1
నిదానంగా సాగుతూ
వడివడిగా పరుగిడుతూ
వేల ఏళ్ళ పాటు ఆలోచించీ
ఎటు పొర్లిపారాలో తేల్చుకోలేక..
రెండు తీరాల సందిట
తీరైన దారేదో పోల్చుకోలేక..
నీటిబాటగా ఒదిగిపోయింది నది!
2
ఇటు నగరపు రద్దీ ధ్వనులు
అటు నిశ్శబ్ద శ్మశాన కాలవలు
ఏ బరువు గుండెనో దాటి
దుఃఖం పొంగిందంటే
సాకుగా దొరికేందుకు
ఇక్కడొక పాత వంతెన!
3
మునిచీకటి ముళ్ల అడవిలా
నడిచే కాళ్ళను ముసిరినపుడు
వంతెన పైనుండి దూకేసి
ఉలుకు పలుకు స్పర్శ చలనం
సమస్తం కోల్పోయేవాళ్ళ కోసం
గుండెలు బాదుకునే గొంతుల్లో
జీరగా పొంగులెత్తే నదులన్నీ
ఈ నదికి ఉపనదులు!
4
నది మధ్యలో ఈదులాడే
చేపల గుంపు ఎదుట ఒక ‘ ఎర’
ఎవరు మీరు పేరేంటని అడుగుతున్నట్టు –
ఏటి బొంతలమని బదులిచ్చి
ఏ ఒడ్డుకి పొడవాలో సందేహిస్తుండగానే
చప్పున చుట్టుకుంటుందో చిక్కుల వల!
5
పైనుండి ఒక్కో వాహనం వెళ్ళినప్పుడల్లా
నీటి మీద గజగజలాడుతున్న అలల్లా
వణికే వారధి!
అంత పెద్ద సేతువు కింద అరికాళ్ళు దన్నుబెట్టి
బరువంతా మోసే స్తంభాల వెన్నులో
ఒకింత వొణుకు
6
వంతెన మీద తడిగుడ్డ పరిచి
పచ్చి పరిగలు అమ్ముతూ ఒక జాలరి
పనికత్తితో పొలుసులు ఒలిచి
సిదుములు కోస్తూ జాలరి భార్య!
7
జీవిత ప్రతిబింబాలన్నింటినీ
నీళ్లలో చూపే నిర్గమ రుతువు నది!
సముద్రంలోకి పారిపోతున్న దారిలో
కాసేపు నదిని నిలబెట్టి నడకలకు అర్థం చెప్పే
నీటి నిఘంటువు సేతువు!
8
నదిలాంటి ప్రతి మనిషికీ
వంతెనలా ఆలంబనయ్యే ఒక ఆకాశం కావాలి
రూపరచన లేని మబ్బుల్ని చీల్చుకుంటూ
వీరుడై వెలిగే సూర్యుడి కళ్ళ ఎదుట
బతుకు శకలాలను ఎంచి చూసుకోవడానికి..
*
బావున్నాయి కవితలు