేళ్లకు ఆయన ‘మోహనా! ఓ మోహనా!’ ప్రచురించారు. అయినప్పటికీ నేను భారమితి కొనసాగింపుగానే ఈకవితా సంపుటిని భావిస్తాను. ఎందుకంటే ఈ రెండు కవితా సంపుటాలూ 1980వ దశకంలో వచ్చినవే. ఆ తర్వాత వచ్చిన అజేయం 1980వ దశకం చివరి భాగంలో మొదలైనప్పటికీ అప్పటికి దేశంలో పరిణామాలు మారడం మొదలు పెట్టాయి.
శివారెడ్డి కవితల్ని నేను చరిత్రలో భాగంగా భావిస్తాను. తన భారమితి, అజేయం రెండింటినీ ప్రత్యక్ష రాజకీయ అంశ ఉన్న పుస్తకాలుగా భావిస్తానని ఆయనే గారే చెప్పుకున్నారు. అప్పుడు సాగుతున్న భూ పోరాట రైతాంగ ఉద్యమాలు,దాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వామపక్ష పార్టీల భావజాలం, మార్క్సిస్టు, మావో ఆలోచనా విధానానని నమ్మటం, అత్యవసర పరిస్థితి, బూటకపు ఎన్ కౌంటర్లు నేపథ్యంగా సాగాయని ఆయన 2010లో ఆంధ్ర సారస్వత పరిషత్ లో చేసిన ప్రసంగంలో చెప్పుకున్నారు. ప్రజలకూ, రాజ్యానికీ మధ్య సంఘర్షణ ఈ రెండు పుస్తకాల్లో ఉన్న కవితల్లో ఉన్నదని తెలిపారు. 1988లో వచ్చిన ‘మోహనా! ఓ మోహనా!’ దగ్గరకు వచ్చే సరికి రాజకీయ స్పర్శ అంతర్వాహినిగా ఉన్నదని, మానవ సంబంధాల వైపు దృష్టి మళ్లిందని ఆయన అన్నారు. మానవ సంబంధాల గురించి రాసినప్పుడల్లా మనిషి గాయపడినట్లు మారతాడు. అందుకే ఈ కవితాసంపుటి అంతటా ఒక గాయపడ్డ స్వరం మనకు వినపడుతుంది.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అవుతున్న దశ అది. మానవ జీవితంలో ఒక ఖాళీ, శూన్యం ఏర్పడుతున్న కాలం అది. అప్పటికే ప్రపంచంలోని గొప్ప కవుల్నీ, రచయితల్నీ శివుడు అధ్యయనం చేశాడు. సమాజంలోని ఉద్యమాల తీరుతెన్నుల్నీ లోతుగా పరిశీలించాడు. ఆయన కవితల్లో లోతైన అవగాహన,పరిపక్వత, ధార ఈ సంపుటిలో అడుగడుగునా కనపడుతాయి. శివుడి కవిత్వం వస్తు విస్తృతితో దృశ్యమానం కావడం, పాఠకుడిని తారాస్థాయికి తీసుకువెళ్లడం మనకు ‘మోహనా! ఓ మోహనా!’ లో దృగ్గోచరమవుతాయి. “బహు స్పందనా భరితమైన నేను అందుకుంటున్న ప్రపంచాన్ని అన్ని ఇంద్రియాలతో,అనుభవాన్ని అదేస్థాయిలో పాఠకుడికి అందించాలనే తపన ‘మోహనా! ఓ మోహనా!’ తో మొదలైంది” అని శివుడు ఊరికే చెప్పుకోలేదు.
అయినప్పటికీ మనం జీవిస్తున్న కాలం మనను ఎప్పటికీ వదలదు. 1991 లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమలు, వర్తకం ఉదారీకరణ 1980వ దశకంలోనే మొదలయ్యాయి. విదేశాలనుంచి అప్పులు తీసుకోవడం కూడా ప్రారంభమైంది. ఓపెన్ జనరల్ లైసెన్స్ జాబితాను విస్తరించారు. శివారెడ్డి కవిత్వం ఈ పరిణామాన్ని విస్మరించలేదు. ‘మోహనా! ఓ మోహనా!’ శీర్షికతో ఉన్న కవితలోనే ఇది వ్యక్తమైంది.
ప్రతి దాన్నీ త్రాసులో తూచే క్రూరత్వం
ప్రతి దాన్నీ వస్తువు క్రింద అమ్ముకునే క్రూరత్వం,
నీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కుదించి ,ఖండించి, పార్సిల్ చేసివిదేశాలకు ఎగుమతి చేసే క్రూరత్వం
నీ నుంచి నిన్నువిడదీసి నిన్ను హరించి సంహరించే క్రూరత్వం
గురించి శివారెడ్డి ప్రస్తావిస్తారు.
అన్నింటినీ కొనడమే కొనగలగడమే ఒక విలువుగా మారినప్పుడు అని ‘ఆత్మహననం’ అనే మరో కవితలో ప్రస్తావిస్తాడు. ‘మునిగిపోతున్న నౌకలను ఏ నైలాన్ వలలూ రక్షించలేవు’ అని ప్రకటిస్తాడు.
80వ దశకంలో పరిణామాలన్నీఈ కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. దేశంలో జరిగిన దుర్మార్గాలు, పౌర హక్కుల హననం కూడా ‘మోహనా! ఓ మోహనా!’ లో ప్రతిఫలిస్తాయి.
ఎమర్జెన్సీ తర్వాత దేశంలో పౌర హక్కుల ఉద్యమం ఊపందుకుంది. 80వ దశకంలో ప్రపంచమంతటా పౌర హక్కుల గురించి చైతన్యంఏర్పడింది. కొత్త పౌర హక్కుల క్రియాశీలత ఏర్పడింది.జస్టిస్ భగవతి లాంటి వారు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా అణగారిన ప్రజలకు న్యాయాన్నిఅందించేందుకు పూనుకున్నారు. 80లోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఇవన్నీ ఈ సంపుటిలో ప్రతిఫలిస్తాయి.
మాట్లాడే హక్కునుకూడా మనం అడుక్కోవద్దు..
గాలంత సహజంగ, స్వేచ్చగా నిర్భయంగా మనం మాట్లాడదాం.
గళాల మీద నియంత పదముద్రల్ని వేస్తున్నాడు మాట్లాడుదాం
నకిలీ ప్రజాస్వామ్య నియంతృత్వం దేశం మీద రుద్దవద్దు
అని శివుడు స్పష్టంగా ప్రకటిస్తాడు.
ప్రభుత్వ నిఘాను కూడా శివారెడ్డి కనిపెడతాడు. ప్రభుత్వ నిఘా ఎక్కడికైనా ప్రవహిస్తుంది. రక్తంలోంచి దిగి, గుండె పక్కన నుంచుని ఆంతర్యం రహస్యాలు వింటుంది. నాసాలుగానూ, మీసాలుగానూ,టెర్రరిస్టుచట్టం గానూ,పోస్టల్ బిల్లు గానూ,దేశ భక్తిగానూ, ఐక్యతా రక్షణగానూ,ఇంకా అనేకరకాలుగా జనం జీవన నయనాల్లో శుక్లంగా పుష్పిస్తుంది.. మన రక్షణ పేర మనమీద నిర్బంధం అమలు అవుతుంది అన్న వాక్యాలు ఆయన కవితల్లో కనిపిస్తాయి.
జీవితాన్ని ఖైదుగా మార్చిన వ్యవస్థ ఏ దేశమైతేనేమి? అని ఆయన ప్రశ్నిస్తాడు
“నలభై ఏళ్ల బ్యాంకు విప్లవాలు, బజారు బజారున ప్రభుత్వాంగీకార వడ్డీ వ్యాపారస్తుల నిర్నిబంధ నిశ్శబ్ద విప్లవాలు,పేపర్ల మీద ప్రభుత్వాఫీసుల్లో నిరంతరం హరిత విప్లవాలు, పంచవర్షాల పునరుద్దరణ సాంప్రదాయ జాతీయవిప్లవాలు, కడుపులోన కృశించి పోతున్నాను తల్లీ” అంటాడు.
నేరాల్నీ నేరస్తుల్నీ లీగలైజ్ చేస్తున్న రాజకీయాల గురించి మన దృష్టికి తీసుకువెళతాడు. అంటే అప్పటికే రాజకీయాల్లో నేరాలు ప్రవేశించాయా?అనుమానం లేదు.
మనం మరిచిపోలేని రెండు ముఖ్యమైన ఘటనలు ఈ సంపుటిలో మనను మళ్లీ తట్టి లేపుతాయి.
1985 సెప్టెంబర్ 2న పౌరహక్కుల నేత, పిల్లల డాక్టర్ రామనాథంను వరంగల్ పోలీసులు కాల్చి చంపారు. దక్షిణాఫ్రికాలో కవి,పోరాట యోధుడు బెంజమిన్ మొలైసీని కూడా 1985 అక్టోబర్ 18న ఉరి తీశారు. ఈ రెండు సంఘటనల్నీ కూడా శివారెడ్డి విస్మరించలేదు.
ఓ నా నీలికలువా, ఓ నా నేత్ర ద్వయమా,
నేను బెంజిమిన్ మొలైసీని,నేను డా. రామనాథాన్ని
అది జాత్యహంకారమో, కులకావరమో,
ప్రజాస్వామ్యనియంతపు విషపు కోరో,
అది చట్టాన్ని చట్టబద్దంగా పాతేయడం..
న్యాయసమ్మతంగా హత్యాకాండ కొనసాగించడం..అంటారు ఆయన.
అనేకమంది ఆఫ్రికన్ కవులూ ఈ కవితా సంపుటిలో మన కళ్లముందు కవితా గానం చేస్తారు. ఆఫ్రికన్ కవిత్వంలో సర్రియలిజాన్ని ప్రవేశపెట్టిన నిగ్రెట్యూడ్ తదితర ఉద్యమాలను కూడా శివారెడ్డి ప్రస్తావిస్తారు.
1980లో బీహార్ లో ని భగల్ఫూర్ లో పోలీసులు 31 మంది ఖైదీల కళ్లలో ఆసిడ్ పోసి అంధులను చేశారు.1984 డిసెంబర్ 2 అర్థరాత్రి భోపాల్ కార్బైడ్ ఫ్యాక్టరీనుంచి విషవాయువు లీకై 8వేలమందికి పైగా ప్రాణాల కోల్పోయారు. శివారెడ్డి వీటిని ఎప్పుడూ విస్మరించలేదు.
చుట్టూ ముళ్లతీగల్లేని కాన్సంట్రేషన్ క్యాంప్ ఇది
స్వస్తిక్ గుర్తుల్లేని నాజీల రాజ్యమిది.
నా ముందు మాట రక్తసిక్తమవుతుంది
నా ముందుమాట భోపాల్ బాధితుడవుతుంది
అంటాడు ఆయన.
అడుగడుగునా దేశంలో జరిగిన ఎన్ కౌంటర్లూ ఆయన కవిత్వంలో మనకు ‘మోహనా! ఓ మోహనా!’ లో కనపడుతాయి.
1984లో పంజాబ్ లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్, 80వ దశకంలో అస్సాంలో విదేశీ వ్యతిరేకఉద్యమంలో వీధుల్లో ప్రజలపై కాల్పులు జరగడం,కాశ్మీర్ లో హింసాకాండ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ కౌంటర్లతో పాటు కారం చేడు వంటి ఘటనలు ఇవన్నీ ‘మోహనా! ఓ మోహనా!’ మరిచిపోలేదు.
దీపావళికి దీపాలమీదే
రాయనక్కర్లేదు
దీపావళికి గాయాలమీద రాయడం మంచిది,
పంజాబ్ గాయంమీద,
అస్సాం గాయంమీద,
కాశ్మీర్ గాయంమీద,
పచ్చని ఆంధ్రప్రదేశ్ గాయం మీద
రాయటం మంచిది..
శివారెడ్డి కవిత్వంలో సమకాలీన చరిత్ర కనపడడం మాత్రమే కాదు. సార్వకాలికత కూడా ఉంటుంది. సమాజంలో దోపిడీ, వ్యవస్థలో దుర్మార్గాలు, నియంతృత్వం, ప్రజాస్వామిక హక్కుల హననం, ఎన్ కౌంటర్లు అణిచివేత, నిఘాలు, నిషేధాలు ఉన్నంతకాలం శివారెడ్డి కవితలు మనకు ఎప్పుడు చదివినా ఆయన ఈ కాలం గురించే రాసినట్లు కనపడుతుంది.మోహనా ఓ మోహనాలో మనకు ఈ కవితా లక్షణాలు కనపడతాయి.
“ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు
జనమున్నారు జనకంటకులున్నారు
ప్రజలున్నారు ప్రజల్ని హింసించే ప్రభుత్వమూ వుంది
గడ్డం పెంచుకుని బొట్టు పెట్టుకుని
ప్రభుత్వ జపమాల తిప్పుతావా
జనంలో కలిసిపోయి జనయుధ్ధాన్ని ఎక్కుపెడతావా
నిర్ద్వంద్వంగా నిర్ణయించుకో నిశ్చయించుకో
నిజం పలకటం నీకూ మాకూ క్షేమదాయకం”
అని ఎటు నిలబడతావో అన్న శీర్షిక కూడా ఇప్పటికీ ఒక ప్రశ్న లాగా అందర్నీ వెంటాడుతుంది.
శివారెడ్డి ‘మోహనా! ఓ మోహనా!’ లో నిత్యం కవిత్వంలో శాశ్వతంగా నిలిచిపోయే అంశాలున్నాయి. వృద్దాప్యం, అమ్మ గురించి ఈ కవితా సంపుటిలో రాసిన వాక్యాలు ఏ కాలంలోనైనా వృద్ధాప్యానికీ, అమ్మకు వర్తిస్తాయి .
సమస్త ప్రపంచాన్నీ
నీ అరచేతుల్లోకి తీసుకుని
చాచి ఒక లెంపకాయ కొట్టు తల్లీ,
అఖిల పురుష ప్రపంచాన్ని
నీలో తన వికృతపుటాకారాన్ని
దర్శించనీ, దర్శించనీ
అన్న వాక్యాలు ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తాయి.
మరణం గురించి శివుడు రాసిన వాక్యాలు కూడా ఎప్పటికైనా వర్తింపదగినవే. నా మరణం కంటే నా బతుకు గొప్పదవ్వడమే నా కిష్టం అంటాడు ఆయన.
చావు అందరికీ ఒకటే అయినా
అందరి చావూ మనకొక్కటి కాదు
నియంతల అధికార దాహానికి
సోపానాలయ్యేవాళ్ళు
దుష్టవ్యవస్థని బతికించ చూచేవాళ్ళు.
చావటమే మంచిది
ముమ్మాటికి ఆ చావుని
మనం హర్షించటం కూడా సక్రమమైందే
అన్న ఆయన వాక్యాలు ఇప్పటికీ వర్తిస్తాయి.
మట్టి కన్న బలమైందీ ప్రియమైందీ ప్రాణప్రదమైందీ
సువాసనభరితమైందీ మరేదీ లేదు
అందుకే మట్టి నా జీవితం నా అనుభవం నా స్వప్నం
నగ్నంగా నీళ్ళలోకి దూకినట్టు మట్టిలోకి దూకుతాను
అని ‘నగ్న భూమ్మీద’ శీర్షికతో రాసిన కవిత్వంలో మట్టి వాసన విలువను అర్థం చేయిస్తుంది .
‘కవి అంటేనే దేశం’ అనే మరో గొప్ప కవిత ఈ సంపుటిలో ఉంటుంది. ‘మనుషులను గుర్తు పట్టలేని స్థితిలో కవికి దేశం గుర్తుంటుంది.దేశమంటేనే కవి, కవి అంటేనే దేశం’ అన్న వాక్యంతో ఈ కవిత్వం ముగుస్తుంది.
ప్రపంచంలో ఎవరు ఎక్కడ యుద్దం చేసినా ఆయన ప్రేమిస్తారు. ‘వాళ్లు యుద్దం చేస్తున్నారన్నదే ముఖ్యం’ అన్నది ఈ సంపుటిలో గొప్పకవిత. దేశమేదైతేనేం యుద్దం చేసేవాళ్లంతా ఒక్కటే. మనను యుద్దంలో దించకుండా శివారెడ్డి ఏనాడూ విశ్రమించలేదు. ఆయన ‘మోహన’ మనం నిద్రించినా మన కను రెప్పలపై నృత్యంచేస్తుంది. మన కలల్లోకి ప్రవేశించి మనను తట్టి లేపుతుంది.
*
నాలుగు దశాబ్దాల మోహనా! ‘హేమంత గాన చిరులేత ఎండల కళ్ల మోహనా! వరి మొవ్వులోని మంచుబిందువా!’ అని 1984లో శివారెడ్డి ‘మోహనా! ఓ మోహనా!’ శీర్షికతో రాసిన కవిత చదివి వినిపిస్తున్నప్పుడు ‘ఎవరీ మోహనా.. ఆమె ఎవరు?’ అన్న ప్రశ్న నాలో తలెత్తినా అడగలేకపోయాను.
ఈ కవితా సంపుటి మీద మిత్రుడు క్రిశ్నుడు టెలివిజన్ లొ రెవ్యు చూసినప్పుడు నెను చూసినప్పుడు చాలా ఆ కవితాల్లొ కవితల్లోని గొప్ప తనాన్ని గ్రహించాను.