ఈ దుఃఖం వుంది చూసారా..దీని దెవసం చెయ్య.. కన్నీళ్లు తాగి తాగి బాగా కొవ్వెక్కింది.. పట్టుకుందామంటే బురదమట్టలాగ జారిపోద్ది..ఎటు తిరిగి చూసినా ఆడ తిష్ట వేసుకు వుంటది..అరె ఛోడ్ దో యార్ అని దూరంగా దులుపుకొని వదిలేసి వస్తామా..తోకూపుకుంటా వెనకాతలే వస్తది.నిద్రలో నీడలా వుంటది.చీకటిలో క్రీనీడలా వుంటది.ఈ దుఃఖనది పుట్టువడి ఎక్కడో..ఈ దుఃఖదారం కొస ఎక్కడో..ఎటుపోయినా ఈ దుఃఖమే ఎదురుపడతంది.ఈ దుఃఖగరుడస్థంభాన్ని భుజం మీద వేసుకొని తిరుగుతున్నా..జంగమ దేవరలా దేశమంతా తిరుగుతున్నా..బాధలతాటిచెట్టు ఎక్కి దుఃఖాన్ని కల్లు బొట్లుబొట్లుగా ఒక్కొక్కొళ్లలోకి ఒంపుతున్నా..పేగుల్లో కనలే వేదనకంజిరను దుఃఖాన్ని గానం చేస్తున్న ఒంటరిపక్షి పాటకు జతగా మోగిస్తన్నా..దీన్తస్సదియ్యా.. దుఃఖించి దుఃఖించి దుఃఖించి దుఃఖమతినయ్యానా..దుఃఖించి దుఃఖించి దుఃఖాన్నే నేనయ్యానా..దుఃఖాన్ని దులపరించడానికి ఒక ఉపాయం చెప్పు.ఈ దుఃఖంలోనే పుట్టి ఈ దుఃఖంలోనే పెరిగి ఈ దుఃఖంలోనే చచ్చేట్టున్నాం. దుఃఖం లేని మడిసిని చూయించండి.దుఃఖం లేని నేలని చూయించండి.దుఃఖం లేని దేశం చూయించండి.ఈ దుఃఖందుస్తులు విప్పి పారిపోతా.. ఈ దుఃఖం కౌగిలి నుండి జారిపోతా..ఈ దుఃఖపంజరాన్ని బద్దలుకొట్టుకు ఎగిరిపోతా.. దుఃఖంతో కాగుతున్నప్పుడు ఒక్కఢూ కౌగిలించడే.. దుఃఖం జిగటలో జారిపడుతున్నప్పుడు ఒక్కడూ చెయ్యందించడే..ప్రతి ఒక్కడు దుఃఖాగ్నిలో కాలుతున్నవాడేగా..ప్రతి ఒక్కడు దుఃఖచితిలో తగలబడుతున్నవాడేగా..తగలబడుతున్న ఈ దేశంలో ఎవరి దుఃఖకుంపటి వాడిదేనా..నా దుఃఖం నీది కాదా..నీది నాది కాదా..నీ దుఃఖం పంచుకోని నేనొక మనస్సాక్షి ఖాళీ చేసిన మాంసం పిప్పినేగా.. సామూహిక దుఃఖం ఇక వృథా వలపోతేనా..నువ్వూ నేను ఎప్పటికీ కలవని జరాసంధుడి విలోమ శరీర భాగాలేనా..ఈ కుల మత పుణ్యభూమి కింద నా దుఃఖచరిత్ర అతలాకుతలమయి వుంది.నా పూర్వీకుల కన్నీళ్లచారికలు చరిత్ర పొడవునా దుఃఖరాతినదులై పారుతూ వున్నయ్.ఈ నేలమాగళిలో మా దుఃఖాస్తిపంజరాలు ఎవరికీ తెలవని కతలను కౌగిలించుకొని మట్టయి వున్నయ్.. ఈ గాలిధూళిలో కలగలసి మా దుఃఖార్తరావాలు నోరూవాయ లేకుండా తిరుగుతున్నయ్.. భోధిసత్వుడు కూడా ఈ దుఃఖం దుంప తెంపలేకపోయాడు.నువ్ చెప్పు మిత్రమా..నువ్వూ నేనూ ఈ దుఃఖశిలువను జీవిత పర్యంతం మోయవలసిందేనా..దుఃఖం తల తెంపే ఖడ్గాన్ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ నువ్వూ నేనూ తరాల బానిస సంకెళ్లను ప్రేమిస్తూ వుండవలసిందేనా..నువ్ చెప్పు..ఈ యుగాల దుఃఖపీటముడి విప్పు –
*
దుఃఖం ఇలాగే ఉంటుందా?! Nice!
పూర్వీకుల కన్నీటి చారికలు చరిత్ర పొడవునా దుఃఖరాతి నదులై పారుతూ ఉన్నాయి🌿🌿🌹🌹
me dukka charithra kavithvam chaala bagunnadi…dukka pamampara varnana super..sir
సామూహిక దుఃఖం….beautiful ❤️
పునరుక్తి నిండిన కవితైనా పదేపదే చదవాలనింపించింది. బాగా రాశారు సర్
Great poem brother
లోతుల్లోకి దూకిన కవిత.
అద్భుతంగా వుంది
బావుంది మిత్రమా. చాలా రోజుల తర్వాత ఓ అర్థవంతమైన దుఃఖం. అర్థమైన దుఃఖం. అభినందనలు.
చాలా బాగుంది.
A powerful poem
Very powerful poem