ఉన్నట్టుండి వర్షం మొదలౌతుంది
చేతిలోని గొడుగు ఎక్కడో జారిపోతుంది
నా లోపల అద్దంలో నేను తడిసిపోతాను
సూర్యుడు మేఘాల వెంట పరిగెడుతుంటాడు
మేఘాలు కొసరి కొసరి చిరు జల్లుల్ని వడ్డిస్తుంటాయ్
నా ఎదుట అద్దంలోని ఇంద్రధనుస్సు
దేహమంతా నల్ల రంగుని అద్దుకుంటుంది
మెల్లమెల్లగా వర్షం కురుస్తూనే ఉంటుంది
నా మీద వాలిన చినుకుపిట్టలు
అద్దంలో చమ్కీల్లా మెరిసిపోతుంటాయ్
నేను తలెత్తి ఆకాశం వైపు చూస్తాను
ఆకాశం నాలోకి తొంగి చూస్తుంది
నా లోపల లోలోపల అద్దంలో
చిల్లులుపడ్డ ఆకాశం
చీకటిలో చిక్కుకున్న సూర్యుడు
గాయపడ్డ నెలవంక
గాజు కన్నుల నక్షత్రాలు
రెక్కలిరిగిన చిన్న చిన్న పక్షులు
తేనెటీగలు ముసురుకున్న వాడిన పువ్వులు
తడిసి ముద్దయి పోతాయి
నదులు సముద్రాలు సంగమించే చోట
ఎదురీదే చేపల్తో నా కవిత్వం సంభాషిస్తుంది
అప్పుడే మొలకెత్తిన విత్తనం
కొలిమిలో కాల్చిన కొడవలిలా ఒళ్ళు విరుచుకుంటుంది
అల్లంత దూరం నుంచే తల్లిని చూసిన లేగదూడ
చెంగుచెంగున గంతులేస్తుంది
కాసేపటికి వర్షం తెరిపినిస్తుంది
పిల్లగాలి తెమ్మెరలా నువ్వొస్తావు
నల్లసముద్రాల ఊపిరి ఘోష వినిపిస్తావు
వర్షం ఆగిపోతుంది
నేను తడుస్తూనే ఉంటాను
నా లోపల
లోలోపల
లోపల్లోపల
తగలబడ్తున్న నల్లటి అద్దం
అగ్నిగోళంలా భళ్ళున బద్ధలౌతుంది …!
*
Kolimilo kaalchina kodavali
చాలా మంచి పొయెం.
బాగుంది sir
,”నదులు సముద్రాలు సంగమించే చోట
ఎదురీదే చేపల్తో నా కవిత్వం సంభాషిస్తుంది”
I love this expression dear Sabir.
Excellent poem.
More power to you.
చాలా బాగుంది.