నన్ను దేశానికి పరిచయం చేసిన కవిత

    నా కలల తోటలో, నా కల్లోల ప్రపంచంలో, నా రక్త సంఘర్షణా సిక్త భూమిలో నేను ఏరి తెచ్చుకున్న పువ్వునల్లా మాలగాగా గుచ్చుతూనే ఉన్నాను. ఏ పువ్వు ఇష్టమంటే ఏం చెప్పను? ఒక కవి నిద్రే కవిత. మెలకువే స్వప్నం. కవి కవితా ప్రపంచమంతా అతని కలల ప్రపంచమే. అలా మెలకువ లాంటి నిద్రలో.. నిద్ర లాంటి మెలకువలో నేను రాసిన కవితల్లో ఇష్టమైనవి చాలా ఉన్నాయి. వాటిలో “పిచ్చి నాన్న” కవిత ఒకటి. ఈ కవిత 2005లో ఆటా కవితల పోటీల్లో ప్రథమ బహుమతి పొందింది. అప్పటినుంచి  పలు సందర్భాల్లో కవిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ కవిత తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. మిత్రుల దగ్గర చదివి వినిపించినప్పుడు ఈ కవితను పిచ్చిపిచ్చిగా మెచ్చి, నేనంటే పిచ్చి అభిమానం పెంచుకున్న ఎమ్మెస్ నారాయణ లాంటి మిత్రులెందరో ఉన్నారు.

        ఆడపిల్ల చిన్నప్పుడు నాన్న భుజాల మీద ఎగిరి కూర్చుంటుంది. బొజ్జ మీద ఆడుకుంటుంది. అదే పిల్ల పెరిగి పెద్దదవుతుంది. తన కలల లోకంలోకి తాను వెళ్ళిపోతుంది. నాన్న అలా చూస్తూనే ఉంటాడు. బిడ్డ తనకు దూరమై తనకుతాను దగ్గరయ్యే దశ సత్యమే గాని, ఈ ‘కవితండ్రి’లో ఒక సత్యానికీ ఒక స్వప్నానికీ మధ్య ఏదో ఘర్షణ చెలరేగడానికి దారితీసింది. తండ్రి పిచ్చివాడు కదా. అదే ‘పిచ్చి నాన్న’ కవితగా అవతరించింది. ఈ కవిత నాకోసం పోగుచేసిన అభిమానం సామాన్యమైంది కాదు. ఈ కవిత ఉన్న నా రెండో కవితా సంపుటి “మాట్లాడుకోవాలి” 2007లో ప్రచురించినప్పుడు మిత్రమండలి నుంచి అద్భుతమైన సహాయం లభించింది. ఆ పుస్తకాన్ని ఆడియో రూపంలో కూడా ప్రచురించారు. దీని వెనుక ప్రధాన సూత్రధారి మిత్రుడు కుమార్. అలా ఈ కవిత నన్ను మిత్రుల నుంచి ఇంకొంచెం దూరం తీసుకు వెళ్ళింది.

     2018లో ఆలిండియా రేడియో జాతీయ కవి సమ్మేళనం జరిగినప్పుడు తెలుగు భాష ప్రతినిధిగా నేను వెళ్లడానికి ఈ కవితే ప్రాణాధారంగా పనిచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక కవితల్లో వడకట్టి కొన్ని కవితలను హైదరాబాదు నుంచి, వాటిని హిందీ ఇంగ్లీషు అనువాదాలతో ఢిల్లీకి పంపించారు. అక్కడ దిగ్గజులైన సాహితీవేత్తలు ‘పిచ్చి నాన్న’ కవితను ఎంపిక చేశారు. అలా 2018లో ఇండోర్ లో జరిగిన జాతీయ కవి సమ్మేళనానికి వెళ్ళాను. అక్కడ పొందిన అభిమానం, ప్రేమ, స్నేహం జీవితంలో మర్చిపోలేనిది. నా కవితను హిందీలోకి శాంత సుందరి గారు అనువాదం చేశారు. ఇంగ్లీషులోకి అల్లాడి శ్రీధర్, ఉమ గారు అనువాదం చేశారు. భారతీయ స్థాయిలో దాదాపు 24 భాషల నుంచి కవులు వచ్చారు. ముందు మూలకవి తాను రాసిన మాతృక చదవాలి. తర్వాత హిందీ అనువాదం గానీ ఇంగ్లీష్ అనువాదం గానీ చదవడానికి మరొకరు వస్తారు. అలా నా కవితను నేను తెలుగులో చదివాను. హిందీ అనువాదాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అంజుమ్ అనే మిత్రుడు చదివాడు. తెలుగులో నేను చదివినప్పుడు హాలంతా మౌనంగా ఉంది. అదే కవిత హిందీలో హిందీ మిత్రుడు వినిపించినప్పుడు హాలంతా మార్మోగింది.  మర్నాడు ఉదయం ఆలిండియా రేడియో జాతీయ కవి సమ్మేళనం  విశేషాలను వార్తాపత్రికలు కవర్ చేశాయి. దైనిక్ జాగరణ్ పత్రిక నా కవిత అంతిమ వాక్యాలను పతాక శీర్షికగా  పెట్టింది. ఈ కవితలో చివరి మాట “నాకు కూతురంటే ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ. మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ” ఈ మాటను దైనిక్ జాగరణ్ పత్రిక వారు హిందీలో “బేటీ కా మతలబ్ ఏకీ జన్మ్ మే మిల్నే వాలీ దూసరీ మా ” అని పెట్టారు. దీని వెనక ఉన్నది ఆ పత్రికలో  ప్రముఖ పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు అనిల్ త్రివేది గారు. చాలా పత్రికల్లో ప్రచురించిన ఫోటోలు, వార్తల్లో ఈ కవిత గురించి విశేషంగా ప్రస్తావించారు. అలా నా కవిత్వానికి నాకు జన్మజన్మల సార్థకతని సాధించి పెట్టిన కవిత ‘ పిచ్చి నాన్న.’   ఆ సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కవిత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని భాషలలో ప్రసారమైంది. ఆ సందర్భంగా ఆలిండియా రేడియో హైదరాబాదు వారు ఎందరో ప్రముఖ సాహితీవేత్తలను పిలిచి, నన్ను వారి సమక్షంలో సన్మానించారు. ఈ మొత్తం కథ వెనుక ఉన్న ప్రియమిత్రుడు ‘రేడియో రాంబాబు’ కు నేనెంతో రుణపడి ఉన్నాను.

      అంతేకాదు.  ఇండోర్లో జరిగిన ఆ కవి సమ్మేళనంలో పాల్గొన్న సాహిత్యకారులెందరితోనో నాకు స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. మలయాళీ కవి థామస్ కుట్టి, నేపాలీ యువకవి మహేశ్ ఇలా ఎందరో ఇప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అస్సాంలో బోడో భాష నుంచి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవయిత్రి అంజలి బాసుమతారి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేవారు. పిచ్చినాన్న కవిత అంటే ఆమెకు మహా ఇష్టం. ఒకసారి ఫోన్ చేసి బోడో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి “100 భాషలు-100 మంది కవులు”  అనే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. 2021లో నేను అస్సాంలోని బోడో ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు సాదర స్వాగతం లభించింది.  అంజలి బాసుమతారి గారు నన్ను ఎంతో గర్వంగా అందరికీ పరిచయం చేశారు. ‘పిచ్చి నాన్న’ కవిత ఈ పిచ్చి కవికి ఎంత పేరు తీసుకొచ్చిందబ్బా అనుకున్నాను.

         అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును  పొందిన వెన్నా వల్లభ రావు గారు నా కవిత్వం అంటే ఎంతో ఇష్టపడతారు. ఎంపిక చేసిన నా కవితలను ఆయన హిందీలో అనువాదం చేశారు. ఆ పుస్తకాన్ని ఎలా ప్రచురించాలో, ఎక్కడ ప్రచురించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇండోర్ లో ఉన్న దైనిక్ జాగరణ్ జర్నలిస్టు అనిల్ త్రివేది గుర్తుకు వచ్చి ఫోన్ చేస్తే అతను మళ్ళీ ‘పిచ్చి నాన్న’ కవిత గురించి ఒకటే పిచ్చిగా మాట్లాడాడు. ఇండోర్ లోనే మీ హిందీ పుస్తకాన్ని ప్రచురిద్దామని ఆయన పూనుకొని “తెలుగు కవి, ప్రసాదమూర్తి, ప్రతినిధి కవితాయే” అనే పుస్తకాన్ని ఇండోర్ లో ప్రచురించారు. ఇలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదివి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఎక్కడెక్కడికో ‘పిచ్చి నాన్న’ కవిత నడిపించింది. స్వచ్ఛమైన కవితాక్షరాలను హృదయానికి హత్తుకునే వారికి నన్ను చేరువచేసింది. ఇండోర్ లో ఈ హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అప్పుడు అక్కడ సభలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్తలు కూడా అనేక కవితల గురించి ప్రస్తావిస్తూ ‘పిచ్చి నాన్న’ కవితను కూడా ప్రముఖంగా పేర్కొన్నారు. అదీ “పిచ్చి నాన్న” నాకు తెచ్చి పెట్టిన కీర్తికి ప్రాణ సూత్రమైన నేపథ్యం. పెద్దదైన నా కూతురు నాకు దూరమైపోతుందేమో అని నేను బెంగ పడ్డాను. ఇలా ఈ కవిత ప్రపంచానికి నన్ను దగ్గర చేసి ఆ బెంగను దూరం చేసింది. ఇలా ఈ కవిత, నా ఇష్టమైన కవితల్లో ఒకటిగా ఎవరూ కదల్చలేని స్థానంలో తిష్ట వేసింది.

పిచ్చి నాన్న

 

ఎప్పుడూ

గుండెల మీద రెండు కలువపూల పాదాలు

కదలాడుతున్నట్టుగానే వుంటుంది

రెండు వెన్నపూస పెదాలు

నా బుగ్గల్ని ఎంగిలిచేసి నవ్వుతున్నట్టే వుంటుంది

రెండు తమలపాకు చేతులు

నా మెడని సుతారంగా చుట్టుకుని

ఉయ్యాలలూగుతున్నట్టే అనిపిస్తుంది

 

చెడ్డీల నుండి చమ్కీల చుడీదార్లదాకా

పప్పీ షేముల నుండి పట్టుపావడాలదాకా

అదెన్ని వేషాలు మార్చినా

ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే

ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూలజల్లే

పిల్లల్లో పిల్లలా , అమ్మాయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ

నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది

 

ఏ షాపుకైనా వెళతానా

అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా

నాన్నా నాన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది

అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా

అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు వుంటుంది

 

ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా

రంగు రంగుల దుస్తుల్లో మా పిల్లే

తూనీగలా ఎగురుతున్నట్టు ఉంటుంది

 

క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా

నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి

చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది

 

ఎవరికీ కనబడదు గాని

నా నెత్తిమీద ఓ బుల్లి సింహాసనం

దానిలో నా బుజ్జి యువరాణి

ఈ ప్రపంచం తిరునాళ్ళలో తనను అలా అలుపులేకుండా తిప్పుతున్నట్టే వుంటుంది

 

దానికిప్పుడు అద్దంలో తన బొమ్మ తప్ప

ఏమీ పట్టదు గాని

అది రాత్రంతా పడీ పడీ చదువుతుంటే

నేను టీ డికాక్షన్ లా మరుగుతూనే వుంటాను

అది పరీక్షలు రాస్తుంటే

ఆ మూడు గంటలూ రోడ్డు మీద వాహనాలేవీ కదలొద్దని

కసురుకునే ట్రాఫిక్ పోలీసునైపోతాను

 

తను చలిలో వణికిపోతే

నేను పత్తికాయనై పగిలిపోతాను

తను జ్వరంతో మండిపోతే

వందరెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను

తను జబ్బు పడితే మొత్తం వైద్యశాస్త్రాన్నే తప్పుపడతాను

 

ఒక్కసారి నవ్విందా

ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని

సజల సంగీతమై ద్రవించిపోతాను

 

ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే

ఆకాశానికి నేనే బెలూనై వేలాడతాను

కొమ్మకొమ్మకీ చాక్లెట్లు, కేకులూ వేలాడదీసి

పక్షులకు ఫలహారంగా పెడతాను

 

ఇప్పుడు తను పెద్దదైంది కదా

నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది

పైగా నన్ను చూసి

పిచ్చి నాన్న అంటూ నవ్వేస్తుంది

 

అదేమిటో గాని ఎప్పుడూ

కోతిపిల్ల తల్లిపొట్ట కరుచుకున్నట్టు

ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో

నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది

 

నాకు కూతురంటే

ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ

మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ.

– – – – – – – – – –    – – – – – – – – – –

ప్రసాద మూర్తి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చివరి పాదంతో గుండెల్ని తాకారు సర్. మీ కవిత్వం మీ సాహిత్య ప్రయాణం నాకెప్పుడూ స్ఫూర్తి. అభినందనలు సర్.

  • హృదయాన్ని స్పర్శించే అర్ధమయిన కవిత్వం గురువుగారు. మీరు తమలపాకు చేతులు అని ప్రయోగించారు దాని అర్థం ఏమిటి గురువుగారు?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు