దాచుకోవాల్సిన బంగారు కథలూ బొమ్మలూ!

 మొదటి పేజీలో పెట్టిన కలంకారీ చిత్రం  ‘ లైఫ్ ఆఫ్ ట్రీ ‘. బంగారు కథల రచయిత విష్ణుమ రాగలీన తన పదో తరగతి అయిపోయాక గురువు వద్ద  చిత్రకళ  నేర్చుకుంటూ వొక మీటరు గుడ్డ మీద అద్దిన బొమ్మ. యీ బొమ్మ లాగే పుస్తకంలోని అన్ని కథలూ, అన్ని బొమ్మలూ చదివి, చూసి,  దాచుకోవలసినవి.

యీ తిరుపతి అమ్మణ్ణి చిన్నతనం నుంచే కథలు చెప్పనేర్చింది. కానీ తనకూ రాయటమంటే మనలాగా మహాచెడ్డ సోదిపని మరి. అప్పుడెప్పుడో అలా చెప్పిన కథలలో కొన్ని ఇలా వచ్చాయి.

పుస్తకం చదువుతుండగా  నాకు అనిపించిందీ ” యీ అమ్మాయి ఊహల వాకిళ్ళు తెరుచుకున్నాయి ” అని.

ప్రతి కథనూ చదువుతూ నా ప్రియమైన రచయితా, గొప్ప ఉపాధ్యాయుడు సుహోమ్లిన్ స్కీని అడుగడుగునా  గుర్తు చేసుకున్నాను. ఎందుకో మీకూ చెబుతాను-

            ఊహల వాకిళ్ళు తెరచుకోవడం

సుహోమ్లిన్ స్కీ ఒక రష్యన్ ఉపాధ్యాయుడు.

స్కూలుకు కొత్తగా వచ్చిన ఆరేడేళ్ల పిల్లలను క్లాసుకు పోదాం పదండి!  అంటూ తోటలోని ద్రాక్ష పొదరింటి కిందికి తీసుకుపోయాడు. ఆ పిల్లలు అబ్బుర పడ్డారు.

” ఇక్కన్నుంచి మనం నీలాకాశం కేసి, తోటకేసి, వూరికేసి సూర్యుని కేసి చూద్దాం ” అన్నాడు. ఇవన్నీ చూశాక ద్రాక్ష పండ్లు తిందాంలే! అని ఆశకూడ పెట్టాడు. నిజంగానే

ప్రకృతి సౌందర్యంతో సమ్మోహితులైపోయిన పిల్లలు నిశ్శబ్దంగా అయిపోయారు. తోట అంతా ఆకుపచ్చ పోగమంచులో ఉన్నట్టుంది… నిగనిగలాడే చెట్ల మీద ఎండకాంతి పడుతోంది.

” సూర్యుడు నిప్పుకణాలు చల్లుతున్నాడు ” నెమ్మదిగా అంది కాత్యా. పిల్లలు ఆ ముగ్ధ మోహన దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నారు. అప్పుడు సుహోమ్లిన్ స్కీ వాళ్లకు యిలా కథ చెప్పాడు.

” అవును పిల్లలూ కాత్య బాగా చెప్పింది. సూర్యుడు ఆకాశంలో ఎక్కడో యెత్తులో వుంటాడు. ఆయనకు ఇద్దరు మహా కాయులైన కమ్మరవాళ్ళు వున్నారు. ఒక దాయ వుంది. వేకువకు ముందే వాళ్ళు తమ అగ్నిమయమైన గడ్డాలతోటి సూర్యుడి దగ్గరికి వెళతారు.

ఆయన వాళ్ళకి రెండు వెండి దారపు పోగులు ఇస్తాడు.ఆ కమ్మర వాళ్ళు దారపు పోగులను బంగారు దాయమీద పెట్టి సుత్తులతో కొడతారు. సాగగొట్టి సూర్యుని కోసం వెండి దండ తయారు చేస్తారు. అలా కొట్టినప్పుడు వెండి నిప్పు కణాలు సుత్తుల కింది నుంచి ఎగిరి ముక్కలై ప్రపంచమంతాపడతాయి. అవే యీ నిప్పు కణాలు. సాయంత్రం వేళకి అలసిన కమ్మరులు సూర్యుడికి దండను ఇచ్చేస్తారు. ఆయన తన బంగారు జడలో పెట్టుకొని తన మాయావనంలోకి విశ్రాంతికి వెళ్లి పోతాడు.” ఆ అద్భుత కథా ప్రపంచంతోటి పిల్లలు సమ్మోహితులై పోయారు. కదిలితే ఆ మంత్ర మహిమ మాయమై పోతుందేమో అన్నంతగా నిశ్శబ్దం అయిపోయారు.

కాత్య నోటి వెంట వచ్చిన ఆ ఒక్క మాట యెంత కవితాత్మకంగా వుంది కదా!

సరిగ్గా ఇక్కడే పిల్లల ఊహల వాకిళ్ళు తెరుచుకోవడం మొదలవుతుంది. సూర్యుడు ఒక స్వయం ప్రకాశిత మండుతున్న అగ్నిగోళము అని ఆయన చెప్పలేదు. పైగా వాళ్ళ ప్రపంచాన్ని వాస్తవాల కుప్పతో నింపేయవద్దని కూడా అంటాడు.

పిల్లల హృదయం ఇంత దాకా ఏదీ చొరబడని చీకటి గది వంటిది. అందులో ఒక్కొక్క వెలుగురేఖనూ నెమ్మదిగా లోపలికి రానివ్వండి. ఆ వెలుగును ఆస్వాదించనివ్వండి. సైన్సు పేరుతో అన్ని కరుకు వాస్తవాలను ఒకేసారి చెప్పి హృదయపు కిటికీలను భళ్ళున తెరవకండి. అంత కాంతిని ఒక్కసారి తట్టుకోలేని పసి మనసులు వారివి.

ఆయన ప్రకారం  పిల్లలను ముందుగా ఊహలు చేయడం నేర్చుకోనివ్వాలి. వాస్తవాలదేముంది పై తరగతుల్లో ఆస్వాదిస్తారు గానీ. నాకు యీ మాట యెంత పరమ సత్యంగా తోచిందంటే బోర్ పరమాణు నమూనా గురించీ, ఐన్ స్టైన్ సాపేక్షత గురించి చేసిన ప్రతిపాదనలు కూడా అద్భుత వూహాలే కదా! వూహలు లేకుండా వాళ్ళు కూడా దృగ్విషయాలను కనిపెట్టగలిగేవారా?  శాస్త్రవేత్తల పరికల్పనలకు పునాది  బాల్యంలో చేసిన కల్పనలే కదా! అందుకే తన బోధనలో కళలను, కథలను వాహికగా చేసుకుంటాడు సుహోమ్లిన్ స్కీ.

తెలుగులో పిల్లల కోసం పెద్దలు రాసిన కథలే యెక్కువ. పిల్లలకోసం పిల్లలే రాసుకున్నవి అతి కొద్ది. అందువల్లనే నేమో మనం కూడా పెద్దల సాహిత్య కొలమానాలతోనే పిల్లల సృజననీ అంచనావేయ ప్రయత్నిస్తాం.

అది తప్పు కదా?

సుహోమ్లిన్ స్కీ ఒకానొక అనుభవం మనకు ఏదైనా చెబుతుందేమో చూద్దాం.

” పిల్లలు వూరికే సౌందర్య సృష్టికర్తల్లాగ దర్శించి చుట్టూతా వున్న ప్రపంచాన్ని కాగితం మీద దించేయరు. వాళ్ళు  గీయటం లోని, ఊహించడం లోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. పిల్లల సృజనాత్మక కృషి అంతరిక జీవితం లోని లోతైన అద్వితీయమైన రంగం స్వయం వ్యక్తీకరణ, స్వయం నిర్ధారణ. వాటిలోనే ప్రతి పిల్లాడి వ్యష్టి లక్షణాలు వెల్లడౌతాయి. యీ వ్యక్తిత్వాన్ని విశ్వవ్యాప్తమైన కొలబద్దతో వర్గీకరించలేం.”

పిల్లల అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశించకుండా వాళ్ళను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. పెద్దవాళ్ళుగా ముందు మనం అందుకు సంసిద్ధులం కావాలి అని తన సందేశం.

ఆ పెద్దమనిషి  అనుభవం లోని యీ సన్నివేశం చూడండి.

” బొమ్మలు గీయమన్నప్పుడు కోల్య వేసిన బొమ్మ పిల్లలందరకూ ఉత్సుకత కలిగించింది. ఒక ఆపిల్ చెట్టు కొమ్మల తోటి, పండ్ల తోటి. చెట్టును పరివేస్టించి,  చెట్టుపైన ఎక్కడనో ఎత్తులో చందమామ వెన్నెల వెలుగులో  చిన్ని నక్షత్ర సమూహం.

ఏమిటవి? నేను అనగానే పిల్లవాడి మొహంలో  ఉత్సాహపూరితమైన మెరుపు!

“అవి చంద్రుడి మీదినుంచి పడే మెరుపు రవ్వలు. చంద్రుడిలో కూడా మహా కాయులైన కమ్మరి వాళ్ళు వున్నారు. లేరా ?”  అన్నాడు.” ఆరేళ్ల పిల్లవాడిలో అలా ఒక కొత్త ఊహ మెదిలింది.

సృజనాత్మకత  పిల్లలలో అంతరంగికమైన దిశలను తెరుస్తుంది. యీ దిశలలో దయాన్విత అనుభూతులు నిద్రిస్తూ వుంటాయి. మనం వాటిని స్పృశిస్తాము.

పిల్లల మనసుల్ని గురించి అనుకునేటప్పుడు మంచు ముత్యాలు తొణికిసలాడే మృదువైన గులాబీ పువ్వుని ఎవరైనా వూహించుకోవాలి. ఆ మంచు బిందువులు చెదరి పోకుండా ఆ పువ్వును ఏరాలంటే యెంత జాగ్రత్త, యెంత సౌకుమార్యం కావాలి. మనం ప్రతి నిముషం అంతే జాగ్రత్త గా వుండాలి.

పిల్లలతో పాటు సుహోమ్లిన్ స్కీ కూడా బొమ్మ గీశాడు కానీ వాళ్ళు అతని బొమ్మను పట్టించుకోలేదు. నిజానికి అతని బొమ్మలోని ధృఢ కాయులు కార్మికుల  వాస్తవ రూపులో వున్నారు. వాళ్ళు అది పట్టించుకోక లరీసా బొమ్మ చుట్టూ గుమిగూడారు.  సుహోమ్లిన్ స్కీ ఆ నిరాదరణతో యెంతో దిగులు పడ్డాడు. అంత గొప్పదనం ఏముంది ఆ పిల్ల బొమ్మలో! అని ఒక్క క్షణం అతనికి అనిపించింది. ఆ తరువాత అతనికి  అర్థమైంది.

“పిల్లలకు తమ స్వంత వ్యక్తీకరణ భాష వుంది. మీరు యెంత ప్రయత్నించినా వాళ్ళ భాషని అనుకరించలేరు. ఆమె బొమ్మలో కమ్మరి వాళ్ళ దూది పింజల్లాంటి జుట్టు, చుట్టూతా రవ్వల పరివేషంతో వున్నారు. వాళ్ళ గడ్డాలు వూరికే గడ్డాలు కావు. నిప్పు చుట్టలు. చేతుల్లోని సుత్తులు వాళ్ళ తలలకి రెండింతల  పరిమాణంలో వున్నాయి. శక్తి మంతులైన వ్యక్తి సమూహానికి, అగ్ని అంశకీ గల నమ్మలేనంత బలానికీ, నైపుణ్యానికి సంబంధించిన సత్యం ఆమె చిత్రం.”

పిల్లల ప్రపంచం అర్థం కావాలంటే వాళ్ళ ఊహల్లోకి మన వెళ్లగలగాలి అని  ముప్పై ఏళ్ళ కింద సుహోమ్లిన్ స్కీ కలిగించిన యీ ఎరుకతో నేను యీ బంగారు కథల్ని చదువుకున్నాను.

‘ అడవి దాహం ‘ కథలో చెట్టు అడుగుతుంది.

” బండరాయి! బండరాయి! వాన నీళ్లకు అడ్డంగా వున్నావు కొంచెం దారి ఇవ్వవా ప్లీజ్! అని.

చెట్టు అడగ్గానే అంత బండరాయి కూడా పక్కకు తొలగింది. ప్రకృతిలో, ప్రకృతితో వుండవలసిన సహజీవనాన్ని యీ కథ చెప్పడం లేదూ !

అటువంటి ఊహతోనే  మరో కథ ‘ వాన ‘.

జంతువులూ, పక్షులూ, చెట్లూ పాల్గొనకుండా మంచికీ చెడుకీ పోరాటాన్ని పిల్లలు ఊహించనేలేరు. వాళ్లకు ఇష్టమైన చెట్లూ, పిట్టలూ, ఉడుతలు, చేపలు, కుందేళ్ళు ఊహాల్లోని కట్టు కథ కాదు అవి మంచితనానికి మూర్తీభావం. ‘ స్వేచ్చ’ కథలో కష్టాలలో వున్న చార్వికి రెక్కలు తొడిగి స్వేచ్చనిచ్చిన సీతాకోకచిలుక మిన్నల్ కూడా అటువంటి  ఒక మంచితనానికి ప్రతినిధి.

కళలు, సృజన ‘ మనసు గల గుడిసె’ కథలో గంగ లాగా పిల్లలను దాయాన్విత మానవులుగా మారుస్తాయి. ఇతరుల పట్ల దయ, కరుణ వాళ్ళ వ్యక్తిత్వంలో భాగమౌతాయి. అందుకే గాయపడిన కోడిపిల్లకు, కుక్కపిల్లకు కట్టు కట్టిన దయామయి అయిన అమ్మాయి వాటిని స్నేహితులుగా మార్చుకోగలిగింది  ‘ముగ్గురు మిత్రులు’ కథలో.

తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి, పరిసరాల నుంచి  పిల్లలు ఎన్నో గ్రహిస్తారు. వారి ప్రభావంతో తమ దృక్పథాన్ని నిర్మించుకోవడమూ ప్రారంభిస్తారు.అట్లా  చెడు పట్ల ఆగ్రహం, మంచి పట్ల ప్రేమ యీ అమ్మాయిలో ఏర్పడ్డాయి. అవి కథల్లో వ్యక్తమయ్యాయి.

ఒక్క మాట చెప్పి యీ పరిచయం ముగిస్తాను

సృజనలో పిల్లలు పొందే ఆనందం బహుముఖమైనది. తమ సామర్థ్యాలను వెల్లడించుకోవటం, శ్రమను ప్రేమించటం, చుట్టూతా వున్న ప్రపంచపు సౌందర్యాన్ని ఆస్వాదించగల సృజనాత్మక శ్రమచేయటం, పరులను ప్రేమించటం, వారికోసం అందాన్ని సృష్టించడం, నిష్కళంక మానవమూర్తులుగా తయారవటం, వీటన్నిటి ఆనందాన్ని మనం పిల్లలకు ఇవ్వగలగాలి. బిడ్డల శిక్షణలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, సమాజపు పాత్ర యిదే.  తమ పిల్లలకు యీ వెసులుబాటును , అవకాశాన్ని కల్పిస్తున్న  తల్లిదండ్రులు అరుదాతి అరుదు. వారికి నమస్సులు.

యీ పుస్తకంలో తన శిష్యురాలి కథలకు అందమైన బొమ్మలుకట్టిన పూజారి మునిరత్నం, తీర్థం బాలాజీ గార్లకు  యేమి చెప్పినా  తక్కువే. యీ సారి తిరుపతి పోయినప్పుడు కలిసి మొక్కిరావాలి. రంగులు నింపుకున్న ఆ చేతిని ముద్దాడాలి.

యీ ఏడుకథల బంగారాన్ని అందంగా అచ్చుబోసిన శ్రీ శ్రీ విశ్వేశ్వర రావు గారికి 🙏.

నాణ్యమైన ఆయిల్ పేపర్ మీద అచ్చేసిన యీ  రంగురంగుల బొమ్మలను, వెంటవున్న కథలను ఫోటో ఫ్రేము చేసి ఇంట్లో గోడకు కట్టవచ్చును.

విష్ణుమ రాగలీన యీ మధ్యే ఇంటర్ పూర్తి చేసి తన ఇష్టమైన రంగం ఫైన్ ఆర్ట్స్  డిగ్రీ లో చేరింది. తన వూహలు మరిన్ని రేకులు తొడగాలని, అవి  రంగు రంగుల రెక్కలతో ఎగరాలని కోరుకుందాం.

అమ్మ చెప్పేది పిల్లలకు పొగడ్త ఆయుక్షీణం అని. అందుకని  ఇక్కడితో ఆపేద్దామేం.

బంగారు కథలు

రచయిత – విష్ణుమ రాగలీన

అట్టతో కలిపి 24 పేజీలున్న యీ పుస్తకం వెల 50 రూపాయలు.

ప్రతులకు: కళా చిత్ర ప్రచురణలు

20-3-131/A-1

శివజ్యోతి నగర్

తిరుపతి – 517507

ఆంధ్రప్రదేశ్.

9985425888.

శ్రీనివాస మూర్తి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పిల్లల వూహల్లోకి పెద్దలు జొరబడినా వారి ఏకాగ్రతకు భంగం కానంతవరకు సరే. సుహోమ్లిన్స్కీ లాంటివాళ్ళు ఆ space లో దూరి వాళ్ళ వూహాలను సంపన్నం చేయడానికి ప్రయత్నించారు.

    మహాశ్వేతాదేవి లాంటివాళ్ళు మరీ అట్టడుగున ఉన్న పిల్లల జీవితాలలోని పట్టుదలనూ తార్కిక జ్ఞానాన్నీ ప్రపంచానికి పరిచయం చేశారు.

    పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల సక్రమ కృషీ దార్శనికు లైన ఉపాధ్యాయుల చొరవా ఎంతో అవసరం. అవి దొరికిన రాగలీనకు అభినందనలు.

    మీ పుస్తక పరిచయం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అభివాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు