తెలుగు సాహిత్యాన్ని కమర్షియల్ రచనలు వెల్లువెత్తి కబళించడానికి ముందు, “నవల, కథ అంటే టైం పాస్ కి చదివే రచనలు” అనే అభిప్రాయం సగటు తెలుగు పాఠకుడికి కలగడానికి ముందు, పాత తరం రచయితలు ఈ తరానికి గొప్ప షాక్ కలిగించే అంశాలతో రచనలు చేశారు.
జెండర్ సెన్సిటివిటీ తో కానివ్వండి, స్త్రీలు నైతికంగా ఒక మెట్టు పైన ఉంటారనే, ఉండాలనే ఒక అనుకోలు ( assumption ) తో కానివ్వండి, మన దృష్టికి మనం ఆపాదించుకున్న కొన్ని నియంత్రణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, ” స్త్రీ పురుష సంబంధాల విషయంలో, స్త్రీలూ పురుషులూ సగటు మనుషులు గా ప్రవర్తిస్తారే తప్ప, నైతికతకు సంబంధం లే”దని కుండ బద్ధలు కొట్టిన వాళ్లలో ధనికొండ కి అగ్ర స్థానం ఇచ్చేయాలంతే .
అందుబాటు లో లేక నో, ఆసక్తి లేకనో, చదివే టైము లేకనో పాత తరం సాహిత్యాన్ని చదవని వారికి, వాళ్ళు ఆ రోజుల్లోనే మానవ స్వభావాన్ని, సంఘ స్వరూపాన్ని రచనల్లో నగ్నం గా చూపించేశారన్న విషయం తెలీక పోవడం లో ఆశ్చర్యం లేదు.
ధనికొండ హనుమంతరావు గారి రచనల మీద సదస్సు, చర్చా వేదిక ను వారి కుటుంబ సభ్యులు, మేన కోడళ్ళు గోపరాజు లక్ష్మి, సుధలు మార్చి ఫస్టు న రవీంద్ర భారతి లో ఏర్పాటు చేయడం సాహిత్య పరంగా ఈ మధ్య కాలంలో జరిగిన ఒక మంచి పని
సుధ నలభై కథల్ని ఎంపిక చేసి, కొందరు ఔత్సాహికులైన పాఠకులు, రచయితలకు ముందుగా పంపారు. వాటిని చదివి, ఆ కథల మీద చర్చించాలని పిలుపు.
ధనికొండ తెలియని ఇప్పటి పాఠకులకు ,ఆయనను చదవని అప్పటి పాఠకులకు కూడా పరిచయం చేసి, ఆయన పుస్తకాలను మన ముంగిట్లోకి తెచ్చి, సంధ్య వేళ లాంతరు దీపం వెలుగు లో చాపేసుకుని క్లాసు పుస్తకాలు చదివినంత శ్రద్ధగా వాటిని చదవమని ఆప్యాయంగా పంపి, అందరి చేతా చదివించిన గోపరాజు లక్ష్మి, సుధ చేసిన ఈ ప్రయత్నం మంచిదే కాదు, సరికొత్తది కూడా
ఆయన అనువదించిన మొపాసా కథలు, క్లియో పాత్రా నవల తప్ప మిగతావేవీ చదవలేదని నిస్సిగ్గు గా (దొరకలేదు మరి) ఒప్పుకుంటూ, ఈ కథలు చదవడం మొదలు పెడితే, చాలా కథలు ఉలిక్కి పడేలా, భుజాలు తడుముకునేలా,షాక్ కొట్టేలా, ఒప్పుకోడానికి మొరాయించేలా, ఒప్పుకోక గత్యంతరం లేక తలాడించేలా… ఉన్నాయి.
లైంగిక సంబంధాలు పెట్టుకోడానికి స్త్రీలు ఇన్ని టాక్టిక్స్ ఉపయోగిస్తారా? అని విస్మయ పడేలా, (లోలోపల ఏదో గుచ్చుకుంటూ ఉంటుంది.. .. బహుశా ఒప్పుకోలు) కొన్ని సార్లు “అబ్బ, ఈయనేంటి? ఇలా చెప్పేస్తున్నాడు” అని కోపం తెచ్చుకునేలా రాశాడాయన కథలు. అందుకే రచయిత్రి , చర్చా వేదిక నిర్వాహకురాలు కె ఎన్ మల్లీశ్వరి ఆయన్ని “కఠినాత్ముడు” అని వర్ణించారు.
ఇవన్నీ ఆయన ఏ పాత్ర పట్లా ఎలాటి కన్సర్నూ, సానుభూతీ, ఇష్టమూ, అయిష్టమూ ప్రకటించక తామరాకు మీద నీటి బొట్టు లా రాశాడు. తను చూసిన, లేదా తనకు తారస పడ్డ, చదివిన ప్రపంచాన్ని కథల్లో చిత్రిస్తూ పోయారు తప్ప, ఏ పాత్ర మీదా, పాత్ర స్వభావం మీద ఎలాటి అభిప్రాయాలూ, రాగద్వేషాలూ , తీర్పులూ ఉండవు.
వివాహేతర సంబంధాల గురించి ఈనాటికీ పబ్లిక్ గా మాట్లాడుకోడానికి సంకోచించే విషయాలను ఆయన మంచినీళ్ళు తాగినంత అలవోక గా రాశాడు
స్టీరియోటైప్ ఆలోచనలకు,సంఘ నీతులకు అలవాటు పడ్డ మన మెదడే “అబ్బ, ఈమె ఇంత తెంపరి గా ప్రవర్తిస్తుందేం?” అనే తీర్పరి స్వభావాన్ని పైకి తెచ్చుకుని ప్రకటించుకుంటుంది.
అది స్త్రీల సహజ స్వభావమై ఉండొచ్చని అంగీకరించడానికి మొరాయిస్తుంది
ఆయన చాలా కథలు సెక్స్ విషయంలో మనం పాటించే ద్వంద్వ నీతుల్ని నిలదీసి ప్రశ్నిస్తాయి. సెక్స్ నిత్య జీవితంలో ఒక విడదీయలేని భాగం కాబట్టే ఆయన కథల్లో ఎక్కువ గా అదే ప్రధాన విషయంగా ఉంటుంది. వీటిని సెక్స్ కథలు గా పిలవలేం. ఇవి ఉద్రేకాన్ని రేకిత్తించవు సరి కదా, సమాధానాలు వెదుక్కునే పని లో పడేసే ప్రశ్నల్ని మన ముందు పరుస్తాయి.
అయితే ఆయన సెక్స్ ఒక్కటే కాదు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసు జీవితాల్లోని దౌర్బల్యాలు, నిస్సహాయత, బలహీంతలు వీటన్నిటి మీదా వేదనతో, రాశాడు. బాధ పడే సందర్భాలకు హాస్యం కోటింగ్ వేసి రాశాడు కూడా ఆయన ఏ సందేశాలూ ఇవ్వబూనడు. ఏ నీతులు చెప్పే బాధ్యతనూ నెత్తికెత్తుకోడు
“ఇదిగో, ఇదీ మనం” అని మన మనసుల్ని, మనకి ఆపాదించుకున్న విలువల్ని నగ్నం చేసి అద్దం లో చూపించి తప్పుకుంటాడు.
అందుకే ధనికొండ రచనలు చదువుతుంటే, ఖాళీ తనమేదో పూడుతున్నట్టు ఉంటుంది. మనం భయపడి మానేసిన బాధ్యత ఏదో తీర్చేసినట్టు ఉంటుంది. వేసుకోడం ఆపేసిన ప్రశ్నలేవో మనల్ని మనం వేసుకుని నిశ్చింత గా ఒళ్ళు విరుచుకున్నట్టు ఉంటుంది
ప్రతి చోటా పాతా కొత్త పీడీ ఎఫ్ లు అందుబాటులో ఉంటున్న రోజుల్లో పుస్తకాలు పోగేయడమే తప్ప చదివే తీరిక ఎక్కడుంది? బుక్ ఫేర్ లో మొహమాటం కొద్దో, నిజంగా ఆసక్తి ఉండో కట్టల కొద్దీ పుస్తకాలు కొన్నా, చదివే ఓపిక ఎవరికి ఉంది?
అలాటి స్థితిలో “ధనికొండ పుస్తకాలు చదివి, కాసేపు మాట్లాడుకుందాం రండి”అంటూ అందరికీ పుస్తకాలు వాయినంగా పంపారు సుధ
ఉదయం నుంచి సాయంత్రం వరకూ విసుగు లేకుండా సాగిన సభ కి సాహితీ మిత్రులు ఉత్సాహంగా వచ్చారు
సదస్సు మొదటి సెషన్ లో వకుళాభరణం రామ కృష్ణ, కె శ్రీనివాస్, సంగిసెట్టి శ్రీనివాస్ గార్ల ప్రసంగాలు వినూత్న రీతిలో సాగాయి.
క్లుప్తంగా వారి మాటలు :
వకుళాభరణం: చలానికి కొనసాగింపే ధనికొండ . ఆయనను సాహితీ చరిత్రలో సరిగా ఎవరూ రికార్డ్ చేయలేదు
కె. శ్రీనివాస్: మెట్ట ప్రాంతపు రచయితలు, మాగాణి ప్రాంతపు రచయితల రచనల్లో ఆయా నైసర్గిక స్వరూపాల, జీవన రీతుల ప్రభావం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ముగ్గురూ ఎక్కువగా రాసింది స్త్రీ పురుష సంబంధాల మీదే అయినా ధనికొండ రచనల్లో, చలం లా కుటుంబ రావులా కాక, పట్టణ ప్రాంత నేపథ్యం ఎక్కువగా కనపడుతుంది. ధనికొండ కథల్లో పాత్రల నిర్ణయాలు ప్రాక్టికల్ గా ఉంటాయి తప్ప విప్లవాత్మకంగా ఉండవు. ఒక సమస్య వస్తే దాన్నుంచి మనుషులు ఎలాగైనా సర్వైవ్ అవుతారని రచయిత చెప్తాడు తప్ప ఎలా సర్వైవ్ అవ్వాలో బోధించడు. ఎవరి అవసరాల మేరకు వాళ్ల నైతికతను పాత్రలు వదులుకుంటాయి, చాలా సహజంగా.
సంగిసెట్టి శ్రీనివాస్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్ళి విద్యనభ్యసించి, ఉద్యమాలలో పాల్గొన్న రచయితలు, రెండు ప్రాంతాల సాహిత్యంలోని పోలికలు, వైవిధ్యాల మీద ప్రసంగించారు. తెలంగాణ లో ఉద్యమ సాహిత్యం వస్తున్న రోజుల్లో ఆంద్ర లో విభిన్న అంశాల మీద సాహిత్యం వచ్చిందన్న సంగతిని సంగిశెట్టి గుర్తు చేశారు
మధ్యాహ్నం సెషన్ లో ధనికొండ కథల మీద చర్చ జరిగింది. సుధ గోపరాజు, కె ఎన్ మల్లీశ్వరి, గోపరాజు లక్ష్మి నిర్వహించిన ఈ సెషన్ లో రచయితలు, పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు
ఒకే కథను ఒక్కో పాఠకుడు తన దృక్కోణంలో ఎలా అర్థం చేసుకుంటాడో ఈ చర్చలో ఆసక్తి కరంగా వ్యక్తమైంది. “బ్రహ్మ వాక్కు” కథ ఇద్దరు వ్యక్తుల మధ్య సమన్వయం (కో ఆర్డినేషన్) ఎలా ముఖ్యమో చెప్తుందని కృష్ణ కుమారి అభిప్రాయ పడితే, బ్రహ్మ సృష్టించిన అందమైన యువకుడితో సరస్వతి వెళ్ళిపోవడం ఈ కథలో ముఖ్యమైన అంశంగా గొట్టిపాటి సుజాత అభిప్రాయ పడ్డారు.
ధనికొండ కథల్లో “కాజువల్ సెక్స్” అనే విషయం చాలా సహజంగా కనిపిస్తుందని, అది తను అంగీకరించలేని విషయమని నరేష్ నున్నా అభిప్రాయం వ్యక్తం చేశారు
సరోగసీ మీద ఇవాళ చర్చ జరుగుతుంటే, నలభైల్లోనే వీర్య దానం మీద కథ రాసిన (చెలియలి కట్ట) ధనికొండ దార్శనికత గురించి కుప్పిలి పద్మ అబ్బుర పడింది. స్త్రీ పురుష సంబంధాలు ఒక ప్రవాహంలా కొనసాగాలని, ఈయన కథల్లో సడన్ గా ఏర్పడే లైంగిక సంబంధాలు తనని ఆకట్టుకోలేక పోయాయంది పద్మ
ఆయన కథలు “నాన్ జడ్జిమెంటల్” గా ఉండటాన్ని వెంకట్ సిద్దారెడ్డి ఇష్టపడ్డారు. అంతే కాక, ఆయన లైంగికత అంశంగా కథలు ప్రముఖంగా రాసినా, ఇతర సామాజిక అంశాల మీద కూడా రాసిన కథల్ని వెంకట్ ప్రస్తావించారు. “మనం ఏ గ్రహించాలో అక్కడి వరకూ తీసుకెళ్ళి వదిలేయడం, అదేమిటో క్లియర్ గా చెప్పక పోవడం” ధనికొండ కథల్లో వెంకట్ కి నచ్చిన విషయం.
ఆంతర్యం కథ గురించి అంకురం సుమిత్ర మాట్లాడారు. ఈ కథలో , స్త్రీ ప్రవర్తన బట్టి “ఆమె ఆంతర్యం ఇదై ఉండొచ్చు” అని అంచనా వేసే సగటు మగవాడి మనస్తత్వాన్ని సుమిత్ర పట్టుకున్నారు. ఇందుకు ఆమె “పింక్” సినిమా కథనాన్ని ఉదహరించారు
పరువు ప్రతిష్టలు కథ గురించి మాట్లాడిన గోపరాజు లక్ష్మి , తండ్రులిద్దరూ ప్రధాన పాత్రలు గా ఉన్న ఆ కథలో, ఆడపిల్ల తండ్రి “ఒకవేళ తనే అబ్బాయి తండ్రి అయి ఉంటే, తనూ స్వార్థం తోనే ప్రవర్తించి ఉండేవాడినని” నిస్సంకోచంగా ఒప్పుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమ్మాయి తండ్రిని కాబట్టే ఇలా మాట్లాడుతున్నా, లేదంటే నేనూ అమ్మాయి దే తప్పు అనేవాడినే” అనే ఎరుకతో ఆ పాత్ర ప్రవర్తించడాన్ని, ఆ చిత్రణని లక్ష్మి ఇష్టపడ్డారు. తన మేనమామ అనే అనుబంధంతో కాక , ఈ తరం చదివి తీరాల్సిన సాహిత్యం గా ధనికొండ రచనల్ని పరిచయం చేయటం బాధ్యత గా స్వీకరిస్తున్నామని లక్ష్మి చెప్పారు
ధనికొండ కుటుంబంతో, వారి ఇంటితో , క్రాంతి ప్రెస్ తో, మద్రాసు జీవితంతో తన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు రెంటాల జయదేవ. చలం, కుటుంబ రావు ల నీడ నుంచి ఈయన్ని బయట పడేయాల్సిన సమయమిదే అంటారీయన. స్త్రీ కూడా లైంగిక సుఖాన్ని డబ్బు ఇచ్చి కొనుక్కునే స్థితిని ఆయన 1950 లోనే ఊహించారన్న సంగతి గుర్తు చేశారు.
గళ్ళ రుమాలు కథ గురించి పుష్ప ,
నిప్పుతో చెలగాటం మీద స్వర్ణ కిలారి ,
చెలియలి కట్ట, మానవసేవ కథల మీద మోహిత,
ప్రియురాలు కథ మీద మణి వడ్లమాని ,
పరువు ప్రతిష్ట కథ గురించి గిరిజ, శశికళ ఓలేటి …. తమ అభిప్రాయాలు పంచుకున్నారు
చివర్లో సుధ చెప్పిన ఒక మంగళ వాక్యం ” జీవితం ఈశ్వరుడికెత్తిన హారతి లా ఉండాలని చలం అన్నాడు. ఐతే ఆ భారం మాత్రం స్త్రీల నెత్తిన పడకూడదు “…
ఇదే కదా ధనికొండ కి నిజమైన హారతి ఆ ఆదివారపు సాయంత్రం వర్చువల్ గా సోషల్ మీడియా లోనే అన్ని చర్చలూ జరిగి పోతున్న రోజుల్లో , రచయితలూ, సాహిత్యాభిమానులూ మనం మరిచి పోయిన ఒక మంచి రచయిత రచనలు చదివి, చర్చించుకునేందుకు ఒక చోట గుమిగూడటం ఎంత మంచి సందర్భం!!
ఆ చర్చ చూస్తుంటే “ఇంకా ఎంతమంది రచయితలను ఇలా నిర్లక్ష్యం చేసి వదులుకున్నాం ? వాళ్ళ రచనలు కూడా ఇలాగే బయటికి తెచ్చి మాట్లాడుకోవడం మన బాధ్యత కాదా?” అన్న ఆలోచన చాలా మందిలో కదిలింది
ఈ ప్రయత్నం ఒక ధనికొండ తోనే ఆగి పోకూడదు. మనం విస్మరించిన అనేక మంది పాతతరం రచయితలకూ కొనసాగించాలి. పెద్ద సభలే అక్కర్లేదు. ఆసక్తి ఉన్న పది మంది మిత్రులు ఎవరో ఒకరింట్లో చేరి కూడా ఈ పని చేయొచ్చు
గోపరాజు సిస్టర్స్ చేసిన ఈ ప్రయత్నం , మరిన్ని కొత్త చర్చా వేదికలకు కాలిబాట అయితే మంచి సాహిత్యాన్ని ప్రేమించే వారికి మంచిరోజులొస్తాయి 🙂
సివంగి అంత మౌనంగా కూచుంటే ఏంటో అనుకున్నా. ఇంత పని రికార్డు చేసిందా! బావుంది బావుంది
ధనికొండని మరోసారి మరింత అర్థవంతంగా పరిచయం చేశారు.. మీటింగ్ ని సంపూర్ణంగా కవర్ చేశారు.సో నైస్😍😍
సమావేశం కళ్ళకి కట్టినట్లు బాగా రాశావు పమి
అమెజాన్ లో ధనికొండ పుస్తకాలు ఇక్కడః
https://tinyurl.com/DhanikondaOnamazon
vaddera chandidas gurinchee kavana sarma gurichee koodaa maatladaali
చాలా బావుంది మేడం …నిజంగానే ఆ తరం రచయితలను వారి రచనలు గురుంచి చర్చిండం aమంచి సందర్భం
చర్చా కార్యక్రమ నివేదికతో పాటు ధనికొండ గారి రచనల గురించి రాసింది చాలా బాగుంది. యాంత్రిక వార్తా నివేదికలకు భిన్నంగా పఠనీయంగా ఉండి, ఆసక్తికరంగా అనిపించింది.
తెలుగునాట పాఠకులను పెంచిన రచయితల్లో, సంపాదకుల్లో ధనికొండ గారు ముఖ్యులు. బాల సాహిత్యంలోనూ ఆయన ‘ప్రమోద’ ముద్ర ఉంది. కానీ ఆయన సాహిత్యం నిన్నమొన్నటివరకూ పెద్దగా అందుబాటులో లేకపోవటం ఆశ్చర్యం.
సుజాత గారూ, ధనికొండ గురించి, తెలంగాణా పోరాటంలో పోరాడిన కమ్యూనిస్టుల గురించి ఫేస్ బుక్ లో ఒక వర్గం ఇలా నీచంగా ప్రచారం చేస్తోంది. పచ్చిబూతు రచనలు ‘మధు’ అనే పేరుతో ఆయన చేసాడని వారి ప్రధాన అభియోగం. ఐతే, నేను దానిని ఒప్పుకోలేదు. కానీ, 1949 లో అభిసారిక మొదలైనప్పటినుంచే ఆ బూతురచనల వ్యాసంగం ఆయన మొదలుపెట్టారని, కచ్చితంగా తెలుసునని నొక్కి వక్కాణించారు ఆ ప్రచారకర్తలు. దీనిలో సత్యాసత్యాలను మీకు తెలిస్తే చెప్పగలరు.
నేను ప్రయత్నించాను గానీ అప్పటి ప్రత్యక్ష వీక్షకులు ఎవరూ నాకు తెలియలేదు. నరిశెట్టి ఇన్నయ్యగారు దానిని ఆంధ్రజ్యోతిలో ఖండించి, అది పుకారు మాత్రమేనని చెప్పారుగాని, ఆ దినపత్రిక విశ్వసనీయతని వీళ్లు నమ్మలేదు.
‘‘1950 ల్లో అంటే తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత డిటెక్టివ్, సెక్స్ సాహిత్యం తెలుగులో ఊపందుకుంది. సాహిత్యం మీద పట్టున్న కమ్యూనిస్టు రచయితలకి వెల్లువెత్తిన ఆ సాహిత్యం ఉపాధి నిచ్చింది. ఆ ఉపాధి ని కల్పించింది ఈ ధనికొండ హనుమంతరావే. ఆ సమయంలోనే ఈ సెమీ ఫోర్న్ సాహిత్యం కాకుండా పూర్తి స్థాయి ఫోర్న్ సాహిత్యం “మధు” అనే రచయిత పేరు మీద వచ్చేది. సాహిత్య వ్యాపార రహస్యం సమగ్రంగా తెలిసిన ధనికొండ హనుమంతరావే ‘మధు’ పేరుతో ఆ సాహిత్యం రాసేవాడని, రాయించి మార్కెట్ చేసేవాడు అనే ప్రచారం ఉంది. మద్రాస్ లోని తన క్రాంతి ప్రెస్ లో అచ్చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని పాండిచ్చేరీ లో ఆ సాహిత్యాన్ని అచ్చేసి తెలుగు నేలమీద విక్రయించే వాళ్ళు. ఈ విషయంలో వాస్తవ అవాస్తవాల్ని పరిశోధించే ఆసక్తి ఉన్నవాళ్లు 70 ల్లో వచ్చిన కాగడా శర్మ గారి కాగడా పత్రికలు ఎక్కడైనా ఆర్కైవ్స్ లో దొరికితే చదివి నిర్ధారణ చేసుకోవచ్చు.’’
శ్రీనివాసుడు గారూ, ఆ ప్రచారం నేనూ చదివాను. అందులో సత్యా సత్యాలు ఏమీ నాకు తెలియదు, అప్పటి ప్రత్యక్ష వీక్షకులు ఎవరూ కూడా నాకు తెలియదు
ప్రచారం చేసిన వారే వాస్తవాస్తవాలను మరి కాస్త ముందుకు వెళ్లి శోధించి బయట పెట్టి ఉంటే, అవేవీ తెలియని పాఠకులకు తెలుసుకునే వెసులు బాటు ఉండేది కదా అనిపిస్తోంది