దేహం కోల్పోయిన చోట

“ఓ చిన్ని పాపా…

మనుషుల లెక్కల్లో స్త్రీలగా మనం మాయమై
దేహాల లెక్కలతో గుణించబడుతున్న చోట
ఎందుకమ్మా బట్టలు వేసుకుని నీ దేహాన్ని

నీది కాకుండా కాకుండా చేసుకున్నావ్

మనసు మీది గాయాల లెక్కలేవీ అక్కరకు రాని సమాజాన,
బట్టల కింద ఉన్న నీ రొమ్ములని ఎవరో చిదిమితేనో
ఇనుపచువ్వలు దించి నీ యోనిని ఛిద్రం చేస్తేనో
నీకెందమ్మా నొప్పి
వాళ్ళచేతుల్లో పీలికలైతేనేం
నీ వంటి మీద ఇంకా బట్టలున్నాయిగా…
చట్టప్రకారం నీ మానం చాలా సురక్షితంగా ఉన్నట్లే..
నయా మనువాద చట్టాల్లో నీ శీలం బహు పవిత్రమే…

బట్టల క్రిందన ఉన్నది నీ దేహమే అని నువ్వనుకుంటే
ఆ బట్టలు నీకు నువ్వుగా తీసేసి
అవతలి వాళ్ళ చేతులని వేయనివ్వాల్సింది
అప్పుడు కదా నీ మీద అత్యాచార యత్నం జరిగిందని చట్టం నమ్మేది
ఆగాగు…
అప్పుడు కూడా దాన్ని అత్యాచారం అనరమ్మాయీ…
ఇష్టపూర్వకంగా జరిగిన శృంగారంగా చెప్తారు..

మరి నీకేం దారి లేదా…
ఎందుకు లేదూ… ఉంది

రేపు నువ్వు తల్లివైనప్పుడు
పాలకోసం నీ బిడ్డ తన నోటిని నీ చన్ను మీద పెడతాడు చూడూ
అప్పుడు…
అప్పుడు చెప్పుకోవచ్చు నువ్వు నీ మీద అత్యాచారం జరుగుతోంది అని
ఎందుకంటే అక్కడ  ‘స్కిన్ టు స్కిన్ టచ్’ ఉందిగా

నా అనుభవాల నుండి నాకన్నీ తెలుసనుకుంటూ
ఇన్నాళ్లుగా నిన్ను జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ వస్తున్నాను కానీ
ప్రతిరోజూ తెల్లవారేసరికల్లా కొత్త విపత్తు ఒకటి
మనకోసం ఉంటుందన్న సంగతే మరచి పోయి
ఇన్నాళ్ళుగా నా బట్టల మాటున ఉన్నది నా దేహమని అనుకుంటున్నా
కానీ నీతో పాటే  నేనూ ఈ రోజే తెలుసుకున్నా
ఒక్క సారి బట్టలు వేసుకోగానే నా దేహం నాది కాకుండా పోతుందని…
వాటి మీద ఏ ముష్కరులు ఎన్ని చేతులు వేసి అడ్డ దిడ్డమైన పనులు చేసినా
వాటన్నిటినీ పవిత్ర స్పర్శలుగా పరిగణించాలని

అవును… ఇక్కడ ఏదైనా సాధ్యమే…
ఇది పురుషుల కోసమే నిర్మించబడ్డ ప్రపంచం
పురుషుల కోసమే రాయబడ్డ లోకం
తీర్పులిచ్చేది  స్త్రీ లైనా
రాయబడిన చట్టాలన్నీ పురుష పక్షమే…
పసికందువైతేనేం… యవ్వన వంతురాలివైతేనేం… వృద్దురాలివైతేనేం…
నువ్వొక స్త్రీవి… నేనొక స్త్రీని…
మనమంతా కొన్ని దేహాలం…
మన దేహాలన్నీ
మరొకరు తమ కోసం రాసుకున్న బానిసత్వాలు..
నీ, నా  జీవితమంతా
మరొకరు తమ కోసం రాసుకున్నపనితనం

ఓ పిచ్చిదానా
ఇక్కడ నీ పుట్టుకే నీది కానప్పుడు
నీకై కొన్నిహక్కులు ఉంటాయని
వాటికోసం న్యాయస్థానాలకి వెళ్లాలని
అనుకోవడం ఎవరి తప్పు…
నీది కాదూ…!

మరింకేం
ఈ కేసులో నిందితురాలివి నువ్వే!

*

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎందుకు దుక్ఖం వేస్తోంది ? ఎందుకేదో నొప్పిగా ఉంది ? ఉమా గారూ, మీలోని కవిత్వం కాదు, సంవేదనా విశ్వరూపి ఎవరో మహోగ్రంగా జడలు విప్పి నృత్యం చేశారు. బాధ మువ్వలు మోగి మోగి తట్టుకోలేక తెగిపోయాయి. చదివిని వాళ్ళల్లో నిందిత వేట మొదలెట్టాయి మీ వాక్యాలు.

  • చాలా బావుంది అని చెప్పడం కూడా చిన్నమాటే అవుతుంది ఉమా గారు..అభినందనలు మీకు

  • Efffffingly beautiful darling !
    Bit lengthy but ,right on the spot.
    Specially ఇదుగో ఈ లైన్స్ చదివినప్పుడు

    “నీ బిడ్డ తన నోటిని నీ చన్ను మీద పెడతాడు చూడూ
    అప్పుడు…
    అప్పుడు చెప్పుకోవచ్చు నువ్వు నీ మీద అత్యాచారం జరుగుతోంది అని
    ఎందుకంటే అక్కడ ‘స్కిన్ టు స్కిన్ టచ్’ ఉందిగా”.

    బాబోయ్ మన ఆడవాళ్ళు కనుక రాజ్యంగ ఇచ్చిన హక్కులు అవి ప్రకటించిన వాళ్ళ పట్ల నిజమయిన గౌరవం కలిగి ఉండి ఉంటే ,ఈ తీర్పు రాగానే పైన లైన్స్ ప్ల కార్డ్స్ మీద రాసి Manipuri nude protest కి దీటుగా ఇంకో ప్రొటెస్ట్ చెయ్యాల్సింది .Hmmm unfortunately రాజ్యాం గం కంటే మత పుస్తకాలు కత్రువు లు నమ్ముకున్న వాళ్ళు కదా ఇలాంటి తీర్పు లే వస్తాయి …మిగిలిన 99% సమర్ధిస్తారు సైతమున్నూ . ప్రపంచం మనల్ని చూసి దీనితో నవ్వుతుంది కదా అనిపించింది ఆరోజు ఆ తీర్పు కి. ఈ రోజు ఇదుగో ఇలా సమాధానం దొరికింది . Kudos girl. Way to go .

    నిశీధి.

    • Thanks nishi. I too felt that it’s a bit lenghthy. But couldn’t crop it. ఉంచేసా ఇంక

  • ఆగ్రహం, ఆవేదనా, ఆక్రోశం, బలమైన పదప్రయోగం వెరసి మీ ఈ కవిత ఉమాగారు. మీ కవిత్వం నాకు పరిచయమే కానీ ఇవాళ మరో ఉమాగారిని చూసాను.
    A genuine & natural response to the crisis. Congratulations

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు