దొంగ

కులాసాగా పడక కుర్చీలో కూచుని ఉన్న మామ్మకి ఇంతలో ఏ కష్టం వచ్చింది?!

రివస కాలవ మీద పడమటి ముఖంగా నిలబడి కుడి పక్కకి చూస్తే పార్కులు, మొక్కలు, రోడ్డు కనబడతాయి.  ఎడమపక్క ఒడ్డున కాలవ పొడుగునా రేకుల ఇళ్ళు, చిన్న బడ్డీ దుకాణాలు, చేతి పని, మోటారు పని చేసే షాపులు కనబడతాయి.  ఇరవై ఏళ్ళకి పైనే అయ్యింది ఆ నిర్మాణాలు ఏర్పడటం మొదలై.  మధ్య తరగతి బీదా, బిక్కీ!  ఈ దురాక్రమణ చేసి కట్టిన రేకు భవంతుల వరుసలో ఓ ఇంట్లో గడియారం మిట్ట మద్యాహ్నం మూడు గంటలు చూపెట్టింది.   ఆ సమయంలో అదే ఇంట్లోని ‘పీనాసి మామ్మ’ అరుపులతో బెజవాడ కొండలు దద్దరిల్లిపోయాయి.

‘ఒరే నాయనా, షెడ్డు పైకి ఎక్కి చిక్కుడు కాయలు కోసిపెట్టమని ఎన్నిసార్లు అడిగానురా.  ఇవాళ రారా.  నీకు పుణ్యం వుంటది’ కాసేపటి క్రితమే దారిన పోతున్న చిన్నాగాడిని పీడించి కాయలు కోయించింది.  వెతికి వెతికి వాడు మొత్తం కోసేదాకా కిందకి దిగనివ్వలేదు.  అదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ అంటా వాడి ప్రాణం తీసి, కిందికి దిగినాక గుప్పెడు వాడి జేబులో కుక్కి ఇంకఫో అంది.  కులాసాగా పడక కుర్చీలో కూచుని ఉన్న మామ్మకి ఇంతలో ఏ కష్టం వచ్చింది?!

ఇళ్ళలో సీరియల్ లో మునిగి పోయిన ఇల్లాళ్ళు బైటికి వచ్చారు.  సైకిల్ మీద వెళుతున్న పిల్లలు ఆగారు.  బైక్ మీద ప్రయాణీకులు తల తిప్పి విషయం ఏమిటో తెలుసుకోవడం కోసం బండి నిదానం చేశారు.  మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి, శుభ్రంగా భోజనం చేసి, పనికి తిరిగి వెళ్ళే లోగా మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసే పనిలో సరసానికి దిగిన జంట ఈ సద్దుని పెడ చెవిన పెట్టాలని పది నిమిషాలు ప్రయత్నించారు.  కుదరలేదు.  ఇంక చేసేది లేక తలుపులు తీసి బైటికి తొంగి చూశారు.

ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించిన కేక పెట్టిన మామ్మ, మావూలుగా కూడా చాలా పెద్దగానే మాట్లాడుతుంది.  అప్పుడప్పుడూ ఆవిడ, పక్క ఇళ్ళ వాళ్ళనీ, దారిన పోయే వాళ్ళనీ, వీధి కౌన్సిలర్నీ గట్టి గట్టిగా తిడుతుంది.  సరిగా చెప్పాలంటే, ఆవిడ సందడి మనిషే.  కానీ ఈ శబ్దం అది కాదు. ఇది వేరేది.  అంతకు మించిన ఉత్పాతం ఏదో జరిగింది.

ఇద్దరు.  ఐదుగురు.  పదిహేను మంది.  ఇరవై మంది.  చూస్తుండంగానే జనాలు పోగు పడ్డారు. ప్రశ్నార్ధకాలు, ప్రశ్నలు, జవాబులు కాసేపు నడిచాయి.

మామ్మ దక్షిణం దిక్కుకి చూబిస్తూ, ‘అయో అయ్యో అయ్యో.  దొంగలు దొంగలు.  అదిగో అటు పోయారు.  ఇద్దరు.  బండి మీద వచ్చారు.  చప్పున వెళ్తే దొరుకుతారు.  నా కొడుకుల్ని సున్నంలో ఎముకలు లేకుండా చావగొట్టాలి’ కేకలు పెడుతోంది.  అందరూ ఆవిడ చెప్పిన దిక్కుకి చూస్తున్నారు,  అడుగు కూడా ముందుకు వెయ్యకుండా.  ఒక్కడు ఇరవై ఏళ్ల వాడు.  వాడు మాత్రం  మామ్మ చెప్పిన గుర్తుల్ని బట్టి దొంగలని పట్టాలని కొంత దూరం పరిగెత్తాడు.  కానీ, వాళ్ళు బండి మీద వెళ్లి పోవడం వల్ల అతని ప్రయత్నానికి ఫలితం లేక పోయింది.  దొంగని(దొంగల్ని) చూడటం, పట్టుకోవడం వాడి వయసుకి సాహసోపేతమైన పని.  తను గనుక నిజంగా పట్టుకుని ఉంటే జనాల్లో గౌరవం, పేపర్లో పేరు వచ్చేవి.  దొంగతో కలసి ఫోటో తీయించుకుని ఫేస్ బుక్లో పెడితే బోలెడు లైకులు వచ్చేవి.  ఆడపిల్లలు హీరోలా చూసి ఉండేవారు.  పాపం అవ్వన్నీ జరగలేదు.   నిరాశగా తిరిగి వచ్చాడు.

దొంగలు.  పట్ట పగలు. మిట్ట మద్యాహ్నం.  జనాలు తిరిగే వీధిలో.  ఇంట్లో మనిషి ఉండంగానే ఒకడు లోనికి జొరబడ్డాడు. ఎంత ధైర్యం!  ఎందుకొచ్చాడు?  పెద్ద పెద్ద బజార్లు, భవనాలు వదిలేసి ఈ అణా, కానీ కన్నా మహా అయితే…..ఒక్క రవ్వ మెరుగైన ఇంటిలోకి ఎందుకు చొరబడ్డాడు?

‘భోజనం చేసి అలా కుర్చీలో కూర్చున్నా. ఇంతలోకి రెండు చేతులూ పులి పంజా లాగా  ముందుకి చాచి, మామ్మా అంటా లోపలికొచ్చాడు.  నన్ను భయపెట్టి , నా మెళ్ళో ఉన్న గొలుసు లాగడానికి ఒక చేత్తో నా భుజం పట్టుకుని, ఇంకో చేత్తో గొలుసు లాగ బోయాడు.  పక్కనే చేతి కర్ర ఉంది.  దాన్ని రెండు చేతుల మధ్యకీ లాక్కుని ఎవడ్రా నువ్వు లమ్డీ కొడకా అని వాణ్ని అదాటుగా వెనక్కి ఒక్క నెట్టు నెట్టి, గట్టిగా అరిచాను.  వెనక్కి పడ్డాడు సన్నాసి ముండాకొడుకు.  లేసి, బైటికి పరిగెత్తాడు. వీడి తోడు ఇంకోడు బైట బండి మీద ఉన్నాడు. వీడూ వాడూ తోడు దొంగలు అనుకుంటా.  వాడు బండి స్టార్ట్ చేసి,  ఇద్దరూ  అదిగో అటు పోయారు.  నా కొడుకులు, నా సొమ్ము లాగాలని వొచ్చారు’ ఎక్కువ ఆవేశంలో అనేక సార్లు ఆ  దొంగల్ని తన కొడుకులుగా సంభోధిస్తోంది!

మామ్మకి కాళ్ళు పని చెయ్యవు.   పెద్ద వయసు.  ఏడాది క్రితం ఏదో చిన్న ప్రమాదం. మంచాలు, గోడలు పట్టుకుని నెమ్మదిగా నడుస్తుంది.  రోజులో ఎక్కువ భాగం బైట గుమ్మంలో కూర్చుని జనాన్ని చూస్తూ, పిల్లల్ని అదిలిస్తూ ఉంటుంది, ఎప్పుడైనా ఒకసారి చుట్టూ పక్కల ఆడపిల్లల్ని ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది.  మద్యాహ్నం కుర్చీలో కూర్చుని సీరియల్ చూస్తుంది.

మామ్మకి చేతులు పని చేస్తాయి.  బియ్యం ఏరుతుంది.  చాకుతో కూరలు తరుగుతుంది.  రోట్లో మసాలా దంచి చాపల పులుసు వండుతుంది.  పచ్చడి నూరుతుంది.  అప్పుడప్పుడూ వీధి కౌన్సిలర్ దారిన పోతుంటే చేతిలో కర్ర నేలకి తట్టిస్తుంది.  పెద్దామె కదా.  ఆవిడ తిట్టినా, కర్ర చూబించినా ఎవరూ ఏమీ అనుకోరు.

మామ్మకి కొడుకులూ, కూతుళ్ళూ, మనవళ్ళూ మనవరాళ్ళూ అందరూ ఉన్నారు.  కానీ, వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు.  ఒక్కర్తే ఉంటుంది.  పోరంబోకు ఇంటిని ఎవరూ ఎత్తుకుపోకుండా ఇంటికి కాపలా!

‘నా సొమ్ము సత్యంగా సంపాయించింది.   మా ముసలాయన ఎవర్నీ మోసం చేసి కొట్టేసింది కాదు.  కడుపు కట్టుకుని రూపాయి రూపాయ్ పోగేసి చేయించుకున్న గొలుసు.  నా సొమ్ము గట్టిది.  నా ప్రతి ఒక్క రూపాయి కష్టం చేసి సంపాయించింది.   దొంగోడు కాదు కదా, ఆడి అమ్మా మొగుడు వచ్చినా వాడి తరం కూడా కాదు.  కాళ్ళు పనిచెయ్యక వదిలేశాను.  దొరికితే నా కొడుకుని సున్నంలో ఎముకలు లేకుండా లేకుండా చావగొట్టేదాన్ని’

‘సున్నంలో ఎముకలు లేకుండా’అనే పదాన్ని కూడా చాలా సార్లు వాడుతూనే ఉంది.  దారిన పోయేవాళ్ళు, చుట్టాలు, వాడకట్టవాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వస్తున్నారు.  ప్రతి వాళ్ళూ ఏం జరిగింది?  ఏం జరిగింది? అని అడుగుతున్నారు.

‘భోజనం చేసి అలా కుర్చీలో కూర్చున్నా. ఇంతలోకి రెండు చేతులూ పులి పంజా లాగా  ముందుకి చాచి, మామ్మా అంటా లోపలికొచ్చాడు.  నన్ను భయపెట్టి , నా మెళ్ళో ఉన్న గొలుసు లాగడానికి ఒక చేత్తో నా భుజం పట్టుకుని, ఇంకో చేత్తో గొలుసు లాగ బోయాడు.  పక్కనే చేతి కర్ర ఉంది.  దాన్ని రెండు చేతుల మధ్యకీ లాక్కుని ఎవడ్రా……..’మామ్మ ప్రతి ఒక్కరికీ పదాల వరస మార్చకుండా ఇలానే చెప్పింది.  ఇప్పటికి ఒక యాభై సార్లు చెప్పింది.  చెప్పడంలో అలసి పోలేదు.  యాభై ఒకటో సారి కూడా మొదటి సారి ఉన్న ధ్వని తీవ్రతలో కొంచం కూడా తగ్గుదల కొలతకు రాకుండా చెప్పింది!  తన సాహసానికి తను ఆనంద పడుతోంది.  తన సొమ్ము ఎవర్నీ దోచుకుపోనీయని తన తక్షణ ప్రతిస్పందనకి సంబరపడుతోంది.

పసుపు తాడు, రెండు దండలు, పది మంది చుట్టాలు, దుర్గమ్మ కొండ.   మామ్మ పదిహేడేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి జరిగింది.  భర్త డ్రైవర్ పని.  పది రోజులు ఇంట్లో ఉంటే ఇరవై రోజులు బండి మీద ఉండేవాడు.  అప్పుడప్పుడూ నెల పైన ఏటో వెళ్ళేవాడు.    బండికి వెళ్తూ వెళ్తూ ఇంటి ఖర్చులకి  ఇచ్చిన  డబ్బులు అయిపోయాయి.  అప్పటికి చెరో చంకనా ఇద్దరు చిన్న పిల్లలు.   కనీసం బియ్యం, చింతపండు, పోపు దినుసులు, నూనె, ఉప్పూ, కారం కావాలి కదా ఇల్లు నడవాలంటే.

‘మీ ఆయన లేనప్పుడు ఇక్కడ ఉండటం దేనికి?  మీ అమ్మోళ్ళ ఇంటికో, తమ్ముడి ఇంటికో వెళ్లి ఉండొచ్చు కదా.  ఒక్క దానివి.   ప్రతి వస్తువుకీ వెతుక్కోవలసి వస్తుంది నీకు.  పైగా ఒక్కదానివే ఉన్నావని పేరు మంచిది కాదు’అప్పటి దాకా అడపా దడపా సరుకులు సర్దుబాటు చేసిన పొరిగింటి ఇల్లాలు, ఇంక నన్ను అవీ ఇవీ అడగొద్దు అనలేక, ఇలా అన్నది.  పాపం, ఆమెక్కూడా కూడా, దాన ధర్మాలు, చీటికీ మాటికీ చే బదుళ్ళు ఇచ్చేంత జమిందారీ ఏమీ లేదు.

‘ఇంకోసారి ఇలాంటి సలహా వినగూడదు’మామ్మ ఆరోజు గట్టిగా అనుకుంది.  ఇల్లంతా వెతికింది.  అక్కడక్కడా రూపాయి, రెండ్రూపాయలు దొరికాయి.  పగిలిపోయిన ప్లాస్టిక్ ముక్కలు, అవసరం లేని పాత కాలపు ఇత్తడి గిన్నె, దొరికాయి.  మళ్ళీ భర్త వచ్చే వరకూ అవే అన్నం పెట్టాయి.  ఆ తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి ఐదు రకాల ఆలోచనలు చెయ్యడం అలవాటైంది.  మిగులు రూపాయి జాగ్రత్తగా దాచి, ఇబ్బంది వచ్చినపుడు వాడుకోవడం అలవాటైంది.  పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయేనాటికి చేతికి రెండు గాజులు, చిన్న బంగారు గొలుసు మెడలోకి వచ్చాయి.   వీధి మొత్తం లోకి పిసినారి అని పేరు వచ్చింది.

మామ్మకి రూపాయి అయినా లక్ష రూపాయలు అయినా ఒకటే.   ఒకే జాగ్రత్తతో చూస్తుంది.  రూపాయి నష్ట పోయినా, లక్ష (ఇప్పటికైతే లక్ష ఉపద్రవం రాలేదు) నష్ట పడినా ఒకేలా దుఃఖిస్తుంది.

‘ఏ రంగు చొక్కా వేసుకున్నాడు?’ఖాకీ చొక్కా, నీలం టోపీ తో ఇద్దరు పోలీసులోచ్చారు. అందులో ఒకతను అడిగాడు

‘పలక రంగు బనీన్ చొక్కా, జీన్సు ఫాంటు’మామ్మ గుర్తు చేసుకొని చెప్పింది

‘ఎంత వయసు ఉంటుంది?’పోలీసు వంక మామ్మ చూసింది.  పోలీసు బాగా ముదురు వయసతను.  జనాల వంక చూసింది.  ఇందాక దొంగని పట్టుకోవడానికి పరిగెత్తిన కుర్రాణ్ణి చూబిస్తూ,

‘ఇదిగో ఇంత ఉంటాడు’అంది.  పోలీసు ఆ కుర్రాడి వంక చూసి, అంచనా వేసి రాసుకున్నాడు.

‘బండి మీద ఉన్న వాడి వయసెంత?’

‘ఇద్దరూ ఒక్క ఈడు వాళ్ళే’

‘ఏ బండి మీద వచ్చారు?’

‘ఏమోనయ్యా.  నాకేం తెలుస్తుంది?’

‘ఏ రంగు బండి?’

‘సార్.  ఎర్ర స్ప్లెండర్ సార్’కుర్రాడు చెప్పాడు.

‘అంటే, నా బండి రంగా?  లేక పోతే ఇంకేదైనా షేడ్ ఉందా?’ఆ పోలీసు తన బండి వంక చూబించి అడిగాడు.

‘ఔన్ సార్.  ఇలాంటి బండే’

‘నంబర్ నోట్ చేశావా?’

‘లేదు సార్. స్పీడ్ గా వెళ్లి పోయారు’

‘మొబైల్ లో ఫోటో ఏదైనా తీశావా?’

‘లేదు సార్’

‘ఎవరైనా ఆ ఇద్దరిలో ఎవర్నైనా చూశారా?  గుర్తులు చెప్పగలరా?  గుర్తు పట్టగలరా?’జనాలు గోలగోలగా ఏదేదో మాట్టాడారు.  కానీ చివరికి అర్ధం ఏంటంటే, ఎవరూ వాళ్ళని సరిగా చూళ్ళేదు.  గుర్తు పట్టలేరు అని.

‘పొద్దస్తమానం కాలేజి కుర్రాళ్ళు ఈ బడ్డీ కొట్ల దగ్గర సిగిరెట్లు కాల్చడానికి వస్తన్నారు.  కాలేజి కుర్రాళ్ళు.  ఖర్చులు, అలవాట్లు, జల్సాలు!  అమ్మా, బాబు అంత డబ్బులు ఇవ్వరు.  ఊరిమీద పడతారు.  ముసలమ్మ ఒక్కర్తే ఉందని వాళ్ళల్లో ఎవడో కనిబెట్టాడు.   తెల్సి వచ్చినోడే.  తప్పకుండా తెల్సి వచ్చినోడే’నైటీ వేసుకుని గేటు బైటకి వచ్చి ఒక ఆంటీ నడుం మీద చేతులు వేసుకుని నిర్ణాయకంగా తల పైకీ కిందకీ ఊపుతూ చెప్పింది.

‘ముందు ఆ సిగిరెట్ల కోసం వచ్చే వాళ్ళు ఇక్కడే నిలబడిపోకుండా భయం పెట్టాలి.  అప్పుడు గానీ ఈ సందులో ప్రశాంతత ఉండదు’కొందరు డిమాండ్ చేశారు.

‘కుర్రాళ్ళు గంజాకి అలవాటు పడీ’పోలీసు అర్ధోక్తిలో ఆపేశాడు.  రాకూడని మాట అతని నోట్లోంచి వచ్చేసింది.  గుంపులో ఒకరిద్దరు ఆడాళ్ళు పసిగట్టారు.  కానీ ఏమీ అనలేదు.

‘చిల్లర కొట్ల దగ్గర కుర్రోళ్ళకి మీరు భయం పెట్టాల్సిందే.  లేక పోతే ఇలాంటి కేసులు ఇంకా ఎక్కువ అయిపోతాయి’మళ్ళీ అరిచారు.

‘భయం పెట్టండి భయం పెట్టండి అనేది మీరే.  తీరా వాళ్ళని స్టేషన్ కి తీసుకెళ్తే, ఓ దెబ్బెస్తే మళ్ళీ మీరే  వస్తారు  వదిలెయ్య మని.  తీస్కెళ్ళ మంటారా?  నాలుగు రోజుల్లో అందర్నీ ఏరి పారెయ్యమా’పోలీసు బెదిరింపుకి ఆడాళ్ళు వెనక్కి తగ్గారు.

‘భయం పెట్టమని అంటాము గానీ, పట్టికెళ్ళి అందర్నీ స్టేషన్ లో పెట్టి కొట్టమని కాదు మేం చెప్పేది’

‘అయితే మరి భయం ఎలా పెట్టాలో చెప్పండి’పోలీసు గొంతు పెంచాడు.  జనాలు ఇంకాస్త తగ్గారు.

సీరియల్ ఇల్లాళ్ళు కొందరు ఇంట్లోకి వెళ్లి పోయారు.  సైకిళ్ళు ముందుకి కదిలాయి.  బైక్లు కూడా.  సరసం ఈ గొడవకి విరసం అయినందుకు నీరసంగా నిట్టూర్చి పడుచు జంట తమ రోజువారీ పనుల్లోకి మనసుని మళ్ళించారు.

‘ఎంతైనా మామ్మ గారి ధైర్యం గొప్పది.  ఆ రోజుల్లో మంచి తిండి తిన్న వాళ్ళు.  దొంగనే విసిరి విదిలించి కొట్టేశారు.  ఈ రోజుల్లో ఎరువుల అన్నం, కూరలు తిన్న వాళ్ళైతే గడ గడ వణికి ఉన్నదంతా ఇచ్చేసేవాళ్ళు’మామ్మ ని వీధిలో చాలా మంది మెచ్చుకున్నారు.  పోలీసులు కూడా.  వాళ్ళ మెచ్చుకోలు అక్షర సత్యం.  ఆ సంగతి మామ్మకీ తెలుసు.

జనాలు పల్చబడ్డాక పోలీసులు ఇద్దరూ మామ్మ అరుగు మీద కూల బడ్డారు.  ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.

మామ్మ కొడుకు వచ్చాడు.  అతన్ని కూడా రక రకాల ప్రశ్నలు అడిగారు.  కాసేపు పోలీసులతో మాట్లాడి, అర్జెంట్ పని ఉన్నట్లు తల్లితో రహస్యంగా చెప్పి, ఆమె వారించే లోగానే అతను గబగబా  వెళ్లి పోయాడు.

పక్కింటి కుటుంబాన్ని కొన్ని విషయాలు అడిగారు.  రాసుకున్నారు.  ఇదే విధంగా యింతకు నెల ముందు ఇంకో ముసలవ్వ మీద దాడి చేసి ఇలాగే బంగారం లాగబోయారని తెలిసి, ఆ వివరాలన్నీ అడిగారు.

‘అప్పుడు ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు?’ఎవరూ ఏం చెప్పలేదు.  ఎక్కువమంది కూడా ఇంక అక్కడ లేరు.  సినిమా చివరకి వచ్చేస్తుంటే, కుర్చీల్లోంచి లేచి ముందుకు నడిచే ప్రేక్షకుల మాదిరి ఒక్కోరూ వెళ్ళిపోయారు.

టైం నాలుగు దాటి ఐదయ్యింది.  ఇంకా టైం అలా నడుస్తూనే ఉంది.    పాత వాళ్ళైతే పట్టేయోచ్చు కానీ, ఈ దొంగలు కొత్త వాళ్ళు.  అంత వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు కాదు.  బహుశా కాలేజీ కుర్రాళ్ళు.  ఖర్చులకీ, అలవాట్లకీ మరిగి ఇలాంటి చిల్లర దొంగతనాలకి దిగుతారు.   వీళ్ళని పట్టుకోవడం ఇంచు మించు అసాధ్యం.  ఇంక చేసే పని ఏమీ లేదన్నట్టు ఇద్దరు పోలీసుల్లో ఒకతను లేచాడు.   టోపీ సవరించుకున్నాడు. వస్తావా? అన్నట్లుగా పక్కనున్న రెండోపోలీసువంక చూశాడు.  నాకింకా చాలా పనివుంది అన్న మాదిరిగా మొహం పెట్టి రెండో అతను ఏదో రాసుకుంటున్నాడు.  మొదటతను వెళ్ళిపోయాడు.

రెండో పోలీసు అలానే అరుగు మీద కూర్చుని ఉన్నాడు.  ఏదో రాయడం, అడగడం.  టైం ఇంకొంచం గడిచింది.  ఎంతో కొంత, బహుశా చాలా సమయం గడిచాక ఆ రెండో పోలీసు కూడా వెళ్లి పోయాడు.

‘కదల కుండా అరుగు మీద కూచుని చచ్చాడు. ఎంతో కొంత ఇవ్వు, ఇంతో కొంత ఇవ్వు అని ఒకటే నస.  మా అబ్బాయి లేడయ్యా.  వెళ్లి పోయాడు.  నాదగ్గరేం లేదు అని చెప్పాను.  వింటేగా.  ఏం చెయ్యను.  కొంత చేతిలో పెట్టి పంపిచ్చాను.  వదిలిచ్చుకోవాలిగా శనిద్రాన్ని’మర్నాడు మామ్మ రుస రుసలాడింది.  కనబడిన ప్రతివారికీ ఈ సంగతి చెప్పింది.

‘ఎంత ఇచ్చావు?’చనువున్న కొందరు అడిగారు.  చెప్పలేదు.

‘పోనీలెద్దూ.  బండి వేసుకుని వచ్చి అందర్నీ ఎంక్వయిరీ చేశాడు కదా.  వదిలేయ్ ఇంక.  అతనికీ ఖర్చులు ఉంటాయి.  పెట్రోలు,  టీ, టిఫిన్లు ఎలా వస్తాయి?’

‘వచ్చి  నన్నేవైనా ఉద్ధరించాడా?  అతని ఉద్యోగం అది.  జీతం తీసుకుంటాడు, జీతానికి పని చేస్తాడు.  అయినా, నాబోటి ముసలి ప్రాణాన్ని పీడించి పట్టుకెళ్ళిన సొమ్ము ఏ మాత్రం కలిసోస్తదిలే.  ఆ బతుకు అలానే తగలడతది’మామ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటా కడుపులో బాధని వెళ్ళగక్కింది.

మొత్తానికి దొంగ విఫలం అయిన చోట పోలీసు విజయం సాధించాడు.

*

కృష్ణ జ్యోతి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • >> చాపల పులుసు; సున్నంలోకి ఎముకలు

    చాప వేరు చేప వేరు. ఎంత చాదస్తం గా వాడినా చాప అనేసరికి అర్థం మారిపోతుంది. ఎముకల్లో ఉండే మారో/గుజ్జు ను సున్నం అనే వాడుక ఉంది. అందువల్ల అది “ఎముకల్లో సున్నం.” మీరు రాసినది తిరగేసి. ఇటువంటి చిన్న తప్పులు కథ పంపించే ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి.

    కథలో మామ్మ సంగతీ, ఊరిసంగతీ కళ్ళకి కట్టినట్టు రాయడం బాగుంది. దొంగ దొరికినా దొరక్కపోయినా పోలీసు ఎప్పుడూ దొంగే. ఈ దరిద్రం మనకి బ్రిటిష్ వాడు అంటగట్టి పోయాడు దేశం వదిలేటప్పుడు. అందుకే ఏమీ చదువు రాని ఎమ్మెల్యేలకీ, మంత్రులకీ అయ్యేఎస్ ఆఫీసర్లు చెప్పులు తుడుస్తూంటారు కాబోలు.

    • తప్పు రాయడం వల్ల బోన్ మారో ని సున్నం అంటారని తెలిసింది. ధన్యవాదాలు శర్మ గారూ, మీ ప్రశంసకీ, మీరు సరి చేసిన విషయాలకీ.

  • ఎప్పటిలాగే పాఠకులనీ గుంపులో నిలబెట్టారు కృష్ణ జ్యోతి. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు