కుక్కరు కథ!
అనగనగా ఒక కుక్కరు. ఆ కుక్కరుకింద హోమపు అగ్నికీలల బుగబుగలు. ఆ కుక్కర్లో కుతకుత వుడికిపోతున్నారు ప్రజలు.
ఆ కుక్కరుకి ఒక సేఫ్టీ వాల్వ్. ఆ వాల్వ్ అవసరం లేదనుకున్నాడు ప్రధాన వంటగాడూ అతని జట్టూ.
ప్రెజరు కుక్కరు పేలిపోతుందన్నారు న్యాయం చెప్పిన పెద్దమనుషులు. సాక్ష్యంగా కుక్కర్లో ఆర్తనాదాలు.
కుక్కర్లో కిక్కురుమనకుండా వుంటే ప్రజాస్వామ్యాన్ని వండి ప్రసాదంగా పెడతామన్నారు వంతగాళ్ళు.
కుక్కరు పేలిపోతే ప్రజాస్వామ్యం మాత్రం మిగులుతుందా తునాతునకలయిపోదూ అన్నారు పెద్దమనుషులు.
కాదనలేక కుక్కరుకు సేఫ్టీ వాల్వ్ అప్పటికి తగిలించారు.
ప్రజలు మెత్తగా ముద్దగా నుజ్జునుజ్జుగా మళ్ళీ కుతకుత వుడికిపోతున్నారు.
సేఫ్టీ వాల్వ్ లోంచి నిరంతరం వచ్చే శబ్దం కమ్మని సంగీతంగా అలవాటు చేసుకోవాలని ఆస్వాదించుకోవాలని వంటగాళ్ళకిప్పుడు వంటబట్టింది?!
సేఫ్టీ వాల్వ్!
‘భిన్నాభిప్రాయం, నిరసన హక్కులనేవి ప్రజాస్వామ్యానికి సేఫ్టీవాల్వ్ లాంటివి, కాదని మీరు అణగదొక్కితే యేదో వొక రోజు ప్రజాస్వామ్యం ప్రెజర్ కుక్కర్లా పేలిపోతుంది..’
‘సుప్రీం కోర్టు తీర్పుకూడా సేఫ్టీ వాల్వే’
ఆరా’య్!
ఒకడు అదే పనిగా తుమ్ముతున్నాడు. అప్పుడప్పుడూ దగ్గుతున్నాడు. మధ్య మధ్యలో ముక్కు చీదుతున్నాడు. చీముడు వేళ్ళని చొక్కాకి రాసుకున్నాడు.
చూసిన ఇంటలిజెన్స్ వాళ్ళు చుట్టుముట్టారు.
అతడేదో కోడ్ లాంగ్వేజులో మాట్లాడుతున్నాడని!
సహజావస్థ!
నేనేం ఆలోచించాలో యెలా ఆలోచించాలో చెప్పాడు.
ఏం తినాలో కూడా చెప్పాడు.
వాడు చెప్పినట్టు విన్నాను. చెప్పిందే తిన్నాను.
కాని తిన్నది తెల్లవారి ముడ్డoట యేరిగేశాను, యెలా?!
అర్బన్ నక్సలైట్!
‘నువ్వు తాగుతావా?’
‘లేదు’
‘పేకాట?’
‘రాదు’
‘అమ్మాయిలు?’
‘ఉహూ’
‘నువ్వు జన జీవన స్రవంతిలో లేవు’
‘వాట్?’
“నో డౌట్.. హి ఈజే ఏ అర్బన్ నక్సలైట్!
‘సార్..’
‘అరెస్ట్ హిమ్’
రూరల్ నక్సలైట్!
‘ఎవిడెన్సు వుందిగా?’
“యస్సార్ వుంది సార్..’
‘ఏంటది?’
‘గిట్టుబాటు ధర కల్పించండి.. రైతు ఆత్మహత్యల్ని ఆపండి.. కౌలు రైతులకు రైతుబంధు పధకం వర్తింపజెయ్యాలని..’
‘చాలు.. లోపల వేసేయ్ కొడుకుని’
చైల్డ్ నక్సలైట్!
భూమి గుండ్రంగా వుందని చదివిన పాఠమే చెప్పింది పాప.
పైగా భూమిని చాపలా చుట్టడమేమిటి? అని కూడా ప్రశ్నించింది.
అయితే పాపం ఆ పాపకు తెలీదు.. తను చైల్డ్ నక్సలైట్నని!
ఉమెన్ నక్సలైట్!
వంట వచ్చిన వాళ్ళకే తినే హక్కుంటుంది అందావిడ.
వొకపూట నువ్వు వంట చెయ్.. వొకపూట నేను వంట చేస్తానని వంతులేసింది.
చాలక పిల్లల పెంపకం పెనిమిటి పెళ్ళాల యిద్దరిదీ అని తెగేసి చెప్పింది.
ప్రభుత ఆ భార్యని నక్సలైట్ చేసినందుకు ఆ పురుష పుంగవ భర్త సంతోషించాడు కూడా!
మెన్ నక్సలైట్!
అతడు ఆఫీసుకు వేళకు వచ్చి వేళకు సాయంత్రం ఐదు గంటలకు యింటికి వెళ్ళిపోయాడు.
రూల్స్ ప్రకారం పనీ శాస్త్రం ప్రకారం పిల్లలూ పుట్టరని అన్నప్పుడు తలవంచుకున్నాడు.
అధికారులతో కూడి తన పర్సంటేజీ లంచం తాను తీసుకోనప్పుడు తలెత్తుకున్నాడు.
తేడాగా వున్నాడని గ్రహించి అనుమానించి వుద్యోగుల్లో కూడా నక్సలైట్లు తయ్యారయ్యారని పై అధికారులకు నివేదికలు పంపించారు!
దళిత నక్సలైట్!
బీఫ్ తిన్నాడు.
బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు.
రోహిత్ వేములను గుర్తుకు తెచ్చాడు.
బ్రహ్మణ అగ్రహారమైపోయిన విశ్వవిద్యాలయంలో నలుగురినీ పోగేసి కుల ధిక్కారాన్ని ప్రశ్నించాడు.
హెచ్సియ్యూ జేఎన్యూ తీవ్రవాదులతో నిండిపోతున్నాయని అతన్ని సస్పెండ్ చేశారు!
థర్డ్ జెండర్ నక్సలైట్!
నేనే ఆడన్నాడు.
నేనే మగన్నాడు.
అర్థనారీశ్వరుణ్ణి పూజించినవాళ్ళు వొప్పుకోలేదు.
తమకీ హక్కులు వుంటాయని అడిగినందుకు ఆ థర్డ్ జెండర్ నక్సలైట్ అయిపోయాడు!
మైనారిటీ నక్సలైట్!
ఈ దేశంలో పుట్టినా మైనారిటీ అయినందుకు నిరంతర కాందీశీకుడయాడు.
నిరంతర దేశభక్తిని నిరూపించుకోలేని అభద్రజీవయాడు.
జైహింద్ చెప్పలేదు.. అనుమానం అక్కర్లేదు.. మైనారిటీ నక్సలైట్ అయిపోయాడు!
అయితే వోకే!
‘అవి నకిలీ ఉత్తరాలు’
‘నకిలీ నకిలీ నకిలీ.. ఈ ప్రజాస్వామ్యం నకిలీదనేగా మీ వుద్దేశం?’
‘నేననలేదు’
‘మాకు తెలుసు యిది నకిలీ ప్రజాస్వామ్యం.. అదే మీ వుద్దేశం!’
దిద్దుకున్నారు!
బొట్టు లేదని దూషించి బొట్టు దిద్దారు.
ఆమె విడో అన్నారెవరో.
విడో యెలా పెట్టుకుంటుందని బొట్టు చెరిపేశారు!
ఘోరమైన నేరం!
‘మా అమ్మనీ అమ్మమ్మనీ ముద్దముసలి జేజమ్మనీ అరెస్టు చేశారు’
‘ఏం చేశారు?’
‘రామకోటి రాయలేదు!’
వాసన!
‘నీకు ఉద్యోగం వొచ్చేసింది కదా?’
‘ఉ..’
‘మరి ఇన్ని పుస్తకాలెందుకు చదువుతున్నావు?’
క్లారిటీ!
‘సార్.. వాడు మార్క్స్ ని పూజిస్తున్నాడు..’
‘పూజ’ చేస్తే మన సాంప్రదాయం వాడే, ఆచరణలోకి దిగితే ఆలోచించాలి’
శివ శివ..
ఒకడు యెప్పటిలాగే యింట్లోకి అడుగుపెట్టబోతూ కాళ్ళు కడుక్కున్నాడు.
అంతే, అతని రెండు కాళ్ళూ ఖండించారు.
శివుని నెత్తిమీది గంగని కాళ్ళమీద పడేలా చేస్తావా? అని శివాలెత్తారు!
రామ రామ..
‘ఎందుకతన్ని అంతలా చావ బాదుతున్నారు?’
‘ఈ హిందూ ద్రోహి చేసిన పని యే వొక్కడూ చెయ్యకూడదు!’
‘ఏం చేశాడు?, గోవు..’
‘కాదు, ఎలకని చంపాడు..’
‘ఊ?’
‘వినాయకుడి వాహనమైన ఎలకని చంపాడు.. అందుకే!’
సో.. దా!
ఇంట్లోని రచనలూ కంప్యూటర్లూ ల్యాపుటాపలూ పెన్ డ్రైవులూ తీసుకుపోయారు పోలీసులు.
కాని ఆ రచయిత బుర్రలో బోలెడు రచనలు అలాగే వుండిపోయాయి!
ముక్కు పక్కు!
ప్రభుత్వం అంటే అస్సలు లెక్కలేదన్న ఆరోపణలతో అరెస్టయ్యాడొకడు.
కోర్టులో రుజువు చేసే వాదనలు ప్రారంభమయ్యాయి.
ముక్కులో పక్కు తీసి కింద పడేసాడని ప్రధాన అభియోగం. అతడు ఆ ముక్కు పక్కుని ఎడమ చేతివేళ్ళతో తీసాడు గనుక అతడు లెఫ్టిస్ట్ అని. ముక్కు అనేది దేశమని. పక్కు అనేది ప్రజాస్వామ్యమని. పక్కుని గోటితో తీసాడని. అది గోలు కాదని. గొడ్డలని. హింసకు ప్రేరేపించాడని. వేలికి అంటిన రక్తపు చెమ్మతో అతడు తీవ్రవాదని. అంతిమంగా అతను ప్రజాస్వామ్యాన్ని అవమానించాడని.
పోలీసులు వెతికి పట్టి తెచ్చిన పక్కుని పరిశోధనలకు పంపించారు.
అయితే అంతవరకూ అతణ్ణి హౌస్ అరెస్టులో వుంచారు!
కిడ్ నక్సలైట్!
ఆగంతకులు ఇళ్ళల్లో దూరారు. ఫోనులు తీసేసుకున్నారు. పోలీసులకు ఫోను చెయ్యబోతే వద్దు అన్నారు. కంప్యూటర్లూ లాక్కున్నారు. ప్రతిగదినీ జల్లెడపట్టి వెతికారు. పిల్లల బొమ్మల్నీ వదల్లేదు. పుస్తకాలనీ వదల్లేదు. ఇల్లు పీకి పందిరేశారు.
‘నాన్నా.. మనింట్లో దొంగలు పడ్డారా?’ అని అడిగింది పాప. ‘కాదు పోలీసులు..’ చెప్పాను. ‘వాట్?’ అనుమానించారు ఆ ఆగంతకులు. మరాఠీ రాదు గనుక యింగ్లీషులో పాప అనుమానమూ నా సమాధానమూ చెప్పాను.
‘గుడ్.. కిడ్ నక్సలైట్’ అని మా పాపని మెచ్చుకున్నారు!
నువ్వు వొక్కడు కాదు!
నోటి మీద వేలేసుకు కూర్చున్నాడొకడు.
ఒక్కడే కూర్చున్నాడు.. మరొకడ్ని కలిస్తే 144 విదిద్దామనుకున్నారు.
నీడ మీద నిఘాపెట్టి అతను వొక్కడు కాదని అరెస్టు చేశారు!
ఇంటినుంచి విప్లవం!
‘వచ్చే ఎన్నికల్లో యధాతధ పార్టీలు వొచ్చి యధాతధ స్థితి కొనసాగితే?’
‘ఇక సండేల్లో హాలీడేల్లో మీటింగ్స్ పెట్టుకోనక్కర్లేదు..’
‘ఊ?’
‘ఆ.. ఎఫ్బీలో ఎంచక్కా లైక్ కొట్టి వాట్సప్పుల్లో షేర్ చేసుకోవచ్చు’
‘…………………………………………………………………………’
కుట్ర!
‘పులి బుట్ర కథ తెలుసా?’
‘ఊ.. తెలుసు!’
‘బుట్రంటే?’
‘ఏమీలేదు.. లేనిది వున్నట్టు భ్రమ.. అంతే’
‘అంటే బుట్రంటే కుట్రన్నట్టేగా!?’
(దేశవ్యాపిత అక్రమ అరెస్టులను నిర్బంధాన్ని నిరసిస్తూ)
Surrendered Naxal Pahad Singh on Maoist propaganda and how ideologues are responsible for bloodshed
Surrendered Naxal Pahad Singh says arrested ‘activist’ was present at high ranking meeting of CPI Maoists
Pahad Singh: Heard senior members talk about the ‘activists’ arrested, unarmed Urban Naxals same as gun toting Naxals
Maoism is about genocide of Tribals, the ‘jobless intellectuals’ are hypocrites: Surrendered Naxal Pahad Singh
మావోయిస్ట్ ప్రచారం మరియు భావజాలంం రక్తపాతానికి ఎలా దారితీస్తున్నాయి – లొంగి పోయిన నక్సలైట్ పహాడ్ సింగ్
మీరు ఇటువంటి వీడీయోలు,పేపర్లో వచ్చే వార్తలను ఎన్ని చూపించినా అధి రాజ్యం వాళ్లపై కుట్రలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్నాదని పట్టించుకోరు. అంతెందుకు ఆ ప్రజాస్వామ్య వాదులు వారి పార్టిని విడీన తరువాత కొండపల్లి సీతరామయ్యనే చనిపోతే ఆయననే పట్టించుకోలేదు
నీడ మీద నిఘా పెట్టీ అతను ఒక్కడు కాదని అరెస్టు చేశారు…bajaraa గారు ఇలాంటి గొప్ప కల్పికలు రాయడం మీకే సొంతం…అభినందనలు
మీదైన శైలి లో చాలా బాగా రాశారు బజారా గారూ