1919లో తెనాలి సమీపంలోని ఇంటూరులో పుట్టిన ధనికొండ హనుమంతరావు రచనలు కొన్నాళ్ళుగా మరుగునపడి వున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక అర్థశతాబ్దంపాటు యువత పడి పడీ చదివిన ఆయన సాహిత్యసంపద ఎందుకోగాని కనిపించకుండా పోయింది. యూరోప్ లో ప్రజలను సైంటిఫిక్ గా నడిపించి సెక్స్ విద్యను వినూత్నంగా చెప్పిన హేవలక్ ఎలీస్ ధోరణిలో ధనికొండ వ్యాసాలూ, నవలలూ, కథల ద్వారా సెక్స్ అంటే ఏమిటో విడమరిచి చెప్పి గొప్ప సేవ చేశారు. ఈ విషయంలో తెలుగులో సెక్స్ విప్లవ సారధులుగా ఆలపాటి రవీంద్రనాథ్, ధనికొండలను పేర్కొనవచ్చు. తెనాలిలో ప్రారంభమయిన లైంగిక విప్లవధోరణులు కొన్నేళ్ళపాటు జనాకర్షణ పొందాయి.
హనుమంతరావు రాయని పత్రికంటూ లేదు. చేబట్టని ప్రక్రియంటూ లేదు. దానికి పునరుజ్జీవనం కల్పించడానికి ఆయన సంతానం, బంధువులు తలపెట్టడం సంతోషదాయకం.
హనుమంతరావు గుంటూరులో ఎ.సి. కళాశాలలో బి.ఎ. చదువుతూ మానేసి, పత్రికారంగంలోకి దిగగా, ఆలపాటి రవీంద్రనాథ్ తురుమెళ్ళ హైస్కూలు నుండి 6వ తరగతికే చదువుకు స్వస్తి పలికి తెనాలి చేరుకున్నారు. రవీంద్రనాథ్ పత్రికా రచనా వ్యాసంగానికి హనుమంతరావు తోడ్పడుతూ ఆ నేపథ్యంలో అభిసారిక పత్రికను ఆరంభించారు. ఈ పత్రికను చదవటానికి యువత అత్యుత్సాహం చూపగా, పెద్దలు ఆగ్రహిస్తుంటే రహస్యంగా చదివేవారు. వీరి పత్రికలకు విపరీత ప్రచారం ఆకర్షణ లభించింది. సెక్స్ ను, వైద్యాన్ని శాస్త్రీయంగా అందించాలనే దృష్టితో పాఠకుల నుండి వచ్చిన ప్రశ్నలను డాక్టర్లకి పంపించి సరైన సమాధానం తెప్పించి ప్రచురించేవారు. కొన్నాళ్ళకు తెనాలి నుండి హైదరాబాదుకు వెళ్ళిపోయిన రవీంద్రనాథ్ కొన్నేళ్ళపాటు మళ్ళీ పత్రికల జోలికి పోలేదు.
హనుమంతరావు అభిసారిక పత్రికను తెనాలి నుండి మదరాసుకు తీసుకువెళ్ళి కొన్నాళ్ళు నడిపిన తర్వాత, 1950లో క్రాంతి ప్రెస్ స్థాపించి అక్కడి నుండే పత్రికను కొనసాగించారు.
హనుమంతరావు హాస్యప్రియుడు. సరళంగా, మృదువుగా, సున్నితంగా విషయాన్ని విడమరిచి చెప్పేవారు. “ఇంద్రజిత్తు” పేరిట అనేక వ్యాసాలు విభిన్న పత్రికలలో రాశారు. అభిసారిక పత్రిక కూడా కొంతకాలం నడిపి సామర్లకోటలోని రామ్ షాకు అప్పగించారు. జ్యోతి కూడా అలాగే రాఘవయ్యకు, వేమూరి సత్యనారాయణకు అప్పగించారు. హనుమంతరావు రాయని పత్రికంటూ లేదేమో అనిపించేటట్లు అనేక పత్రికలలో తన పేరుతోనూ ఇంద్రజిత్తు అనే మారుపేరుతోనూ రాశారు. విషయాన్ని సున్నితంగా, సూటిగా లౌక్యంగా, సరళంగా చెప్పగలిగిన హనుమంతరావు ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం చూసుకుంటూనే రచనలు సాగించారు. ఆయన రాసిన నవలలు, నవలికలలో కొన్ని – దూతికా విజయం, జగదేకసుందరి క్లియోపాత్రా, తీర్పు, జ్ఞాని, ఇలవేలుపు, లోకచరిత్ర, గుడ్డివాడు, మరో మనసు, బహుళ ప్రచారం పొందాయి.
ఎర్రబుట్టలు, చికిత్స, జ్ఞాని, ఉల్టా సీదా, మధుర కల్యాణం, ప్రొఫెసర్ బింసన్ జనాకర్షకమయ్యాయి. కథలలో నాకొడుకు, ప్రణయాన్వేషి, వృత్తిధర్మం, బుద్ధిశాలి, పన్నాగం, కుక్కతోక, గళ్ళ రుమాలు. సంజీవి. అపనింద, కాముకి, చక్రి, ప్రియురాలు, అనాథ, గర్వభంగం, పరిశోధన ఆకట్టుకున్నవి.
ఆంధ్రప్రభ, చిత్రగుప్త, భారతి, వాణి, ప్రజాబంధు, సుభాషిణి, యువ, ఆనందవాణి పత్రికలకు రాసారు.
మొపాసా, బెర్నార్డ్ షా, కార్ల్ మార్క్స్, ఓహెన్రీ రచనలు ఆయనకు ప్రీతిపాత్రం. గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు తాగుతూ చతురోక్తులతో తనదగ్గరకు వచ్చేవారిని కడుపుబ్బ నవ్వించేవారు. మధు అన పేరుతో సెక్స్ పుస్తకాలు రాశాడని ఆయనపై వదంతులు వ్యాపింపచేశారు కానీ అవి ఆధార రహిత మాటలని తేలింది.
హనుమంతరావు విపరీతంగా చదివేవారు. బాల్ జాక్ ఆయనకి ప్రీతిపాత్రమైన రచయిత.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) లో ప్రస్తుతం ఆయన రచనలు కొన్ని లభిస్తున్నాయి. అందులో పన్నాగం, అంచన వంచన, పరిశోధన, లోకచరిత్ర, జగదేకసుందరి క్లియోపాత్రా, వుండడం గమనార్హం.
వాత్సాయన కామసూత్రాలను వైజ్ఞానిక రీతులలో జనంలోకి తీసుకువచ్చిన ఖ్యాతి హనుమంతరావుగారిదే. 1989లో చనిపోయిన హనుమంతరావు రచనలన్నీ మళ్ళీ వెలువరించి కొన్నాళ్ళుగా మార్కెట్ లో లేని లోపాన్ని తీర్చడానికి ఆయన కుమారులు కృషిచేస్తున్నారు.
హనుమంతరావు తలపెట్టిన సెక్స్ రివల్యూషన్ చిలవలు పలవలుగా మారిపోయింది.
కానీ, సున్నితమైన, జటిలమైన లైంగిక అంశాలను, రొమాన్స్ ను అరటిపండు వలిచి చేతులో పెట్టినట్లుగా రాయడం హనుమంతరావుకే చెల్లింది. అందుకే ఆయన తెలుగువారి హేవలక్. యూరోప్ లో అమెరికాలో సెక్స్ రివల్యూషన్ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు తెచ్చిన రీతులు తెలుగువారిలో హనుమంతరావు ప్రచారంలోకి తీసుకువచ్చారు.
*
Good information Innaiah garoo. Thanks