నువ్వు దేశాంతరం వెళ్లి ఇవ్వాళ్టికి ఎన్నో రోజో గుర్తులేదు. తిరిగొచ్చే తేదీ నీకూ తెలీదు, చెప్పేవెళ్లావు చాలా సమయం పట్టొచ్చని. అందాక నీ గదిలోనే ఉండి ఎదురుచూస్తానని మాటిచ్చాను. ఏం తోచక గదిని అలంకరించే పని పెట్టుకున్నాను. ముందుగా గోడకి వేలాడతీసిన ఒకే ఒక చిత్రపటాన్ని తాకి చూశాను. బొమ్మలోని పూలన్నీ చెదిరిపోయి కొన్ని కుశల ప్రశ్నలు అక్కడ అంటుకున్నాయి. ఈశాన్యపు కిటికీ బయట వెలుతురు దారాలు కాకరతీగ పూలతో కలనేసుకున్నాయి.
పగటి పూట లోకమంతా పనిలో మునిగిపోయినప్పుడు ఆకాశం ఒకటో రెండో ఆశీర్వచనాల్ని రాల్చింది. ఎండ పొడకోసం చేతులు చాచినప్పుడు అదృష్టవశాత్తూ దోసిట్లోకి వచ్చి పడ్డాయవి. పదిలంగా లోపలకి తెచ్చి నిలువుటద్దం మీద అతికించాను. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎర్రటి బొట్టుబిళ్ళల్ని అతికిస్తాను కదా, వాటి పక్కనే. నువ్వు తిరిగొచ్చాక రోజూ తలదువ్వుకుంటూ చూస్తావుగా అటువైపు. అంతా మంచే జరుగుతుందిలే.
“నాకేమీ విసుగ్గా లేదు, చాలా పుస్తకాలున్నాయి. ఆకలిబాధ లేదు, పిట్టలు కొట్టిన పళ్ళన్నీ గుమ్మం బయట రాలిపడుతున్నాయి.” అని నీకు ఉత్తరంలో రాశాను. ఇవ్వాళ కూడా బయటికి వెళ్లేందుకు శక్తి లేదని, ఇతరులతో మాట్లాడటానికి భాష ఏమీ మిగల్లేదని మాత్రం చెప్పదల్చుకోలేదు. “ఇంకా అక్కడి సంగతులేమిటి? అక్కడ కూడా ఇదేవేళకి పొద్దు గుంకుతుందా, అప్పట్లో నిప్పుపూలు రాలిన అదే బాటలో పిల్లలు ఇంకా ఆటలాడుతున్నారా, మనం చితుకులు ఏరుకుని చలికాచుకున్న ఒంటిరాయి గుట్ట పక్కన, పాటల ఏరు ఇంకా పోటెత్తుతుందా? మరి … ఇంతకీ నువ్వెళ్లిన పని… మనం తిరిగివస్తే గుర్తుపట్టడానికి దిగంతరేఖపైన రాసుకుని వచ్చిన మొదటి పద్యం… ఈపూటైనా దొరికిందా?”
ఇక ఉత్తరంలో రాయకూడని సంగతి ఒకటుంది. సంధ్యావర్ణాలన్నీ ధూసరఛాయలో చిక్కబడే వేళకి, నేను కాని దేహాన్ని, నాది కాని ప్రాణాన్ని మెలితిప్పుతూ ఒక నొప్పి రేగుతుంది. ఎందుకని అడగటం నేరమని, సమాధానం కోరడం ధిక్కారమని తెలుసు. నీ దుఃఖాన్ని చూసి ఓర్చుకోలేని రాత్రులలో “పోనీ కొంతైనా నాక్కూడా పంచమని” నేనే పంతంగా కోరుకున్నదనీ తెలుసు. దూరము, కాలము, మరణము కలిసిన చోటే సృష్టి మొదలైందని కూడా తెలుసు.
కానీ, మనుషులమై మొలకెత్తినందుకు,అనంతమైన శూన్యాన్ని ఒకచోట చేర్చి మనసుల్ని కల్పించుకున్నందుకు, మరుజన్మల రహస్యం ఇప్పటికీ అంతుపట్టనందుకే కదా ఇంకా మనమంటే ఇద్దరమే అని నమ్ముతున్నాం. అదిగో, దయగా రాత్రి నీడ గదంతా అలముకుంటోంది. నన్నిక్కడ నీ హృదయానికి కాపలా పెట్టి వెళ్లావనే సందేశం ప్రతి నక్షత్రానికీ అందింది.
*
బాగుంది.
వావ్..ఎంత భావుకత, గాఢత ఉందో
ప్రతి పదం, వాక్యం శ్రద్ధగా దేవుడికి కట్టిన పూల మాలలా ఉంది. అంతర్లీనంగా ఆధ్యాత్మికత దారం తో అల్లిన అద్భుతమైన కూర్పు!
చదివిన ప్రతి సారి మరిన్ని కొత్త భావాలు పరిచయం చేస్తూ, ఒక లోతైన అనుభూతిని మిగిల్చింది మీ రచన.
ఎంత అర్ధం అయింది అనిపించినా ఇంకా అర్ధం చేసుకోవాల్సింది ఇందులో చాలా ఉంది అని మరో సారి చదివేలా ఉంది.
అద్భుతం స్వాతి!!
అమ్మా స్వాతి, ప్రతి పదం, ప్రతి వాక్యం, వాక్యాలలో పదాల అమరిక, పదాల లో లోతైన,గాఢమైన భావం మనసు లో లోపల మెలిపెట్టినట్టు అయింది. చదువుతుంటే దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అనుభవపూర్వకమైన భావ వ్యక్తీకరణకు అభినందనలు. 💐