అప్పట్లో అక్టోబరు, నవంబరు నెలల్లో చేతినిండా పనుండేది. చేలల్లో చెనక్కాయ కోతకొచ్చేది. ఏ చేలో చూసినా వాదెలు వాదెలుగా వేసిన చెనక్కాయో, ఇంకా భూమిలోంచీ పెరకని చెనక్కాయో లేక వాములుగా వేసిన చెనక్కాయో కనిపించేది. చేలూ, బాటలూ చెనక్కాయ మయమే. చెనిక్కాయ భూమిలోనుండి పీకడమూ, చెట్లనుండీ కాయలను వేరు చేయడమూ లాంటి పనులన్నీ ఎక్కువగా చేసేది స్త్రీ శక్తే.
యింటి పెద్ద అయిన మగాళ్ళు సాధారణంగా షావుకార్లతో లావాదేవీలు చేయడానికో, అప్పు తేవడానికో, యింట్లోకి గింజలు తేవడానికో ఇలా ఏదో ఒక పనికి వూరిబయటే తిరుగుతుంటారు. కొన్ని యిళ్ళల్లో అయితే మగాడు పని చేయడం అనేది చిన్నతనం. వాళ్ళ పనల్లా తెల్లటి బట్టలేసుకొని పొద్దున్నే బస్సుకు పట్టణమో, పక్కూరో వెళ్ళి ఏవో రాచకార్యాలు చేసి, చీకటి పడ్డాక యింటికి రావడమే. మగాడు బయటి వ్యవహారాలు చూస్తే, పొలం పనులన్నీ యింటి ఆడది చేయడం చాలా సాధారణం అప్పట్లో. కోడికూయక ముందే లేచి యింటిపనులన్నీ చక్కబెట్టి కాస్తా పొద్దెక్కాకా పొలం పనులకు వెళ్ళి మళ్ళీ సాయంత్రమంతా యింట్లో వంటా వార్పూ చేసి వడ్డించి, పిల్లలకూ పడకలేసి కానీ స్త్రీ నిద్దరపోదు.
మా యింట్లో కుటుంబసభ్యులే అన్నట్లుగా కాడి ఎద్దులుండేవి. రెండూ తెల్లనివి. అసహనం ఎరుగనివి. ముక్కుతాడు, పగ్గం అనేవి ఏదో వుండాలనే గానీ నిజానికి అవి లేకపోయినా వాటితో యిబ్బంది లేదు. అమ్మా, నాన్న కూడా వాటిని బిడ్డల్లా చూసుకొనేవారు (అప్పుడలానే అనుకున్నా). ఎండాకాలంలో పచ్చిగడ్డి దొరకని రోజుల్లో కూడా నీళ్ళు పారే గట్ల వెంబడీ పచ్చిగడ్డి దోకి తెచ్చి వేసేవాళ్లం. పగ్గాలు పట్టుకొని పొలాల గట్ల మధ్య వున్న పచ్చికను మేపేవాళ్ళం. రాత్రిళ్ళు వులవలని వుడకబెట్టి తినిపించేవాళ్ళం. ఒకే యింట్లో మేము పడుకునే గదికీ, అవి పడుకునే గదికీ ఓ గోడే అడ్డం. అవి ఏ మాత్రం సకిలించినా మానాన్న ఇలా ధిగ్గున మేల్కొనేవారు. గాటిలో గడ్డిలేదో, నీళ్ళే దప్పిగొన్నాయో, లేక ఏ పరాయి గొడ్డు వచ్చిందో అని వెళ్ళి చూసొచ్చేవారు.
ఒకసారి మా అన్నా, నేనూ పందిట్లో లాంతరు పెట్టుకొని చదువుకుంటున్నాం. మా యిద్దరికీ మధ్య మా చెల్లి పడుకొని నిద్ర పోతూవుంది. దాపటెద్దు అనుకుంటా.. ఎంతగా నీళ్ళకు దప్పిగొందో, పగ్గాన్ని ఎలా తెంపుకుందో నీళ్ళకోసం పరుగెత్తుకుంటూ వచ్చింది. నీళ్ళతొట్టె దగ్గరికి మమ్మల్ని దాటుకొనే వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్ళే దారి లేదు. అది పరుగెత్తుకుంటూ రావడం మేము గమనించేంతలో అది మా చెల్లెలి మీదనుండి ఒక లాంగ్ జంప్ చేసి తొట్టి దగ్గరికి వెళ్ళిపోయింది. మేము షాక్ లోంచి బయటకు వచ్చి లేచి పక్కన నిలబడ్డాము. మ చెల్లి అలాగే నిద్రపోతూ వుంది. తన కాలి గిట్ట తగిలివున్నా పసిబిడ్డ దక్కేది కాదేమొ!
అంతేకాదు, బండి కట్టాలంటే బండి నగలు ఎత్తి రెండు ఎద్దుల మెడమీద పెట్టాలి. నేనూ, మా అన్నా చిన్న పిల్లలంగా వున్నప్పుడు నగలను మేము మా రొమ్ములదాకా ఎత్తినా ఆ ఎద్దుల కాళ్ళ వరకే ఎత్తగలిగే వాళ్లం. సాధారణంగా ఎద్దులు అలాంటప్పుడు అటొకటీ ఇటొకటీ వెళ్ళిపొయి కష్టపెడతాయి. రెండింటినీ దూరం పోకుండా పగ్గాలతో కంట్రోల్ చెయ్యాల్సి వుంటుంది.
కానీ ఇవి విశ్వాసమయిన ఎద్దులు. తమ కొమ్ముల్ని దూర్చగలిగినంత ఎత్తితే చాలు, తామే తలను లోపలికి దూర్చి నగలను మెడమీద వేసుకునేవి. బండికి కట్టినా, మరే పనికి కట్టినా మెడమీద కాడిమాను తప్పనిసరి. కాడిమానుకు, ఎద్దులమెడకూ పట్టెడలు కట్టడం తప్పనిసరి. పట్టెడ వూడిపోతే సహజంగానే ఎద్దు మెడమీదనుండీ కాడిమాను పడిపోయే అవకాశం వుంటుంది. కానీ ఈ ఎద్దులకు మధ్యలో పట్టెడ వూడిపోయినా, అవి మెడను పక్కకు తప్పించకుండా జాగ్రత్తగా దారి వెంబడి వెళ్ళేవి.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇలాగే ఓ నవంబరు నెలలో మా అమ్మ, అవ్వ (అమ్మమ్మ) బండి కట్టుకొని మా పెద్దచేనుకు వెళ్ళారు. నాకప్పుడు పదేళ్లేమొ. రోజంతా గడ్డి కోస్తూనో, కాయలు కోస్తూనో వున్నారు. ఇక చీకటి పడుతుందనగా కోసిన గడ్డిని, కాయలని బండ్లో వేసుకొని, బండితోలుకొని వూర్లోకి వచ్చారు.
వూర్లో మా అమ్మ బండినగలమీద కూర్చుని వస్తూ వుంటే వెంకట్రాయుడు ఎదురయి, “ఏమ్మా, వూర్లోకి వచ్చాకన్నా బండి దిగొచ్చు కదా!” అన్నాడు. అప్పటికే రోజంతా పనితో అలసిపోయుయి వుందో, ఆ సమయానికి వూర్లోలేని మా నాన్నమీద కోపమే వచ్చిందో గానీ, ఆ తర్వాత గంట సేపటి వరకూ మా అమ్మ నానా రకాలుగా మా వూరి మగజాతినంతటినీ తిట్టి పోసింది. “నా బండి, నా యిల్లు నేను కూర్చునే తోలుకొస్తానో, నిలబడే తోలుకొస్తానో. ఈడెవరు నాకు చెప్పడానికి.”
ఇలా మగాడి అధిపత్యాన్ని తూర్పారబట్టింది ఏ రాజ్యాంగమూ, ఫెమినిజమూ తెలియని మా అమ్మ. ఎవ్వరూ నోరెత్తలేదు.
బాగుందండీ!
Thank you!
నిజమే ప్రసాద్ గారు.,గ్రామాల్లో పురుషులంతా పని తప్పించుకు తిరుగుతుంటే. స్రీలు ఒళ్లేరక్కుండ పని చేయడమే కాదు…అదే సమయంలో పని దొంగలైన మగాళ్ళను దులిపేయడము నేనూ చూసాను.మీరు దీన్ని ఓ జ్ఞాపకం గా కాకుండా ఒక కథగా మలచండి.అద్భుతంగా వస్తుంది.అమ్మ తనని ఎడ్లు దిగి నడవమన్న మగాన్ని ఎట్లా దులిపిందో చదవాలి అని ఆశపడ్డ ను… కథ ప్రయత్నం చేయండి
కథ రాసేంత కళ నాకు లేదండి. ఇది రాసేముందు మా అమ్మతో మాట్లాడి ఈ సంఘటనని గుర్తు చేస్టే నాకింకా ఆరోజు గుర్తున్నందుకు భలే ముచ్చటపడింది. కానీ ఏమని తిట్టిందో ఆమెకూ గుర్తు లేదు, నాకూ లేదు.
పల్లెనుంచి అమెరికా వెళ్లి స్థిరపడటం అంటే ఎంత మంది ఎవరెవరు ఎలా నిచ్చెన మెట్లు గా ఉపయోగ పడ్డారో ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి తలుచు కోవడం అభినందనీయం. ఆ ఎద్దులు ప్రసాద్ చెప్పినట్లు మెడలు వంచి కాడి పెట్టుకొనేవి..దారి తప్పక ఇంటి ముందుకు వచ్చి ఆగేవి..మేము, పిల్లలం కేవలం బండి నగలపై ఉత్సవ విగ్రహం లాగా కూర్చొనే వారము పగ్గాలు చేతబూని. వాటిని అందరమూ ఊరందరు పొగిడేవారు…ఆ పొగడ్తల హోరులో మా అమ్మా నాన్నా అనేవారు ” మేము ఇవి అమ్మము ..చేయలేని నాడు కూడా మేపుతాము..చని పోతే సమాధి చేస్తాం”. కానీ పని ఎక్కువయి వాటి శక్తి తగ్గినాక …సేద్యానికి అవసరము లేని వారికి అమ్మారు… పరిస్థితులు అలా వచ్చా యి..మరి ప్చ్…
ఈ ఎద్దులలాగే మనుషులు వున్నారు మాకు సహాయం చేసినవారు…ప్రసాద్ వారిని తర్వాత వివరిస్తారు…
అద్భుతమైన మన గతం గుర్తు చేసి చాలా సంతోషపెట్టారు అన్నా.
రాయలసీమలో సాధారణంగా మగవాళ్ళు పనిచేయరని,వాళ్ళు “రాచకార్యాలు వెలగపెడతారని” మీ నిజకథనం ద్వారా అర్థం అయింది.రాయలసీమకి చెందిన ప్రసిద్ధ కథకులు తమ కథల్లో పురుష రైతుల శ్రమించే స్వభావం గురించీ,కరువు,వర్షాభావం సందర్భాలలో వాళ్ళు పొలం చుట్టూ తిరుగుతూ పడే కస్టాల గురించీ వ్రాసారు. అవన్నీ కల్పితమని మీ కధనం ద్వారా అర్థమైంది. “వాన రాలె” లాంటి కథలూ,సింగమనేని కథలూ కేవలం కల్పితమని ఒక్కముక్కలో అర్థమైంది.
విద్యాసాగర్ గారూ,
నేను మా వూర్లో అందునా కొన్ని యిళ్ళలో అని చెప్పాను. సీమ అంతటికీ నామాటలు ప్రతినిథ్యం వహించవు. మా వూరు కూడా సీమ అంతటికీ ప్రతినిథి కాదు. మా వూర్లో వున్న ఆచారమే పక్కూర్లో వుంటుందని చెప్పలేను అలాంటిది సీమ అంతా మగాళ్ళు రాచకార్యాలు వెలగబెడతారని ఎలా చెప్పగలను? మా యింట్లో కష్టపడే మా నాన్నే వుండగా పురుషులంతా కష్టపడరని ఎలా చెప్పగలను.
మీరు వుటంకించిన కథలు చదవలేదింకా. చదువుతాను.
అన్నా.. ముందుగా కథ రాసి మాట నిలిపినందుకు దండాలు. ఇక అమ్మ లోని సహజ స్త్రీవాదాన్ని అంటే సహజంగా ఎలాంటి నగలు వెయ్యకుండా చాలా సింపుల్ గా present చేశారు. చాలా హత్తుకుంది.
అయితే రాయల సీమ మగాళ్ళ రాచకార్యాల గురించి మీరు యడార్థంగా రాసిన వెంటనే అదేదో ఆ ఒక్క ప్రాంతపు ప్రజలకే అలవాటైన బాడగోలు తనంగా ఆపాదించే ప్రయత్నాలు కింద కామెంట్లలో చూసాను.
నిజానికి ఇది మా గుంటూరు జిల్లాలో కూడా ఉంది. అంతెందుకు… అలెక్స్ హేలీ రాసిన రూట్స్ లో కూడా ధాన్యం పండించడం ఆడాళ్ళ పని అని రాశాడు. మగాళ్లు వేటాడటం, పంచాయితీలు చెయ్యడం లేదా బంగారం సేకరణ లాంటి కృత్రిమ ఆదాయ మార్గాల్లో వ్యపకాల్లో మునిగి ఉండటం చూస్తాం. ఇది ఈశాన్య భారతం లో కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మాతృస్వామ్య పోకడలు ఇంకా అక్కడక్కడా మిగిలి ఉన్నా కొన్ని బ్రతుకులో ఈ విధమైన వ్యవహార శైలి మగాల్లందరు పాటించేదే.
మా ఉల్లల్లో చౌదరమ్మ వ్యవసాయం బాధ్యత తీసుకున్న కుటుంబాల్లో మగాళ్లు ఎల్ వి ఆర్ క్లబ్బులో పేకాట ఆడుతూ కనబడతారు. ఇది స్త్రీకి స్వామ్యం ఇస్తున్నట్టు నటిస్తూ పురుషుడు అనుభవించే విలాసం అనే మనం అనుకోవాలి. ఇది అన్ని ప్రాంతాల మోసం అని నేను భావిస్తాను.