దళిత రచయితలు వెలిగించిన దీపాలు

రాయలసీమ సాహిత్యంలో దళితచైతన్యానికి పునాదులు వేసిన తొలికవి అన్నమయ్య. ఈ ప్రాంతం నుండే పుట్టిన మరొక సాంఘిక విప్లవకారుడు, పోతులూరి వీరబ్రహ్మం, ప్రజాకవి వేమనలు కూడా తదనంతర కాలంలో ఆనాటి కులవ్యవస్థపై తిరుగుబాటు చేశారు. అధునిక సాహిత్యం విస్తృతమవుతున్నకొద్దీ దళితులు అనుభవిస్తున్న అంటరానితనం, వివక్షలను కవులు గుర్తించగలిగారు.

ఈ నేపథ్యంలోనే రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళితకథ చిరంజీవి. రాయలసీమలో మొదటి తరానికి చెందిన కథారచయిత గుత్తి రామకృష్ణ అనంతపురం వాసి. ఈ కథను విజయవాణి పత్రికలో 16.03.1941లో ప్రచురించారు. అయితే ఇటీవలి పరిశోధనలో కడపకు చెందిన పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య ఆదిమాంధ్ర భక్తుని జీవితచరిత్ర అనే కథను 1928లోనే శ్రీరాములురెడ్డి రాసినట్లు గుర్తించాడు. ఇక దళితులే దళితసమస్యను రాయగలగడమన్నది 1980 వరకు జరగలేదు.

చిలుకూరి దేవపుత్ర రాయలసీమలో దళిత అనుభవంలోనుంచి 1980 తర్వాతే రాశారు. అంతకు ముందు రాయలసీమ నుండి దళితేతరులు అనేక దళిత కథల్ని రాశారు. ముల్లుగుచ్చుకున్నవాడికే ఆ బాధ తెలుస్తుందన్నట్లు వివక్షను ఎదుర్కొనే వాడే వివక్షను రాయగలడు. ఆ కోవలోనే చిలుకూరు దేవపుత్ర, నాగప్పగారి సుందర్రాజు, నాగులారపు విజయసారధి, బత్తుల ప్రసాద్‌లకథలు రాయలసీమ దళితసాహిత్యంలోకి వచ్చాయి.

ఈ క్రమంలో నాగప్ప గారి సుందర్రాజు తెచ్చిన ‘మాదిగోడు’ కథాసంకలనం గొప్పవిప్లవాన్ని తీసుకొచ్చింది. కథాసంకలనంలో మద్దికెర మార్తమ్మకత, ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేదా’, ‘చంద్రగ్రహణం’, ‘నెత్తురు మరకలు’ మొదలైన కథలలో దళిత జీవితం గొప్పగా ఈకవి రయగలిగారు. ఈ కథలలో మొత్తం దళితజీవిత వ్యక్తీకరణ, రూపం, అసమానతలు, అవమానాలు చాలా స్పష్టంగా రాయగలిగారు.1983 పాదిరికుప్పం ఘటన తర్వాత రాయలసీమలో దళితసాహిత్యం విస్తృతంగానే వచ్చింది.

అయితే నాగప్ప గారి సుందర్రాజు కథల్లోనూ కవితల్లోనూ కన్నడ సరిహద్దు ప్రాంతాలైన ఆదోని ప్రాంత మాండలికాన్ని గొప్పగా రాయగలగడం వల్ల దళిత సాహిత్య చేగువేరాగా పిలువబడ్డాడు. అది సాహిత్యలోకంలోనే గొప్పచర్చకు, పరిశోధనకు దారితీయగలిగింది. 1995లో గుండెచప్పుడు, 1996లో చండాలచాటింపు, 1997 ఫిబ్రవరిలో మాదిగోడు,1997 డిసెంబర్‌లో మాదిగ చైతన్యం, 1999లో మా ఊరిమైసమ్మ, బొంబాయోడు గోండుజోగమ్మయ్యేడ వంటి రచనలు చేశారు.

సుందర్రాజు కథలు రాసినా, కవిత్వం రాసినా మాదిగ అస్తిత్వం మరచిపోలేదు. అలాగని అస్తిత్వం ఊబిలోకూడా కొట్టుకుపోలేదు. అసమసమాజాన్ని వేలు పట్టుకుని నడిపించాడు. మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాలపట్ల సుందర్రాజు రాసిన కథలు విశ్లేషించినప్పుడు బసివిని కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలుగా చెప్పవచ్చు.

సుందర్‌రాజు ‘సువార్త’ అనే కలం పేరుతో ‘అక్క చచ్చిపోయింది’ అనే శీర్షికతో రాసిన మొదటికథ 1995లో దళితరాజ్యం అనే పత్రికలో అచ్చయింది. 1997లో 10 కథలతో వచ్చిన ‘మాదిగోడు’ తోపాటు ‘మాఊరి మైసమ్మ’, ‘బొంబాయోడు గండు జోగమ్మయ్యేడ్య’ ఈ రెండు కథలు 1999లో వచ్చాయి. తన కథల్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న బసివిరాలు వ్యవస్థ రద్దు కావాలని మాల, మాదిగ స్త్రీలు పడుతున్న బాధను కథలుగా రాశాడు. ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద’ అనే కథ కన్నీళ్ళు తెప్పిస్తుంది.

బసివిరాలు అంటే దేవదాసి. అట్టడుగు స్థాయి కన్యను దేవుడి సేవకు యావజ్జీవం వదిలిపెట్టడం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలలోను దేవదాసి పాత్ర ఉంది. గురుజాడ అప్పారావు రాసిన కన్యకలోను ఈ వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు. నడిమింటి బోడెక్క బసివిరాలు కథలోని పాత్రలు, కథ చెబుతున్న బడికివెళ్ళే కుర్రాడు, పాఠాలు చెప్పే కరణం, మాస్టారు కూడా అయిన శంకరప్ప పాత్రల్ని సుందర్‌రాజు అద్భుతంగా సృష్టించాడు.

రాయలసీమలోని పేదల జీవితాల్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోకపోతే ఇటువంటి కథలు పుట్టవు. కథలో బసివిరాలుగా విడువబడే పిల్ల వయసు పదేళ్ళు. పదేళ్ళ పిల్లను బసివిరాలుగా విడువలేదని రెడ్లతోపాటు అతని కులస్తులే ఆ పిల్ల తండ్రిని ఒప్పిస్తారు. తిరస్కరించిన తండ్రిని మనవూళ్ళో మూడేళ్ళ పసిపిల్లను బసివిరాలుగా విడువలేదా? అని ప్రశ్నిస్తారు. కథ కొనసాగే కొద్దీ అమ్మవారి పండుగ, పోతురాజు పండుగలు కనిపిస్తాయి. ఉత్సవానికి అయ్యే ఖర్చును తానే భరిస్తాను అంటాడు ఆ ఊరిరెడ్డి. ఆ గ్రామపెద్ద న్యాయం నిర్ణయించడం, ఆర్థిక ఆంక్షలూ కనిపిస్తాయి.

కథలో గ్రామరెడ్డి పాత్రలో కర్ణాటకలో రెండువేలకే పదిమంది బసివిరాండ్రనిడువవచ్చు, నీ బిడ్డేమన్నా భూలోకరంభనుకున్నావా? అని నీచంగా పంచాయితీలో తిడతాడు. ఎవరెన్ని చెప్పినా నడిమింటి బోడెక్క బసివిరాలవుతుంది. దేవరపోతును బలిస్తున్నట్లుగానే బసివిరాలిని చేసే పండుగలో బలివ్వాలి. ఇలాంటి సామాజిక రుగ్మతల్ని సుందర్‌ర్రాజు కథల్లో చూపించారు. బసివిరాలి వ్యవస్థ, జోగిని, దేవదాసి వ్యవస్థలు ఎన్ని చట్టాలొచ్చిన అంతరించిపోకుండా ఉండటం కథకులకు గొప్ప కథావస్తువులయ్యాయి.

అందుకే నాగప్పగారి సుందరరాజు రాసిన ‘మాదిగోడు’ కథా సంపుటి తెలుగు కథా సాహిత్యంలోనే ఒక విప్లవకెరటం. రాయలసీమలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే దళితుల జీవితవాస్తవికతను దళిత దృష్టికోణం నుంచి స్వీయకథాత్మకంగా రచించాడు. ఇందులోని పదికథలు భారతదేశ గ్రామాల్లో దళితుల జీవిత సౌందర్యాన్నీ, దళితుల ఆలోచనలను సాంస్కృతిక సౌభాగ్యాన్ని ప్రదర్శించాయి.

‘బోడెద్దు’ కథ చనిపోయిన పశువుని కోసి వండుకొని తినే సంప్రదాయాన్ని ఒక గొప్ప అనుభూతిగా ప్రదర్శించింది. ఎన్ని అణిచివేతలకు గురవుతున్నా దళితుల్లో ఉండే కోరికలు, అగ్రవర్ణ స్త్రీల పట్ల ఉండే ఆకర్షణలు సుందరరాజు ‘ఈరారెడ్డి మనుమరాలు మీద మొనుసుండాది’ లాంటి కథలో వాస్తవికతను ప్రదర్శించాడు. దళితస్త్రీని లోబరుచుకునే క్రమంలో అగ్రవర్ణాల వాళ్ళు బసివిరాండ్రుగా మార్చేక్రమాన్ని ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద్య’ కథలో ప్రతిబింబించాడు.

‘మాదిగోడు’లో అగ్రవర్ణాల దౌష్ట్యాన్ని మాత్రమే కాకుండా దళితులలోని కళాత్మకతను కూడా ప్రదర్శించి సుందరరాజు తెలుగు కథలోకి ఒక కొత్త వస్తువును, కొత్త శిల్పాన్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఈ నేపథ్యంలో రెండోతరంలో దళిత కవుల్లో అగ్రస్థానం సంపాదించుకున్న కవుల్లో అగ్రగణ్యులు నాగప్ప గారి సుందర్రాజు. సుందర్రాజు దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివక్షని ప్రత్యక్షంగా తనూ అనుభవించినవాడు.

ఎదపై తప్పెడమోపి గుండెలదిరిపోయేలా కొట్టాడు.ఇక్కడ మరో దళితకవిని ప్రస్తావించాల్సిన అవసరం వుంది. మాదిగలపై వివక్షను సుందర్రాజు రాస్తే మాలలపై వివక్షను కర్నూలుకు చెందిన గుంపుల వెంకటేశ్వర్లు బ్యాగరోళ్లు కథ రాశారు. రాసింది ఒకే కథే. ఆ కథ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. 2000 సంవత్సరంలో బ్యాగరోళ్ళు అనే సామాజికవర్గాన్ని కథా వస్తువుగా తీసుకొని కథరాస్తే అది తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా దళితసాహిత్యంలో సంచలనమైంది.

ప్రపంచానికి దళితుల స్థితిగతులు ముఖ్యంగా మాలలు(రాయలసీమలో బ్యాగరోళ్ళు) అనబడే దళితుల దుర్భరజీవితాలు తెలిశాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వావిద్యాలయమే ఈ శతాబ్ధపు అత్యుత్తత కథలజాబితాలో ఈ కథను చేర్చి ముద్రించింది.

ప్రస్తుతం రాయలసీమ నుండి అనేక దళితకథలు వస్తున్నాయి. రాయలసీమలో భాగమైన కర్నూలు నుండి “నిప్పులవాన”  అని, దళితులే రాసిన దళితకథాసంపుటి వచ్చింది. ప్రస్తుతం రాయలసీమ నుండి అనేక దళితకథలు విస్తృతంగా వస్తున్నాయి.

*

కెంగార మోహన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు