రచనలు చేసే ఆడవాళ్లు ఎదుర్కోవాలిసిన అనేకానేక అవరోధాలలో ఒకటి ,వారేం రాసినా అది వారి స్వీయానుభవం ప్రాతిపదికగా రాసివుంటారేమోననే అనుమానానికి గురికావడం
ఇంకోటి రచయిత్రులకి ,రచయితలకున్నంత అవగాహనా శక్తీ,పరిశీలనా శక్తీ వుండవనే అపోహ
మరింకో ప్రధానమైన ఆరోపణ రచయిత్రుల మేథాశక్తి, మగవారి మేథాశక్తి ముందు ఎందుకూ పనికి రాదనేది.
కొంతమంది మగ మేథావులు”షి ఈజ్ ఎ బ్యూటిఫుల్ రైటర్ “అని రచయిత్రుల మీద జోకులెయ్యడం కూడా విన్నాను (బ్యూటిఫుల్ అనేది ఆమె అందాని కితాబు ఆమె రచనకు కాదు).
ఇలాంటి వాటన్నిటికీ అపవాదంగా కమలాదాస్ ,అరుంధతీ రాయ్ ,ఇస్మత్ చుగ్తాయ్ లాంటి పేర్లు వినబడినా,వారందరూ ఇంగ్లీషులోనో లేక ఇతర భాషలలోనో రచనలు చేసి వున్నారాయె.
ఇలాంటి నేపథ్యంలో ఈ అవరోధాలన్నింటినీ అధిగమించి ఈ తరంలో ధైర్యంగా తమ గొంతులు వినిపిస్తున్న చైతన్య పింగళి నీ,అపర్ణ తోటనీ చూస్తుంటే ముచ్చటగా వుంటుంది నాకు,అందుకే ఈకథలు బోల్డ్ గా చెప్పినవంటే ఒప్పుకుంటాను గానీ,బ్యూటిఫుల్ అనేమాట మాత్రం నాకు ఒప్పుదలగా లేదు.
అపర్ణ ఈ సంకలనంలో తీసుకువచ్చిన కథలన్నింటినీ చదివాక నాకేమనిపించిందంటే తనకి కథ చెప్పడమంటే అపరిమితమైన ప్రేమ,పాషన్ అని.ఆమె కథచెప్పే విధానం లోనూ,కథావస్తువునెన్ను కోవడంలోనూ చూపిన వైవిధ్యం నాకీ అభిప్రాయాన్ని కలగ జేసింది
అపర్ణ కథ చెప్పే శైలి కథను బట్టి మారడం గమనించాను,టీనేజ్ పిల్లల కథలో భాష వేరూ,మధ్య వయసు వ్యక్తుల కథలో భాష వేరూ ఇలాగన్న మాట
కథ చెప్పేటప్పుడు ఒకోసారి కథానాయిక పరంగానూ(యువతులవవచ్చు,మధ్యవయసు మహిళలవవచ్చు),ఒకోసారి కథానాయకుని పరంగానూ(యువకులవవచ్చు,మధ్యవయసు మగవాళ్లు అవవచ్చు )కథను చక్కగా నడిపి రక్తి కట్టించడం విశేషం
వస్తు వైవిధ్యం గురించి చెప్పాలంటే స్త్రీ పురుష సంబంధాలలోనూ,తల్లీబిడ్డల అనుబంధాలలోనూ,ఇద్దరు స్త్రీల మధ్య వుండే స్నేహంలోనూ,టీనేజ్ పిల్లల జీవితంలోనూ వుండే సంక్లిష్టతనీ,సంఘర్షణనీ వివరిస్తూ వాటిని విశ్లేషించే ప్రయత్నం ఈ కథలలో కనపడుతోంది.
సాధారణంగా రెండు మూడు కథలు చదవంగానే ఆ రచయిత కథ చెప్పే విధానం మనకి తెలిసి పోతుంది,కొంతకాలానికి ఒక రకమయిన మొనాటనీ వస్తుంది,ఆ మొనాటనీ రాకుండా చూసుకోవడం ముఖ్యం,ఆ పని తను సమర్థవంతంగా నిర్వహించింది.
ఈ సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి,ఒక్కో కథ గురించీ చెప్పాలంటే అదే ఒక కథవుతుంది అయితే కనీసం మూడు,నాలుగు కథల గురించయినా వివరంగా చెప్పకుండా వుండలేక పోతున్నాను.
ఒక అతడు-ఒక ఆమె.:
ఈ కథతోనే నాకు అపర్ణ మొట్ట మొదట పరిచయమయింది.అప్పట్లో నేనీ కథ”ఆదివారం ఆంధ్రజ్యోతి “లో చదివి చాలా థ్రిల్లయ్యాను.ఫేస్బుక్ లో రివ్యూ కూడా రాశాను.ఇప్పుడు మళ్లీ చదివినా ఈ కథ అదే ఫీలింగ్ కలగడం ఆశ్చర్యం
ఈ కథలో అతడికీ,ఆమెకీ పేర్లు పెట్టకపోవడం లోనే ఆ కథలోని విషయం యెంత సార్వజనీనమయినదో తెలుస్తోంది.వివాహేతర సంబంధాలగురించి రాసిన కథ.ఇది చాలా సున్నితమైన సబ్జక్టు ,వల్గర్ గా యేమాత్రం అనిపించకుండా డీల్ చేయడం కష్టం.అసలు ఈ సమస్య మనిషి పుట్టుకంత ప్రాచీనమైనది,దీనికి ఎవరెన్ని కారణాలూ,సాకులూ వెతికినా ,జీవితానికి అర్థం వెతకడం యెంత అర్థం లేని పనో,ఈ సంబంధాలకు కారణం వెతకడం కూడా అంత అర్థం లేని పని అనిపిస్తుంది.
ఈ కథని అపర్ణ ఆడమనిషి కోణం నుండే కాక మగమనిషి కోణం నుండీ కూడా రాయడం వలన కథకొక సమగ్రత చేకూరింది,రచయిత్రికి వున్నది హ్యూమనిస్ట్ దృక్పథమని అర్థమయింది.
పునీత:
భర్త దగ్గరనుండీ యే విధమైన ప్రేమా ,గౌరవమూ,ఆప్యాయతా దొరకకపోగా చిరాకులూ,చీదరింపులూ ,ఎదుర్కొనే మధ్య వయసు మధ్య తరగతి మహిళకు,తనకంటే చిన్నవాడయిన బంధువుల అబ్బాయితో యేర్పడిన బలహీనమైన అనుబంధం కథ ఇది. ఇందులో ఆమె లోనయ్యే సంఘర్షణా,ఆత్మన్యూనతతో బాటు,తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి లేదా వదులుగా వున్న దారపు చిక్కు ముడి లాంటి అనుబంధమది అనే స్పష్టీకరణ కూడా వుంది.
ఈ కథ రాసి చాలా విమర్శలనెదుర్కొనే వుంటుంది రచయిత్రి అయితే ఇలాంటి వ్యక్తులూ,ఇలాంటి అనుబంధాలూ నిజజీవితంలో కనపడటం అరుదు మాత్రం కాదు.
పరిధి:
ఒక ఆధునిక యువతి ఆలోచనలూ,ఆమె రోజువారీ జీవితమూ అందులోని డొల్లతనమూ వివరించే కథ
ఇంటర్మిషన్ :
భార్య భర్తతో పాటు సమానంగా యెంత చదువుకున్నా,యెంత టాలెంటెడ్ అయినా ఇంటి పనులలో ,పిల్లల పెంపకంలో బాధ్యతంతా ఆమె నెత్తినే పడుతుంది,భర్తకు అందులో వాటా వుండదు.అంతగా అవసరమైతే ఆమె ఉద్యోగం మానేసయినా సరే ఇంటి అవసరాలు చూసుకోవాలి,ప్రతి చిన్న ఖర్చుకూ అతని ముందు చెయ్యి జాపుతూ ,సంజాయిషీ ఇస్తూ ఆర్థిక స్వాతంత్రం లేకుండా వుండాలి.ఇది నేటి తరానికి చెందిన చాలామంది మహిళల కథ అని నాకనిపించింది.
గుడ్ మార్నింగ్ అదితి :
ఇది తన అస్తిత్వం నిరూపించుకోడానికి గీతదాటి చూద్దాం,ఒక ప్రయోగం చేద్దాం అనుకునే అమ్మాయి కథ.
వాహిని:
ఒక మధ్యవయసు మగవాని అంతరంగ చిత్రణ ఈ కథ
వాలెంటైనుడెవ్వరే:
ఇది పూర్తిగా నేటి తరానికి చెందిన యువతీ యువకుల భాషలో రాసిన కథ .ఈ కథలోని భాష నాకర్థం కావడానికి రెండు మూడు సార్లు చదవవలసి వచ్చింది,మొత్తానికి కొత్తసీసాలో పాతసారా అనిపించింది కథంతా చదివాక.
ప్రేమకథ రిఫైన్డ్ :
నాకు చాలా నచ్చిన కథ.ఎవరైనా ఆడగానీ,మగగానీ “నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడంలో అవతలి వ్యక్తి కూడా తనను ప్రేమించాలీ,ప్రతి స్పందించాలి అనే డిమాండ్ వుంటుంది అంతర్లీనంగా.అలాంటి ప్రతిస్పందన దొరకనప్పుడు ఈ ప్రేమను వ్యక్తపరిచిన వ్యక్తి మనోభావాలు యెలా వుంటాయి,యెలా గాయపడతాయి అనేదే కథ
అసలు భర్తా,పిల్లలతో భద్రమయిన జీవితం గడిపే ఒక స్త్రీ తనలోని స్పందనలు గమనించి,తన ఇష్టాన్ని బయటకు చెప్పడానికి యెంత ధైర్యం కూడగట్టుకోవాలి.
విషయం అక్కడకు వచ్చేదాకా ఆమెలో భావావేశాలను ప్రేరేపించి ,తీరా ఆమె తన ప్రేమను వ్యక్తం చేశాక,ఆమె అంటే ఇష్టమో కాదో స్పష్టంగా చెప్పకుండా ,విషయం దాటవేస్తూ యేవేవో కబుర్లు చెప్పి ఆమెను తప్పించుకుని తన అహాన్ని తృప్తి పరుచుకునే ఒక మగవాడి మనసు కనిపెట్టి మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా అతనికి సమాధానం చెప్పే కథానాయిక కథ ఇది.
ఏడో ఋతువు:
వయసులో తేడా వున్న ఇద్దరు ఆడవాళ్ల మధ్య యేర్పడిన స్నేహమూ,ఆపేక్షా కథ
రంగు వెలిసిన జ్ఞాపకాలు:
ఒక మహిళ యభైయ్యో యేట తన జీవితంలో కరిగి పోయిన ప్రేమకథలనూ,మిగిలిపోయిన జ్ఞాపకాలనూ తడుముకునే కథ
ఆనాటి వాన చినుకులు:
పిల్లలు చదివే చదువులేకాక,వాళ్లు చదివే స్కూళ్లూ,తెచ్చుకునే రాంకులూ కూడా సమాజంలో తల్లిదండ్రుల స్థాయిని నిర్ణయించే కాలంలో బతుకుతున్నాం.ఈ విద్యా వ్యవస్థ తల్లిదండ్రుల మీదా,పిల్లలమీదా యెంత వత్తిడి కలగ జేస్తోందో ,వారి మధ్య యెంత దూరాన్ని పెంచుతోందో చెప్పే కథ.ఎంత బాగా రాశావు అపర్ణా!
సూరిగాడి కొలువు:
ఈ కథలో సూరిగాడి లోకంలో వాడితో పాటు మనమూ తిరుగుతాం.
దౌలత్ :
ఇది మిగతా కథలన్నింటికంటే విభిన్నమైన పధ్ధతిలో రాసినట్టనిపించింది.ఒక కుటుంబంలో యేదైనా ఒక విజయం సాధించడం వారసత్వంగా వస్తుంటే,తర్వాతి తరాలకు అది సాధించి వారసత్వం నిలుపుకోవడం ఛాలెంజ్ గా మారుతుంది.ఆ ఛాలెంజ్ లో చేరాలనుకున్న శిఖరాన్ని చేరి విజయం సాధించిన కొడుకుని చూసి ,ఆనంద బాష్పాలతో వెన్ను తట్టిన తండ్రి కథ
అన్నీ గొప్పకథలు కాకపోవచ్చు ఒకే స్థాయిలో లేకపోవచ్చు అయితే అపర్ణ కథలెందుకు చదవాలి?
మన ఆలోచనలను మనం చదువుకోవడానికి,మనలాంటి మరి కొందరి గురించి తెలుసుకోవడానికి ,అది చాలదా?
ఈ కథల ప్రయోజనం నెరవేరినట్టుకాదా?
“కదిలేదీ,కదిలించేదీ,పెను నిద్దుర వదిలించేదీ కావాలోయ్ నవకవనానికి” అనలేదా శ్రీశ్రీ
అపర్ణ కలం నుండీ ఆలోచనలను గిలకొట్టే ఇలాంటి మంచి కథలు మరిన్ని రావాలని కోరుకుంటూ
Nice