అది మార్చి 1993. నా పెళ్ళికి ఎవరిదైనా కచేరీ పెట్టించాలి. ఎవరి కచేరీ పెట్టాలి, ఎలా అని మథనపడిపోతున్న రోజులు. రెండువైపులా కాస్త సంగీత ప్రవేశం, అభిరుచి ఉన్న కుటుంబాలు మావి. పెళ్ళి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. నా వైపు ఏర్పాట్లేమీ లేవు బట్టలు కొనుక్కోవడం తప్ప. ఆనాటికి నా కాబోయే శ్రీమతి గాయత్రి గురువుగారైన శ్రీమతి రాజేశ్వరిగారి ద్వారా ‘పద్మశ్రీ’ అన్నవరపు రామస్వామిగారు పరిచయమున్నారని తెలిసింది. అంతటి విద్వాంసులు నాబోటి సామాన్యుడి పెళ్ళికి కచేరీ చేస్తారా అని భయ సందేహాలు ముప్పిరిగొన్నాయి.
‘అడగడంలో తప్పేముంది’ అని వారు హైదరాబాద్ వచ్చినపుడు కలసి అడిగేశాము. ‘ఓ తప్పకుండా’ అని ఆయన అనగానే నాకు నోట మాట రాలేదు. అంతటి నిరాడంబర వినయశీలి అయిన ఆ స్థాయి అపూర్వ కళాకారుణ్ణి నేనింతవరకు చూడలేదు. ‘తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక మృదంగ విద్వాంసులుంటారు, వారిని ఏర్పాటు చేయండి’ అన్నారు. అలా మా పెళ్ళిలో వారి కచేరీ ఘనంగా జరిగింది. అంతా హాశ్చర్యపోయారు. మా దంపతులిరువురికి అదో మరచిపోలేని జీవితకాలపు జ్ఞాపకం.
అలా వారితో ప్రారంభమైన పరిచయం ఆ తర్వాత మారాకు తొడిగింది. వారి ప్రియ శిష్యులైన శ్రీ పొన్నపల్లి దుర్గా ప్రసాద్ గారి దగ్గర మా అమ్మాయి సంగీత శిక్షణ ప్రారంభించి, సంగీతంలో బి.ఎ., కాలక్రమంలో ఎం.ఎ. కూడా పూర్తి చేయడం వారి ఆశీస్సులే.
1996 నాటి మాట. అవి నేను ‘వార్త’ దినపత్రికలో పని చేస్తున్న రోజులు. కొంచెం సాంస్కృతిక ఆసక్తి ఉండటంతో ‘కళ’ అనే ప్రత్యేక పుట నాకప్పగించారు. ఇక నాకిష్టమైన ఉద్దండ కళాకారుల పరిచయ వ్యాసాలు పరంపరగా ప్రచురించే సాహసం ప్రారంభించాను. నాకు నచ్చిన మహోన్నత కళాకారుల జీవన రేఖలు సేకరించి వారం వారం ప్రచురించడం ఎంతో ఆత్మానందాన్ని, ఆ పుట నిర్వహిస్తున్నందుకు గర్వంగాను ఉండేది.
అన్నవరపువారి గురువుగారు పారుపల్లివారు, జేసుదాస్, ‘పద్మశ్రీ’, డా.శోభారాజు – ఇలా ఎందరో మహా విద్వాంసుల జీవిత విశేషాలను సేకరించి, ప్రచురించే అవకాశం కలిగింది. ఈ వరుసలో అందుబాటులో ఉన్న రామస్వామివారి జీవిత విశేషాలను పరిచయం చేయాలని సంకల్పమొకటి తలెత్తింది. ఆ వరుసలో గురుతుల్యులు శ్రీ అన్నవరపు రామస్వామిగారి సమగ్ర పరిచయం వెయ్యాలని వారి గురించి వివరాలు రాబట్టడానికి చేసిన ప్రయత్నంలో, వారే స్వదస్తూరితో లేఖ రాశారు. స్వయంగా బాలమురళి గారు వారి షష్ఠిపూర్తి సంచికలో రాసిన వ్యాసాన్ని స్వహస్తాలతో తిరగరాసి పంపించారు. నాటి కాలపు కళాకారుల వినయానికి, సహృదయతకు, ఎదుటివారికిచ్చే ప్రోత్సాహానికి ఇది నిదర్శనం. వారి గురించి నేను రాసినా, రాయకపోయినా వారికి ఒరిగేదేంలేదు. అయితేనేం! వారి లేఖ ఒక తీపి జ్ఞాపకంగా నా దగ్గర ఉండిపోయింది.
వారి శిష్యురాలైన శ్రీమతి రాజేశ్వరి శ్రీనివాస్ గారింట్లో రామస్వామిగారిని కలసి నా ముఖాముఖి ఆలోచనని విన్నవించాను. ఏమాత్రం ప్రచారాసక్తి లేని వారు చివరికి అంగీకరించారు. ఎందుకంటే నేను వారి ఇంటర్వ్యూని ప్రత్యేకంగా ఇంతవరకు ఏ పత్రికలోను చదవలేదు. ఆనాటి పరిస్థితి కూడా అంతే. వారు చెప్పిన వివరాలన్నీ రాసుకుని ‘వార్త’లో ప్రచురించిన వ్యాసానికి ఆ రోజుల్లో కొన్నాళ్ళు నలుగురి నోళ్ళలో నానాను. కాలగమనంలో మా అమ్మాయి వివిధ వేదికల మీద చిన్న చిన్న కచేరీలు చేయడం, వారు ఎన్నో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న పారుపల్లివారి సంగీతోత్సవాలలో సైతం పాడటం మా కుటుంబానికి మరచిపోలేని అనుభవం. నా శ్రీమతి గాయత్రి ఆ వేదిక మీద మూడున్నర దశాబ్దాల క్రితం కచేరీ చేయడం, అదే ఉత్సవాల్లో మా అమ్మాయి కూడా కచేరీ చేసి అన్నవరపువారి ఆశీస్సులు అందుకోవడం మా కుటుంబానికి లభించిన జీవిత కాలపు వరం. మరచిపోలేని మధుర జ్ఞాపకం. ఈ స్వర సాధనా నేపథ్యంలో మా అమ్మాయి ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొని బాలుగారి ఆశీస్సులు పొందటం మరో అద్భుతమైన అనుభవం.
‘బాలమురళిగారు కూడా చెన్నై వెళ్ళి స్థిరపడ్డారు కదా’ అంటే ‘రెక్కలొచ్చాయి కదా అని ఎగిరి వెళ్ళిపోతే ఎలా’ అని మూడు దశాబ్దాల క్రితం వారు చెప్పిన మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకమే. నేడు పొట్ట కోసం చదివే చదువులతో సతమతమవుతూ అమెరికాకు ఎగిరిపోవడమే ఆదర్శంగా బతుకుతున్న విద్యార్ధులు సైతం అన్నవరపు రామస్వామివారిని ఆదర్శంగా తీసుకుని, ఇక్కడే ఉండి మన దేశ అభివృద్ధికి దోహదం చేయాలి. విశ్వవ్యాప్తంగా వందలాది విద్యార్ధులు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సంగీత విద్వన్మణుల లోకంలో ఎవ్వరూ సాధించలేని ఎత్తులకెదిగిన మేరుసమాన వాయులీన విద్వత్శిఖరం ‘పద్మశ్రీ’ అన్నవరపు రామస్వామి.
‘విద్యా దదాతి వినయం; వినయాద్యాతి పాత్రతాం’ అంటే విద్య వలన వినయం వస్తుంది. ఆ వినయం వలన పాత్రత అంటే అర్హత వస్తుంది. ‘ఓనమాల చదువు నాది’ అని వినయంగా చెప్పే రామస్వామివారు ఎన్నో వర్ణాలు, కీర్తనలు రచించారు. కొత్త రాగాలు సైతం సృజించారు. ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నట్టు దేశ, విదేశాల్లో సైతం తన విద్వత్తుతో రసికులైన జనావళిని మంత్రముగ్ధుల్ని చేశారు స్వరార్ణవాన్ని తన వాయులీనంలో బంధించిన శ్రీ అన్నవరపు రామస్వామి. వారి వాయులీన స్వరార్ణవంలో నేను సైతం చిన్ని పిచ్చుకలా జలకాలాడగలగడం నా పూర్వజన్మ సుకృతం.
*
Add comment