“ఎప్పుడు పోతామో తెలియని బొంగులో లైఫ్ లో ఏంట్రా మీ గోల?” చిచ్చా…! తత్వాన్ని ఇంత వైల్డ్ గా ఒక్క ముక్కలో చెప్పిన నీకు చదువు లేకపోవటం ఏమిటీ?? అయినా తప్పు నీదీ కాదు.. ఇస్త్రీ బట్టలు వేసుకున్న వాణ్ణి అంకుల్ అనాలి. స్కూల్ ఆటో వాలాని, గప్ చుప్ బండివాన్ని, ఇంట్లో పనిమనిషినీ ఆంటీ/అంకుల్ అని మాత్రం అనొద్దు. వీలైతే వాడు అనొచ్చు. ఎందుకంటే వాడు మనకన్నా తక్కువ.. మురికిగా ఉంటాడు.. చదువు రాదు..
నాన్నల లోకంలో నీ/నా కథ!
ఇప్పుడు ఆడుకోకు… ఆడితే క్రికెట్, షటిల్ ఆడు కెరీర్ లో పనికి వస్తాయి. పిల్లల హక్కు అయిన ఆటల మీద కూడా ఆంక్షలే.. పెయింటింగ్ కూడా ఈ రెండిటికన్నా అద్భుతమైన జీవితాన్ని అంతకు మించిన తృప్తినీ ఇవ్వగలదు అని తెలియకనో, నా కోరిక నా పిల్లలు తీర్చాలీ అన్న ఆశనో గానీ. ఆటల మీద నిషేధం, అలవాట్ల మీద నిషేధం.. అసలు పిల్లలు పిల్లల్లా ఉండటం మీద నిషేధం.
“హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది
గుండెనెంత మథిస్తే కన్నీటి విలువ తెలిసింది… “
రుద్రరాజు సాగర్ S/O రుద్రరాజు దేవీ ప్రసాద్ తెలుగు లెక్చరర్. పరీక్ష కోసం చదివి.. చదివి.. పొద్దున్నే పేపర్ ముందు కూచున్నాక ఏదీ గుర్తు రాక.. ముందుగా గుర్తొచ్చేది నాన్న. ఫీజులు, బయటివాళ్ళ మాటలూ భరించాల్సింది నాన్నే. ఇప్పుడు టాస్క్ ఎగ్జామ్ కాదు నాన్న తృప్తి. ఎంత తపన పడ్డావ్ సాగర్. నాన్నకి నచ్చాలి కదా.. నాన్న మెచ్చుకోవాలి కదాని. కానీ…! హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. నలిపేస్తున్నార్రా సాగర్. కటకటాల్లోకి పసివాళ్ళని నెట్టి క్రియేటివిటీ లేని మూస జీవితాలని తయారు చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పిల్లలని పనిముట్లు చేసి కంపెనీలకు బానిసలుగా అమ్ముకుంటున్నారు. పిల్లలతో వ్యాపారం చేస్తున్నారు. సాగర్ ఇంకొక్క దెబ్బ గట్టిగా కొట్టాల్సింది. అసలు బాల్యం అంటేనే సంతోషం కదా, స్వచ్చతకీ, అమాయకత్వానికీ రూపం కదా “బాల మేధావుల” పేరుతో బోన్సాయ్ మొక్కల్ని చేసి పిల్లల్ని చిన్నతనం లేకుండా చేస్తున్నారు. చిన్న చిన్న ఆనందాలని వదులుకొని అన్నీ సాధించాలనుకున్నవాడు రక్తం ముద్దగా మారి కనిపించినప్పుడు ఏడ్చావ్ చూడూ… గుండెనెంత మధిస్తే… కన్నీటి విలువ తెలిసింది!
నాన్నలంతే..! నిన్ను ప్రేమిస్తారు, నీకోసం ప్రాణం కూడా పణంగా పెడతారు. విషాదం ఏమిటంటే నువ్వు చదువులో, సంపాదనలో వెనుకబడ్డప్పుడు మాత్రం కుమిలిపోతారు. తేడా ఒక్కటేరా సాగర్ నాన్నలు కేవలం నాన్నలు, సమాజం లో బొమ్మల్లా బతికేసే ఇంటివరకు నాన్నలు. పాన్ షాపోడిది బతుక్కాదా? మెకానిక్ షేడ్డోడిది బతుక్కాదా? అన్నావ్ కదా… నిజానికి పాన్ షాపు వాడు తనకొడుక్కి పాన్ షాప్ ఇవ్వడు, మెకానిక్ తనకొడుకు మెకానిక్ కావాలని కోరుకోడు.. నాన్నలంతే కొడుకేం కావాలో కోరుకుంటారు. కొడుకేం కోరుకుంటాడో తెలుసుకోవాలనుకోరు. ఫలితం… రైలు పట్టాలు మీద మాంసపు ముద్దలా కొడుకులు, హాస్టల్ గదిలో తాడుకు వేలాడుతూ కొడుకులు, వీడియోల్లో అమ్మని, నాన్నని క్షమాపణలు అడిగి మరీ చచ్చి రాలే పిల్లలు..పిల్లలు..
“రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా!
మనిషి దూరమైనాక మనసు విలువ తెలిసింది” నాన్న అర్థం చేసుకున్నాడు. కొడుకు పనోడు కాదు పని చేసేవాడు అని అర్థం చేసుకున్నాడు.
“మాటలెన్ని జారావో నోటినడుగు చెపుతుంది
పాటించిన నాడేగా పలుకు విలువ తెలిసింది”
పిల్లలు అల్లరి చేయాలి, పిల్లలు ఏడవాలి, పిల్లలు మట్టితో బొమ్మలు చేయాలి.. నిజానికి పిల్లలు చడవకూడదు “నేర్చుకోవాలి”.. పిల్లలు పిల్లలుగా ఉండాలి కదా.. చలం చెప్పాడు మెచ్చుకున్నారు, పిల్లల్ని రెండేళ్లకే స్కూళ్ళలో పడేసారు, పనివ్వని చదువు పనికి రానిది అంటూ ఆకలి రాజ్యం చెప్పింది మెచ్చుకున్నారు.. “నువ్వు ఇంజనీరు కావాలి” అని పిల్లలకు చెప్పారు… సాగర్ ఏ కథైనా ఇంతే పిల్లలకు అర్థం కాదు అర్థమయ్యేనాటికి వాళ్ళు పిల్లలుగా ఉండరు. ధార్మిక ఇదే చెప్పిందికదా..! నువ్వు నీలా లేనప్పుడు విజయం నీదీ ఎలా అవుతుంది? అయితే నాన్నదీ లేదా చుట్టూ ఉన్న సమాజానిది. ఎంత నటిస్తాం.. బతుకు కానీ బతుకు కోసం నచ్చని పనులెన్ని చేస్తాం. జనం మెప్పుకోలు కోసం.. నువ్వు ఓడిపోతున్నావ్ అంటే చుట్టూ ఉన్న సమాజం కాదు నువ్వు..నువ్వుమాత్రమే చేత కానీ వాడివి అని న్యూనతని నీలో పెంచి.. తిరగబడకుండా మదనపడే స్వభావాన్ని పెంచుకొని. నాన్నలని ఎదిరించేస్తాం. పాపం నాన్న.. లోలోపల నిన్ను గెలిపించాలని ఉంటుంది. కానీ వస్తాడు ఒకడు లెక్కల మాస్టారు వేశంలోనో, ఇంగ్లీష్ టీచర్ ముసుగులోనో “నీ పెంపకం ఇలా ఉంది” అని వాడి ఈగోని దెబ్బతీస్తాడు నీ వీపు మీద వాతలు లేస్తాయ్… నాన్న విలన్ అవుతాడు. మీ నాన్న లాగే. మా నాన్న లాగే…
“చీకటసలు లేకుంటే వెన్నెలకేం విలువుంది
నిన్న ముగిసి పోయాక నేటి విలువ తెలిసింది”
రుద్రరాజు సాగర్ లేకుంటే నేను నాకు తెలిసే వాణ్ణి కాదు. నాన్నా నేను సెలూన్ పెట్టుకుంటా అని చెప్పేసేవాన్ని నిజానికి నాన్న ఒప్పుకునేవాడు. కానీ అప్పటికే “నాన్నకి నచ్చాలి” అనుకున్నా.. సెలూనూ లేదు నాన్నకి నచ్చే జీవితము లేదు.. ఓడిపోయాను అనుకున్నా… లేదు సాగర్ నీలాగే గెలిచాను.. నా ఫెయిల్యూర్ కి, నా ఆనందానికి , నా జీవితానికి కేవలం నేనే బాధ్యున్ని జీవితం నాది… ధార్మికకి మళ్లీ ఒకసారి థాంక్స్ నీ జీవితంలోకి వచ్చినంత తొందరగా నా దగ్గరికి రాలేదు.. ఎందుకంటే నేను నీ అంత సున్నితం కాదు కదా.. అయినా ఎంత దమ్మురా నీకు? ఒక్క పది నిమిషాలలో తన జీవితం మొత్తం అబద్ధం అని అర్థమయ్యేలా చెప్పావ్.. ఎవడ్రా నీకు చదువు రాదన్నది? యో..! సరస్పతీ మాత నిజ్జంగానే నిన్ను దీవించినాదా ఏందీ?? బాల్యం కోల్పోయాకే చాలామందికి దాని విలువ తెలుస్తుంది.. నిజంగా ఆ పిల్ల ఎంత కదిలిపోయింది, ఎంత బాగా అర్థం చేసుకొని కన్నీళ్లుగా జీవితాన్ని కడిగి చూసుకుంది…. ధార్మికకి ఐ లవ్యూ చెప్పాలనిపించిందిరా సాగరు..
“ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా!
అడుగడుగూ నిషేధాన కాంక్ష విలువ తెలిసింది..”
ఇప్పుడు ఆడుకోకు… ఆడితే క్రికెట్, షటిల్ ఆడు కెరీర్ లో పనికి వస్తాయి. పిల్లల హక్కు అయిన ఆటల మీద కూడా ఆంక్షలే.. పెయింటింగ్ కూడా ఈ రెండిటికన్నా అద్భుతమైన జీవితాన్ని అంతకు మించిన తృప్తినీ ఇవ్వగలదు అని తెలియకనో, నా కోరిక నా పిల్లలు తీర్చాలీ అన్న ఆశనో గానీ. ఆటల మీద నిషేధం, అలవాట్ల మీద నిషేధం.. అసలు పిల్లలు పిల్లల్లా ఉండటం మీద నిషేధం. నాన్నలూ, అమ్మల నిస్సహాయత. జనం కోసం పిల్లలని తీర్చిదిద్దే బాధ్యత భుజంమీద వేసుకుంటారు.. పిల్లలనీ చేజార్చుకుంటారు. లేదూ.. ఒక సంపాదించే రోబో ని తయారు చేస్తారు. అంతా అలాగే ఉంటారా అంటే… ఎక్కువ ఉన్నది పిల్లల హక్కుల్ని హరించేవాళ్లే. నిన్న ముగిసి పోయాకే… నేటి విలువ తెలుస్తుంది. కానీ అప్పటికే బాల్యం బూడిద అయిపోతుంది.. పదే పదే.. కొమ్మల్లో చిక్కుకున్న గాలిపటం కనిపించటం కేవలం ఫ్రేమింగ్ మాత్రమే కాదేమో…
ప్రతి మనిషికి కోరికుంది ప్రతి మనసుకు స్పందనుంది
అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది..
ఒక హోటల్లో దోసెలు వేసే మాస్టర్ కి నెలకి 25 వేలు, ఒక ఆటోవాలా సంపాదించేదీ అంతే. పాన్ షాప్ లో పాన్ వాలా తన చిన్న డబ్బాకి కట్టే రెంటు కనీసం 7000 కానీ వీళ్లంతా “అరే” గాళ్లే. కారణం ఇస్త్రీ బట్టలు లేకపోవటమా? పిల్లలకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువ ఎలా నేర్పిస్తాం?? సాగర్ నీవల్ల చాలా నేర్చుకున్నా, నిజానికి నన్ను నేను తెలుసుకున్నా. ఎవరినీ తప్పు పట్టలేం గానీ మనలాంటోళ్లం కూడా ఈ సమాజంలో ఒక పార్ట్ అని తెలిసిపోయింది.
ముఖ్యంగా … అమ్మల మీద జాలేసింది సాగర్. ఎంత నలిగి పోతారు కదా, ఎంత అమాయకంగా ఉంటారో కదా. భర్త కోసం కొడుకుని బాధపెట్టలేక, కొడుకు కోసం భర్త పడే బాధని తట్టుకోలేక… ఈ పరువు అంటే ఏమిటో తెలియకుండానే కుటుంబ గౌరవం కోసం తపిస్తూ.. అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది.
నిజంగా నీదీ నాదీ ఒకే కథ.. కాకుంటే నీ కథలో నాన్న విలనిజాన్ని చూసారు. నాన్న తపనని చూపించే ప్రయత్నాన్ని చూడలేదు. కొడుకు మీద ప్రేమకి సమాజంలో పరువు అనే మాటకీ మధ్య నలిగిపోయిన నాన్నని ఎవ్వరూ గ్రహిమాచలేదు. నిజానికి నీ కథ నాన్నల కథ, అమ్మల కథ, పిల్లల కథ… ఇన్ని నిజాలు తెలిసీ “నానాటి బతుకూ నాటకమూ.. “అని పాడుకోవటం తప్ప ఇంకేం చేయాలి ఎలా సెటిలవ్వాలి అని ఆలోచించుకోవటమే ఇప్పుడు నా జీవితం లో ఉన్న ఐరనీ..
హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది
గుండెనెంత మథిస్తే కన్నీటి విలువ తెలిసింది
రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా!
మనిషి దూరమైనాక మనసు విలువ తెలిసింది
మాటలెన్ని జారావో నోటినడుగు చెపుతుంది
పాటించిన నాడేగా పలుకు విలువ తెలిసింది
చీకటసలు లేకుంటే వెన్నెలకేం విలువుంది
నిన్న ముగిసి పోయాక నేటి విలువ తెలిసింది
ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా!
అడుగడుగూ నిషేధాన కాంక్ష విలువ తెలిసింది
ప్రతి మనిషికి కోరికుంది ప్రతి మనసుకు స్పందనుంది
అనుభూతులు కొలిస్తేమమత విలువ తెలి సింది..
లిరిక్ : యమ్బీడీ శ్యామల
*
నా గజల్ని సినిమా తో అన్వయించి మీరు రాసిన సమీక్ష అద్భుతం నరేష్కుమార్ గారూ thank u
నిజానికి ఈ గజల్ ప్రివ్యూ చూసిన రోజునుంచీ వెంటాడుతూనే ఉంది. మళ్లీ..మళ్లీ.. వింటూనే ఉన్నాను. రాసేరోజు కూడా ఈ వాక్యాల ప్రభావం నుంచి తప్పుకోలేకపోయాను.