నాన్న పెట్టిన పేరొకటి తూనీగరెక్కలతో
చుట్టూ ముక్కలు ముక్కలుగా ఎగురుతూంటుంది.
నల్లరాతి మీద మెరిసే
అక్షరాల్లా బతుకంతా వాటిని
ఉన్నత శిఖరంపై వెలిగించాలానే
ఆరాటంలో అజ్ఞానతిమిరాన్ని
తరిమే పనిలో నాలో నేనున్నప్పుడు.
నిస్తేజం నిర్లిప్త పరచిన క్షణాన
లోపల పరచుకున్న నిశిలో
వెలిగించిన దీపమై నువ్వొచ్చాక
కాలం తెలీని జగత్తు స్వాగతం చెప్తూ
విలీనం కమ్మని కబురు తెచ్చాక
అలవోకగా నేననేది మరచి
ఆ వెలుగులో అక్షరమై విరాజిల్లుతూ
అప్పటి ఆ పేరు మరచీ.. మైమరచి
సరికొత్త రెక్కలు తొడిగాక
మనంగా మమేకమై సరికొత్తగా జన్మించి
గుండె గూట్లో లిఖించుకున్న
నీ ఆకుపచ్చని సంతకమై వెలుగుతాను.
*
Add comment