1.
దృశ్యం
*
నీలాకాశం
రహస్య పొట్లం విప్పినట్టుగా
అరుణోర్ణవమైన వేళ
గడ్డి పువ్వుల
నిశ్శబ్ద భాషను వింటూ లేచిన
బుజ్జి పిట్టల రాగాలు
జీవనమాధుర్యాన్ని నింపుతుంటాయి
కలలన్నీ అలలై
మళ్ళీ మనో సంద్రంలోకి జారిపోతూ
అర్థవంతమైన దృశ్యం
కనువిందు చేస్తూ వుంటుంది
మిలమిలమని తెల్లనినురగల్లే మెరుస్తూ
ఆ కాంతి అపురూపంగా
పువ్వై, పువ్వు లాంటి నవ్వై పరిమళిస్తుంది.
2.
ముత్యపు మెరుపు
*
అరమోడ్పు కనులపై
నిశ్శబ్దం నిశ్చలత్వాన్నిస్తూ
నెమలీకలాంటి సున్నిత స్పర్శ
స్మృతులను మేలుకొలుపుతూ ఉంటుంది
ధ్యాన స్మృతిలో
వెన్నెల హాయిని ఆస్వాదిస్తూ
కలువలా విచ్చుకుంటున్నప్పుడు
ముత్యపు మెరుపొకటి
విశ్వాసాన్ని నింపుతుంది.
3.
పునర్నిర్మాణం
*
ప్రియమైన వెన్నెల
రాత్రంతా జాగారం చేస్తుంది నీకోసం.
ఆ రాత్రిలో
నిన్ను నువ్వు
పునర్నిర్మించుకుంటుంటావు
మట్టిలా కరిగిపోతూ
స్పర్శించే ఆ క్షణాలన్నీ
స్నేహత్వం, ప్రేమత్వం అవుతుంటే
పువ్వులంత మృదుత్వం
నిన్ను నీలో వికసింప చేస్తుంది.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
ముత్యపు మెరుపొకటి విశ్వాసాన్ని నింపుతుంది
ధన్యవాదాలు సర్