కె. శివారెడ్డి గారి కవిత ఇది:
నగరంలో తెల్లారగట్ట మేల్కొన్నప్పుడు
నాకు పల్లెటూరు ఎందుకు గుర్తుకు రావాలి
(బహుశా నా గుండెలో ఇంకా పల్లెటూరు పదిలంగా వుండి వుండాలి
రక్తంలో జీర్ణించిన శక్తి అంత తొందరగా ఎలా అదృశ్యమౌతుంది.)
తెల్లారగట్ట పల్లెటూరి ప్రపంచం అద్భుతం – నగరానికి సరిగ్గా వ్యతిరేకం
నాలుగ్గంటలకే చీకట్లో స్పష్టాస్పష్టంగా పశువుల కదలికలు
మేత కొరుకుతున్న శబ్దాలు, మేకు చుట్టూ తిరుగుతున్న సవ్వడులు
దూరంగా బక్క రైతులో జీతగాళ్ళో పశువుల్ని కసురుతూ అదిలిస్తున్న శబ్దాలు
డొంకల మీద కాలకృత్యాలు తీర్చుకునేందుకు కదలిపోతున్న
మానవాకారాల నిశ్శబ్దం కదలికలు
మనుషులూ పశువులూ ప్రతిదీ చలికి తమలోని వేడిని
కాపాడుకుంటున్నట్టు మునగడ దీసుకుని మొగ్గలైపోవటాలు
ఎక్కడో ఏ తల్లో శిశువుని లాలించటం – అక్కడక్కడా
ఆకాశం నుంచి వెల్తురుముద్దలు రాల్తున్నట్టు – అవి ఒకదాన్నొకటి
అంటుకున్నట్టు కోడికూతల పరంపరలు-
కొమ్మల్లో పక్షుల కదలికల మనకర్థంగాని సంభాషణలు
అంతా మెలకువగా పర్యవసానం చెందుతూ – అంతా ఎవడో
సంజీవిపుల్లని తాకించితే- ప్రాణం పొందినట్లు మెలమెల్లగా జాగృతీ భూతమౌతూ
అంతా మృదుత్వం – నీటి పొడిలాంటి మంచులో అంతా
సునిశితంగా బరువెక్కటం – చూసిన ప్రతిదాన్నీ చేత్తో తాకాలనే కోరిక –
తెల్లారగట్ట చీకటి ఎంత లలితంగా – కొంచెం తడిగా
కొంచెం యిష్టంగా, కొంచెం అయిష్టంగా – జారిపోతున్న ముసుగులా –
తెల్లారగట్ట చీకట్లో – మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి
కొద్దిగా వెనక్కీ ముందుకీ ఊగుతూ ఒకే ఒక్కడు
కోడిగుడ్డు బుడ్డి ముందు ఒక్కొక్క అక్షరాన్నే ఆరగిస్తూ –
తెల్లారగట్ట పల్లెటూరి చెరువు ఆవిర్లు కక్కుతూ ఆవిరికుడుంలా వుంటుంది
నిన్ను నువ్వే బహుమృదువుగా పిలుచుకుంటున్నట్టు
చిటుకు చిటుకుమంటూ చేపలు ఎగిరిపడటాలు-
చెరువుకట్ట దండకడియంలా, కడియంలో ఒక పిచ్చిరాయిలా దేవుడి గుడి
పాతికేళ్ళ నగర జీవనం తర్వాత కూడా – వేకువనే పల్లెటూళ్ళో లేచినట్టు
మా నాయనమ్మ పక్కలోంచి కొద్దిగా దుప్పటి ఒత్తిగించి ఉదయించినట్టు-
నాగరికతని తిరస్కరిస్తున్నానని కాదు- యింకా నగర జీవనంలో
భాగం కాలేని నా పూర్వీకుల రక్తం- లేదు అన్ని విలువల్నీ ఖండించుకుంటున్న
ఏకాకి యాంత్రిక జీవనాన్ని ఆహ్వానించలేక కావొచ్చు
ఎక్కడో యింకా అడుగుపొరల్లో- అంతరాత్మ అట్టడుగున యింకా
పల్లెటూరి వాడిగానే మిగిలిపోయి –
ఇంకా దృఢంగా నూతనోత్సాహ పోరాటశక్తితో విజృంభించటానికీ
ఇంకా ఇంకా జీవన లాలిత్యాన్నీ మృదుత్వాన్నీ కాపాడుకుంటానికీ
బహుశ అదే ఆ అమూల్యమైన బాల్యమే కారణమై
పాతికేళ్ళ తర్వాత నగరంలో తెల్లారగట్ట నిదరలేచి
నే కనుగొన్నా నేనింకా బతికే వున్నానని- బతికే వున్నానని
10 నవంబర్ 1990
( కె. శివారెడ్డి గారి ” అజేయం” కవితా సంపుటి నుంచి )
—————————— —————————
నగరంలో తెల్లారగట్ట మేల్కొన్న కవికి తన పల్లెటూరు గుర్తుకు రావడం ఈ కవితకు నేపథ్యం. ఈ నేపథ్యమే ఈ కవితకు ఎత్తుగడ అయింది. తను పెరిగిన పల్లెటూరు తెల్లవారుజాము (తెల్లారగట్ట) ప్రపంచం అద్భుతం అనీ, ఈ ప్రపంచం నగరానికి సరిగ్గా వ్యతిరేకం అనీ అనిపించింది కవికి.
ఈ కవిత చాలా భాగం పల్లెటూరు తెల్లవారుజాము ప్రపంచాన్ని చిత్రించింది. ఈ చిత్రణ పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన వారి మనసులను, ఆ వాతావరణాన్ని ఎరిగిన వారి మనసులను ఆర్ద్రపరిచేది, అలరించేది. ఈ చిత్రణలోని స్వభావోక్తులు, ఉత్ప్రేక్ష ఉపమలు పాఠకులను మిక్కిలి ఆకర్షిస్తాయి. కొన్నిటిని మళ్ళీ చదువుకుందాం.
దేన్నైనా ఉన్నది ఉన్నట్టు వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి అంటారని మనకు తెలుసు. ఈ కవితలోని స్వభావోక్తులు పాఠకులను సులభంగా పల్లెటూరి తెల్లారగట్ట ప్రపంచంలోకి ప్రవేశపెడుతున్నాయి.
” నాలుగ్గంటలకే చీకట్లో మెలకువ నీడలు తారట్లాడటం మొదలవుతుంది
చావిళ్ళల్లో చీకట్లో స్పష్టాస్పష్టంగా పశువుల కదలికలు
మేత కొరుకుతున్న శబ్దాలు, మేకు చుట్టూ తిరుగుతున్న సవ్వడులు
దూరంగా బక్కరైతులో జీతగాళ్ళో పశువుల్ని కసురుతూ అదిలిస్తున్న శబ్దాలు “
విషయాన్ని ఉపమానంతో ఊహించడమే కదా ఉత్ప్రేక్ష. ఈ కవితలో – – – ” అక్కడక్కడా ఆకాశం నుంచి వెల్తురుముద్దలు రాల్తున్నట్టు – అవి ఒకదాన్నొకటి అంటుకున్నట్టు కోడికూతల పరంపరలు ” – తెల్లవారుతుండగా కోడి కూస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. పరంపరగా వస్తున్న ఈ కోడికూతలు – అక్కడక్కడా ఆకాశం నుంచి వెల్తురు ముద్దలు రాలుతున్నట్టు, అవి ఒకదాన్నొకటి అంటుకున్నట్టు అనిపించాయి కవికి. ఇదొక సొగసైన ఊహ.
నీటిపొడి లాంటి మంచు, జారిపోతున్న ముసుగులా తెల్లారగట్ట చీకటి, దండకడియం లాంటి చెరువుకట్ట, ఆ కడియంలో ఒక పిచ్చిరాయిలా దేవుడి గుడి – ఇవన్నీ ఆ తెల్లారగట్ట ప్రపంచాన్ని, ఆ పల్లెటూరినీ పాఠకులకు దృశ్యమానం చేస్తున్న, సన్నిహితం చేస్తున్న అభివ్యక్తులు.
ఈ కవిత ప్రారంభంలో ” నగరంలో తెల్లారగట్ట మేల్కొన్నప్పుడు, నాకు పల్లెటూరు ఎందుకు గుర్తుకు రావాలి ” అని ప్రశ్నించుకున్న కవి, ఆ తర్వాతి వాక్యాల్లో సమాధానం చెప్పడం, వాటిని కుండలీకరణంలో ఉంచడం ఒక నిర్మాణ ప్రత్యేకత కాగా, ఆ సమాధానంతో సమాధాన పడక, కవిత ముగింపులో మరింత వివరణను జోడించడం మరో ప్రత్యేకత.
“ఎక్కడో యింకా అడుగుపొరల్లో – అంతరాత్మ అట్టడుగున యింకా
పల్లెటూరి వాడిగానే మిగిలిపోయి ” –
“ఇంకా దృఢంగా నూతనోత్సాహ పోరాటశక్తితో విజృంభించటానికీ,
ఇంకా ఇంకా జీవన లాలిత్యాన్నీ మృదుత్వాన్నీ కాపాడుకుంటానికీ ” – తన పల్లెటూరి బాల్యమే కారణమై ఉంటుందని ఈ కవి విశ్వాసం.
అపుడెపుడో ఆర్కిమెడిస్ ప్లవనసూత్రాన్ని కనుగొన్నప్పుడు ‘ యురేకా ‘ అని బిగ్గరగా పలికి సంబరపడినట్టు అనిపిస్తుంది, ఈ కవి రాసిన ఈ కవిత ముక్తాయింపు వాక్యం చదివినప్పుడు :
“పాతికేళ్ళ తర్వాత నగరంలో తెల్లారగట్ట నిదరలేచి
నే కనుగొన్నా నేనింకా బతికే వున్నానని- బతికే వున్నానని “
కవి బాల్యానికి, పల్లెటూరికి ముడి ఉంది. తన స్మృతుల్లో ఆ బాల్యం, ఆ పల్లెటూరు పదిలంగా వున్నాయి. తనలో పసితనం, జీవన లాలిత్యం, మృదుత్వం పదిలంగా వున్నాయి. ఇవన్నీ తనలో పదిలంగా ఉండటమే తను బతికివున్నానని చెప్పడానికి గుర్తులుగా భావిస్తున్నారు కవి.
*
Add comment