దున్న‌పోతు దూడ‌

నేను వ‌సార్లోని బారాక‌ట్ట‌మీద ప‌డి.. పొల్లాడి ఏడుచ్చానా. మాపాప గోంగ‌ప‌ట్టి ఏడ్చింది!

గోలిగుండ్లు ఆడి మైటాల ఐద‌ప్పుడు ఇంటికొచ్చినా. జోబీలోని గోలిగుండ్ల‌ను ఎంచుకున్యా. ఇన్నూరుకంటే ఎక్కువుండాయి. దాంట్లోనే రాతిగుండ్లు, ఉక్కుగుండ్లు, సోడాగుండ్లు, టాంబాలు, సైగుండ్లు ఉండాయి. ఐదురూపాయ‌లు లెక్క‌గూడ గెల్చుకున్యా. మాయ‌మ్మ గ‌డ్డికి పోయి వ‌చ్చేత‌లిక‌ల్లా కోళ్లు మూసుపెట్తాన్న‌ట్లు బిల్డ‌ప్పుకొట్టాల‌.
మొబ్బు గునుగుతాంది.. సూచ్చాండ‌గానే కండ్ల‌కు మ‌స‌కైతాంది. మా కోళ్లు గోడ‌మీద ఉండాయి. రెక్క‌లు కొట్టి ఎగ‌నీలి కాళ్లు ఎన‌క్కిపెట్టి కొక్కొకోకో అంటాంది ఓ పుంజుకోడి.  ఒక‌పుంజుగోడి గోడ‌మీద ఉండే క‌ప్రిల్లాకు మొక్క ఉండే కుండీలో పురుగుల‌కోసం ఎతుకులాడ్తాంది. ఐదారుకోళ్లు కొట్ట‌మొక్కినాయి. రెండుకోళ్లు ఎన‌మ‌ల‌మీద నిల‌బ‌డి ముక్క‌ల్ని అట్టా.. ఇట్టా అంటాడాయి. కొన్ని కోడిపిల్ల‌లు వ‌సార్లోని గూట్లో, గ‌డ్డికాడ ముడుక్కున్యాయి.  కోళ్ల‌న్నీ మూసిపెట్టాల‌ని ఇంట్లోకి సోపుతానా. అప్పుడే మాయ‌మ్మ గ‌డ్డిమోపు ఎత్తుకోని వ‌చ్చి.. వ‌సార్లో ఇసిరేసినాది. *రోన్ని నీళ్లు తాపో* అన్యాది. మా చెల్లెలు ఉరికిత్త ఇంట్లోకి పోయి గ‌లాసులో ముంచ‌క‌చ్చింది. గాటిపాట‌కి వ‌చ్చి న‌డిపి ఎనుమును నిగీత చూసినాది. *ఈన్తాదేమో ఇంగ‌* అని స‌న్న‌గా మాట్లాడింది. *ప‌ద్ద‌న చేసిన ఉల్ల‌గ‌డ్డ కురాకు వాస‌నొచ్చాంది మా* అన్యా. పోయి ఉల్ల‌గ‌డ్డ కురాకు చూసి *గ‌బ్బుకొడ్తాంది* అన్యాది. బెరీన పొప్పుకేసి గ‌డ్డిలోంచి గంజ‌రాకు తీసింది. బాగా క‌డిగి కందివాల్ల‌లో ఏసింది. పొప్పు బువ్వ తిన్యాం. మా నాయిన ఇంగా టాక్ట‌రుకు పోయి రాల‌.  నిద్ర‌పోయినాం.

సైరిపొద్దుకాడ ఏందో అలికిడి ఇన‌ప‌న్యాది. గ‌బ‌క్క‌ని లేచినా. మాపాప కూడా ఉలిక్కిప‌డి నిద్ర‌లేచినాది. వ‌సార్లోని మంచం దిగి గాటిపాట‌కాడికి పోయినాం. ఎనుము క‌డుపులోని దూడ బ‌య‌టికొచ్చానాది. అప్పుటికే మా ప‌క్కింటి గొల్లోలాయ‌మ్మ‌ని మాయమ్మ పిల్చినాది. మాయ‌మ్మ‌, ఆయ‌మ్మ నిల‌బ‌డుకోని సూచ్చానారు. గొల్లోల్ల పిల్లోళ్లు నిద్ర‌లేచినారు. వాళ్లిద్ద‌రూ మా ప‌క్క‌న నిల‌బ‌డ్నారు. ఇర‌వై అడుగుల్లో ఉండే మా జేజి వాళ్లు మాతో మాట్లాడారు. హుహు.. అని ద‌గ్గుతాండు మాయ‌బ్బ‌. ఎదురూగ ఉండే మంగ‌లోల్లాయివ్వ ల‌లిత‌మ్మ లేచినాది.  గొల్లోల్ల పిల్లోల్ల‌ను వాళ్ల‌మ్మ ఇంట్లోకి పోండి అంటానే.. *మీరు ప‌డుకోపోండిప్పా* అన్యాడు మా నాయిన‌. నాకేమో లోప‌లికి పోబిద్ది కాలేదు. మా పెద్దెనుము నాలిక చాచినాది, గ‌స్స‌ప‌డ్తాంది. *ఎంత సేపులే సోమీ.. గూగూడు కుళ్లాయ‌స్వామీ* అంటా మాయ‌మ్మ చేతులు దండ‌ప్పెట్న‌ట్లు వ‌ణుకుతాంది. పాపం.. అంటూ మాయ‌మ్మ కండ్ల‌నీళ్లు పెట్టుకుంటాంది. బెరిక్క‌న గాటిపాట‌కి పోయి.. గంజుగుంత బండ మూసినాది.. ఈనే ఎనుము ఎక్క‌డ‌కాళ్లు పెడ్తాదోన‌ని! *ఇంట్లోకి పోండి.. చూడ‌గుడ్దు* అని అర్సింది. మేం ఇద్ద‌రం కొట్రీ ఇంట్లోకి పోయి ప‌డుకున్యాం. మాపాప నిద్ర‌పోయింది. నాకు నిద్ద‌ర్రాలేదు. ఎల‌క‌లు దంతెల్లో కిస‌కిస‌.. అంటా తిరుగుతానాయి. మ‌ట్టిమీద ప‌డ‌తాద‌ని.. ర‌గ్గు క‌ప్పుకున్యా. క‌ళ్లుమూసుకున్యా.

ప‌ద్ద‌న్నేలేచి.. మా న‌డిపెనుము బిడ్డ‌ను సూచ్చి.. న‌ల్ల‌గా, న‌వురుగా ఉండాది. ఒక‌మైన ఎనుము.. కొమ్ములు ఊపుతాంది.  బిడ్డ‌ను నాకుతాంది.ఆ చిన్న‌దూడ‌పాప ముద్దుగా ఉండాది.  మా నాయిన ఉత్త‌చెంబు ప‌ట్టుకోని ఇంట్లోకి వ‌చ్చినాడు. బొగ్గు, ఉప్పు దంచి పండ్లు తోముతానాడు.
*ఔ.. మాయ‌ను ప‌ర్తోట్లో బూడిచిపెట్నావ‌*ని చెప్పినావు.  ప‌ద్ద‌న్నే బైటికి పోయిన ఆడోళ్లిద్ద‌రు * మీ ఎనుము మాయను బైటేసినార‌*ని సెప్పినార‌నె మాయ‌మ్మ‌. మా నాయిన ప‌ల‌క‌లేదు.
*అయినా నాకు తెల్దు.. గ‌లీజు ప‌ని ఎందుకు చేచ్చావు. కుక్క‌లు తింటాయి మాయ‌ను. నీకు చెప్పేబ‌దులు నేను చేసుకుండేది ప‌దిమాట్లు మేలు* అన్యాది మాయ‌మ్మ‌.
*ఆ ఏమైతాదిలే* అనె మానాయిన‌.. నీకు చెప్పినాచూడు.. నా మెట్టుతో నేను కొట్టుకోవాల్ల అన్యాది మాయ‌మ్మ‌.  మానాయిన్ను గుడ్లురిమి సింగ‌రిచ్చుకుంది! *నీయ‌మ్మ‌.. నీదేంది ద‌ద్ద‌రిచ్చుకోని* అంటా.. మానాయిన పేడ‌గంప ఇస్సిరేసి, పాత చెప్పులేసుకోని బైటికిపాయ‌.

మాయ‌మ్మ‌కండ్లు.. ఎర్ర‌గ‌యినాయి. కోపంతో. బొగ్గు, ఉప్పును చిన్న‌గుండ్రాయితో దంచిచ్చి.. *బెరీన మ‌గం క‌డుక్కోండి.. కాఫీపోచ్చా* అన్యాది మ‌మ్మ‌ల్ని. మ‌గం క‌డుక్కోని.. బెల్లంతో చేసిన డికాష‌న్‌లో బొరుగులేసుకుని తాగినా. ఆ పొద్దు ప‌ర‌వేటుకు ఎగ‌ర‌కొట్నా.  దూడ ద‌గ్గ‌ర‌కు పోయినా.  వాళ్ల‌మ్మ కొమ్ములు తిప్పుతాంది.  రోంచేపున్యాక తిప్ప‌లా.  దూడ‌ను నిగీత చూసినా. దూడ‌కు కొస్సిగోర్లుండాయి..పాల‌జొల్లు కార్చాంది..

వాళ్ల‌మ్మ‌కాడే ఉండాది. దూడ నిల‌బ‌డుకోవ‌టానికి లేచ్చాంది. కింద ప‌డ్తాంది.  వుయ్యా.. వుయ్యా.. అర్చాంది. దావుంటి పోతా.. ప‌ద్మావ‌త‌వ్వ *ఏం దూడ‌*అని అడిగినాది. *దున్న‌పోతు దూడ అమ్మ‌య్యా* అన్యాది మాయ‌మ్మ మ‌గం బిగిచ్చుకోని. చాక‌లోల్లాయ‌మ్మ ప‌ద్ద‌న్నే గుడ్డ‌ల‌కొచ్చినాది. *వొయ‌మ్మా… ఎనుము ఈనిందా.. ఎప్పుడుక్కా* అని అడిగింది. సైరుపొద్ద‌ప్పుడు ఒంటిగంట‌య్యిండ అన్యాది. *ఏందూడ* అన్యాది ఆయ‌మ్మ‌. *దున్న‌పోతులే* అన్యాది మాయ‌మ్మ‌. ఆయ‌మ్మ‌.. లుంగీగుడ్డ‌లో బ‌ట్ట‌లు క‌ట్టుకోని ఇంటికిపాయో. స‌న్న‌గా ఎండ పెడ్తాంది. తూర్పు ప‌క్క‌న ఎండ మా గాటిపాట‌లోకి ప‌డ్తాంది.  ప‌ద్ద‌నిక‌ల్లా మా బ‌జారుకంతా తెల్చినాది. పిల్ల‌గాళ్లు మా ఇంటికాడికి వ‌చ్చి సూచ్చానారు. పెద్దోళ్లు కూడా. *ఒక్కా ప‌నికి వ‌చ్చానావా* అని దావుంటిపోయే వ‌డ్డివాళ్లాయ‌మ్మ అడిగింది. *నేను మూడురోజులు రానుక్కా. ఎనుము ఈనింది* అన్యాది మాయ‌మ్మ‌. జొన్న‌లు ఉడ‌క‌బెట్టి ఎనుముకు తినిపిచ్చినాది. ప‌చ్చిగ‌డ్డి ఏచినాది. పిల్లోణ్ణి చూసుకున్య‌ట్లు చూసుకుంటాంది.  దూడ రెండ్రోజుల‌క‌ల్లా గ‌ట్టిగా నిల‌బ‌డ్నాది. మాయ‌మ్మ ఫ‌స్టు మూన్నాళ్లు జున్ను చేసినాది. మా ఇంటికాడిచ్చి కొంద‌రు జున్ను కావ‌ల్ల అని గిన్నెలో ఏయిచ్చుకోని పోయినారు.

సూచ్చాండంగ‌నే.. మా దూడ‌..  ఎగ‌రాల‌ని సూచ్చాంది. వుయ్య వుయ్య.. అని అరుచ్చాంది.  గుడ్డ‌తో పేడిన తాడును దూడ‌కు క‌ట్టేసి గాటిపాట ఈతిక్కు గుంజ‌కు  క‌ట్నాది మాయ‌మ్మ‌. ప‌ద్ద‌న్నే దూడ‌ని ఇర్సేది. దాని క‌డుపు నిండినాక‌.. న‌న్ను ప‌ట్ట‌క‌ర‌మ్మ‌నేది. దాన్ని ప‌ట్ట‌క‌రావాల్లంటే.. బిర్రుగా ఎన‌క్కి తాడును గుంజినాది. నేను ఎన‌క కాళ్లు ప‌ట్టుకోని దొబ్బుకోని వ‌చ్చినా. ప‌ద్ద‌న, మైటాల‌… పాలుతాగి దూడ గ‌ట్టి ప‌డ్నాది. చ‌లాట‌కంగా ఎగ‌ర‌బ‌ట్నాది. అది  ఎగుర్తాంటే.. నామంచు సూప‌రుసిత్తి గాల్లో ఎగిరిన‌ట్లు.. ఎగుర్తాంది. దినాము ప‌ద్ద‌న్నే లెయ్య‌టం.. దూడ‌కాడికి పోడం.. దూడ ఎట్ల‌చేచ్చాదో చూసి.. న‌క్కోవ‌టం! సిప్ప‌ర‌, గంజ‌రాకు, గ‌డ్డిపాస‌లు.. తినిపిచ్చాంటి. అది వాస‌న చూసేది. తినేది కాదు. ఒక్కోసారీ నా వేళ్ల‌ను కొరికేది.  *ఈనిన ఎనుముకు ప‌చ్చిగ‌డ్డి కావాల్ల‌* అంటా.. న‌న్ను ప‌ర‌వేటుకు పోకుండా.. మాడీ తోట‌కాడిని మాయ‌మ్మ తీస‌క‌పోతాండె..
నాకు పిట్టిగ‌డ్డిమోపు క‌ట్టి త‌లకాయ‌మీద‌కు ఎత్తి.. అగ‌చాట్లు ప‌డి.. పెద్ద గ‌డ్డిమోపును మాయ‌మ్మ‌ ఎత్త‌క‌చ్చాండె. గ‌డిమాను వాకిలికాడికి పోతానే.. రెండెనుములు పైదూడ‌… ఒక‌మైన అరుచ్చాండె. చిన్న‌దూడ కూడా *వుయ్య‌* అని అర్సేది.

పొద్దుగునికినాక‌.. ఉప్ప‌రోల్లయ‌మ్మ మా ఇంటికి వ‌చ్చినాది.  *ఒక్కా.. గోరు చుట్ట లేచినాది.. ఇది పోల‌..  ప‌ద్మావ‌త‌మ్మ ద‌గ్గ‌రికొచ్చే.. దున్న‌పోతు దూడ ముక్కులో వేలు పెట్టు అన్యాది.  ఎనుము ఈనింద‌ని చెప్పినాది అన్యాది. *రోంచేపుండుబ్బా.. దీపారాజ‌న చేయ‌ల్ల‌* అన్యాది. కొట్రీ ఇంట్లోకి పోయి ఊత‌క‌డ్డీలు ముట్టిచ్చి ముక్కున్యాది. చీర‌పైట‌తో త‌ల‌కాయ‌కు క‌ప్పుకోని.. ఒక ఉత‌క‌డ్డీని కొట్రీ వాకిలికీ, రెండో ఊత‌క‌డ్డీని వ‌సార్లో వాకిలి పెట్టి ముక్కున్యాది.  ఇంగ‌రా అన్యాది మాయ‌మ్మ‌. దూడ‌ను ప‌ట్టుకున్యాది మాయ‌మ్మ‌.. ఆయ‌మ్మ దూడ ముక్కులో గోరుచుట్ట వ‌చ్చిన వేలిని పెట్నాది. ఇంగా రెండ్రోజులొచ్చాక్కా అన్యాది.  *ఏందిమా* అంటే.. *నీకు తెద్దులే.. దున్నపోతు దూడ ముక్కులో వేలు పెడితే గోరుచుట్టు ఎగిరిపోతాది* అన్యాది మాయ‌మ్మ‌.  నేను నోరు తెర్సుకుని విన్నా.

దున్న‌పోతు దూడ‌కి.. గ‌డ్డి, నీళ్లు పెట్ట‌డం.. దాంతో క‌లిసి పోటీకి బ‌డికాడికి ప‌రిగెత్త‌డం..  ఇట్లా..  వంద‌ల ప‌ద్ద‌న‌లు.. పొద్దుగునికే కాలాలు..
ఎన్ని అయిపోయినాయో.. మా ఇద్ద‌రికీ తెల్చు! ప‌ద్ద‌న్నే దూడ‌ను ఇంటి బ‌య‌ట‌కు తీస‌క‌పోయి.. దాని మెడ‌కు ఉండే తాడును దాని బొజ్జ‌కు చుట్టి.. ఇడుచ్చాంటి. అది ప‌రిగెత్తేది. నేను దానికంటే ముందు ప‌రిగెత్తాల‌ని ఉరుకుతాంటి. అట్ల మేం పోటీపెట్టుకుంటాంటిమి. మా దూడ జెండామాను కాడికి పోయి మ‌ళ్లా ఎన‌క్కొచ్చేది. బండో, టాక్ట‌రో.. అడ్డ‌మొచ్చే దూడ‌ను గ‌ట్టిగా పట్టుకోని రోడ్డు ప‌క్క‌కు తీస‌క‌పోతాంటి. దున్న‌పోతు దూడ‌, నేను సావాస‌గాల్ల‌మ‌యినాం. ఒక‌రోజు బ‌డికిపోయి వ‌చ్చినా. ద‌య్యం సినిమా టీవీలో ఏసింటే చూసినా. అది అయిపోతానే ఇంటికొచ్చినా.  దూడ ముడుచుకోని పనుకుండాది. గ‌డ్డి, నీళ్లు ముట్టుకోకుండా ప‌చ్చుండాది.  కండ్లు తేలేసిన‌ట్లుంది. గోడ‌కు మూతి ఆనిచ్చి ప‌డుకున్యాది.  వాళ్ల‌మ్మ ఆంగి.. ఆంగి అని అరుచ్చాంది. దున్న‌పోతు దూడ అర్చ‌లేక‌.. వుయ్యా అని స‌న్న‌గా అంటాంది. బాగా కండ్ల‌కు పిసుర్లు క‌ట్నాయి.  మానాయిన బండ‌ల‌బ‌జారుకుపోయి.. చిన్న గంగ‌న్న తాత‌ను పిల్చక‌చ్చినాడు. ఆ తాత‌వొచ్చి.. *ఏమ్మా.. బాగుండారా* అన్యాడు. *బాగుండామున్నా.. దూడ ముడ్సుకోని ఉండాది. రేత్తిరి నుంచి మెత్త‌గుండాది* అన్యాది. ఆ తాత నిగీత దూడ‌ను చూసినాడు. మ‌ల్లొచ్చా అన్యాడు. బ‌య‌టికి పోయి ఆకులు ఇర్స‌క‌చ్చినాడు. బాగా నూరినాడు. ఆకుప‌స‌రు చేసినాడు. ఎదురుబొంగు ఉండే ఓ  గొట్టంలో ర‌సం పోసి దూడ‌కు తాపినాడు. * ఏం కాదులే.. దానికి పాలు అర‌గ‌ల క‌డుపులో.. పేడ బెడ్తాది. బాగ‌యితాదిలే* అన్యాడు. మాయ‌మ్మ దిగులుగా.. *బాగ‌యితాదాన్నా* అన్యాది. అట్ల రెండు రోజులు ఆకుప‌స‌రు మా దూడ‌కు తాపినాడు చిన్న‌గంగ‌న్న తాత‌. మా దూడ ఏటుకు తిరుక్కున్యాది.  ఇయ్యా ఇయ్య అని అర్స‌బ‌ట్టింది. ఎగ‌రబ‌ట్నాది. మాయ‌మ్మ పాణ‌మూ చ‌ల్ల‌బ‌డింది. నా పాణం లేచొచ్చినాది.

సూచ్చాండంగ‌నే.. మా దున్న‌పోతు రోంత పెద్ద‌యితాంది. పాలు తాగ‌డం మ‌ర్సిపోయినాది. మ‌ట్ట‌సంగా గ‌డ్డి తింటాంది. బాగా బ‌లమైనాది. చిన్న కొమ్ములు మొల్చినాయి. ఆ కొమ్మ‌ల్నిప‌ట్టుకోని.. *ఎంత పాలీసుగా ఉండాయో*న‌ని మాపాప‌, నేనూ ఆడుకుంటాంటిమి. దున్న‌పోతు దూడ‌
ఆ పొద్దు.. పైటాల‌బ‌స్సు సిమాప‌ల్లెకు పోయినాది. టైము నాలుగైతాంది.  కడుపు న‌చ్చాంద‌ని నేను ప‌ర‌వేటుకు పోలా. మాయ‌మ్మ ఏమీ అన్లేదు. మా పాప ప‌ర‌వేటుకు పోయినాది. మాయ‌మ్మ జొన్న‌రొట్టెలు చేసినాది. నా కోసం రెండు కారెంరొట్టెలు చేసింది. రెండూ తిన్యా.  వ‌సార్లో  కూర్చున్యా. తెల్ల బెళుకురాయితో చేసిన తిప్పుడు బిళ్ల‌ను తిప్పుతానా. మాయ‌మ్మ అప్పుడు కాఫీ చేసినాది.  నాకు బుడ్డ‌చెంబు కాఫీ ఇచ్చినాది.  బ‌య‌ట గ‌డిమాను వాకిలికాడ‌.. ఇద్ద‌రు మంచులు నిల‌బ‌డ్నారు.  *మ్మో.. మాబు ఉన్నాడా* అండ్రి. మానాయిన ఇంట్లో.. పొప్పులో రొట్టె క‌లేసి తింటాండు.  రెండు నిమిషాల్లో బ‌య‌టికి వ‌చ్చినాడు. *రాండి బ‌జ్జిగా.. చిన్న‌మ‌ల్లేషు..* అన్యాడు.  *కాఫీగ్లాసులు క‌డుక్కోండన్యాది* మాయ‌మ్మ‌. కోళ్ల‌గూట్లో ఉండే రెండు గ్లాసులు తీసుకుని క‌డుక్కున్యారు.  కాఫీ పోసింది. మానాయిన.. ఉస్సుఉస్సుమ‌ని కాపీ తాగుతాండు. మా నాయిన రెండుగుటికెలు కాఫీ బీర్చినాడో లేదో.. *య్యో.. దూడ బాగుండాది.. కావ‌ల్ల‌* అన్యారు వాళ్లు. *ఇప్పుడే మేం అమ్మం * అనె మాయ‌మ్మ‌. *ఏందిమ్మా.. ఉగాది పండ‌గ ద‌గ్గ‌రికొచ్చాంది… మాకు సీలు కావాల్ల క‌దా* అండ్రి.
*చెప్పుప్పా* అన్యారు మానాయిన్ను సూచ్చా.
*ఆరునూర్లు* అన్యాడు మానాయిన‌.
* ఆ.. ఏంటికి.. * అని మాదిగోళ్లిద్ద‌రూ సూసుకోని న‌క్కున్యారు.
*మాబ‌య్యా.. చెప్పుప్పా.. బెరీన‌. ప‌నుంది రోంత‌* అన్యాడు మ‌ల్లేషు.
*ఐదునూళ్లిచ్చి.. తీస‌క‌పోండి* అన్యాడు మానాయిన‌.
ఆ.. మేం అమ్మం బ‌జ్జిగా.. అన్యాది మాయ‌మ్మ‌.
*ఉంటేలేం.. దున్న‌పోతు మ‌న‌కేంటికి.. గాటిపాట అడ్డం* అనె మానాయిన‌..

*మూన్నూట యాభైకి ఈ* అన్యారు వాళ్లు.
*రాదుపో* అనె మానాయిన‌.
*ఏందిప్పా.. మాద‌గ్గ‌ర్నా ఇట్లా* అన్యాడు.
*నాలుగు నూర్లు ఇచ్చి..  తీస‌క‌పోండి. ఇదే ఫైన‌లు * అనె మానాయిన‌.
వాళ్లిద్ద‌రూ కండ్ల‌ల్లోకి సూసుకున్యారు.  స‌ర్లేప్పా.. ఏందో.. మాకు కావ‌ల్ల‌. మీరు గ‌ట్టిగుండారు. పిరెంప్పా.. అని బ‌జ్జిగాడు జోబీలోంచి యాభై రూపాయ‌లు సంత‌కారం ఇచ్చాండు. మిగ‌తాది  *పండ‌గ‌యినాక ఇచ్చాం.. * అన్యాడు. అంతా ఒక‌టేపారి ఈపోండి అన్యాడు మానాయిన‌. *దున్న‌పోతు దూడ మాకేమీ ఇబ్బందిలేదు. రోంత ఇర‌క‌ట‌మంతే. అగ్గ‌వ‌కు అమ్ముతాండు ఈయ‌ప్ప‌* అని మానాయిన్ను మాయ‌మ్మ రోంత సింగ‌రిచ్చుకున్యాది.  బ‌జ్జ‌గాడు గాటిపాట‌కు పోయి.. దూడ త‌లుగు ఇప్పినాడు.  *తాడు ఈండి బ‌జ్జిగా* అనె మాయ‌మ్మ‌. * ఏంటికి దెంగిస‌చ్చ‌గ తాళ్లుండాయి ఇంట్లో. వ‌ద్దుపోండి* అనె మానాయిన‌. *నీకేం తెల్చు * అని తాడును ఇప్పినాది మాయ‌మ్మ‌. దూడ ముందుకు క‌ద‌ల్లేదు. ఇయ్య‌.. అని అరుచ్చాంది. వాళ్ల‌మ్మ కొమ్ములు తిప్పుతాంది. బెదురుకుని అరుచ్చాంది. మా ముస‌లెనుము, ప‌డ్డ‌దూడ కూడా బెదురున్యాయి.
వాళ్లు.. దూడ ఎన‌క‌నుంచి గ‌ట్టిగా ఊదినారు. అయిది బ‌య‌ప‌డినాది. పేడ‌బెట్టింది. గ‌ట్టిగా గొంతుకాడ , ఎన‌కాల ప‌ట్టుకోని దూడ‌ను అదిలిచ్చినారు వాళ్లు.  రోంత దూడ ముందుకి క‌దిలినాది. గాట్లోంచి మా న‌డిపెనుము కొమ్ములు తిప్ప‌తా.. ఒక‌మైన‌ అరుచ్చాంది. మా నాయ‌న క‌ట్టెతో డ్లే అని రెండేట్లు ఏసినాడు.  గ‌ట్టిగా అర్చి అరిచి దాని నోట్లో బురుగు ఊర్నాది. నోట్లోంటి బ‌య‌టికి బురుగొచ్చాంది. ఎనుము కండ్ల‌ల్లోంచి నీళ్లు కార్తాండాయి.  వెన‌క్కి సూచ్చే.. మాయ‌మ్మ కండ్ల‌ల్లో నీళ్లు తారార్తాండాయి.
*ఏంటికిమా.. ఈళ్లు.. మ‌న దూడ‌ను దెంక‌పోతాంరు* అంటి..
*ఇది పైదూడ కాదురా.. పాపం బిడ్డ‌ని బాగా సాకితిమి. మాదిగోల్లు దున్న‌పోతు దూడ‌ల్ని కోసుకోని తింటారు. *అంటా మాయ‌మ్మ చేత్తో కండ్ల‌నీళ్లు తుడ్చుకున్యాది.నా ఎన‌కాల ఉండే మా చెల్లెలు బ్యారుమ‌ని ఏడిచింది.  రెండు నిమిషాల్లో గాటిపాట ఆత‌ట్టునుంచి  వాళ్లు దూడ‌ను గ‌డిమాను వాకిలి దాటిచ్చిరి. దూడ  ఎన‌కాల దొక్క‌ల‌కు మో చేత్తో ఊదినాడు మ‌ల్లేషుగాడు. మా దున్న‌పోతు దూడ  పెద్ద అడుగులు ఏసినాది. ఎన‌క్కి తిరిగి.. ఇంగ రాను అన్న‌ట్లు.. గ‌ట్టిగా *వుయ్యా* అని అర్సినాది దూడ‌.  మాయ‌మ్మ ఇంట్లోకి పోయి మంచంలో ప‌డుకుని ఏడ్చినాది.

నేను వ‌సార్లోని బారాక‌ట్ట‌మీద ప‌డి.. పొల్లాడి ఏడుచ్చానా.  మాపాప  గోంగ‌ప‌ట్టి ఏడ్చింది!

( హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ ద‌గ్గ‌ర‌లో ఉండే  రెహ్మ‌త్‌న‌గ‌ర్‌లో ఉండే డైరీఫామ్‌కి రోజు లీట‌రు ఎనుము పాలు పోయిన్చుకోటానికి పోతా. నాతో పాటు నా కూతురు.. వ‌చ్చాది.  దూడ ద‌గ్గ‌ర‌కు పొమ్మంటే నా కూతురు భ‌య‌ప‌డినాది. నేను దున్న‌పోతు దూడకాడ నిల‌బ‌డినా. నా  నిక్క‌ర‌ను అది కొరికింది. మోకాలు నాకినాది. *వుయ్యా..*  అనే దాని అరుపు ఇంటానా.. మా దున్న‌పోతుదూడపాప మ‌తికొచ్చినాది.. బాధ‌తో త‌ల్చుకున్యా ఇట్లా)

 

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మా దూడ మీద మావాడి ప్రేమే గుర్తొస్తాంది కథ చదువుతుంటే…
    చివరికి ఏడుపు రాక తప్పలేదు.
    నా బాల్యం కూడా పల్లెలో గొడ్డూగోద, చెట్టూచేమల మధ్యే గడిచింది కాబట్టి కథ కళ్లకు కట్టినట్టే ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు