నాన్న!

పేరే నాకెంతో ఇష్టం ! ఆయన వైపు చూస్తే చాలు,ఆరాధన కలుగుతుంది.ఆయన ఏ పని చేస్తున్నా,ఎటు తిరుగుతున్నా, ఇంట్లో ఉన్నంత సేపూ మనసు సంతోషంతో గంతులు వేస్తుంది.

నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు చుట్టుకు చుట్టుకు తిరుగుతుంటే ‘అబ్బబ్బ అల్లరి వెధవ ! ఏ పనీ శాంతంగా చేసుకోనివ్వవు కదా.సరే రా,నా ఒళ్లో కూచోబెట్టుకుని రాసుకుంటాను’ఎంతో ముద్దు చేస్తూ ఆప్యాయతగా అక్కున చేర్చుకున్న మధురానుభూతులు కోకొల్లలు.

ఆయన స్పర్శ చల్లగా ,ఆత్మీయంగా, చూపులు అపారమైన కరుణను వర్షిస్తూ ఉండేవి.అనాధనైన నన్ను ఎక్కడి నుంచో తీసుకు వచ్చి ఎంతో మమత్వంతో ఆదరించిన ఆ మనిషే నా తండ్రి ,ఆయన భార్యే నా తల్లి ! తొలి చూపు నుంచీ నా మనసు వారిద్దరినీ నా పాలిటి దేవతలుగా స్వీకరించి పూజిస్తోంది.

నాన్న మరీను.ఆయన గురించి ఎంత చెప్పినా ఎంతో తక్కువే! నాకు ప్రపంచంలో అంత ప్రియమైన మనిషి మరొకరు లేరు.

అమ్మ కూడా మంచిదే. ఉన్నన్నాళ్ళూ. నన్ను సొంత తల్లి కంటే మిన్నగా లాలించి దగ్గరకు తీసేది.ఆటలలో మురికిగా తయారైతే ముద్దుగా మందలిస్తూ ఒళ్లంతా మృదువుగా రుద్ది నీళ్ళు పోసేది. పౌడరు వేసి జుట్టు కుదురుగా దువ్వేది. వాళ్ళిద్దరూ కూడా నాకు పెట్టి,నేను తిన్న తరువాతే కబుర్లు చెప్పుకుంటూ తినేవారు.

నాన్న ఆఫీస్ నుంచి రాగానే నవ్వులు, మాటలు,సంగీతం, సంతోషం.ఆటలో పొద్దంతా గడిపేవాణ్ణి. ఇంటి కంటే స్వర్గం వేరే ఉంటుందని నేను అనుకోను.

ఎందుకో మరి నాన్నలో మార్పు మొదలైంది. ఏవేవో సీసాలు ఇంట్లోకి వచ్చి చేరటం ప్రారంభమైంది.వాటి గురించి వాదనలు .అమ్మ వ్యతిరేకించసాగింది. చిన్న వాణ్ణి అయినా ఆ మాత్రం అర్ధం కాకపోలేదు. రోజులు గడిచిన కొద్దీ ఆటపాటలు మర్చిపోయి ఇల్లంతా భయంకరమైన మౌనం రాజ్యం చెయ్యసాగింది. నాతో, అమ్మతో కంటే సీసాలతో నాన్న ఎక్కువగా కాలక్షేపం చెయ్యసాగాడు.ఆఫీస్ కి వెళ్ళటం మానేసి అస్తమానం సీసాలు పట్టుకు కూర్చునేవాడు.ఆయన సమయమంతా సీసాలు ఖాళీ చెయ్యటం తోనే

సరిపోయేది. లేదా అమ్మతో దెబ్బలాట అరుపులు,చెయ్యి చేసుకోవటం.. వీధిలోకి వెళ్ళిపోవటం.. ఇదీ నాన్న దినచర్య.

అమ్మ పాపం అన్నం తినేది కాదు.ఏడుస్తూ పడుకునేది.ఎప్పుడో లేచినప్పుడు దిగులుగా చూస్తున్న నన్ను దగ్గరికి తీసుకుని ఏవేవో మాట్లాడేది. ‘ఈ ఇంట్లోకి వచ్చి పడటం నీ ఖర్మరా’ అనేది.’అయ్యో అలా అనకమ్మా.మీ దగ్గర నాకు ఏ లోటూ లేదు.మీ కంటే మంచి వాళ్ళు మరొకరు ఉండరు.ఏడవకమ్మా’అని నాకు తోచినట్లు నచ్చజెప్పేవాణ్ణి. నా కన్నీళ్ళు చూచి ఇంకా ఏడ్చేది అమ్మ.

అలా తిండీ తిప్పలూ మాని,దిగులుతో ఏడుస్తూ కొన్నాళ్ళకు అమ్మ బాగా జబ్బు పడింది.మామయ్య ఊరి నుండి వచ్చాడు. ఆయన డాక్టరు.అమ్మను ఆసుపత్రిలో చేర్చాడు. మామయ్యకూ నేనంటే ఇష్టమే. అత్తయ్యతో ‘పరీక్షలు చేస్తున్నాం .రేపటికి జబ్బు తెలుస్తుంది’ అనటం విన్నాను.

ఏమిటి మామయ్య అమ్మకి?’ అని అడిగాను.నన్ను ఒళ్లో కూచోబెట్టుకుని ‘చిన్నా బాగా దిగులు పడుతున్నాడు’ అన్నాడు మామయ్య. ‘అవును మరి.ఆయన దోవన ఆయన తాగి వీధిన పడతాడు.భార్య ఆసుపత్రి పాలైన ఖాతరు కూడా లేదు.ఎవరూ పట్టించుకోలేని బతుకై పోయింది వాడిది.ఈ మాత్రానికి పెంచుతామని గొప్పగా తేవటం దేనికి?’ అన్నది అత్తయ్య.

ఒక్కసారిగా చాలా కోపం వచ్చింది అత్తయ్య మీద. ‘ఊరుకోవమ్మా.నీకేం తెలుసు వాళ్ళు నన్ను ఎంత ప్రాణంగా చూసుకుంటున్నారో ‘ అందామనుకుంటుండగా అనిపించింది, అమ్మను చూసుకుంటున్నది వాళ్ళే, వాళ్ళను ఏమీ అనకూడదని!

అమ్మ తిరిగి రాలేదు.ఏదో జబ్బు ..మందు లేని మహమ్మారిట.నడిచి వెళ్ళిన అమ్మను జీవం లేని శవంగా తీసుకువచ్చి వాకిట్లో పడుకోబెట్టారు.నాన్న ఏడుపుకి అంతులేదు.ఏడుస్తున్న నన్ను చూచి వచ్చిన వాళ్ళంతా కళ్ళు తుడుచుకున్నారు.ఆ రోజు కూడా నాన్న తాగాడు.మామయ్య తగాదా పడి నాన్నను కొట్టాడు.

ఎంతైనా నాన్న కదా,అమ్మను పోగొట్టుకుని ఏడుస్తున్న నాన్న! అలా నాన్నను కొడితే నాకు కోపం, దుబ్బుం ఆగలేదు. పరిగెత్తుకుంటూ వెళ్లి ‘ఏడవకు నాన్నా,నేనున్నా కదా, ఎవరు నీ జోలికి వస్తారో చూస్తాను,ఏడవకు నాన్నా’ అంటూ ఓదార్చాను. మునుపటి నాన్న లాగా నన్ను గుండెకు హత్తుకుని వలవలా ఏడ్చాడు నాన్న.’అమ్మ పోయిందిరా,నువ్వేరా చిన్నా నాకు మిగిలింది.’

చూస్తూండగానే అందరూ వెళ్ళిపోయారు, అమ్మతో పాటు. అమ్మ లేని ఇంట్లో నేను ,నాన్న,సీసాలు. ఇదీ జీవితం. పొయ్యి వెలిగించి వారం రోజులయ్యింది. కొద్దిగా తాగటం,అమ్మ ఫోటో చూస్తూ ఏడవటం , ఏదేదో మాట్లాడటం.. మత్తుగా నిద్ర పోవటం.. ఇదీ నాన్న దినచర్య.

‘లే నాన్న ,అన్నం తిను.నాకు పెట్టు ఆకలవుతోంది. ‘వద్దురా, అన్నం వద్దు.కావాలంటే నువ్వు కూడా నాలుగు చుక్కలు తాగు,అన్ని బాధలు మర్చిపోవచ్చు. బలవంతంగా నా నోట్లో పోసాడు.చీ, డొక్కున్నాను.ఏదో మగతగా నిద్ర..అలా ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గడిచాయో.

భరించలేని దుర్వాసన..అబ్బ ముక్కు పగిలిపోతోంది. నెమ్మదిగా కదలకుండా పడున్న నాన్న దగ్గరికి జరిగాను.’నాన్నా, నాన్నా, లే ‘ ఎంత లేపినా కనీసం కదలట్లేదు.ఎక్కువగా తాగితే ఇలాగే పడుకుంటాడు…ఎప్పటికో మెళకువ వస్తే లేస్తాడు. పడుకోనీ, లేస్తే మళ్ళీ తాగుడేగా, ఇదే నయం,పడుకోనీ.

ఎందుకో ఆ చీకట్లో,భరించరాని నిశ్శబ్దంలో నాలో మొదటిసారిగా ఏదో భయం ! అమ్మకి లాగే నాన్నకు ఏమన్నా అయితే నాకెవరు దిక్కు? కడుపులో నొప్పి, భయం,బాధ..నాకెవరు అన్నం పెడతారు, నన్నెవరు ప్రేమిస్తారు ? నేను మళ్ళీ అనాధనేనా? నోరు ఎండిపోయింది. ఏడుపుతో గొంతు పూడుకుపోయింది.” ఏడుస్తున్నాను కానీ అది మూలుగు లాగా వస్తూంది. తలుపులు దబదబా బాదుతున్న శబ్దం.లేచి ఎవరూ అనే ఓపిక కూడా లేదు.నలుగురు మనుషులు లోపలికి వచ్చారు.లైట్లు వేశారు. దుర్వాసన అసహ్యించుకుంటూ తలుపులు , కిటికీలు తీశారు. నాన్న దగ్గరకు వెళ్లి చూసి ‘పోయినట్లున్నాడు’ అనుకుంటుండగా ‘డాక్టర్ గారు వచ్చారు ‘ అన్నా రెవరో. ‘

పోయి రెండు రోజులైంది.’ అంటున్నారు.

మామయ్య గొంతు వినబడింది. ‘అయ్యయ్యో..ఎంతటి నాశనానికి ఒడి కట్టావు బావా.బంగారం లాంటి ఇల్లాలిని మట్టి పాలు చేసి ఇంటిని వల్లకాడు చేసుకున్నావు,అయ్యో’ మామయ్య గొంతు ఏడుపుతో జీరపోయింది. వెక్కివెక్కి ఏడుస్తున్నాడు మామయ్య. ‘డాక్టర్ గారు, ఒక్కసారి ఇలా రండి సార్’ ఎవరో మామయ్యను పిలిచారు.నా దగ్గరకు వచ్చి ‘చిన్నా, ఒరే చిన్నా’ అంటూ నన్ను ఎత్తుకుని ‘నిన్ను దిక్కులేని వాణ్ణి చేశాడురా పాపిష్టివాడు’ అంటూ ఏడ్చాడు.

దయాపూరితమైన ఆయన చేతుల స్పర్శ నాలో ఏ మూలనో జీవాన్ని చిగురింప జేసింది. ‘వచ్చావా మామయ్యా’ అనాలని తెరిచిన నోట్లో చల్లటి మంచినీళ్ళు పడ్డాయి. రెండు గుటకలు వేసేసరికి ప్రాణం లేచి వచ్చింది. ‘వీడు నా చెల్లెలి

జ్ఞాపకంగా ఇక నుంచి నా దగ్గరే ఉంటాడు.’ నన్ను ఎత్తుకుని అందరికి ఏర్పాట్లు చెప్పి కార్ ఎక్కాడు మామయ్య.

“తాగుబోతుల ఇళ్ళల్లో మట్టికొట్టుకు పోవడానికి మనుషులే కానక్కర లేదండి.ఈ నోరు లేని జీవం కూడా బలిపశువే ! ఈ చిన్న కుక్క పిల్ల అంటే పిల్లలు లేని మా చెల్లెలికీ బావకీ ప్రాణం . కొడుకులాగా చూసుకున్నారు.’ నన్ను అనునయంగా నిమురుతూ ఎవరితోనో అంటున్నాడు మామయ్య.

‘దిక్కుమాలిన తాగుడ్ని ఎవరు కనిపెట్టారో కానీ…. ముందు వెటర్నరీ హాస్పిటల్ కి పద డ్రైవర్ ‘ నిద్ర ముంచుకు వస్తూంటే మామయ్య గొంతు లీలగా వినిపించింది.

*

శ్రీదేవి మురళీధర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీదేవి చాలా బాగా రాసిన కధ ఇది . ఒక తాగుబోతు తండ్రి వల్ల పిల్లలు అనుభవించే ఇబ్బంది క్షోభ చెప్పుతుంది ఈ కధ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు