ఓ రాత్రివేళ
నిద్ర పట్టని దేవుడు కొలను గట్టు మీద నడుస్తున్నాడు
ఎంచేతనో ఆ రోజు
తామరలు విచ్చుకోలేదని తోచింది
కలువలు కూడా
ఇంకా అలాగే ముకుళించుకుని ఉన్నాయి
ఆకాశం మబ్బుగా ఉంది
రోజూ ప్రసాదాలు తిని నోరు వేరే రుచి కోరుతోంది
దేవుడికి!
దూరంగా నేరేడుపళ్ళు
చీకట్లో కూడా నిగనిగలాడుతూ కనిపించాయి
అక్కడే చెట్టు మీద
తనలాగే నిద్రపట్టని కోతిని బతిమాలితే
కొన్ని పళ్ళిచ్చింది!
అవి తినేసి గుడిలోకెళ్ళిపోయాడు!
తెల్లారుతోందనగా గుర్తొచ్చింది
నాలుక రంగు చూసుకోలేదని…
కళ్ళు తెరిచి చిన్న పిల్లాడిలా ఇలా నాలుక జాపాడో లేదో
భళ్ళుమని గర్భగుడి తలుపు తెరుచుకుంది!
ఉన్నపాట్నే బొమ్మైపోవాల్సొచ్చింది!
ఇంక చూస్కోండి
దేవుడిక్కోపం వచ్చిందోహోయ్ అంటూ
ఒకటే హడావుడి!
ఊరంతా జాతరే జాతర!
*
Good. Jaathare
🙂