దేశ ద్రోహితో… స్నేహం

రంజాన్ నాడు వాడు దారాలు దారాలుగా ప్రేమ పాయసం అయ్యేవాడు. బక్రీద్ దినాన దం బిర్యానీ రుచి చూపేవాడు. నెత్తిన పెట్రొ మాక్స్ లైట్లు మోస్తూ, కందిల్  తీసుకొచ్చే గుర్రం కళ్ళకు దారి చూపుతూ ట్యూబ్ లైటై రాత్రంతా సోంద్ షాహెద్ దర్గా ఉర్సులో తెల్లగా వెలిగేవాళ్ళం.

నా రేకు పలకను దూది పీరీ కత్తి పీరీ గంధం పీరీ బారిమాలుగా కత్తిరించి, ఆకాశం గుండంలో చుక్కల రాత్రి నిప్పుల అస్సోయ్ దులా ఆటలాడే వాళ్ళం. రైల్వే స్టేషన్ బయట మియాభాయ్ హోటల్లో మలాయ్ చాయ్ తాగుతూ వచ్చే పోయే రైళ్లతో అలయ్ బలయ్ మాటలయ్యే వాళ్ళం.

రైలు పట్టాలకు ఇవతల వన్ టౌన్ మా ప్రాంతం. పట్టాలకు ఆవల మా మేం చదివే సాములోరి సెయింట్ జోసెఫ్ స్కూల్. అక్షాంశ రేఖాంశాల్లాంటి మా ఇళ్ళను స్కూల్ ని గ్రీనిచ్ రేఖలా, రైలు పట్టాలు నిలువునా విభజించేవి. సిగ్నల్ అజీర్తితో ఊరిబయట అవస్థలు పడుతున్న సర్కార్ రైలో, మగ మహారాజు లాంటి ఎక్స్ ప్రెస్ రైళ్ళకు దారి తొలిగి సిగ్గుతో నిలబడ్డ గూడ్స్ బండో, చక్కెర బస్తాలు మోస్తున్న బడి చీమలకు అనధికార సెలవిచ్చేది.

అడ్డంగా ఆగిఉన్న రైలు పెట్టెల అడుగువెడల్పు కొలుస్తూ దూరి వెళ్ళేవాళ్ళం. వంగటం లేవటంలో సమతుల్యం లోపించినపుడు రైలు బోగి మా వీపున ఇనుప గోటి గాయాల సంతకం చేసేది. సెకండ్ షో చూసొచ్చి, అరుగుల మీద మిగతా సగం రాత్రినీ తెల్లార్చే వాళ్ళం. వేసవిలో వీధి అరుగుల మీద మంచాలు వాలు కుర్చీల్లో నిద్రించే వాళ్ళకు కలల కధలు చెప్పే వాళ్ళం.

వాడి పలకమీదే కదూ నేను అలీఫ్ బే అక్షరాలు దిద్దింది. వాడి నోటి దువాలోనే కదూ లా ఇల్లాహీ…బిస్మిల్లాహీ నేర్చింది. వాళ్ళింటికొచ్చే గీటు రాయి పత్రికలోనే కదూ మొదటి సారి సూఫీని కనుగొంది. నన్ను అరేయ్.. అనిపిలుస్తున్నప్పుడు వాళ్ళ నాన్న విని “బేటా.. మత్ బోల్ నా ఐసా .. భాయ్ బోల్ నా” అన్నాడు.

ఇదిగో నిన్నటి వరకూ అలానే అన్నాడు. మా మొదటి పరిచయం రోజు మురికి బట్టల మా మూడో తరగతికి హంస దుస్తుల్లో వచ్చాడు. కట్ట కట్టుకొచ్చిన పూల గుత్తిలాంటి అతన్ని శ్వాసిస్తూ అడిగాం ఏంట్రా.. మస్త్ సెంటు గింటు కొట్కచ్నవ్ ఊరు బోనీకి తయారైనవా ఏందని అడిగినం.

అవ్ … నమాజ్ కి బోవాల గదా నేను ఇయ్యాళ్ళ…నమాజ్ అంటే ఏంటి అని నేను అడుగుతుంటే…

పువ్వు పొర లాంటి తన చెవ్వి అరలో దాచిన అత్తరు దూదిని నా చెంపలకు మెత్తగా రాస్తూ,  “తుం భీ ఆయేగా మేరే సాథ్” అన్నాడు వాడు.

ప్రతి రంజాన్ కు అలాగే అడిగే వాడు.  కానీ నిన్న నన్ను అలా అడగకుండానే వాడొక్కడే వెళ్ళిపోయాడు నాకు ద్రోహం చేసి– ఈ రోజు ఖబరస్థాన్ వైపు వెళ్ళాను వాడ్ని చూసొద్దామని.. గాలి గంపలో పూలను తెచ్చినట్టు వాడి కదలిక సుగంధం అక్కడ.

వాడ్నెవ్వరో దేశద్రోహి అన్నారు. ఆ మచ్చ చెరుపుకోలేక పోయాడు. అందుకే వాడు అలిగి వెళ్ళి పోయాడు. విచారణ లేదు నిర్ధారణ కాదు. హఠాత్తుగా ఫత్వా -అతని నుదుటిన దేశ ద్రోహి ముద్ర.

ఈ దేశం నా మాతృ భూమి అనే కదా బడిలో ఇద్దరం చేయి చాపి ప్రతిజ్ఞ చేశాం!  అదాట్టుగా అతను దేశ ద్రోహి ఎపుడయ్యాడో తెలియదు. హటాత్తుగా అతనిపై మోపబడిన నిందారోపణ యేమిటో  తెలియదు. అతని భార్యా పిల్లల్ని చూసొద్దామని వెళ్ళాను. వారి వెనుక పొంచి ఉన్న కాషాయం కమలం త్రిశూలాల్ని చూశాను.

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

శ్రీనివాస్ సూఫీ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Wow sir congrts దేశద్రోహి తో స్నేహం రంజాన్ సందర్బంగా చదివినట్టు అనిపించింది ప్రతివాక్యం సెంట్ పూసుకున్న కొత్తకుర్తాలా వెలిగిపోతోంది ,ఇలాగే మీరు రాయాలి మేము చదవాలి నిజంగా your poem awsom

  • కులమూ, మతమే కాదు, ఆఖరికి ఉగ్రవాదమూ రాజకీయ ఆట వస్తువుగా మారినప్పుడు ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో! ఇది కథ కాదు, కవితా కాదు సంఘంలో ఘనీభవించిపోయిన చేదు వాస్తవానికి దర్పణం. రచయితకు అభినందనలు.

  • షీర్ కుర్మా తాగుతుంటే మధ్యలో ఉప్పుగల్ల తగిలినట్లు ఉంది.కవిత,బొమ్మ బాగున్నాయి.

  • కవిత ముస్లిం సమాజం పట్ల గొప్ప సహానుభూతిని వ్యక్తం చేసింది. భాషలో గొప్ప ఆర్తి వుంది. ఇలాంటి సాహిత్యం అన్ని రూపాలలో ఎక్కువగా రావాలి. అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు