జీవితంలోంచి నడిచొచ్చిన వాక్యానికి మరణం ఉండదు. పదికాలాల పాటు నిలబడాలంటే అందులో మనం ఉండాలి.
అప్పుడే అది జీవమున్న కవిత్వం అనిపించుకుంటుంది. వీటితోపాటు సహజత్వం లోంచి ఇమేజరీ పుట్టినపుడే సాధారణపాఠకుడికి కూడా చేరువౌతుంది . వస్తువు ఏదైనా తాజాదనపు అభివ్యక్తి కనిపించాలి.కేవలం ఉద్వేగాలే కాకుండ దానిని కళాత్మకంగ మలిచే నేర్పు ఉండాలి.కళాత్మకతతో పాటు వర్తమానత,సామాజికత ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ దానిని సొంతం చేసుకుంటారు.
అనిల్ డ్యాని రాసిన “ఎనిమిదో రంగు” కవిత్వం కూడా సరిగ్గా అలాంటిదే.35కవితలున్న ఈ సంపుటి మనల్ని అనేక ఉద్వేగాలకు గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అనిల్ డ్యాని కవిత్వం ప్రధానంగా మూడు పాయలుగా ప్రవహిస్తుంది .స్త్రీల పక్షాన నిలబడి మాట్లాడే కవితలు కొన్నైతే, వర్ణవ్యవస్థను నిలదీసే కవితలు మరికొన్ని .మానవత్వ దృక్పథంతో రాసిన కవితలు మరొక పాయ. ముఖ్యంగా వర్ణవ్యవస్థను ధిక్కరించే ఎనిమిదో రంగు కవిత గురించి మాట్లాడుకోవాలి. ఇంద్రధనస్సులో ఉండేవి ఏడురంగులే కదా మరి ఈ ఎనిమిదో రంగు ఏంటనే ప్రశ్న మనకు సహజంగానే కలుగుతుంది.
ఇంద్రధనస్సులో ఒదగని ఎనిమిదో రంగు నలుపు” .ఇది సమాజంలోంచి వెలివేయబడ్డ వెలివాడల రంగు .ఎండలో చెమట బొట్లు చిందించే శ్రమజీవుల రంగు.శరీరరంగు వివక్ష వలనే తరతరాలుగ ఎన్నో దేశాలు బానిసత్వంలో కూరుకుపోయాయి.అయితే “నలుపు చావులేని రంగే” అని డ్యాని తన కవిత్వంలో అంటాడు .నలుపు లోని అందాన్ని వర్ణిస్తూ తామసి అనే ఖండకావ్యం కూడా రాశాడు దాశరధి.
“నలుపనేది లేకపోతే తెలుపుఎక్కడిది రా” అని నలుపు గొప్పతనాన్ని, నల్ల మనుషుల ప్రాధాన్యాన్ని ఎప్పుడో చెప్పిండు మద్దూరి. ఇలా ఎన్ని చెప్పుకున్నా నలుపు రంగు అంటే చాలా మందికి ఇప్పటికీ చిన్నచూపు.
“ఎంత నింద పడ్డాను సాయ తక్కువని
ఏం చేసుకుంటార్ర రంగుని పూనుకుంటారా
అని అవ్వ చానా తిట్టేడిది సూపుల కొచ్చిన పోరగాళ్ళని”
(ఎనిమిదో రంగు -63)
ఆడపిల్లలు నల్లగుంటే వచ్చే సమస్యలు మాములువి కాదు. గుణం కన్న రంగుకే ప్రాధాన్యత ఇస్తున్న రోజులివి.పెళ్ళిచూపుల వరకు వచ్చి పిల్ల నచ్చలేదంటు మధ్యలోనే ఆగిపోయే పెళ్ళిళ్ళు ఉన్నాయి.అమ్మాయి నల్లగున్నదని మరింత వరకట్నం అడిగే మగాళ్ళు లేకపోలేదు.కుటుంబ పరంగ వీళ్ళు ఎదుర్కొనే సమస్యను కవిత్వం చేశాడు కవి.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోనే “దేహాల నిండా పరుచుకున్న ఎనిమిదో రంగు ప్రేమ”అని అన్నాడు.నలుపు రంగును స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా,సమస్త దళితజాతిని ప్రతిబింబించే విధంగ చెప్పాడు.రంగుని చూసి గౌరవించే మనుషులుండడం ఈ దేశపు దౌర్భాగ్యం.అందుకే ఈ కవి ప్రేమించే హృదయం కోసం కలగంటున్నాడు.దేశాన్ని,దేశ రాజకీయాల గురించి బాగ అవగాహన కల్గిన ఈ కవి రాజ్యం తీరుపై ధిక్కారస్వరమై కనిపిస్తాడు కొన్ని కవితల్లో.
“దేశపటం నిండా సరిహద్దుల్లో సమాధులు
ఇప్పుడిక ఏడవడం మీద కూడా నిషేధం”
(ఇక్కడ ఏడుపు నిషేధం-36)
అనేక ఆంక్షల మధ్య ,అనేక సంఘర్షణల మధ్య బతుకీడుస్తున్న జనం వెతలను చిత్రించాడు కవి.ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛను కోల్పోతున్న ప్రజలగూర్చి ఆలోచింపజేసే కవిత.
డ్యాని కవిత్వంలో అనేక మంది స్త్రీలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలబడుతారు.ఎన్నో ఆటుపోట్లకు గురౌతున్న మహిళల జీవితాలను చూసి,చలించి స్త్రీ మీద అమితమైన గౌరవంతో
“తెల్లారొచ్చిన సూర్యుడి వెలుగంతా
ప్రపంచ తల్లులు స్రవించిన రక్తం” (ఆమెతనం-29)
అని అనిల్ డ్యాని లాంటి కొద్దిమంది కవులు మాత్రమే రాయగలరు.
పెళ్ళిలో లైట్లు మోస్తూ జీవితాన్ని ఎల్లదీస్తున్న ఒక కూలి వీరి కవిత్వంలో కనిపిస్తుంది.నిజాయితీతో పాత్రికేయ వృత్తిని పాటిస్తూ ప్రాణాలిడిచిన గౌరీలంకేష్ గొంతు వినబడుతుంది.మనిషిలెక్క చూడబడని ఒక వేశ్య డ్యానీ కవిత్వంలో ఎవరూ చూడని జీవితంలో తాను అనుభవించిన బాధను చెప్పుకుంటుంది.
నేటి సమాజంలో స్త్రీలంటే,అందులోనూ వేశ్యలంటే మరింత చులకన.వాళ్ళు అలా మారడానికి కారణం ఏంటి?అని ఏనాడు మనం ఆలోచించం.పైగా అసహ్యించుకుంటాము.అలిశెట్టి లాంటి ఎంతో మంది కవులు వీరిపై రాశారు..డ్యాని కూడ వాళ్ళ మానసిక వేదనకు అక్షరరూపం ఇస్తాడు వెకేటింగ్ కవితలో.వేశ్యజీవితాలపై వచ్చిన గొప్ప కవితల పక్కన ఇది నిలబడుతుంది.
“రాత్రి వానకి గట్టు కోతకి గురైంది
ఎంత కోతో ఆ గట్టుకీ తెలీదు”(వెకేటింగ్ -58)
ప్రతీ రోజు ఎంత నరకం అనుభవిస్తుందో తనకు కూడ తెలియదనడంలోనే ఎంతో ఆవేదన వ్యక్తమౌతుంది.నిరంతరం అలల కోతకు గురయ్యే ఒడ్డుతో వేశ్యను చెప్పడం ఇక్కడ చూస్తాం.
“అక్కడక్కడా పుట్టుమచ్చలు
కాలిన గాయాల మచ్చల్తోకలిపి” లాంటి వాక్యాలు వాళ్ళ జీవితం నిండా పరుచుకున్న గాయాల్ని చూపిస్తాయి.
డ్యానీ రాసిన కవితల్లో మానవత అంతర్లీనంగా ప్రవహిస్తుంది.స్త్రీ సమస్యలపై గొంతెత్తినప్పుడైనా ,కులమతాలకు అతీతంగ మనిషివికాసం జరగాలని కోరుకున్న సందర్భంలోనూ వీరిలో మానవతాదృక్పథం కనిపిస్తుంది.జనరల్ బోగి లాంటి కవితల్లో సూటిగా,స్పష్టంగ ఈ విషయం అవగతమౌతుంది.
1)గడిపిన గంట సేపూ
మనిషితనం కాస్త మనసులకే అంటుకుంది కదా
అందుకోసమైనా అప్పుడప్పుడూ
జనరల్ బోగీల్లో ప్రయాణించాలి
(జనరల్ బోగి-42)
2)మనసుల మధ్య ఖాళీతనాన్ని మాటలతో
నింపుకోలేక పోవడం బలవన్మరణం
(మనుషుల మధ్య-62)
పై రెండు వాక్యాల ద్వారా కవి చెప్పదలుచుకున్నదేదో అర్థమౌతుంది.మనుషుల మధ్య పెరిగిపోతున్న ఖాళీతనాన్ని చెరిగిపోవాలని కోరుకుంటున్నాడు.సామాన్యజనానికి దగ్గరగా ,సామాన్య జనంలో ఒకడిగా బతకాలనే కోరిక కనబడుతుంది. ఆత్మీయ కరచాలనంతో,మాటలతో గుండెలకు దగ్గరయ్యె మనిషికోసం అన్వేషిస్తున్నాడు.
జీవిత అనుభవాల ద్వార తాను గ్రహించింది తాత్వికతంగ చెప్పడం వీరి కవిత్వంలో గమనించవచ్చు.
“సంఘర్షణొకటి చిట్టచివరి శ్వాసదాకా
తోడొస్తుంది
సుఖం కన్న బాధే గొప్పది”.
సాధారణ వాక్యంలాగే కనిపిస్తున్న ఈ వాక్యంలో ఎంతో లోతు కనబడుతుంది.మానని గాయాల బాధను మోసుకొస్తుంది ఈ వాక్యం.
అనిల్ డ్యాని కవిత్వాన్ని ఎవరైనా సొంతం చేసుకోవడానికి గల కారణం తాను కవితను నడిపిన విధానం,తాను ఉపయోగించిన ఉపమానాలు.ఎత్తుగడ,ముగింపుల్లో తాను కనబరిచిన శ్రద్ధ.కిక్కిరిసి పోయిన జనంతో కూడిన జనరల్ బోగీని గురించి చెబుతూ
“ఒక్క అక్షరమూ పట్టకుండా/పూర్తిగా రాసేసిన ఉత్తరంలా ఉంది రైలు బోగి” అని చెప్పినప్పుడైనా వేముల రోహిత్ మరణాన్ని తల్చుకుంటూ “నిన్ను మోసిన ఆ ఉరితాడులా/సంధిస్తున్న ప్రశ్నలను ఎదుర్కోవాలంటే /ప్రజ్వలిస్తున్న సూర్యుడిని చూస్తున్నంత/ఇబ్బందిగానే ఉంది”అని కన్నీరు విడిచినపుడైనా తనదైన ఉద్వేగ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు.తాను తీసుకున్న ఉత్తరం,సూర్యుడు లాంటి పోలికలు మన జీవితానికీ దగ్గరగా ఉండడం వలన అందులో పూర్తిగా లీనమౌతాము.
ప్రతీ కవితలోని ముగింపు వాక్యాలు మెరుపుతోనో,వ్యంగ్యంతోనే,కవిత మొత్తానికి ఆత్మగా చెప్పుకునే వాక్యాలతోనో ముగించడం వీరి కవితల్లో ప్రత్యేకత. సామాన్యజనం మాట్లాడుకునే మాటలే ఇతని కవిత్వ శీర్షికలుగ కనిపిస్తాయి.”జండాపై కపిరాజు”,భలే మంచి చౌక బేరము,”ఇదిగో పొలం నుంచి వస్తున్నాను” మొదలైన కవితాశీర్షికలు ఈ కోవకు చెందినవే.డ్యాని కవిత్వం ఇంటిముందు ముగ్గులేసి రంగులు చల్లినాక మెరుపు అద్దినట్లుంటుంది.నెత్తిన బరువైన మూటమోస్తు ఒక వైపు జారిపోతున్న చెమటలాగ మెరుస్తూ ఉంటుంది.పసిపిల్లల నవ్వులాగ స్వచ్ఛంగా,చీకటిజీవితాల మధ్య పరుచుకున్న ప్రేమ లాగ ఉంటుంది.
ప్రతులకు :
ఎనిమిదో రంగు ,కవి:అనిల్ డ్యాని
వెల:100,పుటలు:80
కవి సెల్ :9392971359
తగుల గోపాల్ గారు నమస్తే
కవి అయిన వారు చేసే విమర్శకు, విమర్శకుడు అయినవారు చేసే విమర్శకు గల తేడాను ఈ విశ్లేషణ అందించింది. కవి లేదా కవిత ఆత్మను పట్టుకోవడం ఒక కవి అనేవాడికి తెలిసినంతగా విమర్శకుడికి తెలియదు అని ప్రచారంలో ఉన్న ఒక ఆలోచన ఈ విశ్లేషణ ద్వారా రుజువైందని అనిపిస్తోంది. మీ విశ్లేషణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కవిగానే బహుళ ప్రచారంలో ఉన్న మీ పేరు కవితా విమర్శకుడిగా కూడా ప్రచారంలోకి రావడం చాలా సంతోషించదగ్గ పరిణామం. అనిల్ డ్యా నీ కవిత్వం గొప్పతనాన్ని, కవిత్వంలో ఆయన అనుసరించే వస్తుధ్వనిని అద్భుతంగా పట్టుకున్నారు. మీ ఇరువురికి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు అన్నా..మీ స్పందన నాకెంతో ప్రోత్సాహం.
Good one Gopal. చాలా బాగుంది.
నమస్తే అన్నా…థ్యాంక్యూ సో మచ్ అన్నా…
అనిల్ డ్యానీ గారి’ ఎనిమిదోరంగు ‘ కవిత్వంపై తగుళ్ళ గోపాల్ గారి విశ్లేషణ చాలా బాగుంది.ఇద్దరికి అభినందనలు
ధన్యవాదాలు సార్ …చాలా సంతోషం
పుస్తకంపై ఆమూలాగ్ర విశ్లేషణ..అభినందనలు తమ్ముడు..💐💐💐
అన్నా…అనేక ధన్యవాదాలు
మీ విశ్లేషణలో మంచి తూగు వుంది గోపాల్ .
అభినందనలు
ధన్యవాదాలు రాజన్నా…చాలా సంతోషం
అన్న మీ విశ్లేషణ వ్యాసం చాలా బాగుంది కవిత్వం లాగే సాధారణ వాక్యాలతో నడిపించే లోతైన నడక భలేగా చదివిస్తుంది. ఇరువురి కవులకు హృదయపూర్వక అభినందనలు💐💐
ధన్యవాదాలు తమ్ముడూ
తమ్ముడు
చాలా బాగా రాశావు, నిజానికి ఈ పుస్తకము నిండా నా మీద నాకే నమ్మకం లేని కవిత్వం రాశాను అనుకునే వాడిని , చాలా మంది కూడా అలాగే అన్నారు, కానీ నీకులాంటి వాళ్ళు, లక్ష్మి నరసయ్య గారిలాంటి వాళ్ళు ,అఫ్సర్ లాంటి వాళ్ళు ఇంకా కవిసంగమం మిత్ర బృందం ఆ పుస్తకాన్నీ అక్కున చేర్చుకున్నారు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, నా ముందే నా కవితలు చదువుతూ పడీ పడీ నవ్విన వాళ్ళు ఉన్నారు. ఏమో నాకే జ్ఞానం తక్కువేమో అని నాలో నేనే బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇదిగో నీలాంటి నిజాయితీతో కూడిన విశ్లేషణలు చూసినప్పుడు కడుపు నిండిపోతుంది.ఎన్ని పుస్తకాలు వేసినా నా మొదటి పుస్తకం నా పెద్ద బిడ్డ కదా , ఆ ఆప్యాయత అలాగే ఉంటుంది. నా బిడ్డను ఎత్తుకున్నావు, లాలించావు, బుజ్జగించావు.. తమ్ముడివి కాబట్టీ కృతజ్ఞతలు చెప్పను. నీ పుస్తకం మీద ఒక సమీక్ష రాస్తా.
మీకు చెప్పలేగానీ ఎనిమిదోరంగును ఎన్నిసార్లు చదువుకున్ననో అన్నా…ప్రతీ కవిత నోటికి గుర్తుంది.ఒక కవి రాసిన కవిత్వం ఇంతలా ప్రభావితం చేస్తుందా అనిపించింది ముఖ్యంగా జనరల్ బోగి,వెకేటింగ్ లాంటి కవితలు.
ఆ ఇష్టమే ఈ నాల్గు మాటలు అన్న.మీ ప్రేమకు అనేక ధన్యవాదాలు అన్న
ఎనిమిదో రంంగు అనే టైైటిలే కొత్తగా అనిపిస్తుంంది.అక్కడి నుంండి స్పెల్లింంగ్ మిస్టేక్ వరకు కవిత్వంం నింండా జనంం పూసుకున్న రంంగుల్ని కడిగిపారేయడమే పనిగా పెట్టుకున్నాడు.ఇరువురికీ అభినంందనలు.
వేణన్నా….నిజమే అన్నా…ధన్యవాదాలు అన్నా…
Good one Gopal/ But I remember Anil did not give me this after 2nd edition also.