ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చుగానీ; శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి వంటి రెండో తరం సాహితీవేత్తల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థిరం చేసుకున్న రచయిత ధనికొండ హనుమంతరావు. 1919 మార్చి 4న గుంటూరు జిల్లా ఇంటూరులో పుట్టిన ధనికొండ 1938 నుంచీ జీవిత చరమాంకం వరకూ అనితరసాధ్యమైన సాహితీసేద్యం చేశారు.
సుమారు 150 కథలు, 3 నవలలు, 9 నవలికలు, అనేక నాటికలూ నాటకాలూ రాశారు. హేవలాక్ ఎల్లీస్, ఫ్రాయిడ్, బాల్జాక్, ఓ హెన్రీ, మొపాసా, గాల్స్‌వర్దీ వంటి పాశ్చాత్య రచయితల సాహిత్యాన్ని ఇష్టపడిన ధనికొండ అనువాద ప్రక్రియలోనూ విశేషంగా కృషి చేశారు. పత్రికా సంపాదకుడిగా, ముద్రాపకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
ధనికొండ సృజించిన విలువైన సాహిత్యసంపదను ఆయన కుమారులు నరసింహారావు, రవికుమార్ గార్లు పాఠకులకు అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయం. ప్రముఖ సాహితీవేత్త మాడభూషి సంపత్ కుమార్ సంపాదకత్వంలో ధనికొండ హనుమంతరావు కథలు, నవలలు, నవలికలు, నాటికలు, నాటకాలు, అనువాద సాహిత్యం తొలుత 12 సంపుటాలుగా అందుబాటులోకి వచ్చాయి. అనంతరం మరో పది సంపుటాలు వెలువడ్డాయి. ఒక రచయిత రాశిపోసిన సాహిత్యం 22 బలమైన సంపుటాలుగా కొలువు తీరిందంటే, ధనికొండ హనుమంతరావు ఒక ఉద్యమంలా సాహిత్యాన్ని సృజించారని అంచనా వేయొచ్చు.
ధనికొండ రచనను చదవటం ప్రారంభించటమే మనం చేయాల్సిన పని. ఆ తర్వాత మన కళ్లు పరుగులు తీస్తాయి. ఆ కథలో మునుగీత కొడతాం. 300కు పైగా పేజీలకు విస్తరించిన ‘‘దూతికా విజయం’’ నవలను క్లుప్తంగా పరిచయం చేసి, రచయిత సృజనాత్మక లోతుల్ని స్పృశించటమే ఈ వ్యాసం ఉద్దేశం.
అవంతీ రాజ్యాధిపతి ధర్మపాలుడికి వారసుల్లేరు. పెద్ద భార్యకు ‘గొడ్రాలు’ అనే ముద్ర వేసి మరో పెళ్లి చేసుకుంటాడు. చిన్న రాణి మాధవీదేవి వంశాంకురం కోసం ఎదురు చూస్తూంటుంది. ఏళ్లు గడిచినా ఫలితం కనిపించదు. మరో సంవత్సర కాలంలో వారసుణ్ని అందించకపోతే మాధవీదేవినీ గొడ్రాలుగా పరిగణించి, ఇంకో రాణిని తెచ్చుకుంటానని రాజు అధికారదర్పంతో ప్రకటిస్తాడు. రాజుగారి ‘అసమర్థత, అరసికత, సంతానాన్నివ్వలేని నిస్సహాయత’ నేపథ్యంలో కడుపు పండే క్షణం ఎండమావేనని తేలిపోతుంది. మార్గాంతరం కనిపించక మాధవీదేవి తల్లడిల్లిపోతుంది.
ఆ బాధను తన ప్రియ చెలికత్తె సరస్వతితో పంచుకుంటుంది. సుదీర్ఘ తర్జనభర్జన అనంతరం పర పురుషుడి ద్వారా సంతానం పొందటమొక్కటే గత్యంతరమని తీర్మానించుకుంటుంది. నవరాత్రి ఉత్సవారంభం సందర్భంగా రాజాస్థానంలో జరిగిన బలప్రదర్శన పోటీల్లో ప్రథముడిగా నిలిచిన వీరభద్రుడే సరైన జోడీ అని నిర్ణయించుకుంటుంది.
అందుకు సహకరించాల్సిందిగా చెలికత్తెను అర్థిస్తుంది. ప్రాణసఖి అయిన సరూ అనివార్య పరిస్థితుల్లో వీరభద్రుణ్ని అత్యంత రహస్యంగా కోటకు తీసుకువచ్చే పథకానికి రూపకల్పన చేస్తుంది. ఆ ఉపాయం ఉనికిలోకి రావాలంటే ముందుగా అతనికి చేరువ కావాలి. చెలిమి చేసుకోవాలి. దాపరికం లేకుండా తన రాణి కోరికను తెలియజేయాలి. ప్రతిఫలం ఎర జూపాలి. ఒప్పుకొన్నాక, అతనికి ఆడవేషం కట్టి, అర్ధరాత్రి దాటాక కోటకు తీసుకురావాలి.
కోట చుట్టూ భద్రతావలయం ఎంత పకడ్బందీగా ఉంటుందో సరూకు తెలుసు. కాపలా సైనికుల నిఘా అంచెలవారీగా ఎంత వ్యూహాత్మకంగా ఉంటుందో తెలుసు. ఆగంతకులెవ్వరూ ప్రవేశించకుండా ప్రతి కాపలాదారూ నిరంతరం ఎంత అప్రమత్తంగా ఉంటాడో తెలుసు. పొరపాటున ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తూ దొరికిపోతే, మరణశిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. అదే సమయంలో, కోట వెనక భాగంలో ఎవరెవరు కాపలా ఉంటారో, వారిలో ఎవర్ని మచ్చిక చేసుకుంటే కార్యం నెరవేరే అవకాశముందో కూడా తనకు తెలుసు.
సరూ రాత్రింబవళ్లూ మనసులోనే వ్యూహాలు రచించుకొని, ఆ తెలివిడికి అనుగుణంగా పథకం సిద్ధం చేసుకుని, రంగంలోకి దిగుతుంది. కానీ, ఆ వ్యూహం వికటించి వీరభద్రుణ్ని కాపలా సైనికుడైన జయపాలుడు మట్టుబెట్టడం, రాజుగారు జయపాలుణ్ని మదపుటేనుగుతో తొక్కించి చంపటం, రాణినీ సరస్వతినీ వీరభద్రుడి శవంతోపాటు సజీవ సమాధి చేయటం… నవల్లో సగం దూరం కూడా చేరకముందే ఇంత భయంకరమైన ముగింపేమిట్రా అని మనం ఆశ్చర్యపడేలోపు అది సరస్వతి కన్న స్వప్నం అని తేలిపోతుంది.
పనిలో పనిగా స్వప్నంలో జరిగిన తప్పిదాలకు తావులేకుండా తన పథకంలో మార్పుచేర్పులు చేసుకుని దూతికా పాత్రను మరింత రక్తి కట్టిస్తుంది సరస్వతి. వీరభద్రుడు ఓ పట్టాన ఒప్పుకోడు. పైగా, సరస్వతిని కోరుకుంటాడు. పురుషులంటేనే అసహ్యించుకునే సరూ అందుకు ససేమిరా అంటుంది. తన కోరిక తీరిస్తేనే రాణి గురించి ఆలోచిస్తానని భీష్మించుక్కూచుంటాడు వీరభద్రుడు. మరోవైపు, తన మనోవాంఛ తీర్చే పురుషుణ్ని ఇంకెప్పుడు తీసుకొస్తావంటూ అటు రాణి ఒత్తిడి చేస్తుంది. విధిలేని పరిస్థితిలో వీరభద్రుడి కోరిక తీర్చటానికి సరూ ఒప్పుకొంటుంది.
ఆ కోరిక ఒక రాత్రితో సద్దుమణగదు. కొనసాగుతూంటుంది. వీరభద్రుడు ఓ పట్టాన దారికి రాడు. మరోవైపు రాణి కన్నెర్ర జేస్తుంది. రకరకాల ప్రయత్నాలతో వీరభద్రుణ్ని ఒప్పించే ఒరవడిలో, మెల్లగా తనే అతని హృదయానికి దగ్గరవుతుంది సరస్వతి.
ఇంతకీ, సరూ వీరభద్రుణ్ని కోటకు తీసుకురాగలిగిందా? రాణి సంకటాన్ని తప్పించగలిగిందా? ఈ ప్రయత్నంలో సైనికుల చేతుల్లో చిక్కుకుందా? ప్రాణసఖిగా నమ్మకం గడించిన సరూ తన రాణి నుంచి దండిగా కానుకలు స్వీకరించగలిగిందా? ఈ ప్రహసనంలో రాజు ప్రమేయం ఏమేరకు ఉంది?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ‘దూతికా విజయం’ చివరిదాకా చదవాల్సిందే.
*****
చిన్న విషయాన్ని ఒక నవలగా తీర్చిదిద్దటం తేలిగ్గాదు. ధనికొండ ఆ సంగతి తెలిసిన రచయిత కాబట్టి… కమనీయ కథనం, హొయలొలికే శైలి, ముగ్ధమనోహర శిల్పాలతో పాఠకుణ్ని కట్టిపడేశారు. అక్షరాల వెంట పరుగులు తీయించారు. అడుగడుగునా అనూహ్య సంఘటనలతో కథను రసవత్తరంగా నడిపించటంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు.
ఆకట్టుకునే అక్షరవిన్యాసం ధనికొండ సొంతం. బలప్రదర్శన తిలకించటానికి రాజుతోపాటు ఆయన భార్యలిద్దరూ వస్తారు. వారిద్దరి మధ్యా పచ్చగడ్డి వేయకూడదన్న విషయాన్ని ఇలా చెబుతారు…
‘‘పట్టమహిషి చూపులూ, మాధవీదేవి చూపులూ కలవటమంటే ఇద్దరు మహా యోధులైన విరోధుల పదునైన కత్తులు కదనంలో కలిసినట్లే ఉండేవి’’.
రాజులు, రాణులు, అంతఃపురాలు, చెలికత్తెలు, సైనికులు… వీరంతా నిరంతరం మసలే రాజ్యాన్ని మన కళ్లకు కట్టడంలో రచయిత ఊహాశక్తి అపూర్వం. రాజు, అతని వందిమాగధులు, అక్కడి చట్టాలు, కఠోర నియమనిబంధనలు, పాలనాపరమైన వ్యూహ ప్రతివ్యూహాల గురించి అవసరం మేరకు మాత్రమే ప్రస్తావించటంలో రచయిత ముందుచూపు ప్రశంసనీయం.
అదే సమయంలో, వర్తమాన కాలపు చర్చనీయాంశాలను కూడా కథలో సంలీనం చేయటం విశేషం. స్త్రీ స్వేచ్ఛారాహిత్యం గురించి అప్పట్లోనే ఈ రచయిత తన రచనల్లో వీలైనంత ఎక్కువగా ప్రస్తావించారు. ఈ నవలలో సైతం ఆ ప్రాధాన్యాన్ని విస్మరించలేదు.
పేరుకు చెలికత్తే అయినా, సరస్వతి ఓ విజ్ఞాన గని. క్లిష్టమైన అంశాలను సైతం సందర్భానుసారంగా విశ్లేషించటం, సమయానికి తగు పథకాల్ని రచించటంలో దిట్ట. ‘‘కఠినమూ అనుమానాస్పదమూ ఐన ప్రక్రియల్ని స్త్రీ జాతికి కేటాయించి; తేలికైనవీ, భౌతికశాస్త్ర సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేవీ నిస్సందేహమైన ప్రక్రియల్ని పురుషుడు తాను పంచుకున్నాడు!’’ అంటూ పురుషాధిక్య మూలాల గురించి వివరించటంలో సరస్వతి ప్రజ్ఞ కనిపిస్తుంది. పైగా సతీసావిత్రి, వకుళాదేవి వంటి మహిళలు భర్తల్ని బతికించుకోగలిగారుగానీ, ‘భార్య ప్రాణాలు తిరిగి తేగలిగిన పురుష పుంగవుని కథ ఏ పురాణంలోనైనా ఉందా?’ అని ప్రశ్నిస్తుంది.
పరాయి పురుషుడి ద్వారా గర్భం ధరించే విషయమై తర్జనభర్జన జరుగుతున్న నేపథ్యంలో ‘‘భూసారాన్ని శంకించి ఫలవంతమని భావించిన భూమి మీద రెండవసారి విత్తులు చల్లి అవీ మొలకెత్తకుంటే మార్చవలసింది బీజమా? క్షేత్రమా?’’ అంటూ ఆలోచనలు రేకెత్తిస్తుంది. సమాంతరంగా రాణి ఆలోచన గురించి ‘‘చాలా ప్రమాదకరమైన ఊహను సారవంతమైన మెదడనే భూమిలో నాటి మహావృక్షంగా రూపొందిస్తున్నావు’’ అంటూ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందో వివరిస్తుంది.
దూతికగా వీరభద్రుడి చెంతకు చేరి, అతనిపై విశ్వాసం స్థిరపర్చుకున్నాక, అతను రాణి మందిరంలోకి ఎట్లా ప్రవేశించాలో వివరించే ఘట్టాన్ని రక్తి కట్టించటంలో రచయిత కలం కత్తిలా స్వైరవిహారం చేసింది. రాణి శయనించే ఇంటిని ‘సప్తదర్పణ శయన మందిరం’ అంటారు. ‘‘మీరు స్వప్నంలో కూడా చూసి ఉండనంత అందంగా అలంకరించబడి ఉంటుంది శయనగారం. శయనగారంలో సువాసన నూనెలు తాగుతూ మంద్ర సుగంధపు వెలుగునిచ్చే దీపాలుంటవి. మంచంమీద పరుపులు, తలగడలు గాలికి కూడా కుంగిపోయేటంత మెత్తనివి. ఆ స్పర్శే మీకో నూతనానుభూతిని, బహుశా అస్వాభావికమైన దవటం వల్ల ఏదో తెలియని భయాన్ని రేకెత్తించవచ్చు..’’ అని ఆమె చెప్పే మాటల ద్వారా రచయిత ఆ మందిరాన్ని మన కళ్లముందు అక్షరాలతో నిర్మిస్తారు.
కోటలోకి ప్రవేశించే క్రమంలో ప్రయత్నం విఫలమై కాపలదారులకు దొరికిపోవటానికి ఎన్ని రకాల అవకాశాలున్నాయో దూతిక వీరభద్రుడికి వివరిస్తుంది. ఒకవేళ మానవమాత్రుల పహారా నుంచి తప్పించుకున్నా, ప్రకృతిశక్తులు సైతం పట్టించే అవకాశముందని చెబుతుంది. రాచకార్యం నిర్వహించే క్రమంలో మానవీయ కోణపు ఆలోచన్లకు తావుండదని చెబుతుంది. ఈ ప్రస్తారాలను బొమ్మ కట్టించటంలో ధనికొండ ఊహ గుర్రంలా దౌడు తీస్తుంది.
‘ఏకు వలె మెత్తగా, అంతలోనే మేకు వలె దృఢంగా’ రూపొందగల సరస్వతిని వీరభద్రుడు ‘‘ఈమె ఆజ్ఞాపించగలదు, అర్థించగలదు, అమృతాన్ని కురిపించగలదు, హాలాహలాన్ని వర్షించగలదు, హృదయాంతరాళంలోని కోర్కెలను ఎదుటి వ్యక్తికి సుగ్రాహ్యమయే విధంగా వివరించగలదు’’ అని స్పష్టంగా అంచనా కడతాడు. అందుకే, రాణి సంగతి పెడచెవిన పెట్టి, ఈమెనే వరించాలని నిర్ణయించుకుంటాడు.
నవల పొడవునా సాగిన సంభాషణల్లో మన ఊహకందని లాజిక్కులు గభాల్న ప్రత్యక్షమై ఆశ్చర్యం కల్గిస్తుంటాయి. రచయిత తర్కం విభ్రమ కల్గిస్తూంటుంది. తర్క విశ్లేషణలో భాగంగా ‘వంశ-వాయు’ న్యాయాన్ని సైతం ప్రస్తావించారంటే, ఎన్ని దృక్కోణాల్లో కథనాన్ని విస్తారం చేశారో అర్థం చేసుకోవచ్చు. హంస చాతుర్యం, తిలతండుల న్యాయం వంటి వాటినీ సందర్భానుసారంగా కథనంలో భాగం చేస్తారు. ‘అత్యధికంగా నగిషీ చేస్తే, లోహమే చిల్లు పడిపోతుం’దన్న ఎరుక ఉండటంతో ఆ విశ్లేషణ ఎక్కడా హద్దులు దాటి కనిపించదు.
*****
నవల పొడవునా ఎక్కడికక్కడ మన ఊహలు తారుమారవుతుంటాయి. సజావుగా సాగిపోవాల్సిన సంఘటనలు అకస్మాత్తుగా దారి మార్చి, కొత్త చిక్కులు తెచ్చిపెడతాయి. ఇట్లా ఎప్పటికప్పుడు ముళ్లు బిగిస్తూ, మనల్ని ఉత్కంఠ ఊబిలో దింపేసి, చోద్యం చూస్తుంటాడు రచయిత.
రాణి, సరస్వతి, వీరభద్రుడు, కాపలాదారు జయపాలుడు… ఒకరిని మరొకరు మోసం చేసుకునే ప్రయత్నాల గురించి చదువుతుంటే చిత్రంగా అనిపిస్తుంది. కథను ఏ తీరానికి తీసుకెళ్తారోనన్న సందేహం తొలిచేస్తుంది. నవలలో రాజు ప్రస్తావన చాలా తక్కువ. కానీ, దోషుల్ని తేల్చాల్సివచ్చిన ఘట్టంలో న్యాయాధికారి స్థానంలో కూచున్న రాజు పరిజ్ఞానాన్ని వర్ణించటానికి రచయిత చేసిన కసరత్తు అబ్బురపరుస్తుంది.
రాజు గారి న్యాయ విచారణ ఎలా ఉంటుంది? తప్పొప్పుల విశ్లేషణలో నేరం తేలితే విధించే శిక్షలు ఎంత కఠోరంగా ఉంటాయి? రాజు లోచూపు ఎంత నిశితంగా ఉంటుంది? సామాన్య ప్రజల కంటికీ మనసుకీ కనిపించని కొత్త కోణాల్లో రాజు మనోనేత్రం తచ్చాడి రాజ్య సంక్షేమమే అంతిమలక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? వంటి విషయాలపై పాఠకులకు అవగాహన కల్పించటానికే రచయిత స్వప్న పరిణామాలను అంత సుదీర్ఘంగా వివరించారని భావించవచ్చు.
ప్రధాన పాత్రధారి వీరభద్రుడిలోనూ దాగుండే మగ అహంకారాన్ని సరస్వతి ఆలోచన్ల నెపంతో మనకందేలా చేయటం రచయిత నైపుణ్యానికి ప్రతీక. అయితే, చివరికి అతని మనసులోని నైర్మల్యాన్ని తెలియజెప్పటం ద్వారా నాయకత్వ లక్షణాలకు పట్టం కట్టడం కూడా రచనా వ్యూహంలో భాగమే.
దూతిక ప్రయత్నాలను అనేకానేక కోణాలనుంచి అనూహ్యంగా చిత్రీకరించటంలో ధనికొండ నేర్పు ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది.
అద్భుతమైన ఉపమానాలు (రాణి చిరునవ్వు వెన్నెల వెలుగును వెక్కిరించింది(పేజీ 47)), అందమైన వర్ణనలు (చీకటి పడిన తర్వాత వేశ్యావాటికలోని వాతావరణం (పేజీ 163)), అత్యంత సూక్ష్మాంశాల వివరణ, తార్కిక శోధన, భాషపై పట్టు (నిర్ధనుడు, అరసికుడు వంటి అనేక పదప్రయోగాలు) ధనికొండ అక్షరదర్పణాల్లో అడుగడుగునా ప్రతిఫలిస్తాయి.
‘‘జిహ్వకూ, హృదయానికీ మధ్యలో ఉండే ఆ కాస్త స్థలంలోనూ ఎంత కుత్సితాన్ని నిలవ చేయవచ్చునో సరస్వతికి అర్థమైంది’’ వంటి వాక్యాలు నవల నిండా బోలెడు.
‘‘ఈ రచనకు నేను పడిన ఆవేదన ఇంతా అంతా కాదు. లోపల అగ్నిపర్వతమే పేలినట్లయింది. రాయకుండా ఉండలేకపొయ్యాను. ఊహిస్తుంటే అనుకోని అనేక సంఘటనలు, అన్నీ అతితెలివిగా ప్రవర్తించే పాత్రలు కావటంతో మరీ జాగ్రత్త పడవలసివొచ్చింది’’ అంటారు ధనికొండ హనుమంతరావు ‘దూతికా విజయం’ గురించి తన కథాసంపుటి ‘‘పన్నాగం’’లో.
ఈ సంపుటాలకు సంపాదకుడిగా వ్యవహరించిన మాడభూషి సంపత్ కుమార్ ‘‘సజీవంగా నిలిచే రచయిత ధనికొండ’’ శీర్షికతో రాసిన ముందుమాటలో రచయిత జీవిత విశేషాలతోపాటు సాహిత్య సాధన తాలూకు అనేక అంశాలను కూలంకషంగా చర్చించారు.
మరో ముందుమాట రాసిన ప్రముఖులు ఏల్చూరి మురళీధరరావు ఈ నవల గురించి ఇట్లా అంటారు: ‘‘కామోత్తేజకత సాధ్యనిర్దేశంగా కలిగిన ఈ కథలోని సుశీలత అశ్లీలతగా పరిణమించకుండా రచనాక్రమాన్ని శ్రీ ధనికొండ ఎంత సంయమనంతో నిర్వహింపగలిగారో పుస్తకాన్ని చదివి ముగించిన తర్వాత పాఠకులకు ఆశ్చర్యంగా ఉంటుంది’’.
ఈ నవలలో అక్షరదోషాలు అతితక్కువ.
గిరిధర్ గారి కవర్ డిజైన్ నవలకు అదనపు ఆకర్షణ.
ఈ తరం అధ్యయనం చేయాల్సిన అరుదైన రచయిత ధనికొండ హనుమంతరావు.
ధన్యజీవి ధనికొండ!
(ధనికొండ సాహిత్య సర్వస్వం కోసం ధనికొండ నరసింహారావు @ 98410 21266 గారిని సంప్రదించవచ్చు)
—0—
Add comment