నల్లమోడం
నెమలిలా పురియిప్పుకుంది
నాయిన వసారలో కూకొని
ఆకాసం వంక సూడబట్టే
ఉరుము ఎంట ఆన
దొడ్డ దొడ్డ సినుకుల్తో
కుండపోతయింది
నాయిన మొగం కేసి సూసా
నల్లబోర్డు మీద తెల్లటి అచ్చరాల్ల
ఆయన మనసు సదవబట్నా
అమ్మ పోయినంక
నాయిన్నుంచి ఎవుసం దూరం సేసి
పట్నంలోనే నాతాన్నే బలంతాన
ఉండబెట్టిన
నాయిన సుట్టూ మనువళ్ళు
ఎంతమూగినా ఆకాసేపే
నిమ్మలంగా ఉంటడు
అంకసారికి దిగులు గూడు కట్టుకుంటది
నా పెళ్ళాం సెప్పింది నిజమే
ఆన పడ్నపుడంతా
తన మొగంలో ఎలుగు
ఒరే పెద్దొడా !
దూళ్ళు గొత్తొస్తున్నాయిరా
కొట్టంలొ ఎడ్లు మ్యాత
తిన్నాయో ల్యానో
గంపకింద కోడిపిల్లల్ని
దాసాల ల్యాకుంటే
పిల్లి తినేస్తది
కంప బాగా లేసింది
కురవ మద్దిలేటిని పిల్సి
బుడానికి ఇరిపిచ్చాల
మట్టి మిద్ద దెంతలు
పుచ్చుపట్నాయి మార్సాల
సెరువు నిండింటాది
వంక పారుతుంటాది
నాట్లు బిరీన ఎయ్యాల
దండిగా పండితే
కూలోళ్ళకు గింజలు పెట్టాల
ఇయన్ని ఆయన సెప్పకనే
పాఠం సదివినట్టు నాకర్థమయితవి
న్యాలనించి నాయినను
ఏరుసేసె అక్కు నాక్యాడిది
రేపు నాయిన్ని
తన తావులో ఇడ్సిరావాల
ఆయన బలం బలగీనత
కుశాలు కుములుడు
ఆకలి దప్పిక
కథ పాట సిందు అన్నీ
గట్టున కూకోని బీడి ఎలిగించి
పొలంతొ మాట కలిపితేనే
తను బతికున్నట్టు
ఆనలో తడిసి
ఎండలో ఎండి
మానులా ఇస్తరించుకుంది తన శలీరం
ఊరిమర్లు శానా గొప్పది.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment