కళ్యాణరావు పేరు వినగానే అంటరాని వసంతం జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకం గతం కాదు.
జీవితం కూడా అంతే. అనేక అనుభవాల సమాహారం. అక్కడ నుండి గంగవోలు కళ్యాణరావు దారి వేసుకున్నాడు. దళిత జీవన ఒరవడి ఎంత సౌందర్యాత్మకంగా ఉంటుందో అందమైన శిల్పంతో చెప్పాడు. కవితాత్మక హృదయంతో చెప్పాడు. రాయలేని దశ నుండి రాయడం మొదలుపెట్టారు. ఒక రచయితకు జీవితమే పునాది .ఆ కేంద్ర బిందువు నుండి రచయిత విశాలమవుతాడు. విస్తృతి చెందుతాడు. తనకి తాను కరిగిపోతాడు. తను నివసించిన కాలాన్ని, మనుషులను, వేదనలను, ప్రశ్నలను, జవాబులను అన్వేషిస్తాడు. సాహిత్యం పుస్తకాలలో నిక్షిప్తం కాదు. మనుషుల జ్ఞాపకాలలో చేరుతుంది. చీకటిలో నక్షత్రంవలె వెలుతురును చిమ్ముతుంది.
ఇంతకీ ఎవరీ కళ్యాణ రావు?!
ప్రకాశంజిల్లా అలకూరపాడు గ్రామానికి చెందినవారు. అందమైన పల్లెటూరు.
జీవితమంతా అక్కడే గడిచింది . గ్రామీణ స్వభావంలోని సకల శ్రమ, మానవీయ సంస్కృతులను అధ్యయనం చేశాడు. ఇంగ్లీష్ లిటరేచర్ తో పరిచయం ఉంది.
తనని తాను రూపొందించుకునే క్రమంలో కేవలం అధ్యయనం సరిపోతుందా? జీవితాన్ని తనదైన కొలబద్దలతో అంచనా వేశాడు. కుల-వర్గ అణిచివేత దేశంలో తన వంటి వారి జీవితాలలోని చీకటిని చూశాడు. భారతదేశ కుల వ్యవస్థలో దాగిన అంటరానితనాన్ని అంచనా వేశాడు .స్వయానా బాధితుడు .ఒక బాధిత స్వరం తనకు తాను ప్రవహించింది.
కల్యాణరావు అంటరాని వసంతం దగ్గరే ఆగలేదు. విస్తృతమైన సాహిత్య సృజన ఉంది. సమాజ కార్యకర్త కూడా. సాహిత్య రచన మాత్రమే కాదు, విప్లవ రచయితల సంఘంలో నాయకునిగా పనిచేశాడు. రచన , ఉద్యమం, నిర్బంధం వీటి మధ్య కొనసాగుతున్నారు.
కల్యాణరావు శిల్పం చాలా అరుదైనది.
చిక్కనైన వాక్య నిర్మాణం .ఒక నదీ ప్రవాహం వంటి శిల్పమది. మనుషులలో ఉండే జీవన గాఢత అతని శిల్పం. కథ, నవల, కవిత, వ్యాసం, ఉపన్యాసం వీటి మధ్య ఉన్న అంత సూత్రాన్ని సజీవంగా నిలపగలుగుతాడు. ఇదొక సజీవ ,జీవన అక్షర విన్యాసం .ప్రజలభాష నుండి ఎక్కడా వేరుపడడు. తన అస్తిత్వం నుండి తన దారిని విశాలం చేసుకున్నాడు.
సాహిత్య రచనలోకి ఒకింత మెలకువతో వచ్చారు. ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం. మనుషుల జీవన రాపిడి ఆధిపత్య భావజాలం, పీడన ఈదడి మధ్య రచయిత పెరిగాడు .అంత మాత్రమేనా! ఆరుదశాబ్దాల ఉద్యమ ప్రభావం ఉండనే ఉన్నది. కార్యకర్త, నాయకుడు కూడా. రచయితలు ఎలా రూపొందుతారు? నూరేళ్ల సాహిత్య పరంపరలో సృజన ఘనీభవించని శిలలా ఎలా గడ్డ కడుతుంది. ఆశిల అనేక అనేక అక్షరాల తర్వాత ఎలా కరుగుతుంది. శతాబ్దాల మానవ జీవితాన్ని ఒక రూపు కట్టడం దృశ్యమానం చేయడం. కేవలం సాహిత్యకళ. రచయితగా తనను తాను నిర్మించుకోవడం ఒక పార్శ్వము. ప్రజల ముంగిట రచయిత ఒక ఓదార్పు కావడం అనేది జీవన రచన. నాలుగు దశాబ్దాల దాటిన కళ్యాణరావు సాహిత్య జీవనం, రచన- మాట అనే కేంద్రం దగ్గరే కొన సాగుతుంది
రాజీలేని రచనా క్రమం. ఈదేశంలోని అసమానతలకు కారణమైన రాజ్య వ్యక్తీకరణల గురించి స్పష్టమైన లోచూపు ఉన్నది. వర్గ ,కుల దోపిడీ సారాంశం తెలుసు. వీటిని అంగీకరించలేని ఆచరణ నుండి కల్యాణరావు తనని తాను ఆవిష్కరించుకున్నాడు . పల్లె జీవితం నుండి రచయితగా రూపొందడానికి కావలసిన బీజాలను అక్కడి మనుషుల నుండి స్వీకరించాడు . తనచుట్టూ కేవలం మనుషులేనా!
విశాలమైన ప్రకృతి దృశ్యం ఉండనే వుంది . సౌందర్యవంతమైన మనుషులు. వారి జీవితం. ఇదంతా వసుధైక కుటుంబం అనే భ్రమల కాలం. ఈ మనుషుల కలయికలో అనేక అంతరాలు ఉన్నాయి. గ్రామం నుండి దేశం వరకు ఈ అంటరానితనం అనేక రూపాలలో వ్యక్తం అవుతుంది. ఒక దగ్గర కులం. మరొక దగ్గర వర్గం . కల్యాణరావు తాత్వికతలో కులం ప్రధానమైన భాగం కాదు. అతనిలోని మార్కిస్టు చింతన భారతదేశం కుల పీడన దగ్గర ఆగలేదని . అసమానత వర్గంలోనే ఉన్నది అనే గ్రహింపు కల్యాణరావులో ఉన్నది. అయితే కుల-వర్గ అసమానతలు పరిష్కరించే భావజాలం విప్లవం దగ్గరే ఉన్నదని కళ్యాణరావు నమ్మిక.
రచయితగా ఉంటూనే విప్లవ రచయితల సంఘంలో చురుకైన పాత్రను నిర్వహించారు. అరుణతార సంపాదకుడుగా పని చేసారు. ఒక ఉద్యమ పత్రికను సాహిత్య, రాజకీయ సమ్మిళితం గా తీసుకురావడానికి తనలోని సృజనాత్మక అభినివేశం తోడ్పడింది. కళ్యాణరావు మాటలానే రచన ఉంటుంది.
ప్రభుత్వానికి, విప్లవకారులకు జరిగిన చర్చలలో చర్చల ప్రతినిధిగా ఉన్నాడు . చర్చలు విఫలమైన తర్వాత నిర్బంధానికి గురయ్యారు. జైలు జీవితం ఉండనే ఉంది. జీవితం ప్రవాహగానం అనుకుంటే కళ్యాణరావుది రచనాగానం . ప్రజల మిత్రునిగా, రచయితగా స్థల, కాలాలలో నిలబడడం వెనుక తను నడిచి వచ్చిన దారి ఉన్నది . కథ, కవిత్వం వెలువరించినా అంటరానివసంతం నవల క్లాసికల్. ఆఖరిమనిషి అంతరంగం ప్రసిద్ధ రచన. అంటరానివసంతం తెలుగు నవలల జాబితాలో ఒకటిగా నిలిచింది .అనేక భాషలలో అనువాదమైంది. ఇప్పటికీ అనేక ముద్రణలు అవుతుంది.
జ్ఞాపకాల, వాస్తవాల మధ్య నడిచేదే నారచన అంటారు కళ్యాణరావు. జీవితాన్ని ఎన్ని పేజీల్లోనైనా రాయ వచ్చు .అంటరాని వసంతం కొద్ది పేజీలలో పూర్తయ్యే జీవితం కాదు. ఏరచనకైనా ఈ కొలబద్ధ ఉంటుంది. ఒక నవల సమగ్రజీవితాన్ని ఆకలింపు చేయదు. దాని పరిధి సమగ్రం కాదు. అయినా రచయిత జీవన వాస్తవికతతో మొదలైనవారు. నవలా రచన ప్రారంభించినప్పుడు నవల సమగ్రత ప్రధాన అంశం. అయితే ఖాళీ పూరించలేనిది. అయినా అంటరానివసంతం ప్రతి తరం పాఠకున్ని ఆవాహన చేసుకుంటుంది .
ఆలకూరపాడులో ఉంటూనే సమకాలీన సాహిత్య, రాజకీయ ధోరణలను గమనిస్తున్నారు. చదువురిగా ఉన్నారు. తెలుగుసాహిత్యం, తెలుగు సమాజం ఒకనాటి కాలంతో పోలిస్తే ఒక నిరాసక్తత ఉందని అభిప్రాయపడతారు.
భారత సమాజపు వికాసాన్ని జీవిత కాలంలో చూసిన కళ్యాణరావు ఇవాల్టి భారతదేశం ఏమవుతుంది? అనే ఆందోళనజీవిగా వున్నారు. ఒకానొక నీటిజాలు కలుషితమవుతున్నదనే కలత వుంది. భవిష్యత్తు భారతదేశ నిర్మాణానికి ఈదేశంలోని రచయితలు, బుద్ధిజీవులు ఆలంబనగా వుండాలనే ఆశను వ్యక్తం చేస్తారు. తను ఆశించిన స్వప్నం ఇది కాదు అనే హెచ్చరిక ఉండనే ఉంది. ఎనభై ఏళ్లకు దగ్గర పడుతున్న కల్యాణరావు జీవనసమయాలు రచన మాత్రమే. జీవితం ఆనంద కళ, ఆనందకరమైనదని తెలియదు.
ఈ వసంతం
అప్పుడు నిషేధమే .
ఇప్పుడు నిషేధమే.
పుట్టిన కులం నిషిద్ధం. పోరాటం నిషిద్ధం.
నిన్న కావచ్చు
ఈరోజు కావచ్చు
కాలం ఏదైనా కావచ్చు.
*
ఒక రచయితకు జీవితమే పునాది .ఆ కేంద్ర బిందువు నుండి రచయిత విశాలమవుతాడు. విస్తృతి చెందుతాడు. తనకి తాను కరిగిపోతాడు. తను నివసించిన కాలాన్ని, మనుషులను, వేదనలను, ప్రశ్నలను, జవాబులను అన్వేషిస్తాడు. సాహిత్యం పుస్తకాలలో నిక్షిప్తం కాదు. మనుషుల జ్ఞాపకాలలో చేరుతుంది. చీకటిలో నక్షత్రంవలె వెలుతురును చిమ్ముతుంది. అద్భుత వ్యాక్యం..మంచి పరిచయ పరామర్శ.