నగరానికీ ఒక కల వుంది..

1
ఎంతమంది కడుపు చేత పట్టుకొచ్చినా
చేయి పట్టుకు చోటిస్తుంది నగరం.
చెరువుల్ని, చెట్లనీ మింగేస్తున్నా
కక్కలేక మింగలేక చూస్తుందీ నగరం.
రోడ్ల మీద ఏరులై పారుతున్న వర్షానికి
కన్నీరై పారుతున్న రోడ్డు మీద వ్యాపారికి
నగరం బాధ్యత పడదు.
నిజానికి
మనం చూసే నగరానికి
నవ నాగరికులకు
ఎక్కడా పొంతన లేదు.
ఎందుకంటే
నగరానికి రావాలని కలలు కనేవాళ్లు..
నగరానికొచ్చి
కలలు నెరవేర్చుకున్నవాళ్ళు..
ఎప్పుడైనా
నగరం ఏం కల కంటుందో
కనుక్కున్నారా..
నగరానికీ ఒక కల వుందనీ
నగరానికీ లోన ఒక లోకముందనీ
ఆ లోక నిస్వన కలకలాన్ని తలొగ్గి విన్నవాడే కదా..
తాకిన ప్రతి చేతి చివర
కలలలతలు పూయించేవాడే కదా..
నగరవాసి.
నగర సహవాసి.
నగరం కంటున్న కలల తోటలో
నేను సైతం ఒక కలగనే పూవు.
ఒక్క క్షణం వెలిగించి…
వచ్చేవరకు
కన్నీళ్ళు ఎక్కడ దాగి వుంటాయో ?
కన్నీళ్ళలో ముంచి తీసిన వాక్యాలు
తేటగా వుంటాయి.
సంతోషవిషాదాల జిగీషతో
జీవం తొణికిసలాడతాయి.
చూసే చూపులో
తలపులో తూగులో
యోచించి వేసే అడుగులో
సమస్తం దాగి వుంటాయి.
జీవితం
నిర్వచనాల వలలకు అందక
జారిపోయే చేప.
ఒకరికొకరు జీవించాలనిపించడమే
ఒకరినొకరి జీవితానందమే
జీవన ప్రతిఫలం.
దుఃఖం మన గురువు.
సంతోషం మన సహచరి.
కష్టసుఖాలు బంధువులు.
జగత్తుని
ఒక్క క్షణం వెలిగించి
తొలగిపోయేదే కదా మన జన్మ.
*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును నగరానికీ ఒక కల ఉంటుంది కదా!చాలా బాగా చెప్పారు

  • అచ్చమైన కవిత్వాన్ని ప్రేమించే వారెవరైనా మీ కవిత్వాన్ని ప్రేమిస్తారు

    దుఃఖం మన గురువు..
    సంతోషం మన సహచరి..
    కష్ట సుఖాలు మన బంధువులు…

    జీవిత తాత్వికత ఇంతకన్నా భిన్నంగా ఏ కవిత్వం చెప్పగలదు..👏🌷

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు