‘ఆకాశంలో ఒక నక్షత్రం’ – దీన్నే సంపుటికి శీర్షికగా పెట్టడం- ఈ కథనే మొదటి కథగా ఉంచడం – ఏదైనా విశేషమా? కావచ్చు.
ఒకే వృత్తి వారు ఒక కులంగా ఏర్పడవచ్చు . ఓకే ఆచార సంప్రదాయాలు, ఒకే సామాజిక సంస్కృతి కలవారు ఒక కులంగా ఏర్పడవచ్చు. వీరి వివాహాది శుభకార్యాలు, పండుగలు పర్వదినాలు ఒకేలా ఉంటాయి. పుట్టిన ప్రతి వ్యక్తికీ వారు పుట్టిన కులం ఆధారంగా వారికి ఒక సామాజిక హోదా లేదా స్థాయి ఏర్పడుతుంది. ఇక వారు మరణించే వరకూ అది వెన్నంటి ఉంటుంది. ఇటువంటి కులం భారతదేశంలో ఉంది. ఇప్పటికీ ఉంది. అంటరానితనం నేరం. అయినా అంతర్లీనంగా ఉంది. కులవివక్ష చట్టరీత్యా నేరం. అయినా అంతర్గతంగా ఉంది.
కులం పేరుతో వివక్ష, అణచివేత, దోపిడీ చాలా యధేచ్ఛగా, ఘోరంగా జరిగింది. అప్పట్లో దీనికి ఏ అడ్డూ ఆటంకాలు లేనేలేవు. ఆధిపత్య కులాలదే పెత్తనం. అణచివేతకు గురైన కులాలవారికి ఇది వివక్ష, అణచివేత, దోపిడి అనే స్పృహే లేనంతగా జరిగింది. సుమారు మూడు వేల సంవత్సరాలపాటు ఇది అప్రతిహతంగా సాగింది. 1873లో ఫూలే ‘గులాం గిరి’ రచనతో కులకుట్ర బయటపడింది. అయోతిదాస్, నారాయణ గురు, అయ్యంకాళి, సహోదర అయ్యప్పన్, అంబేద్కర్ మొదలైన వారి వలన కులం గుట్టు రట్టయింది. ఇలా దళిత లేదా బహుజన స్ప్రహకు పునాదులు పడ్డాయి. ఇది సంస్కరణ స్థాయి దాటి 1950 నాటికి అస్థిత్వవాదంగా తలెత్తింది. 1980 నాటికి దళితవాదం కవిత, కథ, నవలతో సంప్రదాయ సాహిత్యానికి ప్రత్యామ్నాయ సాహిత్యంగా బలపడింది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ కొంచెం అటూ ఇటుగా ఇలాగే జరిగింది.
దళిత బహుజనులకు చదువు గగన కుసుమం. పేదరికం, కులవివక్ష ఇలాంటివి వీరి చదువుకు పెద్ద అడ్డంకులు. తిండి ఉండదు. సరైన బట్ట ఉండదు. ఆఖరికి ఉండడానికి సరైన నీడా ఉండదు. అయినా వీరు చదువు కుంటారు. ఎందుకంటే చదువు ఒక్కటే వీరి భవిషత్తుకు భరోసా ఇస్తుంది. వీరికి ఆస్తిపాస్తులు ఉండవు. సెంటునేల ఉండదు. కాయకష్టం చేసే తల్లిదండ్రులు తప్ప వీరికి ఆకలి తీరే వేరొక మార్గం ఉండదు. అందుకే చదువుకుంటే చిన్న ఉద్యోగమైనా దక్కుతుందని వీరు ఎంతో ఆశతో చదువు కుంటారు. పట్టుదలతో పది పూర్తి చేస్తారు. ఇష్టంతో ఇంటర్ దాటేస్తారు. డీలా పడిపోకుండా డిగ్రీ పూర్తి చేస్తారు. విజేతలై విశ్వవిద్యాలయం వరకు వెడతారు. ఈ ప్రస్థానంలో వీరి కష్టాలు అన్నీ ఇవన్నీ కాదు. పుస్తకాలకు డబ్బు ఉండదు. ఫీజులకు డబ్బుండదు. (మినహాయింపు ఇచ్చినా కూడా) ప్రయాణాలకు డబ్బుండదు. అనారోగ్యం, ఆపదలు, ప్రమాదాలు ఇలా ఎన్నో అవరోధాలు. అందుకే చాలా మంది దళిత బహుజన విద్యార్థులు శలవుల్లో కూలి పనులకు వెడతారు. వ్యవసాయ పనులు, తాపీ పనులు ఇలా ఎవరికి అందుబాటులో ఉన్న పనికి వాళ్ళు వెడతారు. పట్టభద్రుల స్థాయిలోనే కాదు పరిశోధన సమయంలో కూడా కూలిపని చేసిన దళిత బహుజన విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థే వేముల రోహిత్. ఎంతో కష్టపడి కేంద్రీయ విశ్వవిద్యాలయం వరకూ ఎదిగాడు. కులవివక్షతో రోహిత్ ను విశ్వవిద్యాలయం చంపేసింది. ఈ సంఘటనే ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథ.
‘ఆకాశంలో ఒక నక్షత్రం’ ప్రయోగాత్మక కథనం. వేముల రోహిత్ మరణ సంఘటనే కథ ఇతివృత్తం. కాని రచయిత తనదైన బాణీలో చెప్పారు. మూడు విషయాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఒకటి కథ నేపథ్యం క్రైస్తవం.
రోహిత్ ది ఆత్మహత్య కాదని చెప్పడం. రోహిత్ వారసులు అతని లక్ష్యం నెరవేరుస్తారనే ఆశాభావం వ్యక్తం చేయడం. ఈ మూడు విషయాలతో రచయిత కథను నడిపిస్తారు. మొదటి నుండీ కథలో ఉత్కంఠత , వేగం ఉంటాయి. వీటిలో పాఠకుకుడు కొట్టుకుపోతాడు. సంఘటన కూడా అటువంటిదే కాబట్టి కథనానికి ఆ వేగం, అవసరమైంది. రోహిత్ పేరు కథలో ‘తొహిరో’ అని చెప్పీ, దాన్ని వేగంగా ఉచ్ఛరించమనీ చెప్పీ రచయితే దాన్ని పరోక్షంగా రివీల్ చేయడం ద్వారా చిన్ని సమత్కారం సాధించారు రచయిత. రోహిత్ హత్య వెనుక దాగి ఉన్న వేధింపులు, దళితులు కేసుల్ని ఎలా దారి తప్పిస్తారో, దళితులకు ఇళ్ళు అద్దెకు ఇవ్వలేని హీనత్వం ఇటువంటి విషయాలను రచయిత నాటకీయంగా బయటపెట్టారు.
నిర్మాణ రీత్యా, వస్తురీత్యా ఏం విధంగా చూసినా చాలా బలమైన కథ ‘ఆకాశంలో ఒక నక్షత్రం’.
కులవివక్ష గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, నగరాల్లో లేదు అనడానికి లేదు. కులవివక్ష నగరాల్లోనూ కొనసాగుతుంది. నగరాల్లో కులవివక్ష ఎలా ఉంటుందో హుందాగా చెప్పిన కథ ‘ఆపాల పెద్దమ్మ’ కథ. గ్రామీణ ప్రాంతాల్లో కులం బహిరంగ రహస్యమే. ఏదైనా చిరునామా కోసం వాకబు చేస్తే, దాని సమాధానం కంటే ముందు ‘మీరేవుట్లు’ అనే ప్రశ్న ముందు వినిపిస్తుంది. అక్కడ కులంతోటే అన్నీ ముడిపడి ఉంటాయి. ఇది చాలా సహజంగా రన్ అవుతూ ఉంటుంది. నగరాల్లో ఇంటి పేరునుబట్టో, అలవాట్లను బట్టో కులాన్ని పసిగడతారు. ఉద్యోగం మంచి హోదా ఉంటే స్నేహంగానే ఉంటారు. కానీ కులరేఖల్ని మాత్రం వదిలిపెట్టరు.
అనిల్ కుమార్ అనే ఒక దళిత ఆఫీసర్ ఫ్లాష్ బ్యాక్ కథనంతో ఈ కథ నడుస్తుంది. తన చిన్న తనంలో అనిల్ కుమార్ పెద్దమ్మ ఆపాలు చేసి అమ్మేది. వాటి ఆ అంబేద్కర్ కాలనీ వాసులు తప్ప వేరే కులం వారు కొనేవారు కాదు. ఆవిడా వాళ్ళకి అమ్మడానికి భయపడేది. ఒకసారి వేరే కులపు చిన్నపిల్ల ఆ ఆపాలుకొనుకుని తింటుంటే , అదిచూసిన తల్లి ఆపిల్లను చితకబాదింది. ఇంకోసారి ఈ అనిల్ కుమారే పెద్దమ్మ ఆపాలు బడికి పట్టుకెడతాడు. ఈ ఆపాలు బడిలో ఇంకో స్నేహితుడికి పెడతాడు. ఈ విషయం ఆ పిల్లాడు ఇంట్లో చెబుతాడు. ఇంకోసారి ఆపాలు తినొద్దని మందిలిస్తారు. ఇలాంటివన్నీ చిన్నతనంలో అనిల్ కుమార్ కు అర్థం కాలేదు. కానీ అవి అతన్ని అవి పెద్దయ్యాక కూడా వెంటాడాయి. ఉద్యోగ జీవితంలో కూడా అతను ఇలాంటి అవమానాలు, వివక్షపూరిత సందర్భాలు ఎదుర్కొన్నాడు.
అనిల్ కుమార్ ఉండే గేటెడ్ కమ్యూనిటిలో ఏదో కంపెనీ వాళ్ళు వంటల పోటీలు పెడతారు. ఆ పోటీకి అనిల్ కుమార్ పెద్దమ్మను రప్పించి ఆపాలు వంటకాన్ని ఎంట్రీగా పెడదామనుకున్నాడు. కారణాంతారాలు వలన ఆ పెద్దమ్మ రాలేకపోయింది. ఆ పోటీ రోజే అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురు సుబ్బులు పుట్టిన రోజు. ఆ అమ్మాయికి ఇష్టమని సుబ్బులు తల్లి రాజ్యలక్ష్మి ఆపాలు తయారుచేసింది. రాజ్యలక్ష్మి ఏదో పనిలో ఉండగా, సుబ్బులు ఆ ఆపాలు తెచ్చి వంటలు పోటీల వేదిక మీద పెడుతుంది. ఈ వంటకానికి బహుమతి వస్తే ఈ పుట్టిన రోజుకైనా తన అమ్మకు ఒక కొత్త చీర వస్తుందనీ, సుబ్బులు అభిప్రాయంగా రచయిత దీన్ని వివరించారు. న్యాయ నిర్ణేతలు సుబ్బులు (రాజ్యలక్ష్మి) ఆపాలును ఉత్తమ వంటకంగా ప్రకటించారు . పెద్ద హోదా కాబట్టి బహుమతి ప్రదానం అనిల్ కుమార్ చేత చేయించారు. అయిదు వేల రూపాయలు, పట్టుచీర రాజ్యలక్ష్మికి ఇస్తున్నప్పుడు అప్రయత్నంగా అనిల్ కుమార్ కనులు చెమ్మగిల్లాయి. దానికి కారణం, రాజ్యలక్ష్మి కూడా ఆపాలు పెద్దమ్మ పుట్టిపెరిగిన ఆ అంబేద్కర్ కాలనీ నుండే (వలస) రావడం.
యథార్థవాది లోకం విరోధి అనే నానుడికి లక్ష్యంగా ఉంటుంది ‘దేవుడిని చూసిన వాడు’ కథ. ఇతివృత్తం సత్తె కాలపు నాటిదేమో అనుకుంటాం. కానీ సత్యం, ధర్మం ఏం కాలంలోనైనా ఉండాలి కదా! అదే ఈ కథ ధ్యేయం. సుదర్శనం అనే ఒక ప్రభుత్వ అధికారి జీవితమే ఈ కథ. తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనతో (సిగిరెట్ కాల్చి తండ్రితో అబద్ధం చెప్పడం) నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంటాడు. శాస్త్ర ప్రకారం పోతే పిల్లిపిల్లలు పుట్టాయన్నట్టు నిజాయితీగా ఉంటే ఇప్పటి లోకం బతకనిస్తుందా! అందువలన సుదర్శనానికి ఆఫీసు వాళ్ళూ విరోధులయ్యారు, ఇంట్లో వాళ్ళూ విరోధులయ్యారు. సుదర్శన నిజాయితికి తట్టుకోలేక భార్య ఇద్దరు (కొడుకు, కూతురు)పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. సుదర్శనం ఇల్లు అమ్మేసి ఆ డబ్బు భార్యా పేరుతో బ్యాంకులో ఫిక్స్డు డిపోజిట్ చేశాడు. సుదర్శనం ఒక జత బట్టలుతో ఆంధ్ర -ఒరిస్సా సరిహద్దులో ఒక పాడుబడిన దేవాలయంలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అక్కడి పూజారి సుదర్శనాన్ని ‘స్వామీజీ’ గా భావించి ఆరాధించేవాడు. అక్కడికి వచ్చే భక్తులకు ఇచ్చే పళ్ళు మాత్రమే తింటూ సుదర్శనం పదిహేనేళ్ళు అలా ఉండిపోయాడు.
సుదర్శనం ఇల్లు విడిచి దేవాలయం చేరడంతో కథ మొదలవుతుంది. సుదర్శనం గత జీవితం ఫ్లాష్ బ్యాక్ లో చెప్పబడింది. సుదర్శనం ఆఫీసులో ఒక అవినీతి పరుడు ఉద్యోగం కోల్పోతాడు. దానికి కారణం సుదర్శనం ఇచ్చిన విచారణ నివేదిక . సుదర్శనం కూతురు ఒక కాంట్రాక్టర్ కొడుకుని ప్రేమిస్తుంది. ఆ పెళ్ళి జరగాలంటే సుదర్శన సీట్లో ఉన్న పదికోట్ల విలువైన ఫైళ్ళు క్లియర్ చేయమని అబ్బాయి తండ్రి డిమాండ్ చేశాడు. సుదర్శన ఆపని చేయలేదు. కూతురి పెళ్ళి ఆగిపోయింది. ఇదంతా రచయిత ఫ్లాష్ బ్యాక్ లో చెప్పారు.
కథ చివర్లో అన్ని అనుకూలంగా మారిపోతాయి. సుదర్శన ఫలానా చోట ఉన్నట్టు కుటుంబ సభ్యులకు తెలుస్తుంది.
ఉద్యోగం పోయిన వ్యక్తి వ్యాపారం చేసి పైకి వస్తాడు. కాంట్రాక్టర్ కొడుకు తండ్రిని ఎదిరించి సుదర్శనం కూతురినే పెళ్ళి చేసుకుంటాడు. సుదర్శనం భార్య, కొడుకు, కూతురు వచ్చి ఎంత బతిమాలినా అతడు దేవాలయం వదిలి ఇంటికెళ్ళలేదు. ‘యథార్థవాదులు లోకవిరోధులు అయితే ఏం, సత్యం జయిస్తుంది. యథార్థ మార్గం సార్వజనీనం’ అన్న దేవాలయ పూజారి మాటలుతో కథ ముగుస్తుంది. సుదర్శనం దేవుడిని చూశాడు. దేవుడెవరూ? మనలోని సత్యనిరతి. ధర్మబద్ధత.
ఇందులో ఇరవై నాలుగు కథలున్నాయి. ప్రతి కథలోనూ ఏదో ఒక విశేషం ఉంది. ఇందులో చాలా కథలకు బహుమతులొచ్చాయి. దాని కారణంగా విభిన్న ఇతివృత్తాలు రచయిత తీసుకున్నారు . కథ చెప్పే తీరు సులభంగా ఉంది. ఎటువంటి మార్మికత లేదు. హాయిగా చదువుకోవచ్చు. కేవలం దళిత కథలే కాకుండా, మంచి స్త్రీవాదకథలూ ఇందులో ఉన్నాయి. ‘రానిక నేస్తం! రానిక నీకోసం ‘ మంచి స్త్రీవాద కథ. ‘దేవుడే దిగి వచ్చాడు’ కథలో కులం ప్రేమనీ, స్నేహాన్ని ఎలా భగ్నం చేస్తుందో చెప్పారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మంచి కథ. ఒక్కోసారి జీవితం ఎలా ఉంటుందో బైరాగి పాత్ర చెబుతుంది. ‘గంగ పొంగింది ‘ వర్గపోరాటం, దోపడీకి సంబంధించిన కథ. ఈ కథల్లో కులవివక్షను ఎండగట్టిన కథలున్నాయి. దోపిడి, వర్గపోరు నేపథ్య కథలున్నాయి. మానవవిలువలకు సంబంధించిన కథలున్నాయి.
‘విభిన్నరకాల ఇతివృత్తాలతో రూపొందిన ఈ కథల్లో మానవ జీవితంలోని వైశాల్యం, భిన్న ప్రవృత్తులతో
సంచరించే మనుషుల నైజం సాక్షాత్కారిస్తుంది. సమాజం మారుతున్నట్టే కనిపిస్తున్నా మారని మనుషుల ప్రవర్తనాసరళిని చిత్రించడానికి ప్రయత్నించారు సుగుణరావు గారు’ (పు 6) అని తన ముందుమాటలో గుడిపాటి గారు చెప్పిన మాటలు పాఠకులకు కథ చదివేటప్పుడు జ్ఞప్తికొస్తాయి.
‘జీవితాన్ని ఊహించుకోడానికి, పునరాలోచించుకోడానికి, చింతించడానికి, నిర్లిప్తత నిండిపోయిన జీవనాన్ని re-imagine చేసుకోడానికి, మరింత బాగా జీవించడానికి, జీవితానికే ప్రాతినిధ్యం వహించడానికి. అందుకని జీవితం ఉన్నంత వరకు సుగుణ రావు లాంటి వారెందరో రాసిన కథలు చదువుకుందాం ‘ (పు 19)అని తన తండ్రిగారి ఈ కథలు సంపుటికి ముందుమాట రాసిన హర్షగారితో ఏకీభవిద్దాం.
‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథ ఉపాధ్యాయ మాసపత్రిక బహుమతి పొందింది. ఇదే కథను వంశీ గారు (రచయిత పెద్ద కొడుకు)ఇంగ్లీషు నాటకంగా రూపొందిస్తే, టాటా లైవ్ ఫెస్ట్ సుల్తాన్ పదాంసే నాటకాల పోటీల్లో లక్ష రూపాయలు బహుమతిని గెలుచుకుంది. ‘పాలపిట్ట’ వారు ప్రచురించిన ఈ కథల సంపుటి ఇటీవలి వచ్చిన మంచి పుస్తకాల్లో ఒకటిగా చెప్పవచ్చు. రెండువందల నలభై ఎనిమిది పుటల ఈ పుస్తకం ధర రెండు వందల రూపాయలు.
ప్రతులకు: డాక్టర్.ఎం. సుగుణ రావు,
312 గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్స్,
హోటల్ ఫెయీర్ ఫీల్డ్ మారియట్,
మాధవధార,
ఉడా కాలనీ,
విశాఖపట్నం – 530018.
చాలా మంచి సమీక్ష.సమగ్రంగా తులనాత్మక విశ్లేషణ.
సంపుటి లోని కథల గమ్యాన్ని, కథకుడి ఉద్దేశ్యాన్ని .. చక్కగా తన సునిశిత పరిశీలన తో ఆవిష్కరణ చేసిన బండి సత్య నారాయణ గారి కి, సమీక్ష. ప్రచురణ చేసిన సారంగ వారికి అనేక ధన్యవాదాలు
a superb review.