నర్మదా నదిని పలకరిస్తూ…..!

2

హోషంగాబాద్ స్టేషన్‌లో దిగేసరికి సాయంత్రం నాలుగు. తిన్నగా నర్మదా రైల్వేబ్రిడ్జి దగ్గరికి వెళదామని మ్యాపు చూశాను. నాలుగు కిలోమీటర్లు. ఆ మ్యాపు చూసే ప్రయత్నంలో స్టేషనుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సేఠాణీ ఘాట్’, దానికి అటూ ఇటూ విస్తరించి ఉన్న మరి నాలుగు ఘాట్‌లు… నది దాటి వెళితే అవతలి ఒడ్డున రామాలయం కనిపించాయి. అదంతా చూడగా నర్మదానదిని పలకరించడానికి ఆ సేఠాణీ ఘాట్ ప్రాంతమే సరైనదనిపించింది. మనసు అటు మళ్ళింది. ‘ఆటోనా, నడకా?’ – నడక అయితే ఊరుతోనూ పరిచయం పెరుగుతుంది కదా… నడకకే ఓటు.

స్టేషను ఉన్నది కచ్చితంగా నగరపు నడిబొడ్డున. ఉత్తరాన ఉన్న నర్మదానది పట్నానికి ఒక సరిహద్దు. హోషంగాబాద్‌లో ఎటువెళ్ళినా రెండు మూడు కిలోమీటర్లలో ఊరు పొలిమేర. మాళ్వాప్రాంతపు ‘హోషంగ్ షా’ అన్న పాలకుడు అయిదువందల సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని స్థాపించాడని రైల్వేస్టేషన్ లోని ఫలకం చెప్పింది. చిన్న పట్నం. లక్షాలక్షన్నరకన్నా జనాభా ఉండకపోవచ్చు.

నా కాలిదారి నగరపు పాత పేటల గుండా సాగింది. ఆ సన్నపాటి భవనాల నేలమట్టపు అంతస్థులలో చిన్న తరహా దుకాణాలు, పై అంతస్థుల్లో షాపుల యజమానుల నివాసాలు. అడుగడుగునా పశుగణం. అంతంతమాత్రంగా ఉన్న శుభ్రత. అడిగితే దారి చెప్పే బళ్ళ దుకాణాల వాళ్ళు. అనుకొన్నదానికన్నా బాగాముందే సేఠాణీ ఘాట్ చేరుకున్నాను.

హోషంగాబాద్ దగ్గరి నర్మదకు అటు చివరన రైల్వేబ్రిడ్జి, ఇటు పక్కన నర్మదాఘాట్ ఉన్నట్టు అక్కడి మ్యాపు చెప్పింది. ఆ రెండింటికీ మధ్యన ఐదు కిలోమీటర్ల దూరం. వాటికి నట్టనడుమన ఈ సేఠాణీఘాట్. ఆ అయిదు కిలోమీటర్లూ నడిచెయ్యాలని నా ఆశ. ఆశపడ్డానే గానీ ఆ సేఠాణీఘాట్ అందం, గాంభీర్యం అడుగు ముందుకు పడనివ్వలేదు.

మధ్యప్రదేశ్ రాష్ట్రపు తూరుపు అంచున అమర్ కంటక్ అన్న ప్రదేశంలో పుట్టి, మధ్య భారతపు కొండల నడుమ, లోయలూ పీఠభూముల మీదుగా పడమటి దిక్కుకు పదమూడు వందల కిలోమీటర్లు సాగిసాగి, గుజరాత్ లోని ‘భారుకచ్ఛం’ దగ్గర అరేబియా సముద్రంలో కలిసే నర్మదానదికి – సరిగ్గా మధ్యబిందువు దగ్గర ఉందీ హోషంగాబాద్ పట్టణం. నూటయాభై-రెండువందల మీటర్ల వెడల్పుతో ధీరగంభీరంగా కనిపించింది అక్కడి నర్మదా ప్రవాహం. ఒడ్డునుంచీ నదీజలాల దాకా అరవై-డెబ్భై మెట్లతో, కాస్తంత ప్రవాహపు దిగువన స్ఫుటమైన మలుపుతో, నదిలోకి తొంగి చూసి తమ తమ ప్రతిబింబాలు చూసుకుని మురిసిపోతున్న లేత గులాబీరంగు భవనసముదాయంతో ఆ సేఠాణీఘాట్ పరిపూర్ణమనస్విలా, స్థిరచిత్తలా కనిపించింది. హడావుడి పడకుండా వీలయినంత సమయం అక్కడే గడిపి ఆ ప్రశాంతతను మనసులో నింపుకోవాలనిపించింది. జనసమ్మర్ధం తక్కువగా ఉన్న ఓ పక్కకు చేరుకొని, మెట్లమీద చేరగిలబడి, నదినీ ఆ నది ఒడ్డున కనిపిస్తోన్న సజీవలీలనూ గమనిస్తూ… సమయం ఎలా గడిచిందో తెలియని తన్మయస్థితిలో ఉండిపోయాను.

నదిని దాటించి అవతలి గట్టున ఉన్న రామాలయానికి తీసుకువెళ్ళే మరపడవలు నదిమీద కనిపించాయి. మరో అరగంటా నలభై నిమిషాలలో సూర్యాస్తమయం జరిగే ఛాయలు… ఆ సంధ్యాసమయంలో నదీ విహారాన్ని మించిన ఆనందం ఏముంటుందీ? అటువేపు నుంచి తిరిగి రావడానికి ఆఖరి పడవ ఆరున్నరకట… అంటే అవతలి ఒడ్డున కనీసం అరగంట గడపొచ్చన్నమాట.

పడవలోంచి సేఠాణీఘాట్ ను చూస్తే ఇనుమడించిన శోభతో పలకరించిందా స్నానఘట్టం. దూరాన లీలగా రైల్వేబ్రిడ్జి. పదిపదిహేను నిమిషాల్లో ఆవలిగట్టు. ఇరవై-పాతిక మెట్లు ఎక్కితే రామాలయం. ఆలయం చిన్నదే గానీ అక్కడి చెట్టూ చేమా అడవిని తలపించాయి. కాస్తంత ఎగువకు వెళితే అంతా అడవేనని నిర్ధారించారు గుడిదగ్గర మనుషులు. ఒక అడుగు అటువేశాను. ఏభై గజాలు నడిచేలోగానే అతిగంభీరమైన వృక్షమొకటి కనిపించి నిలువరించింది. ‘ఈ అడవికి నేనే రాజును’ అన్నంత కుదురుగా, కుటుంబపు పెద్దలాగా కనిపించి గౌరవభావం కలిగించింది. అలాంటి వృక్షాల ముందు మనుషులం మనమెంత!?

చివరి పడవ కోసం నేనూ మరో ఇద్దరూ ఎదురు చూస్తోంటే కట్టెల మోపులు ఎత్తుకుని నడుస్తూ నలుగురు మహిళలు రేవు చేరారు. మోపులు పడవలో వెయ్యనన్నాడు పడవ కుర్రాడు.  ఒకామె ముందుకు వచ్చి ‘చూడు కుర్రాడా, నువ్వు కొత్తగా పనిలోకొచ్చినట్టున్నావు. పడవలో మేవూ మా మోపులూ నదిదాటడం అన్నది నువు పుట్టడానికి ముందునుంచీ ఉన్న ఏర్పాటు. మారాం చెయ్యక నాయనా’ అని అనునయమూ, మందలింపూ కలగలిపి అతనికి నచ్చచెప్పింది. ఆమెను చూస్తే జయతీవాళ్ళ కెనాపారా ‘పూర్ణ’ గుర్తొచ్చింది. ‘అడవి నుంచి అడవి’కి అన్న జయతి యాత్రాగాధలో ‘పూర్ణ’ అన్న కట్టెల మహిళ సజీవంగా కనిపించి మనల్ని ఆకట్టుకొంటుంది. అక్కడ పూర్ణ, ఇక్కడ ఈమె తమ తమ కట్టెల మోపుల బృందాలకు సహజంగా అమరిన అప్రకటిత నాయకులు. కొంతమందిలో స్వతహాగా చొరవా, సాయపడే గుణం ఉంటాయి. సహచరులు నాయకత్వం కోసం వీరివేపు చూస్తారు. ఈ హోషంగాబాద్ పూర్ణ అలాంటి మనిషి. పడవ ప్రయాణంలో ఆమెతో మాట కలిపాను. సంకోచాలు లేకుండా స్పందించింది. జయతీవాళ్ళ కెనాపారా అడవి గురించి చెబుదామనుకున్నాను. సమయం,సందర్భం కాదనిపించింది. అడవిలో కలిసి ఉంటే ఆ కబుర్లు సాగేవేమో!!

(మూడో భాగం వచ్చే సంచికలో…)

Dasari Amarendra

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • యాత్రానుభూతులు హృద్యంగా చెప్తారు సార్ మీరు! 2012 లో ఢిల్లీ శంకర్ రోడ్డు దగ్గర చిట్టడవిలో మీతో నడవడం గుర్తుంది.

  • నర్మదా నది నీ చూపించినందుకు ధన్యవాదాలు. అవును, prateechotaa పూర్ణ లు కనిపిస్తారు. మీరు గుర్తించారు. వచ్చే సంచిక కోసం ఎదురు చూస్తూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు