పల్లెల్లో దీపం ముట్టించే ప్రయత్నంతో ముందుకుసాగుతున్న కవి యాకూబ్ .అతని అక్షరపు పుట్టుకంతా ఎదుటిమనిషి గుండెను తాకి మురిసిపోవడంలోనే ఉంది.యాకూబ్ రాసిన “తీగలచింత”అనేది ఉన్న ఊరును విడిచి నగరం చేరుకున్న ఒక మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థితి.తన “ఊరిడైరి”లో పారకుండా ఆగిన ప్రవాహం ఙ్ఞాపకాలతో!మడుగులు కట్టిన బుగ్గవాగు,గుంపువొదిలి ఒంటరి గూటి పక్షుల కోసం ఎదురుచూస్తున్న పక్షిలా కారేపల్లి ఊరిచివరి ఈద్గా,”ఊరిపొలిమెరల్లో నిలబడి/ఎదురుచూస్తున్న అమ్మ” హృదయాన్ని కలిచివేస్తూ కనిపిస్తాయి.
ఎక్కువగాతీగలచింతలో తీగలుతీగలుగా అల్లుకుపోయిన సామాజికచింతనం ఉంది.ఒక ఎరుకతో రాసే కవికి మొదటగా సామాజిక సమస్యలే తన ముందట కనిపిస్తాయి.కవి యాకూబ్ కూడా పల్లెతోపాటూ సామాజిక సమస్యల మీద గొంతెత్తాడు.తాజా విషయమైన కాశ్మీర్ గురించి రాస్తూ ఇది ” రక్తమోడుతున్న స్వర్గం “అంటాడు.
“ఇక్కడ వైధవ్యం కూడా ఒకేసారి దక్కదు
సగంసగం వాయిదాల వైధవ్యం
(కాశ్మీరం-పు.73)
370ఆర్టికల్ రద్దుచేసిన నేపథ్యంలో కాశ్మీర్ లో జరుగుతున్న ఘోరాలను చూసి నిట్టూరుస్తాడు.అలాగే సిరియాలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన బాలుడు ఐలాన్ కుర్ది మరణాన్ని చీకటిగా భావిస్తాడు.రోహింగ్యాలపై జరుగుతున్న దాడిని కూడా చీకటిగ చెప్పాడు.
మయన్మార్ లో నివసిస్తున్న ఒక ముస్లిం తెగకు చెందినవారు రోహింగ్యాలు.అక్కడ తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో స్ధానికజాతులుగా రోహింగ్యాలను గుర్తించకపోవడంతో వాళ్ళు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వలసపోతున్నారు.
సమాజంలో కవి అయినా,జర్నలిస్ట్ అయినా,కళాకారుడైనా సమాజమార్పు కోసం తనను తాను త్యాగం చేసుకొని భవిష్యత్తు తరానికై అసువులుబాయడం ఆ రాజ్యం వెనుకబాటుతనాన్ని ప్రస్పుటంగా సూచిస్తుంది.
ప్రశ్నించిన కలాన్ని,గళాన్నిరాజద్రోహిగా ముద్రవేయడం,ఇంకేదో కారణం చూపి అంతమొందించడం ఈ రాజ్యానికి కొత్తేమి కాదు.అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ప్రముఖ జర్నలిస్ట్ గౌరిలంకేష్ హత్య.గౌరిలంకేష్ గురించి రాస్తూ “బ్రతకడమంటే ఏమిటో/బందీలకు నేర్పిన గుండె అది”అంటాడు.
“ఆవులు భద్రంగా ఇంటికి చేరే లోకంలో
ఆడపిల్లలను మేసే కాలంలో
తల్లులు ఇక తల్లులను కనడానికి వణికిపోతారు”
(గిరఫ్తార్ హమ్ హువే-పు.40)
ఎనిమిదేండ్ల చిన్నారి ఆసిఫా చనిపోయినపుడు దానికి గల కారణాన్ని,ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఆవు రాజకీయాల గురించి మాట్లాడుతాడు.
వీటితో పాటు ఇతని కవిత్వం ఒక గరగపర్రు,ఒక నేరెళ్ళ,ఒక టేకులపల్లి ఎన్ కౌంటర్ లాంటి సామాజిక అంశాలపై స్పందించిన విధం కనిపిస్తుంది.400దళిత కుటుంబాలను వెలివేసిన గరగపర్రు సంఘటన ఇంకా కులం వేళ్ళు నేలలోకీ పాతుకపోయి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి.
ఇట్లా ఊర్లలో కులం పేరుతో జరుగుతున్న దాడులను ఖండిస్తాడు యాకూబ్ .తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పుడు అడ్డుకున్న దళితులపైన రాజ్యం ఎట్లా కన్నెర్రజేసిందో మనందరికి తెలియంది కాదు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో చండ్రపుల్లారెడ్డి అనుచరులను ఎన్ కౌంటర్ చేసి చంపిన వంటి అంశాలను యాకూబ్ కవిత్వంలో స్పష్టంగా చూడవచ్చు.
“ఊళ్ళు తమనుతామే వెతుక్కుంటూ,పేర్లు కనుక్కుంటూ
లోపల్లోపల పళ్ళు నూరుతుంటాయి
ఆ మధ్య యాకోబు గరగపర్రుకు సంకేతమయ్యాడు
ఇసుక నేరెళ్ళగా పేరు మార్చుకుంది.
పారిన రక్తం పేరు,ఒరిగిన దేహాల పేరు టేకులపల్లి ఎన్ కౌంటర్ .
లాఠీలు,తుపాకులు ఫర్మానా పత్రాల అధికారపు గుర్తులుగా మారాయి”
(Shhhh…-పు.119)
ఇటువంటి దాడులు ఆగి “కులాతీత,మతాతీత నిర్మాణం జరగాలని మనిషి మనిషిగా గుర్తింపబడే లోకం రావాలని కోరుకుంటాడు.
అరుణోదయ రామారావులాంటి కళాకారుడిని మరణాన్ని తల్చుకుంటూ ,నిష్క్రమణగీతం పాడుకుంటూ తన పాటతో సమాజాన్ని ప్రభావితం చేసిన రామారావును ఒంటరిగదిలోకి వెళ్ళిపోయిన తీరును వివరిస్తాడు.అతనే ఒక పాటగా మారి జీవించి చూపాడని తన బతుకు తీరుతెన్నులను మనముందుంచుతాడు.
కవిగా యాకూబ్ మనిషిని గురించిన తండ్లాట,బతుకు గురించి చింతన తీగలచింత నిండా కనిపిస్తుంది.
“ఎక్కడో పిడుగుపడుతుంది,కంపించాలి
పక్కనే చెట్టు కూలుతుంది.ఒడుపుగా తప్పించుకోవాలి.
ఎవడో ఉమ్ముతుంటాడు,తుంపర్లు మనపైన చిందకుండా ఆ పక్కనుంచి తప్పుకోవాలి.
ఇల్లు వేడెక్కుతుంది.చల్లబడేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడాలి”(బతకడం అవసరం-పు.19)
మనిషి కొంత జీవితాన్ని స్పృషించాక జీవితం యొక్క పరమార్థం ఏమిటో తేటతెల్లం అవుతుంది.అప్పుడు గతం తాలూకు అస్పష్టత అవగతమౌతుంది.అడుగు కూడా పదిలమవుతుంది.
“జన్మించిన తావులో జతకట్టిన దోస్తులతో చెంపచెంప ఆనించి/చెమ్మగిల్లె కళ్ళు నిజం
………………….
ఎంతైనా,ఏమైనా,ఏదైనా
తడితడిగా జీవించే వనరులన్నీ పోగేసి
వాటిచుట్టుతా పరిభ్రమిస్తూ
తిరుగాడే బతుకుమాత్రమే నిజం”
(నిజానికి దగ్గరగా -పు.111)
ఈ ఆటవిడుపు పయనంలో ఏది నిజమైన బతుకు?ఏది నిజమైన అడుగు ?అని తనకు తానే ప్రశ్నించుకుంటూ తనకుతానే ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటాడు.ఇది అమ్మస్పర్శలాంటి నిజం.
యాకూబ్ ఎంత భావుకుడో తీగలచింతలోని కొన్ని కవితాపంక్తులు పట్టిస్తాయి.
1)తనకేమి అవసరం లేని యోగిలా నవ్వుతుంది ఈద్గా-(పు.63)
2)నీటికొమ్మల మీద తేలియాడుతూ
లేతపసుపువర్ణపు పండులా సూరీడు-(పు,57)
3)లైట్లన్ని ఆర్పేసిన చీకటిగదిలా మనసు-(-పు68)
4)పాతసామాను పెట్టెలాంటి దేహం-(పు.105)
పై ఉపమవాక్యాలన్ని యాకూబ్ నూతన అభివ్యక్తిని తెలియజేస్తాయి.దేనినైనా కవిత్వం చేసేటపుడు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని నువ్వు,నేను కలిసి మాట్లాడుకున్మంత సహజంగ వ్యక్తీకరిస్తాడు.
ఇంకా ఈ తీగలచింతలో “ఊరూరకవిసంగమం”లో భాగంగా సందర్శించిన గాంధారిఖిల్లాదారిలో అన్న కవిత,తను నిత్యం కళాశాలకు వెళ్ళివచ్చే దారిలో కనిపించే గోల్గొండకోటపై “గోల్కొండా!గోల్గొండా!”వంటి కవితలు ఇందులో చోటుచేసుకున్నాయి.మత్లబీ,సబ్ ఠీక్ నహీ హై!,గుఫ్తగూ,గిరఫ్తార్ హమ్ హువే! మొదలైన హిందీ శీర్షికలతో కూడిన కవితలున్నాయి.అలాగే కొన్ని ఇంగ్లీష్ శీర్షికలు కూడా.
“నేనే తీగలచింత/తీగలచింత నేనే” అని కవి యాకూబ్ అనడంలోనే గొప్ప మార్మికత ఉంది.ఒక మనిషి అతని చుట్టుతా ఉన్న సమాజం ,గాయాలు,ఒడిదొడుకులు,గాయాల తాలూకూ మూలాలు ఏవైనా జీవితాన్ని విడిచి విడిగా ఉండవు.వాటి చుట్టు నిరంతర పరిభ్రమణమే తీగలచింత.అందులో నువ్వు,నేను,మనం ఉన్నాము.
సమీక్షకుడు: నాగిళ్ళ రమేష్ 9100482478
ప్రతులకొరకు: కవి సంగమం
సంపుటి పేరు:తీగలచింత
కవి:యాకూబ్
వెల :100
Add comment