అంబేద్కర్ సిద్ధాంత భావజాలాన్ని అణువణువూ నింపుకుని, ‘కులాన్ని నిర్మూలిద్దాం – బహుజన సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ ఉవ్వెత్తున ఎగసిన కాన్షీరాం కార్యాచరణతో ప్రభావితుడైన కవి నేలపూరి రత్నాజీ. అట్టడుగు వర్గాల అభ్యుదయం కోసం, చైతన్యం కోసం అక్షరాన్ని ఆయుధంగా మలిచిన కవి. మనువాదంతో మత్తెక్కిన మెదళ్ల మలినాన్ని తొలగించడానికి తపించే అభ్యుదయ కవి.
వెలివాడల వెతల్ని, బహుజనుల బాధల్ని అక్షరాలుగా మలచి సాంత్వన కలిగించే సమానత్వ స్వాప్నికుడు. కవిత్వం కాలక్షేపానికి కాదని, మెదళ్లలో చైతన్యాన్ని నింపే బీజాక్షరాలని నమ్మిన కవి. హైకూలైనా, నానీలైనా, దీర్ఘ కవిత్వమైనా, సంపాదకత్వమైనా… సమాజ హితాన్ని కోరాలని మనసా వాచా కర్మణా నమ్మిన నిబద్ధత కలిగిన కవి. ఎగుడుదిగుడు జీవితంలో ఎత్తుపల్లాలను అనుభవించి, అంటరానితనపు అవహేళనల్ని సహించి, అవమానాల్ని భరించి అక్షరాన్ని ఆత్మీయంగా హత్తుకుని కవిత్వమై ఎగసిన నిఖార్సైన కవి. ‘గాజా లేని జాగా’ కోసం తపించిన ఈ కవి పదునైన అభివ్యక్తులతో, ‘మాట్లాడుతూనే ఉంటా’నంటూ మన ముందుకు రావడం అభినందనీయం.
ప్రతి కవితా ఒక నిప్పురవ్వ. కులమతాల ప్రస్తావన లేని సమసమాజాన్ని కాంక్షిస్తూ నింగికి ఎగరేసిన శాంతి గువ్వ. అందులో కొన్ని కవితల్ని చూద్దాం. మనదేశం.. కులం కంచెలతోనూ, మతం ముళ్ళ కంచెలతోనూ నిత్యమూ పహారా కాయబడుతున్న దేశం. సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది నేతి బీరకాయలో నెయ్యిలాగా అనిపిస్తుంది. దళిత, బహుజనులపైన దాష్టీకాలు అగ్నిహోత్రంలా మండుతూనే ఉంటుంది. చిన్నపిల్లలు, మహిళలపైన అత్యాచారాలకు అంతేలేదు.
ఆ కుకీ మహిళల దేహంలో
కొత్తగా మొలిచిన ఏ అంగం ఉందిరా
ఆ పంగలో మీ ముఖాలు దూర్చి మీ తల్లుల మర్మ స్థానాన్ని
మీ జన్మ రహస్య స్థావరాన్ని
బహిరంగంగా భయోత్పాతంగా చుట్టూ
ఆకలి చూపుల పులులై ఎగబడి
ఎందుకురా రోడ్లమీద ఊరేగింపులు చేస్తారు (లోయను ముంచెత్తండి)
మణిపూర్ మహిళలపైన సాగించిన అత్యంత పాశవిక క్రీడ చరిత్ర మర్చిపోదు. ప్రభుత్వం కళ్ళుండీ గుడ్డిదైంది. అమాయక కుకీ మహిళల నగ్నదేహాల ఊరేగింపును దేశమంతా నివ్వెరపోయి చూసింది. మానాల్లో వేళ్లు జొనిపి, వీడియోలు తీస్తూ అమాయకులపైన రాజ్యం అండతో సాగించిన వికృతక్రీడ మర్చిపోలేని పీడకల. అందుకే ‘కాళిక చేతిలోని కత్తి మణిపూర్ నాగా మహిళల చేతుల్లో మారణాయుధమవ్వాలి’ అని చెప్తూ ప్రతిఘటించే తెగువ నేర్చుకోమని తల్లుల్నీ, తోబుట్టువుల్నీ కోరుతున్నాడు.
అన్యాయమే న్యాయంగా చలామణీ అవుతున్న నేలమీద కళ్లముందు జరుగుతున్న ఘోర కృత్యాలను చూస్తూ కూడా కోర్టుల్లో న్యాయం జరగట్లేదు. ఆయేషా చనిపోయి ఇన్నేళ్లూ గడిచిన హంతుకులు దొరకలేదు, వారికి శిక్ష పడలేదు. వాకపల్లి ఆదివాసీ స్త్రీల మీద జరిగిన అత్యాచారాలు, ఖైర్లాంజీ భయ్యాలాల్ చావు, గుజరాత్ మారణ హోమాలు, మధుకర్ హత్యలు…ఇలా చెప్పుకుంటూ పోతే కోర్టుల్లో కూడా న్యాయం జరగకుండా వీరి చావులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అందుకే సమాధుల్ని తిరగదోడి, శవాల్ని బయటికి తీసి, వాటి సాక్ష్యాల్ని వినిపిస్తేనైనా కోర్టుల్లో న్యాయం జరుగుతుందేమోనని ప్రశ్నిస్తున్నాడు కవి.
చుండూరు, కారంచేడు, కంచికచర్ల కోటేశు లాంటి ఘోర కృత్యాలలో దోషులకు శిక్ష పడడం కంటితుడుపు చర్యే. సనాతనధర్మం పేరుతో ఆటవిక పాలన కొనసాగుతోంది. హిందుత్వమే ప్రధాన అంజెండాగా కొనసాగుతున్న రాజ్యానికి క్రైస్తవులు, ముస్లింలు ప్రధాన శత్రువులు. అందుకే ‘నెత్తురు మడుగులోంచి’ మాట్లాడుతున్నాడు కవి.
హిందుత్వ ముసుగులో దళిత, బహుజన, స్త్రీలపట్ల రాజ్య వైఖరిని వైఖరినిఆవేదనతో ప్రశ్నిస్తున్నాడు కవి. మనిషిని మనిషిగా కాకుండా కులంగానో, మతంగానో చూసే దేశంలో శవాల్ని బహూకరిస్తారు. ఆడపిల్లల్ని పెట్రోలు పోసి నిలువునా తగలబెడతారు. రాజ్యాంగం అందరికీ సమానహక్కులు ప్రసాదించింది. అయినా కొద్దిమందే వాటిని తరరతరాలుగా, వారసత్వంగా అనుభవిస్తూ దళితుల్ని, బహుజనుల్ని ఇంకా క్రూరంగానే హింసిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు కవి.
విజయవాడలోని ‘సామాజిక పరివర్తన కేంద్రం’ ప్రచురించిన ఈ సంపుటిలో యాభై కవితలున్నాయి. గూడు కట్టుకున్న దళిత, బహుజన జీవితాల అస్తిత్వ చిత్రాలున్నాయి. వివక్షకు గురవుతున్న వారి జీవిత ఆనవాళ్లున్నాయి. ఏదో ఒక రూపంలో అమలవుతున్న ‘మనువు’ కులధోరణి పట్ల వ్యతిరేకత ఉంది. డెబ్భై తొమ్మిదేళ్ల స్వతంత్రం దేశంలో ఎక్కడో ఒకచోట ప్రవహిస్తున్న ‘నీళ్ల అంటు’ మీద నిరసన వుంది.
రాజకీయ నాయకుల్ని ‘వెలిగించ’డానికి నిరంతరం అగ్నికి ఆహుతి అవుతున్న దళిత, బహుజనుల శ్రమదోపిడి పట్ల సానుభూతి ఉంది. ప్రతీ కవితలోనూ సమాజం పట్ల లోతైన అవగాహన కనిపిస్తుంది. కోట్లాది దళిత, బహుజనుల తరుపున వకాల్తా పుచ్చుకుని, జరుగుతున్న నేరాలు, ఘోరాల పట్ల స్పందిస్తూ ‘మాట్లాడుతూనే ఉంటా’నంటున్న నేలపూరి రత్నాజీ గారికి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నాను.
Add comment