“ప్రాకృత(ప్రాగ్దిశ) వీణియపైన
దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగతతులే
వినీల గగనపు వేదిక పైన…”
సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలోని “దినకర మయూఖ తంత్రుల” అనే పదఖండం రజత ద్యుతితో నా మనోఫలకంపై మెరిసింది, హిమాలయాల్లోని తొరాంగ్ లా పర్వతం స్మృతిలోకి రాగానే.
సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ సర్క్యూట్ లోని 17,769 అడుగుల ఎత్తైన తొరాంగ్ లా పర్వతం ఒక్కసారిగా ఎదురుగా కనిపించగానే నా ఊపిరి ఆగిపోయింది. ఆ పర్వతం నిర్మితే విశిష్టమైనది. అటువంటి పర్వతాన్ని మనం ఇంకెక్కడా చూడలేము. సూర్యోదయ వేళ ఇలా కాంతి జలపాతాలు ఈ పర్వతంపై నుండి కిందికి జారుతూ కనిపిస్తాయి. అదే ఈ పర్వతం యొక్క గొప్పతనం. అక్కడికి వచ్చిన యాత్రికుల్లో ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే వారు ఇక్కడికి కేవలం మత విశ్వాసాలతో మాత్రమే వచ్చారు. అయినప్పటికీ ఈ విషయాన్ని గతంలో ఎందరో యోగులు గమనించారని నా విచారణలో అర్థమయింది.
అటు బౌద్ధులు గాని, ఇటు హిందువులు కానీ ఈ పర్వతాన్ని ఎంచుకోవడానికి కారణం నాకు అర్థమయింది. రాజులు ఈ క్షేత్రం కోసం గొడవ పడడానికి కూడా కారణం అర్థమయింది. సుమారు 2000 ఏళ్ళ నాటి బౌద్ధ క్షేత్రాన్ని 1815 లో హిందువులు ఆక్రమించుకొని ముక్తినాథుని ఆలయాన్ని ప్రతిష్టించడానికి కారణం అర్థమయింది. ముక్తినాథ్ ఆలయాన్ని తిరిగి బౌద్ధులు ఆక్రమించుకోవడానికి కారణం అర్థమైంది. తిరిగి హిందువులు బౌద్ధులు కలిసి ఉమ్మడిగా ఈ క్షేత్రాన్ని సామరస్యంగా పంచుకోవడానికి కారణం అర్థమయింది.
బౌద్ధులు ఈ క్షేత్రాన్ని చుమిగ్ గ్యత్సా (వంద జలపాతాలు) అని ఎందుకు పిలుస్తారో నాకు స్పష్టంగా అనుభూతమయింది. ఇక్కడ పర్వత పాదంలో ముక్తినాథ్ క్షేత్రంలో “ముక్తి ధార”గా హిందువులు పిలుస్తూ కృత్రిమంగా 108 నీటి ధారల్ని ఏర్పాటు చేశారు. కానీ నిజమైన ధారలు ఈ కాంతి ధారలని నాకు అనిపించింది.
పద్మశాంభవుడు అని పిలవబడే టిబెట్ బౌద్ధ స్థాపకుడు గురు మిలరప తన ప్రయాణాన్ని ఆపేసి ఎందుకు తొరాంగ్ లా పర్వతం పాదంలో తపస్సు చేసుకోవడానికి ఆగిపోయాడో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మిలరప జీవితం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అతడు క్షుద్రోపాశకుడిగా జీవితాన్ని మొదలుపెట్టి యోగిగా ఎదిగాడు. బౌద్ధ గురువులలో ఆయనకు గొప్ప స్థానం ఉంది.
ఎందుకు బౌద్ధులు, హిందువులు ఈ పర్వతాన్ని తమదిగా చేసుకోవాలని పరితపించారో, ఎందుకు రాజులు ఈ పర్వతంపై ఆధిపత్యానికి కొట్లాడారో ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది.
అలాగే ప్రపంచంలోని 51 శక్తి పీఠాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. సతీదేవి నుదురు ఇక్కడ పడిందని అంటారు.
హిందూ ప్రతీకలని పక్కన పెడితే, బౌద్ధ ప్రతీకలు ఎంతో కళాత్మకంగా, కవితాత్మకంగా అనిపిస్తాయి.
ఆకాశ నర్తకిలుగా పిలవబడే దాకినీ దేవతలు, 21 తారలు(స్త్రీ బోధిసత్వినిలు) నివాసముండే చోటుగా, బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే ప్రపంచంలోనే 24 తాంత్రిక స్థలాలలో ఒకటిగా ఈ పర్వతం గౌరవించబడుతోంది.
అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం, నా హృదయానికి ఇష్టంగా అనిపించిన విషయం, బుద్ధులందరి కరుణ ఒక్కటై అవలోకితేశ్వరుడిగా అవతారం దాల్చిన చోటుగా చెప్పబడడం. ఆ కాంతి ధారలన్నీ ఒక్కటై కరుణాసముద్రుడిగా మారడం.
*
దినకర మయూఖ తంత్రుల చుట్టూ వెలయించిన మీ కాంతి జలపాతాల చిత్రయానం చాలా బావుంది.
ధన్యవాదాలు