నాక్కొంచెం
ఆకాశం కావాలి
కొద్దిగా చంద్రుడు
కొన్ని నక్షత్రాలు కూడా
ఎల్లలు లేని నింగి మీద
నేను
స్వేచ్ఛగా ఎగరాలి
స్వేచ్ఛగా
నాక్కొంచెం
నేల కూడా కావాలి
చుట్టూ కంచెలు లేని నేల
నేను పులినెత్తురు తాగిన నేల
దేవుడు పుట్టని నేల
ఎలాంటి ఆంక్షలు లేకుండా
చిన్నారులు సంతోషంగా ఆడుకునే నేల
రుజువులన్నీ చెరిపేసి
నిబ్బరంగా నడవాలి
నిబ్బరంగా
బారులు బారులుగా తిరిగే
చీమలతో జట్టు కట్టాలి
తూనీగల వీపుమీద కూర్చొని
ఊరంతా సంచరించాలి
నాక్కొన్ని
రంగులు కావాలి
గిరగిరా తిరిగే బొంగరమ్మీది రంగులు
కన్నుల గోడల మీద
బొమ్మలు గీయాలి
మాట్లాడే బొమ్మలు …!
*
Add comment