అసలు ఈ సంవత్సరం మొదలవడమే మహా అధ్వాన్నంగా మొదలైంది కొరొనా వైరస్ వల్ల. ఎటువంటి ఉష్ట్రపక్షినైనా వదలకుండా మెడలు విరిచి అందరి దృష్టీ తన వైపుకే మళ్ళేలా చేసుకున్న సంభవం- కొరోనా వైరస్ పుట్టుకా, వ్యాప్తి అన్న దాన్లో అతిశయోక్తి లేదు. పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదేనేమో. ప్రపంచమంతా పల్లెటూరి కంటే చిన్నదైపోయింది, అని అంతా గంతులేసి ఎంతో కాలం కాలేదు, అంతలోనే, “దూరం, దూరం” అంటూ ఎవరికి వాళ్ళం తలుపులు బిగించుకోనే రోజొచ్చింది.
చుట్టూ వేల మైళ్ళ కొద్దీ విస్తరించిన సముద్రంతో, ఆస్ట్రేలియా ఖండ వాసులు చాలా విషయాల్లో “అది మన దాకా వస్తే చూసుకుందాం లే”, అన్న తేలిక భావంతో వుంటారు. పైగా డిసెంబరు, జనవరి ఇక్కడ ఎండాకాలం సెలవులు కాబట్టి చిన్నా పెద్దా అదోలాటి విశ్రాంతి భావనతో హాయిగా రోజులు బీచి ఒడ్డున గడిపేస్తూ వుంటారు.
కానీ 2019 చివరి భాగంలో న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాలు భయంకరమైన అగ్ని జ్వాలలకు ఆహుతయ్యాయి. విపరీతమైన ప్రాణ నష్టం అంతకంటే ఎక్కువగా తగలబడి పనికిరాకుండా పోయిన పరిసరాలూ, పొలాలూ (దాదాపు పద్దెనిమిది మిల్లియన్ల హెక్టారుల మేర చెట్లూ ఇళ్ళు తగలబడిపోయాయి) దేశాన్ని పెద్ద ఆపదలో పడేసాయి. ఆ విషాదాన్ని ఎదుర్కోవడంలో తలమునకలుగా వుండి ఎక్కడో చైనా లో చిన్న వైరస్ ప్రారంభమైందట, అన్న వార్తని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, ప్రజలూ, పాలకులూ కూడా.
జనవరి – ఫిబ్రవరి లో ఎండకాలం సెలవలు ముగిసి యూనివర్సిటీ విద్యార్థులంతా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలనుంచీ ఆస్ట్రేలియా చేరుకుంటారు. అలా చైనా నుంచి సిడ్నీ చేరుకున్న విద్యార్థుల్లో మొదటిసారి జనవరి 25 న ఒక విద్యార్థి కొరొనా వైరస్ తో ఆస్పత్రి లో చేరేసరికి అంతా ఉలిక్కిపడ్డారు. అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పాండెమిక్ గా నిర్ధారించి వుంది. ఈ విద్యార్థులతో పాటు క్రూస్ పడవలు డైమండ్ ప్రిన్సెస్, రూబీ ప్రిన్సెస్ కూడా శాయా శక్తులా వైరస్ ని ఖండం లోపలికీ బయటికీ చేరవేశాయి. అయితే మరి తక్కువ జన సాంద్రత వల్లో, ఇంకా ముగిసిపోని వేసవి ఎండల వల్లో, మిగతా అన్ని చోట్లా వ్యాపినించినంత వేగంగా ఇక్కడ వ్యాపించలేదు.
ప్రభుత్వం కూడ వీలైనంత వేగంగానే స్పందించింది. ముప్పై ఒకటి జనవరి నించి చైనా నుంచి నేరుగా ఆస్ట్రేలియాలోకి ఎవ్వరినీ రానివ్వకుండా ఆంక్షలు విధించారు. మధ్యలో రెండు వారాలు ఇంకేదైనా ఒక్ దేశం లో మజిలీ చేయాలని నియమం పెట్టారు. ఫిబ్రవరి చివరికొచ్చేసరికి ఆ నియమం ఇరాన్ నించి వచ్చే ప్రయాణీకులకీ వర్తించడం మొదలైంది. కేసుల సంఖ్య చక చకా పెరుగుతూ వున్నా, మొదటి మరణం మార్చి మొదటి వారం లో సంభవించింది.
ఇహ అక్కణ్ణించి ఆపకుండ పరిగెత్తిన వైరస్ వ్యాప్తి ఎప్రిల్ రెండు వరకూ అప్రతిహతంగా సాగింది. తరువాత కొంచెం నెమ్మదించి, ఇది రాసే సమయానికి (April 29) ఆరువేల పైచిలుకు (6700+) కేసుల సంఖ్యా, ఎనభై తొమ్మిది (89) మృతుల సంఖ్యా దగ్గర వుంది. గత ఇరవై నాలుగ్గంటల్లో 13 కేసులు నమోదైనవి. మేముంటున్న క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోనూ, సౌత్ ఆస్ట్రేలియాలోనూ కొత్త కేసుల సంఖ్య సున్నా చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మూడు మిలియన్ల (ముప్పై లక్షలు) కేసులు వుంటే, రెండు లక్షలకు పైగా మృత్యువు వాత పడ్డారు. పది లక్షలకంటే కొంచెం ఎక్కువగా కేసుల సంఖ్య, యాభై వేలకు పైగా మృతుల సంఖ్యతో అమెరికా పరిస్థితి దయనీయంగా వుంది.
మార్చి మధ్య నుంచి అన్ని సంస్థలూ వీలైనంతవరకూ అందరినీ ఇళ్ళ వద్ద పనిచెసుకోమని ప్రోత్సహించాయి. న్యూసొత్ వేల్స్ లో వైరస్ బారిన పడ్డ రోగుల సంఖ్య ఎక్కువగా వుండడంతో, మిగతా అన్ని రాష్ట్రాలూ ప్రయాణాలని నిలిపి వేసాయి. మార్చి చివరికొచ్చేసరికి రాష్ట్రం లోకి వచ్చిన ప్రయాణీకులందరూ రెండు వారాలపాటు “సెల్ఫ్ ఐసొలేషన్” లో వుండాలని నియమించారు. జన జీవితం దాదాపు స్తంభించిపోయిందనే చెప్పుకోవాలి.
యూనివర్సిటీలు ఈ సెమిస్టరు అంతా బోధన ఆన్ లైన్ లోనే జరుగుతుందని విద్యార్థులని ఇళ్ళకు పంపించి వేసాయి. స్కూళ్ళు తెరిచివున్నా, రావడం రాకపోవడం కుటుంబాల ఇష్టం. నిజానికి ఈ విషయం మీద కొంచెం వివాదం చెలరేగింది. అయితే హెల్త్ కేర్ లో పని చేసే వారూ, అత్యవసర సేవా విభాగాల్లో పనిచేసే వారూ పిల్లలని పంపడానికి వీలుగా బళ్ళని తెరిచి వుంచామని ప్రభుత్వం సమర్ధించుకొంది. ఇప్పటికీ స్కూళ్ళు నడుస్తూనే వున్నవి, ఎక్కువగా పిల్లలు పోవడం లేదు కానీ.
ఎప్రిల్ 11 నించీ నాలుగు రోజులు ఆస్ట్రేలియాలో ఈస్టర్ పండగ సెలవలు. బయటికి పోయి ఆడుకుంటామని మారాం చేసే పిల్లల్ని బంధించి ఇంట్లో ఉంచడం ఎంత కష్టమో, ఈ నాలుగు రోజులూ ఆస్ట్రేలియన్లని ఇళ్ళల్లో వుంచడం అంతే కష్టం. కానీ సోషల్ డిస్టన్స్ అనే మాట తారక మంత్రం లా వల్లెవేయించే సరికి అంతా కిమ్మనకుండా వుండిపోయారు. మేము కూడా గత ఇరవై సంవత్సరాలలో నాలుగు రోజులూ ఇంటి పట్టునే వుండడం ఇదే మొదటిసారి కావొచ్చు.
చాలా నిర్దాక్షిణ్యంగా నియమాలు విధించి, ఫైన్లు వేసినా, అక్కడక్కడా కొన్ని తెలివి తక్కువ సంఘటనలు జరగక మానవు. సిడ్నీ లోని బాండై బీచి లో ఒక సాయంత్రం పెద్దగా గుమిగూడిన జనాన్ని చూసి వెంటనే కట్టుదిట్టం చేసారు. అదే సిడ్నీ లో నాలుగు వారాల తర్వాత రెండు మూడు కుటుంబాలు కలిసి సందులో క్రికెట్ ఆడినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇంటినుంచి బయటికెళ్తే, ఆఫీసుకో, సరుకులు కొనుక్కోవడానికో, లేక వ్యాయామం కోసం నడకకి మాత్రమే అనుమతి. సరుకులు కొంటున్నామని చెపితే రసీదు చూపించాలి. మొదట్లో జనం వెర్రెత్తినట్టు సరుకులు కొనుక్కున్నమాట నిజమే. అయితే వెంటనే అమ్మకం దార్లు వస్తువు పైనా (ముఖ్యంగా ఆహార పదార్థాలు) నియమిత సంఖ్య దాటకుండా పరిమితులు విధించడంతో పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది.
అంతర్-రాష్ట్రీయ ప్రయాణీకులని విమానాశ్రయాల్లోనూ, బోర్డర్ల వద్దా ఆపి, వాళ్ళ ఫోన్ నెంబర్లూ అడ్రసులూ తీసుకున్నారు. ఆ తరవాత వాళ్ళ నంబర్లని రెండు వారాల పాటు ట్రాక్ చేసారు. (నిజంగా చేసారో లేదో తెలియదు కానీ, చేస్తారని చెప్పారు).
ఆర్థిక వ్యవస్థ అన్ని చోట్లా కుదేలై పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. వర్జిన్ ఆస్ట్రేలియా కూడా దుకాణం మూసేసుకుంది. ఆస్ట్రేలియా ఎకానమీకి సహజ వనరుల ఎగుమతి, పర్యాటక రంగం, రెండూ మూల స్థంభాలు. రెండిటి భవిష్యత్తూ ఇప్పుడు అగమ్యగోచరమే. మూడవ చిన్న స్తంభం విదేశీ విద్యార్థులు ( ముఖ్యంగా భారత దేశం, చైనా, ఇంకా ఇతర ఏషియన్ దేశాలు) యూనివర్సిటీ విద్యల కోసం చెల్లించే రుసుము. (Mining, Tourism, Education Economies). చైనా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతే దాని ప్రభావం కూడా ఆర్థిక పరిస్థితి మీదా, ఉద్యోగావకాశాల మీదా బాగా వుండొచ్చు.
ఉద్యోగాలు పోయిన వాళ్ళూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళూ, రెస్టారెంట్ లు, అయిర్ బి ఎండ్ బి నడుపుకునే వాళ్ళూ, బోలెడంతమంది ఉపాధి కోల్పోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం సెంటర్ లింక్ ద్వారా వీలైనంత ఆదుకున్నా, మళ్ళీ పరిస్థితి చక్కబడేదెప్పుడో, వీళ్ళు నిలదొక్కుకునేదెప్పుడో తెలియదు. ఇప్పటికి ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం “స్టిమ్యులస్ పేమెంట్” పథకాన్ని ప్రవేశపెట్టి నిరుద్యోగులనూ, చిరుద్యోగులనూ, ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళనూ, చిన్న వ్యాపారస్తులనూ ఆదుకుంటోంది. వీటి వల్ల కనీసం కొంత వరకైనా నిలదొక్కుకోవచ్చు.
మేము ఆఖర్న పాల్గొన్న కార్యక్రమం- ఒక దగ్గరి స్నేహితుడి పెళ్ళి నిశ్చితార్థం మార్చి పధ్నాలుగున. ఆ తరవాత సోమవారం నించీ చాలావరకు ఇంటినుంచే పని. మాకు ఇంట్లో ఎనభై పైన వయసున్న పెద్దవాళ్ళుండడం వల్ల మా ఆఫీసులో కొలీగ్స్ దాదాపు నా కాళ్ళు పట్టుకోని ఆఫీసుకి రావొద్దని వేడుకున్నారు. నేను వాలంటీరుగా వారానికొక్క రోజు పని చేసే మేటర్ హాస్పిటల్ కూడా అన్ని రకాల వాలంటీర్ సర్వీసులని నిలిపివేసింది. జూం, స్కైప్ లాటి టెక్నాలజీ వల్ల సంగీతం పాఠాలు మామూలుగానే కొనసాగుతున్నవి. రెండు మూడు వారాలుగా జూం సాయంతో చిన్న చిన్న కచేరీలు (పక్క వాద్య సహకారం లేకుండా) కూడా జరిగినవి.
ఈ వింతైన అనుభవాన్నించి మనమేమైనా నేర్చుకున్నామా, ఏమైనా మారామా, అనే ప్రశ్నలకి కాలమే జవాబు చెప్పాలి. అయితే ప్రయాణాలంటే మనకి కనీసం ఒక రెండేళ్ళ వరకూ భయం పోక పోవచ్చు. ఎన్నో వసతులని మన హక్కుగా అనుభవించే మనం, కొంచెం ఆలోచిస్తామేమో. ఓపికగా, కలిసి కట్టుగా ఆపదలని ఎదుర్కోవడం, అందరం కలిసి నేరుచుకుంటున్న పాఠం.ప్రతీ విషయానికీ ఒకటే ఆందోళన చెంది కాళ్ళు తొక్కుకోని కింద పడి హడావిడి చేయక్కర్లేదని నేను వ్యక్తిగతంగా నేర్చుకున్న పాఠం.
ఇప్పుడిప్పుడే ఇక్కడ నియమాలు కొంచెం సడలించాలని ఆలోచిస్తున్నారు. బహుశా మే మధ్యకొచ్చేసరికి అంతర్-రాష్ట్రీయ రవాణా అనుమతిస్తారేమో. కానీ నిబంధనలు సడలించగానే బాధ్యతగా ప్రవర్తించ గలమా, లేదా అన్నది పెద్ద మిస్టరీ. లేదా మన అజాగ్రత్త వల్ల మళ్ళీ వైరస్ విరుచుకు పడితే మన గతి ఏమిటి?
ఇక్కడ రోజువారీ కొత్త కేసుల సంఖ్య (ఆస్ట్రేలియా అంతటా) ఇంకా సున్నా చేరుకోలేదు. అది సున్నా చేరుకున్న తరవాత కనీసం ఇంకొక పక్షం రోజులు ఇదే సోషల్ డిస్టెన్స్ అనుసరిస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుందన్న ప్రశ్న కి జవాబు కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేం.
అంతవరకూ- “సామాజిక దూరం- సోషల్ డిస్టెన్స్” పాటించడమే మన తక్షణ కర్తవ్యం.
*
Add comment