దేవయ్య

ప్రేమ కథలు రాయాలని ఉన్నా, వాటి కన్నా సామాజిక అంశాల కథలే ఎక్కువ తృప్తి నిస్తాయి

సోయి లేకుండా పండుకున్న నేను తదేకంగా కొడుతున్న తలుపు చప్పుడు కి లేచి తలుపు తీశాను. తలుపు ముందు…. దేవయ్య, రాజమ్మ ఉన్నారు.
“అంకుల్, మీరేంది…గింత పొద్దుగాల్నే…?”
ప్రశ్నార్థకమైన నా ముఖాన్ని చూసి

“రూం లో అందరున్నారా…బిడ్డా.?” అన్నడు దేవయ్య.
ఊ…అన్నాను.
“ఏం లేదు బిడ్డా….” కొంచెం తడబడుతూ బాధతో కూడిన గొంతుతో
“మీ రంతా హాస్టల్ ఖాళీ చేయాలె బిడ్డా…” దేవయ్య మాటకు నిద్రమత్తు వదిలింది.
“ఇప్పటికిప్పుడు ఇంత హడావిడి గా చెబితే అట్లెట్ల ఖాళీ చేస్తం…?”అయోమయంగా అడిగాను.
“అయ్యో బిడ్డా…గిప్పుడే కాదు. ఒక వారంల చేయండి…..” అంది రాజవ్వ.
“ఐనా ఎందుకు గట్ల….?” అర్థం కాక అడిగాను.
“హాస్టల్ అమ్ముకున్నాం బిడ్డా….” బాధగా చెపుతున్న దేవయ్య మాటలు భారంగా అనిపించాయి.
దేవయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి.
“గింత సడెన్ గా చెప్పినందుకు ఏమనుకోకుండ్రి. కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి ..బాంచెన్ …” అని అన్నం పెట్టిన చేతులతో దండం పెడుతున్న రాజవ్వ చేతులను వద్దని పట్టుకున్న.

“మీ రూమోళ్ళంతా ఇంకా లేవనట్టున్నరు..! నువ్వే వాళ్ళకు జర అర్థమయ్యేలా చెప్పాలి బిడ్డా…యాదికుంచుకో.”  అంటూ దేవయ్య తలకు కట్టుకున్న తువాలు తీసి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

***
నాలుగేళ్ల కిందట……
యూనివర్సిటీ లో సీటు వచ్చిందని ఎగిరి గంతేసిన నేను, క్యాంపస్ లో సీనియర్లు చూపించిన చుక్కలకు అన్నీ మూసుకుని పిల్లి కూనలెక్కయిన.
ఒక రోజు రాత్రి హాస్టల్లో నీళ్ళు నింపుకుని పోతుంటే బాటిల్ గుంజుకున్నడు ఒక సీనియర్. వాడి వెనకే ఇంకో నలుగురు.
అప్పుడు వచ్చిండు దేవయ్య నన్ను కాపాడనీకి….
హాస్టల్ వార్డెన్ ను కొంత మంది సీనియర్లు సినిమా కు తోలినపుడు జూనియర్లను దేవయ్యే కాపాడేది.

“అరేయ్…ఏం మనుషులురా మీరు. చిన్న పోరగాళ్ళను చేసి ఆడుకుంటార్రా..ఛల్.” అంటూ సీనియర్ల మీదకి వచ్చిండు

“అరే..దేవన్న. ఏం లేదే. పొలగాడు మా ఊరోడే. ఉత్తగనే మాటాడుతున్నం. “అన్న సీనియర్ మాటలు లెక్క చేయకుండా….

“నాకు తెలుసు లే. మీ ముచ్చట్లు. నడుండ్రి ఈన్నుంచి…” కొంచెం కోపంగా అని నా చేయి పట్టుకొని అక్కన్నుంచి గుంజకపోయిండు.

దేవయ్య,రాజవ్వ మొగడుపెళ్ళాలు. వాళ్ళే హాస్టల్ మెస్ చూసుకుంటారు. రాజవ్వ చేతి బువ్వ మంచి రుచుంటది.
ఒక  సారి మంగళవారం మెనూ, టైం టేబుల్ ప్రకారం టిఫిన్ దోశ చెయ్యాల్సింది బోండాలు చేశారు. బొండా మీదంతా బాగానే వేగింది. కానీ లోపల పిండి పిండి గా ఉందని కొంతమంది సీనియర్లు లొల్లి కి దిగినరు. అందులో ఒకడు పెద్ద గిన్నె డు చెట్నీ కింద పారబోసిండు. ఆ గొడవకు అందరూ డైనింగ్ హాల్లో గుమికూడారు.
నేల పాలైన చట్నీ చూసి దేవయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ కోపంలో చట్నీ పారబోసినోడిని గట్టిగ కొట్టిండు. హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది.

“రోజూ బకెట్లకు బకెట్ల అన్నం పారబోసే మీకు ఏం తెలుస్తుందిరా….ఆ అన్నం విలువ..? ఆ బియ్యం పండించిన రైతు కష్టం, అది వండి పెట్టే మా గోస…ఎలా తెలుస్తుంది రా..?”  బాధ పడుతూ అక్కన్నుంచి వెళ్ళిపోయాడు దేవయ్య.
ఆ తర్వాత ఎగ్జామ్ కి టైం అవుతుండడంతో గబగబా అన్నం తింటున్న. రుచి తేడా కొట్టింది. అది రోజూ తినే రాజవ్వ చేతి వంట కాదు…..వేరెవరిదో.!
ఆరా తీస్తే అప్పుడు తెలిసింది. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అప్పటిదాకా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులనా తీసేసి తన మనుషులని పెట్టించాడని.
రాజకీయ నాయకులు యూనివర్సిటీ ల మీద పడితే వీసిలు, డీన్లు, ప్రిన్సిపాళ్ళే మారిపోతరు. ఇంగ వంట చేసేటోళ్ళు ఎంత..?
****
బీటెక్ అయిపోయాక జాబ్ తెచ్చుకుని, కంపెనీకి దగ్గరగా ఉండాలని, గచ్చిబౌలిలోని హాస్టళ్లు చూస్తున్నపుడు అనుకోకుండా ఓ హాస్టల్లో దేవయ్య కనిపించిండు. నన్ను గుర్తుపట్టడం నాకు ఇంకా సంబురమనిపించింది. కళ్ళుమూసుకుని ఆ హాస్టల్లో జాయిన్ అయ్యాను.
“హాస్టల్ ఫీజు జరంత తగ్గియ్యరాదే….?”అని అడిగిన.
“గీ గచ్చిబౌలిలో అంతే. పిండిని బట్టే రొట్టె. ఇక్కడ అన్నీ బాగా ఖరీదు. కర్సులు పోను నాకు మిగిలేది చిల్లరే. కావాలంటే నువ్వే లెక్క చెయ్యి…. ” అని పరిస్థితి మొత్తం వివరించిండు.
యూనివర్సిటీ హాస్టల్ తో పోలిస్తే ఇక్కడ వీళ్ళకు పనెక్కువ. హాస్టల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉద్యోగస్తులే. పొద్దున్నే టిఫిన్ తో పాటూ లంచ్ బాక్స్ కోసం అన్నం,కూర చేసి పెట్టాలె. నార్త్ ఇండియన్స్ కోసమైతే రెండు పూటలా చపాతీలు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ వాళ్ళకోసం వేరు వేరుగా రూంలు సర్దాలె. ఇవేకాక దోబీ, రూం లు, బాత్ రూమ్ లు కడుగుడు ఉంటది. గచ్చిబౌలి ఏరియాలో నీళ్ళకు కరువు. ఎంత కష్టపడినా ఏదో ఒక కంప్లైంట్ వస్తనే ఉంటది.
ఒకరోజు ఆఫీసు లో క్లయింట్ మీటింగ్ బాగా లేటయింది. హాస్టల్ వచ్చేసరికి లిఫ్ట్ గేట్ ఐదో ఫ్లోర్ లో ఎవరో సరిగ్గా వేయక ఆగిపోయింది.
గ్రౌండ్ ఫ్లోర్ లో నేను లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న. పక్కనే దేవయ్య వాళ్ళు ఉండే రూమ్.
ఉతికిన బట్టలు ఇస్త్రీ చేస్తుండు దేవయ్య. లోపల మంచంల కూచున్న రాజవ్వతో….
” ఏందే రాజం. నీ నడుం బాగా ముడతపడింది. నా చేతులతో ఇస్త్రీ చేయనా..? వెచ్చ గుంటది….” సరసమాడిండు దేవయ్య.
సిగ్గుతో రాజవ్వ…. “నువ్వు చేబట్టే నా నడుము నలిగిపోయింది. పిండి పిసికినట్లు పిసుకుతవు….” అంటూ నవ్వింది.

“ఎంతైనా నీ నవ్వు చూస్తే చాలే. ఎంత కష్టమైనా మర్సిపోత…”
వాళ్ళ మాటలు విని నాకే సిగ్గేసింది. ఇంతలో లిఫ్ట్ కిందకు వచ్చింది.
బాయ్స్ హాస్టల్ కావడంతో కొంతమంది అర్ధరాత్రి తాగొచ్చి రాజవ్వ గురించి అసహ్యంగా మాట్లాడడం, దేవయ్య వాళ్ళతో గొడవ పడడం జరిగేది.ఎలాంటి సమస్య వచ్చినా,  ఎంత కష్టమైనా వాళ్ళ మొఖాళ్ళో చిరునవ్వు మాత్రం పోనిచ్చేవాళ్ళు కాదు.
“అవునంకుల్. యూనివర్సిటీ హాస్టల్ వదిలేసినంక ఏమైపోయిండ్రు..?” అని అడిగితే

“ఇదే గచ్చిబౌలి లో టిఫిన్ సెంటర్, హోటల్ మొదలుపెట్టినం. మొదట్లో బానే నడిసింది. కానీ ఆఫర్ల మోజులో అంతా ఆన్ లైన్ లోనే కొనబట్టే. గిరాకీలు తగ్గిపోయినయి, హోటల్ బంజేసినం….” దేవయ్య చెప్పింది విని చాలా బాధనిపించింది.
ఇంతలో ఒకాయన పోలీసులతో వచ్చి దేవయ్య మీద లొల్లికి దిగిండు. హాస్టల్లో ఉండే ఒక పిలగాడు హాస్పిటల్ పాలైండట. డాక్టర్లు ఫుడ్ ప్రాబ్లం అని చెప్పారట. అందుకే ఆ పిలగాని తండ్రి పోలీసులతోని లొల్లికి దిగిండు. నిజానికి నాకు కూడా ఈ మధ్య పానం బాగుండటం లేదు. రాత్రి పూట కడుపు నొప్పికి నిద్ర పట్టేది కాదు. కారణమేందో అర్థం కాలేదు.
***

ఇది జరిగిన మూడు రోజులకే దేవయ్య అందరినీ ఖాళీ చేయమన్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫ్రెండ్ రూం కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికే దేవయ్య హాస్టల్ ఖాళీ ఐపోయింది.

మా రూం లో వండుకున్న వంటలు గొంతు దిగతలేవు. నా ఇరవయ్యేళ్ల జీవితంలో మా అమ్మ వంట తర్వాత ఎక్కువుగా తిళ్ళది రాజవ్వ చేతి వంటనే…
ఓ రోజు పేపర్లో న్యూస్… ప్యాకెట్ నూనెలు విషవలయాలు. నగరం లో విస్తరించిన కల్తీ నూనె ప్యాకెట్లు…..అని ఒక ప్రముఖ బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల గురించి వార్త. అది కల్తీ నూనె అని తెలియక వాడిన దేవయ్య, రాజవ్వల జీవితాలు అల్లకల్లోలం అయిపోయినయి.
రూం లో ఫుడ్ నచ్చక ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన. అది తెచ్చిన డెలివరీ బాయ్ గా దేవయ్యను చూసి షాక్ అయ్యాను

***

   కదిలించిన సంఘటన లోంచే కథ పుడుతుంది

ప్రముఖ కథా, నవలా రచయిత కేవీ నరేందర్ వారసుడు మన్ ప్రీతమ్. చాలా చిన్న వయసులోనే కలం పట్టి కథలు రాస్తున్నారు.  మొదటి కథ నవ్య వార పత్రికలో అవయవ దానం పై వచ్చిన దానం. ఈ కథ పలువురి ప్రశంసలతో పాటూ తెలంగాణ కథా సంకలనం దావత్ కి ఎంపిక అయ్యింది.  తండ్రి కేవీ నరేందర్ చూపిన బాటలోనే నడుస్తూ గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ వల్ల కింది స్థాయి ప్రజల జీవితాల్లో వచ్చిన , వస్తున్న మార్పులు… అల్లకల్లోలాన్ని తన కథల్లో చూపుతున్నారు. సామాజిక ప్రయోజనం ఉండే మంచి కథకు, రేపటి తెలంగాణ కథకూ భరోసానిస్తున్న మన్ ప్రీతమ్ రాసిన కథ ….”దేవయ్య ఈ పక్షం సారంగ రేపటి కథ.

 

హలో. మన్ ప్రీతమ్. మొదటి కథ ఎప్పుడు రాశావు. ? ఎందుకు రాయాలి అనిపించింది..

నా మొదటి కథ దానం. అవయవ దానం పై రాసిన కథ. ఓ హాస్పిటల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగే తీరు చూసి

ఆశ్చర్యపోయాను. అవయవ దానమే కాదు, మొత్తం శరీరం మెడికల్ కాలేజీ కి దానం చేశారని తెలిసింది. అలాంటి వారి దానం ఒక విద్యను నేర్పించి డాక్టర్లను తయారు చేసి ఇంకో పదిమందికి ప్రాణం పోస్తుంది అనే అంశం పైన రాశాను.

 నీ కథ రాయక ముందు కథలు చదివే వాడివా..? ఆ కథలు గుర్తు ఉన్నాయా..?
మా నాన్న కె.వి.నరేందర్ ప్రముఖ కథారచయిత. చిన్నప్పటినుండీ సాహిత్య వాతావరణం లో పెరిగాను. ఇంటర్ తర్వాత కథలు, నవలలు చదవడం మొదలుపెట్టాను. చాలా మందికి రచనలు చదివాక రచయితలు పరిచయం అవుతారు. నాకు మాత్రం రచయితలు ముందు పరిచయం అయ్యాక వాళ్ళ రచనలు చదివాను.

నీకు నచ్చిన కథలు...?
నేను చదివిన మొట్టమొదటి కథ నాన్న రాసిన ఎడారి దీపాలు. నాన్న ఇప్పటివరకూ 200 పైన కథలు రాశారు.

దాదాపుగా అన్ని కథలూ చదివాను. నాన్న ఏకాంశం పైన కథలు రాస్తారు. మధ్య తరగతి జీవితాల గురించి. అమ్మ, నాన్న సిటీ, ఊరు, నాతి చరామి… ఇలా అనేక ఏకాంశాలపై రాశారు. నాన్న నవలల్లో నల్ల సముద్రం, శిథిల స్వర్గం చాలా ఇష్టం. అలాగే పెద్దింటి అశోక్ కుమార్ జిగిరి నవల, మాయి ముంత కథలు కూడా ఇష్టం. రామా చంద్రమౌళి సూర్యుడి నీడ, నవీన్ గారి అంపశయ్య, యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం బాగా నచ్చినవి.
గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ ప్రభావం గ్రామీణ జీవితాలు ముఖ్యంగా కులవృత్తులపై ఎలా ఉందో చూపిన కె.వి.నరేందర్, పెద్దింటి రచనలు బాగా ఇష్టం. ఇప్పుడు రాస్తున్న సమ్మెట ఉమాదేవి, వెల్దండి శ్రీధర్ ….ఇలా చాలా మంది కథలు ఇష్టం.

సహజంగా నీ వయసులో ప్రేమ కథలు రాస్తుంటారు..? నీ కథలు సామాజిక అంశాల చుట్టూ ఉన్నాయి..? ఏదన్నా కారణం ఉందా..?

-మన చుట్టూ జరుగుతున్న మార్పులు. దాని ప్రభావం, నన్ను బాగా కదిలించిన సంఘటన గురించి కథ రాయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ప్రేమ కథలు రాయాలని ఉన్నా, వాటి కన్నా సామాజిక అంశాల కథలే ఎక్కువ తృప్తి నిస్తాయి

 “దానం కథ నేపథ్యం ఏమిటి..?
నేను బీ-టెక్ చివరి సంవత్సరంలో ఉఝడగా జరిగిన ఒక నిజమైన సంఘటన ఆ కథకు ప్రేరణ. వాళ్ళు చనిపోయి కూడా పదిమందిని బతికించడం గొప్ప పని. దాన్ని సమాజంలో అందరికీ తెలియజెప్పాలనే దానం కథ రాశాను.

కథలు చదివేవారు తగ్గి పోతున్నారు. రాసేవారు కూడా… యువత కథలు తక్కువ గా చదవడానికి కారణం…?

విజువలైజేషన్ ప్రభావం ముఖ్యంగా ఇంటర్ నెట్ పెరిగాక సినిమాలు, యూట్యూబ్ లు, ఇతర సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ముఖ్యంగా యువతపై అధికంగా ఉండి పాఠకుడు మెల్లగా క్షీణిస్తున్నాడు. ప్రజల జీవితాల్లో వేగం పెరిగింది. ఐటీ సెక్టార్ లోని యువత పది నిమిషాల వీడియో ప్రశాంతంగా చూడలేక పోతున్నారు. ఇక మూడు పేజీల కి మించిన కథను చదవలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. శ్రద్ధగా పుస్తకం చదివితే దాని ప్రభావం ఓ గొప్ప సమాజాన్ని నిర్మిస్తుంది.

 నేపథ్యం ?

నేనో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని. ఇంద్రియన్ డేటా అనలిటిక్స్ అనే సంస్థ లో పని చేస్తున్న. మంథని జేఎన్టీయూ లో బీటెక్ చదివా. పుట్టి పెరిగింది జగిత్యాల. అమ్మ శ్రీదేవి గృహిణి. నాన్న కేవీ నరేందర్ రచయిత, ఉపాధ్యాయుడు. చెల్లి మాన్విత బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

***

 

మన్ ప్రీతం

36 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు