నగరానికొచ్చిన ఫోక్ సాంగ్!

ఈ రోజుల్లో కవిత్వం పూర్తి వచనం బాట పట్టిన నేపధ్యంలో నందూ రాతలు మాత్రం అటు పద్యానికీ, ఇటు వచనానికీ మధ్యలో అదొక ప్రత్యేక ప్రక్రియ అన్నట్టుంటాయి.

2013 లో వొచ్చిన నందకిషోర్ మొదటి పుస్తకం నీలాగే ఒకడుండేవాడు పుస్తకానికి అవార్డులు, రివార్డులు రాకపోవచ్చుగాక, కానీ మొదటి పుస్తకంతోనే తానెంత ఎత్తుకు ఎదిగాడన్నది అతన్ని నిశితంగా పరిశీలించినవాళ్ళూ, అతన్ని కనీసం 50శాతం చదివిన వారూ ఏదో ఒక సందర్భంలో చెప్పితీరుతారు. తంగేడు పువ్వు తనువుతో బంగార్రంగులో మెరిసే తెలంగాణా గడ్డమీద పండగలాంటి గుర్తు నందకిషోర్.

ఇప్పటివరకూ చరిత్రకెక్కిన గొప్పవాళ్ళ పక్కన నిలబడే అర్హత అన్నివిధాలా సంపాదించుకుంటాడు. ఇలాంటి స్టేట్ మెంటుల్లాంటి మాటలు నాలాంటి పిలకాయలంటే మీమీ బుర్రలకు ఎక్కకపోవచ్చుగాక. కానీ, ఇప్పటికే నందూని చదివున్నవాళ్లకి నేను చెబుతున్న మాటలు ఏమాత్రం ఎబ్బెట్టుగా అనిపించవు. నందకిషోర్ కవిత్వం గురించి నా గమనింపులో ఉన్న కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ నందూ రెండో పుస్తకం యథేచ్ఛ వైపు ఈ పరిచయ ప్రయాణాన్ని నెడతాను.

ఆ పుస్తకం చదువుతూవుంటే జీవితం పరిధి ఎంతున్నా ఆదీ, అంతం ఆడదేననే అతని భక్తి, తనువుతీరా ప్రకృతిని ఆస్వాదించే తత్వం అతన్ని నిత్యం రాసేలా  చేస్తాయని అనిపిస్తూ ఉంటుంది. యథేచ్చ నందూ రాసిన రెండో పుస్తకం,విడుదలై ఆరు నెలలు దాటినా పెద్దగా చెప్పుకోదగ్గ విమర్శలేమీ రాలేదు. అందుకు కారణాలు తెలిసేంత జ్ఞానం నాది కాదుగానీ, ఎందుకో ఆ పుస్తకాన్ని సాహితీ దిగ్గజాలనబడే వాళ్ళు,సాహిత్యాభిమానులూ చిన్నచూపు చూశారనే అనుకుంటాను. చదువుతున్నదంతా పాటలా అనిపిస్తూ పదాల ఒరవడిలో కొట్టుకుపోయేలాగా ఉంటుందతని మొదటి పుస్తకం.

ఇప్పుడొచ్చిన యథేచ్ఛ కూడా అచ్చంగా అలాంటిదే, ప్రేమలో ప్రాణాలతో పాటు లీనమైపోవడం గురించే రాశాడన్నట్టు ఉంటుంది. Five stages of slow death in love అని పుస్తకం ముందుపేజీల్లో కవి అదే రాశాడు. ఇందులో దాదాపు అన్నీ ఒకే థీమ్ లో ఉంటాయి. సంభాషణలు మూలాధారంగా సాగే ఈ కవిత్వం చదూతుంటే చాలా భిన్నమైన అనుభూతుల్ని కలిగిస్తుంది. జీవితంలో ప్రేమ సర్వసాధారణంగా మొదలవడం దగ్గర్నుంచీ, ఏకాతంలో ప్రేమ తాలూకూ పరిస్థితినంతా అంతరంగిక ప్రకటనలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకిట్లా అయ్యాంరా భగవంతుడా అనుకునే వైరాగ్యపు పాటని కలం త‌న కాలానికి య‌వ్వ‌నాన్ని తొడుక్కుని ప్రేమలో లీనమై పాడితే ఇలా ఉంటుందీ అని చెబుతున్నట్టు ఉంటుంది. రాతమొత్తమంతా ప్రత్యేక శైలీ, ఏదో పాతకాలపు ఛందస్సూ ఉన్నట్టు చాలా లయబద్ధంగా ఉంటుంది నందూ కవిత్వం.

అసలు ప్రేరణంటూ ప్రత్యేకంగా ఏం లేకుండానే విరివిగా కళ్లకు కనబడ్డది రాయగలగడం బాగుంటుంది. ఏది చూడాలన్నా, పూర్తిగా అనుభవించాలన్నా హృదయం కంటే ముందే వీలున్న కళ్ళకి సాధ్యమనే ఊహలోనుంచి పూర్తిగా బయటపడి రాసిన రాతలుంటాయి. యథేఛ్చలో ప్రేమను వ్యక్తపరచడం అనేది ఒక దివ్యమైన చర్యగా భావించే పద్యాలుంటాయి. ఒకర్ని కోరుకోవడం ద్వారా వ్యక్తపరిచే బెంగ, అంటే ఇద్దరం కలిస్తే ఇట్లా ఉండొచ్చు అనో, నువ్వు లేకపోతే జీవితం ఇట్లా అయిపోతుందనో రాసుకున్నవి ఉంటాయి. నీకు అందరూ ఉన్నారు- నాకెవరూ లేరు అంటూ నింద నిండిన పద్యాలుంటాయి. ఏదైనా జరిగి ఎవరినైనా దూరం చేసుకుంటే, ఎవరైనా దూరమైతే వొదిలేసిపోయాక రోజులు ఎట్లా గడుస్తున్నాయో, ఎదురుచూపులో ఎంత నిరాశ కమ్ముతుందో అలాంటప్పుడు మన తలరాతను మనం ఎంతగా తిట్టుకుంటామో రాసుంటుంది. ఆఖరికి ఎందుకిలా అయ్యామనే మెలుకువలాంటి యెరుకతో ఏ ఒక్కర్నో కాకుండా మొత్తం ప్రపంచాన్నే నిందించే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.

ఈ రోజుల్లో కవిత్వం పూర్తి వచనం బాట పట్టిన నేపధ్యంలో నందూ రాతలు మాత్రం అటు పద్యానికీ, ఇటు వచనానికీ మధ్యలో అదొక ప్రత్యేక ప్రక్రియ అన్నట్టుంటాయి. అతి ప్రాచీన భాషను రాసేచోట ఇతను కాడి , దూడ, వడ్లు , గడ్డి లాంటి జీవభాషతో నిండిన పదాలతో ముడిపెట్టి పాటలాంటి భావాలనిచ్చే సంపదను సృష్టిస్తాడు. ఇదంతా మెదటి రెండు పుస్తకాల్లో తక్కవగా కనిపించి, ఇటీవల రాస్తున్న వాటిల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇతనివి లోతైన భావాలనడం, లేదా విరివిగా కవిత్వం చదివేవారికే ఇతని మాటలు అర్థమవుతాయనడం విన్నాను. అది కొంతనిజమే అనిపించినా,నందూ ప్రతి అక్షరంలోకి తొంగిచూస్తే ఏదో ఉంటుంది. మరీ అర్ధంకానిదో, మన ఎరుకలో లేనిదో మాత్రం నందూ ఎప్పుడూ రాయడం లేదు. అతను రాసే పదాల్లో ప్రాణం ఉంటుంది. ప్రాంతం ఉంటుంది, పదార్ధం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. పగలూ రేయీ, పాపమూ పుణ్యమూ పదాల్లో కలిసే ఉంటాయి.

ఒక గమనింపేమిటంటే పదమొకటి కొత్తగా ఉండీ అర్ధం కానిది ఏమన్నా ఉంటే, దానికి వెనకా ముందూ ఉన్న పదాల వల్ల ఆ అర్ధంకాని పదం గురించి వెంటనే తెలుసేసుకోకపోతే ఏమైపోతామో అని భయంపుట్టే జీవభాష రాసివుంటుంది. నందూ రాస్తూ ఉన్న క్రమంలో చాలా ఎక్సర్ సైజ్ చేస్తాడు. చరిత్రను అతను రాసేదాంట్లో ట్యాగ్ చేస్తాడు. గమనిస్తే అతని రాతల్లో కాలం తాలూకా కీవర్డ్ ఒకటొచ్చి కూచుంటుంది. మన బతుకుల్లో అంతా తెలిసినట్టుండీ, ఎవరికీ అందకుండా వేలాడే తత్వాన్ని ఒక పాపులర్ ఫోక్ సాంగ్ లా పాడి వినిపించే కళాకారుడు నందకిషోర్. అతన్ని వీలున్నప్పుడు చదివితీరాలని కోరుతున్నాను.

*

 

కాశిరాజు

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భాషను పూర్తిగా గౌరవించి, శ్రద్ధగా రాస్తాడీఅబ్బాయి. మీరు పంపిచిన వ్యాసం బాగుంది. ఆయన రచనలు చదువుకొనేందుకు ఎక్కడ లభిస్తాయో కూడా తెలియజేయండి. నందకిషోర్ యువకుడే అనుకుంటాను, మరింత ప్రోత్సహి్చాల్సిన భాద్యత మనకుంది. ఎవరో చిన్న చూపు చూసేరనీ, చూస్తున్నారని ఆగకూడదు. ఎలా ఉన్నా, ఎలా అయినా మన ఉనికి మనం చాటుకోవాలి. వ్యక్తిగా కూడా ఎదగడానికి తెలుగు సాహిత్యం చాలా సాయపడుతుంది. మీరూ రాస్తుండాలి కాశీ…
    -మీ శర్మ మాస్టారు

  • అవును.. నందూది అచ్చంగా జీవభాష.. I love this poet.. భలే రాశావు కాశీ 🙂

  • అవును..మీ మాట నిజం..వారి కవిత్వం మరింత మందికి చేరువ కావాల్సిన అవసరం ఉంది..✍✍✍👏👏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు