దొరల క్రౌర్యపు జాడలు కె. వి. నరేందర్ కథ

నిరాడంబరమైన శైలీ,  శిల్పాల ఈ కథ నిండా తెలంగాణ దుఃఖం, ఎద మీద అగ్నిపర్వతాన్ని మోస్తున్న ఒకలాంటి బాధ, తెలంగాణ మట్టి రేణువుల మౌన ఆక్రందన పరుచుకొని ఉన్నాయి.

తెలంగాణ కథ అంటే విప్లవ కథ /ఉద్యమ కథే అనే ముద్రను దూరం చేసిన కథకులలో కె.వి. నరేందర్ కూడా ఒకరు.  సింగిల్ కాన్సెప్ట్ కథల్ని రాయడంలో మధ్య తరగతి మందహాసాల్ని కథీకరించడంలో నరేందర్ ది అందవేసిన కలం. మానవ సంబంధాలు, వాటిని ఒరుసుకుంటూ కదిలిపోయే సంఘర్షణలు నరేందర్ కథా  వస్తువులు.  కథ, నవల, నాటిక, కవిత్వం, వ్యాసాలు ఇలా అనేక  ప్రక్రియల్లోనరేందర్ కలం కొత్త పుంతలు తొక్కింది. మరో కవి సంగెవేణి రవీంద్ర తో కలిసి నరేందర్ రాసిన ‘తెలంగాణ గడీలు’ అప్పట్లో సంచలనం. అమ్మ, నాన్న, నాతిచరామి, దురదలు జాబిల్లి, ఊరు, సిటీ, పోరు, చీపురు కథాసంకలనాలు వీరి సింగిల్ కాన్సెప్ట్ కథల పుస్తకాలు. కె.వి.నరేందర్ పేరు చెప్పగానే ఆయన రాసిన బోలెడు కథలు గుర్తుకొస్తాయి. బర్రె, నడిపోడు, వేరు పురుగు, హిజ్రా, ఉసిల్లు…. ఇలాంటివి ఎన్నో. ఈ వరుసలోనే ఒకనాటి తెలంగాణ సమాజ నెత్తుటి చిత్రాన్ని ఆవిష్కరించిన గొప్ప కథ ‘దొరుంచుకున్న దేవక్క.’

అదొక మారుమూల తెలంగాణ పల్లె. అక్కడ గడీల రాజ్యం నడుస్తున్న కాలంలో ఆ ఊర్లోకి గవర్నమెంట్ టీచర్ గా అడుగు పెడతాడు రచయిత. అప్పుడే డప్పుల శబ్దాల మధ్య ఒక పెళ్లి జంట ఎదురవుతుంది పెళ్లి కూతురు అందం చూసి పల్లెటూర్లో కూడా ఇంత అందం ఉంటుందా!! అని ముగ్ధుడవుతాడు రచయిత. ఆమే దేవక్క. మనిషి మందారం. సొగసు మల్లెతీగ. ఆ ఊరి దొర ఆనందరావు గడీలోనే రచయిత పాఠాలు చెప్పే బడి. “చిత్రంగా నలుగురే పిల్లలు… ఒకడు ఆనందరావు దొర కొడుకు కాగ.. ఇద్దరు పటేల్ గంగన్న కొడుకులు. మరొకడు పట్వారి రాములు కొడుకు. దొర కొడుకు మాత్రం స్టూల్ మీద కూర్చుండే వాడు. పల్లి కాయలు కొట్టి తినిపిస్తూ నేను అతడికి చదువు చెప్పాలి. ఒకరోజు గడీలో నేను పాఠం చెప్తుంటే దేవక్క ని, ఆమె పెనిమిటిని తీసుకొచ్చి దొర కాళ్లు మొక్కించారు కుల పెద్దలు.

దేవక్క అందం చూసి దొరసాని ముఖంలో రంగులు మారినాయి. ఎనిమిది మానుకల బియ్యం కొలిచాక… వాళ్లు వెళ్లిపోయారు.  దొరసాని దేవక్కని తన ఇంటి పనుల్లోకి పంపమని కోరగానే దేవక్క పెనిమిటితో సహా అందరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. మర్నాటి నుంచే దేవక్కకి దొర ఇంట్లో పని దొరికింది. పొద్దున్నే అర ఎకరమంత వాకిలూడ్చి, కల్లాపి చల్లి దొరసాని చెప్పిన పనులన్నీ చేస్తూ కూచోవాలి. దేవక్కని చూసినప్పుడల్లా.. ఆ అందానికి దొరసాని మనస్సు చివుక్కుమనేది. ఎండలో రెండు గంటలు బావి నీళ్లు తోడించినా.. ఎర్ర గులాబీలా అయ్యే దేవక్క అందానికి భగ భగ మని గుండె మండేది.” ఒక ప్రాంతాన్ని లోబరచుకోవాలంటే ముందు వాళ్ల భాషను హినీకరించి, సంస్కృతిని దెబ్బ తీయాలి. అలాగే ఒక ఆడదాన్ని మరో ఆడది గెలవాలంటే ప్రయోగించే అస్త్రాలు రెండే. ఒకటి నైతికంగా దిగజార్చడం, రెండు ఐదోతనాన్ని దూరం చేయడం. ఓరోజు గుడ్లురిమి చూసి లేడి పిల్ల లాంటి దేవక్కని రక్తం మరిగిన పులి లాంటి దొర గదిలోకి పంపింది. తర్వాత ఎలా జరిగిందో కానీ బతుకమ్మ పండుగ రోజే దేవక్క పెనిమిటి చెరువులో మునిగి చనిపోయాడు.  బొట్టు లేక ముండ రాలైన దేవక్క ‘కళ’ తప్పిన ముఖం చూసి దొరసాని పెదాల మీద చిరునవ్వు మొలిచింది. భర్త చనిపోయిన బాధనుండి బయటపడకముందే గడీలో పని మానేయమని హుకుం జారీ చేసింది దొరసాని. దేవక్క గడీకి పోవడం మానేసింది. కానీ దొర దేవక్క ఇంటికి పోవడం మొదలుపెట్టాడు. ఆనాటి నుండి ఆమె ‘దొరుంచుకున్న దేవక్క’.

గడీ మీద నక్సలైట్లు దాడి చేయబోతున్న విషయం ముందే పసిగట్టిన దొర రాత్రికి రాత్రే అంతా సర్దుకుని హైదరాబాద్ పారిపోయాడు. ఆనందరావు దొర ఊరి నుండి వెళ్ళాక గాని అర్థం కాలేదు దేవక్కకి. తన బతుకెంత ముండ్ల కంపలో పడ్డట్టయిందో… ఆ దుఃఖంలో ఉండగానే పటేల్ గంగన్న నడుం మీద చెయ్యేసాడు. పట్వారి రాములు వీపు నిమిరాడు. ‘ఛీ’ అని ఇద్దరిననీ విదిలించింది దేవక్క. ఒక నాటి అర్ధరాత్రి దొర భూముల్లో జెండాలు పాతిన నక్సలైట్లు గడీని కూడా పేల్చేద్దామని వచ్చి గడీ లోపలకి దారి తెలియక దేవక్కను నిద్రలేపుతారు.

“గడీని పేల్చితే ఏమత్తది? ఈ ఊరి మనసుల్లోంచి దొర మాసిపోతడా? గడి మాసిపోతదా?” అడిగింది దేవక్క.

“మాసిపోవాలె బూర్జువా వ్యవస్థనే మాసిపోవాలె. సమసమాజం రావాలె. అందుకే మా పోరాటం” ఒకతను ఆవేశంగా అన్నాడు. చివరికి వాళ్ల  బెదిరింపులకు లోబడి వాళ్ళతో వెళ్లి గడీ అంతా తిప్పి చూపించింది. తెలతెలవారుతుంటే గడీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. బురుజులు నేల కూలినయి. తెల్లవారి ఊరి నంతా పోలీసులు చుట్టుముట్టారు. దేవక్క ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది.  బూట్ కాళ్లతో తంతూ, లాఠీలతో కొడుతూ బరబరా ఈడ్చుకొచ్చి దేవక్కను జీపెక్కించారు. అప్పటికప్పుడు దేవక్క కి ‘ఇన్ఫార్మర్’ అని పేరు పెట్టి నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో  కుళ్ళబొడిచి  శవం లాంటి దేవక్కను ఇంటి ముందు పడేసి పోయారు. మందారం లాంటి దేవక్క నెత్తుటి ముద్దయిపోయింది. దేవక్క మళ్ళీ మనిషి అయ్యేందుకు ఆరు నెలలు పట్టింది. ‘కండ పట్టిన దేవక్క వైపు కొన్ని కళ్ళు కాపలా కాస్తూనే ఉన్నాయి’ కానీ దేవక్కని దురదృష్టం మరోలా వెంటాడింది. ఒక నక్సలైట్  నాయకుడు దేవక్క దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దేవక్క ఏమీ మాట్లాడలేదు. అప్పటికే చీకటితో పాటు పోలీసులూ ఇంటి చుట్టు ముట్టారు. ఆ నక్సలైట్ నాయకుడిని లొంగిపొమ్మని హెచ్చరికలు జారీ చేశారు. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. బీభత్సం నిండిన ఆ పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుండి పారిపోయింది దేవక్క. నక్సలైట్ నాయకునితో పాటు ఇల్లు కూడా కాలి బూడిదయింది. ఆ రోజు నుంచి దేవక్క ఎవరికీ కనిపించలేదు. కాలగర్భంలో ఎనిమిదేళ్లు  గడిచిపోయాయి. దేవక్క శరీరం మీద,  దేవక్క జీవితం మీద ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. క్రమంగా ఊరు దేవక్కని పూర్తిగా మర్చి పోయింది.

ఓ రోజు సాయంత్రం చేతిలో చిన్న  సంచితో ఊర్లో దిగింది దేవక్క. చాలామంది దేవక్కని గుర్తుపట్టలేదు. అసలామె గుర్తుపట్టేలా లేదు. ‘వారం కింద తెంపిన తెల్ల గులాబీలా పూర్తిగా వాడిపోయింది.’ రచయిత తొందరగానే దేవక్కని గుర్తు పట్టి “ఇన్ని రోజులు ఏమైపోయావ్?” అని అడిగాడు.

“బతుకు భయంతో పారిపోయాన్సార్… వలస పోయాను.”

“అదే ఇన్నాళ్ళూ ఎక్కడున్నావ్?”

“కామాటిపురా”

“మరిప్పుడు?”

“వాళ్లు తరిమేశారు”

“ఎందుకు?”

“ఎ.. యి..డ్స్..” అని చెప్పి దేవక్క ఊర్లోకి పోయింది. చిత్రంగా ఆమె ఇల్లు ఉండాల్సిన చోట ఇప్పుడు గ్రామ పంచాయితీ ‘పశువుల దవాఖాన’  కట్టింది. ఊరు ఊరంతా కదిలి వచ్చి ఆమెకు సోకిన ‘మాయరోగం’ గురించి తెలుసుకొని దూరం నుండే బెరుకు బెరుగ్గా మందలించి పోయారు.  దేవక్క” అప్పుడే పోచమ్మ తల్లికి నైవేద్యం పెడుతూ.. డప్పుల చప్పుడుతో వెళ్తున్న ఊరేగింపు చూసింది. భర్త గుర్తొచ్చాడు..   దొరసాని గుర్తొచ్చింది.. దొర గుర్తొచ్చాడు..  నక్సలైట్లు..పోలీసులు… తన జీవితాన్ని ఎయిడ్స్ క్రిమి కన్నా భయంకరంగా పొడిచేసిన వాళ్లంతా గుర్తొచ్చారు.”

మర్నాడు పొద్దున్నే రచయిత ఇంటికి వెళ్లి “సార్ ఇయ్యాల్ల ఊర్లో న్యాయ వేదిక వాళ్ళొస్తుండ్రట. గ్రామపంచాయతీ వాళ్ల నించి నా భూమి నాకిప్పియ్యుండ్రి. ఒక అప్లికేసన్ రాసియ్యుండ్రి.” అని ప్రాధేయపడింది. తీరా న్యాయ వేదిక వాళ్ళు వచ్చి దేవక్క విజ్ఞాపన పత్రం చూసి మళ్లీ వచ్చినప్పుడు తీర్పిస్తామని వెళ్లిపోయారు. సర్పంచ్ కి ఇది నచ్చక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలు ఊర్లో ఉండొద్దని తరిమేయాలని  ప్రయత్నించేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఏళ్లు గడిచిపోతున్నాయి… ఊర్లోకి ఏ అధికారి వచ్చినా దేవక్క అప్లికేషన్లు ఇచ్చేది ఇస్తున్నది. ఆమెకు భూమి మాత్రం దక్కలేదు. ఆమె స్థలాన్ని ఆక్రమించి కట్టిన  ‘పశువుల దవాఖాన’ వరండాలోనే ఉంటోంది.. పిల్లలు అప్పుడప్పుడు పిచ్చిది అనుకొని రాళ్లు  రువ్వేవారు. దేవక్క రోజుకింత చిక్కి శల్యమైపోతోంది..”కొంపదీసి ఇలాంటి రోగం తమకు కూడా ఉందా? ఈ ముండ ఊర్లోకి రాకున్నా ఈ భయం పట్టుకునేది కాదని మనసులో తిట్టుకునేవారు ఊర్లో మిగతా ఆడవాళ్ళు.”

చివరాఖరికి కోర్టు దేవక్క కి 20,000 నష్టపరిహారం ఇవ్వాలని గ్రామ పంచాయతీకి నోటీసులు ఇస్తుంది.  దీంతో ఎవరెవరో దూరపు చుట్టరికం  కలుపుకొని నష్టపరిహారం కింద వచ్చే రూపాయలు తమకే ఇప్పించాలని దేవక్కను ఇక నుండి తామే చూస్తామని రచయితను కలుస్తారు.  రచయిత ఆశ్చర్యానికి లోనవుతాడు.  రచయిత మనసంతా వికలమవుతుంది.  చాలాసేపు దేవక్క జీవితం చుట్టూ పరచుకుని పోయిన చీకటి గురించి దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోతాడు. తెల్లారేసరికి ‘దేవక్క చచ్చి పోయిందట’ అనే వార్త ఊర్లో గుప్పుమంటుంది. ఊరిలో ఆడవాళ్ళంతా ముక్కుకు కొంగు అడ్డం పెట్టుకొని,  మగవాళ్లేమో దేవక్క అందం గురించి చర్చించుకుంటూ శవం చుట్టూ మూగి పోతారు.

ఇంతలో ఎవరో వచ్చి “సార్ పన్నెండేండ్ల తర్వాత  దొర మళ్ళా వచ్చిండు. ఇప్పుడే ఊర్లెకచ్చిండట” అని చెప్తాడు. రచయిత దొర ను కలవడానికి వెళ్ళేటప్పటికి” నక్సలైట్లు దేవుళ్ళురా… వాళ్లే మరో పది ఏళ్ళ ముందు పారిపోయేలా చేసి ఉంటే హైదరాబాద్ సిటీని సగం కొనేసి ఉండేటోన్ని. నేనే కాదు నా లాంటి దొరలంతా పల్లెలు వదిలాక పారిశ్రామికవేత్తలయ్యారు. ఏ వన్ కాంట్రాక్టర్ల య్యారు. కాలేజీలకు, హాస్పిటల్లకు, రియల్ ఎస్టేట్లకు ఓనర్లయ్యారు…

విప్లవం వర్ధిల్లాలని పట్నాల్లో దొరలు పూజలు చేశార్రా. విప్లవం అంటే మాకు ప్రేమ.. భక్తి  గిక్కన్నే ఉంటే గడీల్నే పడి ఉండేటోన్ని. మీ అందర్నీ చూసి పోదామని వచ్చిన.  రేపోమాపో ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్టుంది. అందరూ నాకే ఓట్లెయాలే” అన్నాడు. ఇంతలో   ఎవరో గుంపుగా  దేవక్క శవాన్ని ఎత్తుకుపోవడం చూసి “ఏమైంది  ఎవరో చచ్చిపోయినట్లున్నారు?” అని అడిగాడు దొర.

“దేవక్క చచ్చిపోయిందండి” అన్నాడు రచయిత.

“దేవక్క ఎవరు?” అన్నాడు దొర నొసలు చిట్లించి.

“దేవక్క…” అని రచయిత ఏదో చెప్పబోయేంతలో అటు తిరిగి మరెవరితోనో మాటల్లో పడి పోయాడు. అరగంట తర్వాత పాడుబడిన గడీని స్కూల్ కి,  దవాఖానకి, కమ్యూనిటీ హాల్ కి వాడుకొమ్మని ‘దొర  ధర్మాత్ముడు’ అని అనిపించుకొని మళ్లీ కారెక్కి పట్నం పోయాడు.

“దేవక్క శవం తూర్పు దిక్కు ఉన్న స్మశానం  వైపు తరలిపోయింది.

దొర కారు పడమటి వైపున నేషనల్ హైవే వైపు  దూసుకుపోయింది.

ఉత్తరాన ఉన్న గుట్ట ల్లోంచి నక్సలైట్లు ఉరుకురికి వస్తుండ్రు.

దక్షిణం వైపు నుంచి పోలీసులు పెట్రోలింగ్ పేరుతో అడుగు పెట్టారు.”

రచయిత దిగ్బంధమైపోయిన తెలంగాణ పల్లె లాగా నడుమన నిలబడిపోయాడు.

శతాబ్దాలుగా… తరతరాలుగా తెలంగాణలోని కష్టజీవుల, అమాయకుల జీవితాలు దొరల చేత శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతగా దోపిడీకి గురై మట్టిలో కలిసిపోయాయో ఈ కథలోని ప్రతి అక్షరం శక్తివంచన లేకుండా చెప్తుంది. ఇప్పటికీ ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంది. రంగు మారి ఉండవచ్చు, ప్రలోభాలు మారి ఉండవచ్చు. ఒక నాడు దేవక్కలాంటి పల్లె పడుచుల జీవితాలెన్నో చీకట్లో కలిసిపోయాయి. ఊర్లో ఏ అమ్మాయి పుష్పవతి అయినా, ఏ అమ్మాయి పెళ్లయినా ‘మొదటి రాత్రి’ దొరతోనే గడపాలి. లేదంటే ఆ అమ్మాయి తండ్రో,  భర్తో అనుమానాస్పద స్థితిలో ఏ చెరువులోనో శవమై తేలుతాడు. ఈ విపరీత దోపిడీని అంతమొందించడానికి పుట్టిన నక్సలైట్ ఉద్యమం దొరలను పల్లెల నుంచి పట్టణాలకు తరిమి కొడితే అక్కడా వారిదే పైచేయి.  వ్యాపారవేత్తలుగా, రియల్టర్లు గా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మళ్లీ గ్రామాల్లో చదువుకున్న మొదటితరం విద్యావంతులకు వాళ్ళ కంపెనీల్లోనే ‘బాంచెన్’ బతుకుల స్వరూపాన్ని మార్చి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి తిరిగి గ్రామాలకు తరలిపోయి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికై పల్లెల్లో ఉన్నా, నగరాల్లో ఉన్నా రాజ్యాధికారం తమదేనని నిరూపించారు.

‘నక్సలైట్లు దేవుళ్ళు’ అని ప్రజలంతా వాళ్లను గుండెల్లో దాచుకుంటే దొరలు కూడా విప్లవం అంటే తమకూ ఇష్టమేనని వాళ్లే లేకపోతే తాము ఇంత అభివృద్ధి చెందే వాళ్ళం కాదని విప్లవోద్యమాలకు ఉన్న మరో పార్శ్వాన్ని ఎత్తి చూపారు.  తెలంగాణలోని ఒకనాటి ‘ఉక్కపోత’  వాతావరణాన్ని ఈ కథ విజువలైజ్ చేసి చూపిస్తుంది.  నిరాడంబరమైన శైలీ,  శిల్పాలతో సాగిపోయే ఈ కథ నిండా తెలంగాణ దుఃఖం, ఎద మీద అగ్నిపర్వతాన్ని మోస్తున్న ఒకలాంటి బాధ, తెలంగాణ మట్టి రేణువుల మౌన ఆక్రందన పరుచుకొని ఉన్నాయి. ఈ కథను చదవడమంటే ఒకనాటి తెలంగాణ సామాజిక చరిత్రని, ఇక్కడి దేహాల మీద స్వారీ చేస్తోన్న ఒక క్రౌర్యాన్ని తడిమి దాన్ని మన రక్తంలోకి ఒంపుకోవడమే.  ఎలాంటి వారసత్వం నుండి మనం వచ్చామో తలుచుకుంటే గుండె నిప్పుల కుంపటి అవుతుంది. దొరలు చూపించిన విశృంఖల దోపిడీలోని ఒక కోణం మాత్రమే ఈ కథలో చిత్రింప బడింది.  సాహిత్యంలోకి ఎక్కని దొరల క్రూరమైన పార్శ్వాలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి కథను పరిచయం చేశారు. మనసంతా బరువుగా అయిపోయింది.

  • వివరణ బాగుంది. విశ్లేషణాత్మక విమర్శ.

  • The inhuman and the most revulsive Ghadi cultural values have no counterparts in any uncivilized and barbaric society throughout the brutal (in)human history……who are the Hitler’s,Pol pot s ,Papa DOCs and Idi Amins before these SHOEDRA Satanic Scoundrels called Doras….the story boils my blood and I m and my family have been witnesses to the inhumanities these Siamese twins called Doralu (Shoedras …the lowest Varna of CASTE HINDU social order…Reddies &Velmas)police. The ending is symbolic…the Devakka dead body moves towards the East, and omnipotent and omnipresent Dora goes towards the West,and the Brutal Police arrives from the South(death-) and Revolutionaries from the North…signify some symbolism…the expression…” katheekarinchatam ” is novel and new. The freedom at midnight IS yet to dawn on the billions of Daliths and other marginalized section s of mankind…Hats off both the story writer and reviewer…

  • ఇటువంటి తెలంగాణ పృత్యేక స్థితిని తెలిపే కథల ను లోకాకానికి తెలియ చేయాలి.ఆ ప్రయత్నం చేస్తున్న మీరు అభినందనీయులు.

  • సమీక్ష బాగుంది…… శ్రీధర్ గార్కి కృతజ్ఞతలు

  • నేను ఏడో, ఎనిమిదో చదువుతున్నపుడు వార్త ఆదివారం అనుబంధం లో చదివిన కథ. ఆ పేరు లోనే కథంతా ఉందనిపించింది. ఇరవై ఏళ్ళు ఐనా ఇంకా ఆ కథ గుర్తు ఉంది. ముఖ్యంగా ముగింపు..

      • కె.వి నరేందర్ గారు మీరు రాసిన “తెలంగాణ గడీలు” పుస్తకం ఎక్కడా లభ్యం అవట్లేదు. దయచేసి ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలిగితే మాకు చదివే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.

  • శ్రీధర్ గారు, కె వి నరేందర్ గారు రాసిన “తెలంగాణ గడీలు” పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?? వీలుంటే చెప్పగలరు.

  • అసలు ఇది ఏ ఊరు సార్
    మీ వుల్లో కూడా గడి వుందని తెలిసింది వాటి గురించి
    తెలియపరచండి. అలాగే తెలంగాణ గడిలు బుక్ యెక్కడ దొరుకుతుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు