వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జన్మించిన మౌనశ్రీ మల్లిక్ 2009లో దిగంబర, 2013లో గరళం, 2015లో తప్త స్పృహ, 2025లో మంటల స్నానం కవిత్వ సంపుటులను వెలువరించారు. సినీ గేయ రచయితగా, టీవీ సీరియల్ పాటల రచయితగా కొనసాగుతున్న వ్యక్తి. సరళమైన వచనం రాయటంలో సిద్ధహస్తులు. మంటల స్నానం లోని ‘జీవ లక్షణం’ కవిత గురించి మాట్లాడుకుందాం. హృద్యమైన కవిత్వం రాస్తరు. కంటి తడి పెట్టిస్తరు. కొంత సస్పెన్స్ను జొప్పిస్తరు. ఎత్తుగడలోని కుతూహలానికి ముగింపులో దాహం తీరుతది. అలాంటిదే నాన్న కవిత.
*
“తలకొరివి పెట్టి వెనుదిరగ్గానే నా భుజమ్మీద చెయ్యేసి ఓదార్చుతూ ఇంటికి తీసుకువచ్చింది నీడ/ ఎర్రబడ్డ కళ్లలోంచి జారే నీటిని తుడిచి లాలనగా తల నిమురుతూ నిద్రపుచ్చింది ఆ నీడే” (జీవలక్షణం)
ఇది ఎత్తుగడ. ఇందులో సప్పెన్స్ అని చెప్పింది ‘నీడ’ గురించి. ఇప్పుడు ముగింపు వాక్యాలు చదువుకుందాం.
“అదేంటో నాన్నలకు ఆత్మాభిమానం ఎక్కువ బిడ్డలు సంపాదన పరులు కాగానే మహారాజుల్లా మహాప్రస్థానానికి పయనమవుతారు/మనల్ని వెన్నంటి ఉండే నీడలా మారిపోతారు”
*
ఎత్తుగడలో సస్పెన్స్ అనుకున్న ‘నీడ’ ఇక్కడ ‘నాన్న’కు పర్యాయ పదంలా మారుతుందని ఊహించలేం. ఏ ఉద్వేగం అయినా సరే రాసే కవిత్వం ఒక్కోసారి తీరం దాటి మాట్లాడే సంభావ్యతే ఎక్కువ. మౌనశ్రీ కవితను నడిపించే తీరు, ఆ ఒడుపుదనం ఎమోషనాలిటీకి టెక్నిక్ను దాసోహపరచడు. అది కవిలోని ఒక గొప్ప సుగుణం. భావోద్వేగానికి గురై చెప్పేవ్యక్తి కన్నీరు పెట్టడం చాలా కవితల్లో చూస్తాం. నిబ్బరంగా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పాఠకుల గుండెతడిని స్పర్శించడం మౌనశ్రీ కవితా లక్షణం.
*
‘తలకొరివి పెట్టి’ అన్నప్పుడు కొడుకో, కూతురో మాట్లాడుతు న్నట్లు అర్ధమైతది. భుజం మీద చెయ్యేసి ఓదార్చడం, తల నిమురుతూ నిద్రపుచ్చడం చాలా దగ్గరి వ్యక్తులు సముదా యిస్తున్నట్లు భావిస్తాం. అయితే ఇవన్నీ ‘నీడ’ చేస్తున్నట్లు కవి చెప్పినపుడు తన నీడే అయి వుంటుందనే (Assumption) ఊహ కలుగుతది. చివరికి ఆ ఊహ నీటి బుడగ చిట్లిన అనుభూతికి లోనవుతం. ఆ ‘నీడ’ నాన్న అని తెలిసినపుడు ఉద్వేగం రెట్టింపు అయితది. నాన్నకు – విషయం చెబుతున్న వారికి/కవికి వున్న అనుబంధం ఎలాంటిదో మరో ఊహకు అవకాశం కల్పిస్తం.
1. బాల్యంలో నవ్వుతూ కనిపించిన నాన్న నాకు వయసొస్తున్న కొద్దీ మౌనిగా మారాడు.
2. మా ఆకలి మంటలపై వర్షరుతువై మెరిసేవాడు.
3. ఏ ఉషస్సును మా భవిష్యత్తుగా కలగనేవాడో మా పాద రక్షలుగా మారాడు.
4. ఎండకు ఎండి వానకు నాని చలికి వణికిన నాన్న ఒంటికి చొక్కా తొడుక్కున్నట్టు గుర్తులేదు.
5. ఏ అర్థరాత్రో ఇల్లు చేరి మా చిట్టి బొజ్జలపై తనముని వేళ్లతో అనురాగ కవిత్వం రాసేవాడు
6. నాన్నను ప్రశాంతంగా ఎప్పుడూ చూడలేదు
*
సరళంగా చెబుతూనే కవిత్వమై పలవరించడం పై వాక్యాల్లో గమనించవచ్చు. సాధారణ వాక్యాలను కవిత్వ వాక్యాలుగా మార్చడంలో అందరికీ అర్థమయ్యే పదాలనే ప్రతీకాత్మకంగా చెప్పడం, ఉద్వేగభరితంగా చెప్పడం, కృత్రిమత్వం లేకుండా అతి సహజంగా వ్యక్తీకరించే భాష పాఠకులకు నచ్చుతది. నాన్న లేని స్థితిని చెప్పటానికి నాన్న నీడ తన వెన్నంటి వుందని, చలనశీలత్వం నాన్న జీవలక్షణమని అమరత్వాన్ని ఆపాదించిన తీరు మనసుకు హత్తుకుంటది. “అదేంటో నాన్నలకు ఆత్మాభిమానం ఎక్కువ” అంటున్నపుడు మనసు కలుక్కుమంటది. సంపాదన పరులైన బిడ్డలు నాన్నలను ఏవిధంగా చూసుకుంటున్నరు? అన్న ప్రశ్నను మోసుకుని తిరుగుతుంటాం. సమాధానాలు రకరకాలుగా తారసపడుతూ గుండెల్ని పిండి పిప్పి పిప్పి చేస్తయి. మరి మీరో.?
*
జీవలక్షణం
~
తలకొరివి పెట్టి వెనుదిరగ్గానే నా భుజమ్మీద చెయ్యేసి ఓదార్చుతూ
ఇంటికి తీసుకు వచ్చింది నీడ ఎర్రబడ్డ కళ్లలోంచి జారే నీటిని తుడిచి
లాలనగా తల నిమురుతూ నిద్రపుచ్చింది ఆ నీడే
బాల్యంలో నవ్వుతూ కనిపించిన నాన్న
నాకు వయసొస్తున్న కొద్దీ మౌనిగా మారాడు
రోజంతా ఏ శ్రమయాగం చేసేవాడో
మా ఆకలి మంటలపై వర్షరుతువై మెరిసేవాడు
ఏ ఉషస్సును మా భవిష్యత్తుగా కలగనేవాడో
మా పాదరక్షలుగా మారాడు ఎండకు ఎండి
వానకు నాని
చలికి వణికిన నాన్న
ఒంటికి చొక్కా తొడుక్కున్నట్టు గుర్తులేదు
ఏ అర్ధరాత్రో ఇల్లుచేరి మా చిట్టి బొజ్జలపై
తన మునివేళ్లతో అనురాగ కవిత్వం రాసేవాడు
నాన్నను ప్రశాంతంగా ఎప్పుడూ చూడలేదు
ఆయన సేద తీరే కుర్చీ కూడా ముందుకు వెనక్కి కదిలేది చలనశీలత్వం ఆయన జీవలక్షణం
ఉదయిస్తున్న సూర్యునికి నడుస్తున్న నాన్న మట్టి పాదాలే కనిపించేవి
ఒట్టి చేతులతో బయటికెళ్లిన నాన్న
ఏవో దోసెడు దినుసులు తెచ్చేవాడు
ఇక అమ్మ వంటను కలగంటూ నిద్రపోయేది
అదేంటో నాన్నలకు ఆత్మాభిమానం ఎక్కువ బిడ్డలు సంపాదనపరులు కాగానే
మహారాజుల్లా మహాప్రస్థానానికి పయనమవుతారు
మనల్ని వెన్నంటి ఉండే నీడలా మారిపోతారు.
*
చాలా గొప్ప విశ్లేషణ చేశారు.
ఈ కవితపై ఇదే ఉత్తమ శ్రేణి సమీక్ష
జీవ లక్షణం కవితలోని జీవాన్ని పట్టిసూపింది అన్న నీ సమీక్ష మౌనశ్రీ అన్నకు మరియు రాజ్ కుమార్ అన్నకు అభినందనలు