నల్లగొండ కథలంటే కొంచెం ఎక్కువ ప్రేమ!

 ‘నల్లగొండ కథల’ పిలగానితో ముచ్చట్లు

వి. మల్లికార్జున్ కథలు రాస్తాడు…, చాలామంది రచయితల్లాగే కథలు రాస్తాడు. అయితే ఈతరం తెలుగు రచయితగా మల్లి అంటే నాక్కొంచం ఎక్కువ ప్రేమ. కొంపలు మునిగే విషయాన్ని కూడా సున్నితంగా ప్రేమతో చెప్పే మల్లికార్జున్ ఈ జనరేషన్ కథా రచయితగా నిలబడుతున్నాడు. కథ మీద కథ, పుస్తకం మీద పుస్తకం… యువకుడిగా తన వేగాన్ని రాయటంలోనూ చూపిస్తాడు. అత్యంత సున్నితంగా చెప్పాలనుకున్న విషయాన్ని పాఠకుడిలోకి తీసుకుపోతాడు. ఒక్కోసారి మనతోనే నడుస్తూ కథ చెబుతున్నట్టుంటుంది. అందుకే అసలు ఈ పోరడు ఇట్లా ఎట్లా రాస్తున్నాడో అడగాలనిపించేది. అదిగో ఆ సంభాషణ ఇట్లా– ’నల్లగొండ కథలు’ పుస్తకం రిలీజైన సందర్భంగా ఇన్నాళ్లకి కుదిరింది.

‘నల్లగొండ కథల’ పిలగానితో ముచ్చట్లు…

 

మల్లి కథలు ఎందుకు రాస్తాడు?

రాయకుండా ఉండలేను కాబట్టి. నా చుట్టూ రోజూ కనిపించే ఇన్నిన్ని జీవితాలను చూసినప్పుడు వీటినుంచే మనం కథలు ఎందుకు చెప్పకూడదు అనుకుంటా. అవి నా జీవితంలో జరిగేవి కావొచ్చు, జరిగిపోయిన జ్ఞాపకాల కథలు కూడా కావొచ్చు. ఆ జీవితాలే నాకు లెక్కలేనన్ని కథలను తీసుకొచ్చి పెడతాయి. రాస్తూ పోతా. ఇక కథలు ఎందుకు రాస్తున్నానంటే రాయాలన్న ఆలోచన ఒక పురగు.. అది తొలుస్తూనే ఉన్నప్పుడు రాసేస్తే తప్ప ప్రశాంతంగా ఉండలేను కదా!

నీ కథల్లో భాష చాలా ప్లెయిన్ అనిపిస్తుందన్న కంప్లైంట్ ఉంది..

కానీ నేను రాస్తున్నదే నా కథల్లో భాష ప్లెయిన్‌గా, సింపుల్‌గా ఉండాలని కదా!  కథల్లో పాత్రలు రచయితల్ని దాటి వచ్చి బతకాలి. అప్పుడే వాటికో అందం ఉంటుందని నమ్ముతాను. రచయితకు ఎక్కువ తెలుసు కదా అని ఆ పాత్రలతో కూడా అలాగే మాట్లాడిస్తే ఇంక కథ ఎందుకు? ఇప్పుడు నల్లగొండ కథలే తీసుకుంటే అందులో మా అమ్మ, నాన్న.. వీళ్లే ప్రధానంగా కనిపిస్తుంటారు. వాళ్లతో క్యాపిటలిజం, మెట్రోసిటీ లాంటి మాటలు మాట్లాడించలేను. నేను రాసే కథల్లో భాషను ఆ పాత్రలే ఎంచుకుంటాయి. అలాగే ఉండటమే నాక్కూడా కావాలి. అది కంప్లయింట్ అయినా సరే.

కథల్లో సొంత కథలు ఎక్కువ ఉన్నట్టున్నాయ్? పూర్తి ఫిక్షన్ కథలు ఎందుకు తక్కువగా రాశావు?..’

ఫిక్షన్ అనేది నిజానికి రియాలిటీకి ఎక్స్‌టెన్షన్ అనుకుంటాను. అంటే రియాలిటీ నుంచి ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే అక్కడ్నుంచి మొదలయ్యే స్టోరీలో అలా ఎంత దూరం వెళ్తామన్నది ఆ కథ ఇష్టం. అవి ఒరిజినల్ స్టోరీస్ అనిపించుకునేది కూడా అప్పుడే. సింపుల్ యూనివర్స్ ఫిలాసఫీ చెప్తా, ఈ విశ్వం పుట్టిందే ఒక్కటే ఈవెంట్  దగ్గర కదా; కానీ ఇప్పుడున్నది? కథ కూడా అలాంటిదే. నేను నా కథలకి అవసరమైనంత దూరం రియాలిటీని ముందుకు తీసుకుపోతుంటాను. ఒక్కోసారి అవి పూర్తి ఫిక్షన్‌లాగా అనిపించొచ్చు, ఇంకోసారి మొత్తంగా నా కథలేనేమో అనిపించొచ్చు. నాకు అది ఏదైనా కథే.

నీ బుక్ కవర్ పేజెస్ కూడా స్పెషల్‌గా అనిపిస్తాయి, అవి ఎలా ప్లాన్ చేస్తావు?

ఏ ఆర్ట్ ఫామ్‌లో అయినా నాకు ఆ ఆర్టిస్టుకంటూ ఉండే ఒక పర్సనల్ ఫిలాసఫీ ఇష్టం. ఏదో సందేశం ఇవ్వాలి, ఏదో చెప్పాలనే దానికంటే కూడా ఎక్స్‌ప్రెషన్ ఉంటే ఇష్టపడతా. ఇరానీ కేఫ్, కాగితం పడవలు రెండు పుస్తకాల ఫిలాసఫీకి సరిపోతాయనిపించే పెయింటింగ్స్‌ని వెతికి పట్టుకొని తీసుకున్నా. ఇక నల్లగొండ కథలకి శంకర్ అన్నతో కవర్ బొమ్మ వేయించటానికి కారణం – ఒక ఇరవై ఏండ్ల కిందటి నల్లగొండ ఎలా ఉంటుందన్నది అక్కడే పుట్టి పెరిగినవాడిగా ఆయనకి బాగా తెలుసని. అదే ఇప్పుడు కవర్‌పేజీ మీద కనిపిస్తున్నది కూడా.

ప్రేమ అనే పదం ఎందుకంత ఇష్టం?

ప్రతీ మనిషికీ – వాళ్లు ఆర్టిస్టులే కానవసరం లేదు – సొంతంగా ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఉండాలి కూడా. నేను నా చుట్టూ నాతో ఉండే మనుషుల్లో ఇష్టపడేది ఆ ఫిలాసఫీనే. నా వరకైతే నేను నమ్మే ఫిలాసఫీ ప్రేమ. దానికి మించింది ఇంకేదీ లేదని నమ్ముతాను. ప్రపంచంలో అతిపెద్ద పొలిటికల్ ప్రాబ్లెంని కూడా నేనైతే ప్రేమతో కనెక్ట్ చేసి చూస్తాను. నా కథలు కూడా ఎక్కడ, ఎలా నడుస్తున్నా నేను వాటిని ప్రేమతోనే కట్టేస్తాను. అలాగని ’ఇదిగో నేను ఈ ఫిలాసఫీ చెప్తున్నా’ అని కథ చెప్పడం కూడా నాకిష్టం లేదు. నాకిష్టమైన ఒక కథ చెబుతా. దానిలోతుల్లో నాదంటూ ఒక ఫిలాసఫీ కూడా చెప్పాలనుకుంటా. నేను చెప్పే ఫిలాసఫీ అనేది ఒకటి ఎవరికైనా అర్థం కాలేదనుకో.. కనీసం వాళ్లకోసం వాళ్లు మామూలుగా చదువుకోవడానికైనా నేనొక మంచి కథ చెప్పి ఉండాలి. అంతేగానీ ఫిలాసఫీలే కథలు అయిపోకూడదని నమ్ముతా.

వెంటవెంటనే రాసేస్తావ్ కదా, అంత స్పీడుగా కథ రాయటం ఎలా సాధ్యమవుతోంది?

కథ రాయటానికి ముందే ముగింపుతో సహా నా మైండ్‌లోకి వచ్చేస్తుంది. అలా నాకు ఒక కథ పూర్తిగా తెలిస్తేగానీ రాయలేను. రాస్తున్నప్పుడు అది మారుతూ నాకే కొత్తగా కనిపించొచ్చు. కానీ నాకు ఆ కథ అర్థమైనతర్వాతే రాయడం మొదలుపెడతా. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా. ఒక్కసారే నాలుగైదు కథలు నడుస్తుంటాయి. ఏది ముందుకు బయటికొస్తే అదే కథ. తొందరగా రాయాలని ఏం పెట్టుకోను.. ఒక్కసారి రాసి నేను ఫైనల్ అనుకున్నానంటే నేనింక ఆ కథ గురించి ఆలోచించను. వెంటనే ఇంకో కథ రాసుకోవచ్చు.

నీ కథలని నువ్వే పాఠకుడిగా చదువుకున్నప్పుడు ’ఇది ఇంకోలా రాసి ఉండొచ్చు, దీన్ని బాగా ఎడిట్ చెయ్యొచ్చు’ అని ఎప్పుడైనా అనిపించిందా?

కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిసార్లూ మనకు కథ ఒకేలాగ అర్థమవ్వదు కదా. నేనైతే ఆ కథ రాస్తున్నప్పుడు ఉన్న నాకున్న భాషను, స్టేటాఫ్ మైండ్‌ను గౌరవిస్తా. తర్వాత మార్చే అవసరమే వచ్చినా కేవలం టెక్నికల్‌గా ఏమైనా తప్పులుంటే దిద్దుతా. అలా కాకుండా ఇప్పటి నన్ను తీసుకెళ్లి ఆ కథల్ని మళ్లీ రాయించను. అలాగే ఒక్కసారి రాసి పబ్లిష్ చేసిన కథల విషయంలో నేనెప్పుడూ రిగ్రెట్ ఫీలవ్వను.

నీ కథలు సారంగ మేగజైన్ మినహా పెద్దగా ఎక్కడా రాలేదు, ఎందుకని?

ఒక కథ రాసి దాన్ని ఏదో పత్రికకు పంపాలి, దాంట్లో రావాలి అని నాకేం ఉండదు. కథ రాసిన తర్వాత దాని గురించే ఆలోచించేటంత ప్రేమ కూడా ఏం ఉండదు. దాని దారి అదే వెతుక్కుంటుందని కూడా నమ్ముతాను నేను. అలాగే నేను పత్రికల్లో పనిచేయడం వల్ల ఇంకో పత్రికకు కథ పంపించాలని ఎప్పుడూ అనుకోలేదు. పనిచేస్తున్న పత్రికలోనే అయితే అసలు మనల్ని రాయనివ్వరు కదా!

నల్లగొండ కథలు మొత్తంగా నీ పర్సనల్ స్టోరీసే కదా, ఎక్కువ ప్రేమ ఉందా?

లేదని చెప్పగలనా? నల్లగొండ కథల్లో మొత్తంగా నేనే ఉన్నా, నా కథలే ఉన్నాయి. అయితే ఇవి రాయడం మొదలుపెట్టినప్పుడు వీటిని నేను ఇంత ఇష్టపడతానని అనుకోలేదు. ఈ కథలు రాస్తున్నప్పుడంతా నన్ను నేను వెతుక్కుంటూ వెళ్లినట్టు అనిపించింది. లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇది.

నల్లగొండ కథల మీదనే ఎందుకంత ప్రేమ?

నేను ఈ కథలనే కాదు, ఏది రాసినా ఇష్టపడి, ప్రేమిస్తేనే రాస్తా. ఇప్పుడు ఈ పుస్తకం మీద ఎందుకు ప్రేమంటే.. ఇది నా జీవితం. నేను చూసొచ్చిన కథలు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కథల్లో ఒకప్పటి పేదరికమే ఉండని, కష్టాలే ఉండని, ఓపలేనంత బాధలే కావొచ్చు.. ఇవన్నీ నావి అని గుర్తొస్తున్నందుకేమో.. నల్లగొండ కథలంటే కొంచెం ఎక్కువ ప్రేమే.

*

నరేష్కుమార్ సూఫీ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ పుస్తకం చదివినప్పటి నుంచి..పొద్దు పొద్దుగాల, కల్లో కూడా నల్లగొండే కనబడుతోంది. ఇప్పటికిప్పుడు రెక్కలు కట్టుకు పోయి ఇప్పుడున్న నల్లగొండ ను చూస్తూ.. అప్పటి నల్లగొండ ను తలచుకోవాలనిపిస్తోంది. మనందరికీ ఇష్టమైన మన బాల్యాన్ని గుర్తుకు తెచ్చే ఈ కథల గురించి ఎంత​చెప్పినా తక్కువే! వయసు పెరిగుతోన్న కొద్దీ ఒకప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కొకటిగా మర్చిపోతూ ఉంటాం మనం. మల్లికార్జున్ మాత్రం చాలా తెలివిగా ఆయన బాల్యాన్ని ఈ కథల్లో రాసి పెట్టుకొని దాచుకున్నారు. వాస్తవానికవి అందరి కథలు కూడా. అతను అన్నట్టు.. నిజమే, ఊరి గురించి రాయడమంటే అమ్మ గురించి రాయడమే. గుండెల్నిండా ఉన్న ఈ కథల పట్ల ప్రేమను చెప్పడానికి, మళ్లోక నూట యాభై పేజీల పుస్తకం రాయాల్సి వస్తుందేమో!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు