చాలా రోజుల తర్వాత
మాయింటికి
నాయనొచ్చాడు .
మా ఇంటికి అంటే
ముందుగా ఆయన ఇంటికే అన్న మాట !
వూళ్లో పాత రేల్లు గడ్డి ఇంటిని
విప్పేస్తున్న ప్పుడు
ఇంటి వాసాలు బర్మా టేకువి
మరో వందేళ్లు అయినా ఢోకా లేదు అన్నాడు
వేప చెట్టు నీడలో కూచుని .
ఇంటి కలప తో ఫర్నీచరు చేయించుకుని
రెండు వాటాలేసుకున్నాo
రెండో అన్నయ్యా నేనూ.
నాయన కోసం చేయించిన
పడక కుర్చీ
మనుషుల పంపకాల్లో
ఆయన తో పాటే మాయింటికి వచ్చింది.
బతికున్న రోజుల్లో నాయనా కుర్చీ
ఇద్దరూ గొప్ప అద్వైతులు !
కుర్చీ భౌతికంగా వున్నా
నేనో సూక్ష్మ కళాకారుణ్ణయి
నాలుగడుగుల పడక కుర్చీ ని
నాలుగంగుళాల మినియేచరు గా మార్చి /మనసు షో కేసులో భద్ర పరచు కొన్నాను .
కాలం బహు వొంకరి
అమ్మాయి పెళ్ళికి
ఇల్లు పీకి పందిరేస్తూ
వూరినుండి వచ్చిన ముసలి తల్లి తండ్రుల ను
మూల గది లో కూచో బెట్టినట్టు
దీని అవసరం యేముందని డాబా షేడ్ పై దాచి పెట్టారు.
మొన్న ఆషాడానికి అమ్మాయి ఇంటి కొచ్చి
తాతయ్య కుర్చీ ని గుర్తు చేస్తే
పైనుంచి దింపి దుమ్ము దులిపి నట్లు బిగించి కర్రలు వెతికి
పట్టా వేసి సిద్దం చేసాo !
పడక కుర్చీ కి పట్టా వేస్తుంటే
నాయన కే కొత్త చొక్కా తొడిగినట్లు అనిపించింది .
సిద్దమైన కుర్చీ లో కాలు మీద కాలేసుకుని
అది జమీందారిణి లా కూచుంటే
నా కన్ను త్రీడీ కెమేరా అయి
కాసేపు మానాయన ను కాసేపు మా అమ్మాయిని చూపించింది .
నీ చిన్నప్పుడు తాతయ్య నిన్ను యెత్తుకుని
ఈ కుర్చీ లోనే కూచున్నా డు
మరి నేనెప్పుడు యెత్తు కోవాలే అమ్మా అంటే
తొందరే ముంది లే డాడీ అంటూ
నవ్వు కుంటూ లోపలికెళ్లి పోయింది !
చాలా రోజుల తర్వాత
మా ఇంటికి
నాయనొచ్చాడు !
*
మంచి పద్యం.
పిల్లల చేష్టల్లో పూర్వీకులను వెతుక్కోవటం ఒక ముచ్చట.
పిల్లలు నీనుంచి రారు నీ ద్వారా వస్తారు అన్న జిబ్రాన్ వాక్యానికి అర్ధమదే.
జీవనానుభవాలను దాటి గొప్ప వస్తువులు మరెక్కడ ఉంటాయి?
ఓసారి మీరు పెద్దవారు అయిపోతున్నారు సారు అంటే “ఏం… కాదు… నేనింకా కుర్రాడినే… నాతో సమానంగా నువ్వు పరిగెట్టగలవా.. ఛాలెంజ్” అన్నారు..
అందుకే…. శిఖామణి గురువుగారు ఎప్పుడెప్పుడు “తాత” అవుతారా నేనూ ఎదురుచూస్తున్నాను… 🙂