తోక

కాంగో నది ఒడ్డున ఆ దట్టడవిలో జీవించే సెంటా తెగ జాతిలో మొదటిసారిగా ఓ ‘తోకలేని బిడ్డ’ పుట్టింది.

అప్పటికే కురచ తోకల బిడ్డలతో కుచించుకుపోయి మూగదైపోయిన గూడెం ఈ తోకలేని బిడ్డ పుట్టుకతో గొల్లున గోల పెట్టింది. ఆడవాళ్లు గుండెలు బాదుకుని ఏడిస్తే, మగవాళ్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. ముసలివాళ్లు తమ తోకలను తడిమి తడిమి చూసుకుంటున్నారు.

వనామా దేవత గుడి దగ్గర డప్పులు కొట్టడంతో గూడెం జనాలందరూ ఒక్కొక్కరుగా అక్కడ గుమిగూడుతున్నారు. ‘తిరస్కృత గుడిసె’లో ఉన్న రాకీ కూడా డప్పుల సద్దు వినగానే ఏదో కీడు జరిగిందని పరిగెత్తుకుంటూ గుడి వద్దకొచ్చాడు. అందరూ పోగయ్యాక గూడెం పెద్ద మురాజీ మాట్లాడటం మొదలుపెట్టాడు.

“గూడెం ప్రజలారా! మన పూర్వీకుల రోజుల్లో మన తోక ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. ఈ అడవిలో అటువైపునున్న మన శత్రు తెగల తోక కంటే ఎన్నో రెట్లు పొడుగ్గా ఉండేది. అప్పుడు మన తోక మనకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. మరి వనామా దేవత మన మీద ఎందుకు పగ పట్టిందో తెలియదు! తరాలు మారే కొద్దీ ఆ తోక పొడుగు తగ్గుతూపోవడం మొదలై, శత్రు తెగ మనల్ని అవమానించేలా మన బతుకు కురచ తోకల వరకు దిగజారింది. ఈ రోజు ఏకంగా అసలు తోకే లేని బిడ్డ పుట్టేసింది. ఇది మన సెంటా జాతి మొత్తానికి తీరని బాధ. అతి పెద్ద అవమానం! ఈ విషయం ఆ తెగకి తెలిస్తే, మనం ఎప్పటికీ తలెత్తుకోలేం. కనుక ఈ శాపగ్రస్తమైన బిడ్డని గుట్టుచప్పుడు కాకుండా మన వనామా దేవతకే బలిచ్చేయాలని నిర్ణయించుకున్నాను” అన్నాడు మురాజీ.

అతని మాటలకు అందరూ “ఓవ్” అని అరుస్తూ మద్దతు తెలిపారు. “ఈ బిడ్డని చంపొద్దు” అని అరుస్తున్న రాకీ ఆక్రందన ఎవరికీ వినిపించలేదు.

సెంటా జాతి మొత్తం చూస్తుండగా, ఆ రోజే పుట్టిన ఆ పసిబిడ్డ పీకని కోసేసి ఆ రక్తాన్ని వనామా దేవతకి అర్పించారు.

****

ఆ రోజు రాత్రి రాకీకి నిద్ర పట్టలేదు.

రాకీ పుట్టడమే గూడెంలోకెల్లా కురచ తోక పిల్లోడిగా, ఒక శాపగ్రస్తుడిలా పుట్టాడు. ఈ కురచ తోక శత్రు తెగ కంటిలో పడకూడదని రాకీని గూడెం దాటనిచ్చేవారు కాదు. ఒక గుడిసెలోనే ఉంచేసి బయటకి వెళ్లనివ్వకుండా చేశారు. గూడెంలో సొంత మనుషులే రాకీని అంటరానివాడిగా చూస్తూ అడుగడుగునా అవమానించేవాళ్లు. అలా గూడెంలోనే ఉంటూ, వనామా దేవత చేత  తిరస్కరించబడిన ప్రాణంగా, వెలివేయబడ్డ బతుకుతో ఆ ‘తిరస్కృత గుడిసె’లోనే ఏడుస్తూ ఉండేవాడు రాకీ.

కొన్నాళ్లకి రాకీకి తమ్ముడు పుట్టాడు. వాడి పేరు సాగో. వాడి తోక మరీ బెత్తెడే! గూడెంలోకెల్లా అతి చిన్నది. ఇన్నాళ్లూ రాకీ పడ్డ అవమానాలన్నీ సాగో మీదకి మరిలాయి. సాగో శాశ్వత ఆవాసం కూడా ఆ గుడిసే అయ్యింది.

రాకీకి సాగో అంటే పిచ్చి ఇష్టం. తాను అవమానాలు పడ్డా ఫర్లేదు కానీ, ఆ తోక వల్ల తన ముద్దుల తమ్ముడు సాగోని బంధించడం రాకీని ఎంతో బాధించేది. అయినా ఏమీ చేయలేకపోయేవాడు. ఎప్పుడూ సాగోతోనే ఉంటూ వాడిని నవ్విస్తూ ఉండేవాడు. అలా వారిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా ఉంటూ తమ అవమానాలను మర్చిపోయేవారు.

ఒకసారి సాగో, “అన్నా! నాకు అడవిని చూడాలని ఉంది” అని అడిగాడు.

“వద్దురా! మనం బయటకి వెళ్లకూడదు. అడవిని చూడకూడదు. శత్రుమూక మన తోకలను చూస్తే మన సెంటా జాతి మొత్తాన్ని అవమానిస్తారు” అన్నాడు రాకీ.

“అన్నా! నాకొక పాట వినిపించింది. అది కోయిల అని చెప్పావ్. ఆ కోయిలని చూడాలని ఉంది. అలానే ఒక కూత, ఒక ఊల, ఒక గాండ్రింపు, ఒక గర్జన, ఒక ఘీంకరింపు.. ఇలా ఎన్నో విన్నాను. కానీ ఏదీ చూడలేదు. అందరూ మాట్లాడుకునే ఆ నది పరవళ్లను ఒక్కసారి, ఒకే ఒక్కసారి చూడాలని ఉందన్నా” అని ఎంతో ఆర్తితో అడిగాడు సాగో.

ఏది ఏమైనా సరే, తన తమ్ముడి కోరిక నెరవేర్చాలనుకున్నాడు రాకీ. ఎవరికీ తెలియకుండా ఆ రోజు రాత్రే సాగోని తీసుకుని అడవిలోకి వచ్చాడు.

ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టిన సాగో ముఖంలోని ఆనందాన్ని చూస్తున్న రాకీకి ఎంతో తృప్తిగా అనిపించింది. తమ్ముడికి నదిని చూపించేసి మళ్లీ గూడెంలోని గుడిసెలోకి చేరుకోవాలని త్వరపడుతున్నాడు రాకీ.

వాళ్లు అలా అడవిలో సాగుతుండగా హఠాత్తుగా

శత్రు తెగల వాళ్లు వీళ్లకి కనిపించారు. వాళ్లు అనాగరికులు. పొడుగైన తోకతో ఎంతో బలంగా, భయంకరంగా ఉన్నారు. వారిని చూసి వీళ్లిద్దరూ భయపడిపోయారు. ఒక చెట్టు చాటున దాక్కున్నారు.

అయినా లాభం లేకపోయింది. వీళ్లు ఆ శత్రు తెగల కంటపడ్డారు. వారు సాగో కురచ తోకని చూసి హేళనగా పడీ పడీ నవ్వుకున్నారు. వాడి చేతులు వెనక్కి మడిచి పట్టుకుని, వాడి తోకని పట్టుకుని బలంగా లాగడం మొదలు పెట్టారు. నొప్పితో “అన్నా.. అన్నా” అంటూ అరుస్తున్నాడు సాగో. రాకీని అప్పటికే వాళ్లు కాళ్ల కింద వేసి తొక్కుతున్నారు.

అలా వాళ్లిద్దరితో కాసేపు ఇష్టమొచ్చినట్లు ఆడుకున్నాక, చివరికి సాగో బెత్తెడు తోకకి ఒక పెద్ద రాయిని కట్టి, ఆ రాయిని లాగమని కర్రతో కొట్టడం మొదలుపెట్టారు. వాడు దేకుతూ, పాకుతూ ఆ రాయిని లాగుతున్నా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఆ నొప్పికి వాడు తాళలేకపోతున్నాడు. ఇక వాడి వల్ల కాక “అన్నా.. అన్నా‌..” అంటూ తోకకి కట్టిన ఆ రాయిని చేతులతో ఎత్తుకుని, పరిగెత్తుకుంటూ పోయి ఆ కొండపై నుంచి నదిలోకి దూకేశాడు సాగో.

****

కాలం గడిచింది. సెంటా జాతిలో తోకలేని బిడ్డలు పుట్టడం, వారిని గూడెంలోని వనామా దేవతకి బలివ్వడం మాములైపోయింది. ఇక నుంచి ఈ జాతిలో పుట్టే ప్రతి బిడ్డ తోక లేకుండానే పుడుతుందని వాళ్లందరికీ అర్థమైంది. దీనికి శాశ్వత పరిష్కారం కనిపెట్టాలని గూడెం పెద్ద మురాజీ తన గూడెం జనాలని సమావేశపరిచాడు.

అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ “మన సెంటా జాతి, మన శత్రువు తెగ కంటే ఎంతో గొప్పది, తెలివైనది. ఆ నీచ జాతి ఇంకా చెట్ల మీదే బతుకుతుంటే, మనం ఇళ్లు కట్టుకున్నాం. మనం వేటకి ఎన్నో కొత్త కొత్త ఆయుధాలను వాడుతుంటే, వాళ్లేమో ఇంకా రాళ్ల మీదే ఆధారపడ్డారు. అసలు ఆ జాతికి వావి వరసలు లేవు. మనమేమో కుటుంబాలుగా బతుకుతున్నాం. మనకి వనామా దేవత అండ కూడా ఉంది. వారికి దేవతే లేదు. ఇలా వారిపై అన్నివిధాలుగా మనదే పైచేయి. అయినా ఈ ఒక్క తోక విషయంలో మాత్రం మనం ఆ నీచ జాతి ముందు తలొగ్గక తప్పట్లేదు. వారిది అత్యంత పొడుగైన తోక. మనది అత్యంత కురచ తోక. ఇప్పుడైతే అసలు తోకే లేదు” అని బాధతో తలవంచుకున్నాడు.

గూడెం మూగగా నిలబడింది.

మురాజీ కొనసాగిస్తూ “మన దేవతైన వనామా మాత తన తోకతో చందమామని చుట్టేసి ఊయల ఊగేది. తోకతో చుక్కలను ముడివేసేది. తోకతో గ్రహాలను విసిరికొట్టేది.  ఇంకా ఎన్నో అద్భుత కార్యాలను చేసింది. మన వనామా పవిత్రగ్రంథంలో ఇవన్నీ రాసున్నాయి. అందులో తోక గొప్పతనం గురించి ఎన్నో వర్ణనలున్నాయి. మన జాతికి ఎంతో గర్వకారణమైన ఈ తోక మనకు లేకుండా పోతోంది. ఆ విధంగా మన మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యకి ఏదొక దారి చూడాల్సిందే!” అన్నాడు.

గూడెం పూజారి లేచి “మురాజీ! వనామా దేవత మనపై కన్నెర్రజేసింది. శపించింది. మన జాతికి తోకని దూరం చేసింది. నేను మన వనామా గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే నాకొకటి తెలిసింది. వనామా మాతని శాంతపరచడానికి పద్దెనిమిది అమావాస్యల వరకు ప్రతి రోజూ ఒక దుప్పిని బలిచ్చి ప్రత్యేక పూజలు చేయాలి. మరు అమావాస్యకల్లా తోకతో బిడ్డ పుట్టేలా దేవత కరుణిస్తుంది” అన్నాడు.

దానికి మురాజీ “పూజారీ! ఇక నుండి నువ్వూ, నీ కుటుంబం వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సినవన్నీ గూడెం జనాలే వంతులవారీగా సమకూర్చి పెడతారు. నువ్వు ఆ పూజల్లో నిమగ్నమయితే చాలు” అన్నాడు.

తర్వాత గూడెం వైద్యుడు లేని నిలబడి “మురాజీ! మన పూర్వీకుడు, గొప్ప జ్ఞాని అయిన దామూ రాసిన తోకశాస్త్రాన్ని నేను అధ్యయనం చేశాను. అందులో తోక పుట్టుపూర్వోత్తరాల మొదలు ఏ మూలికలతో ఏ పసరు తయారు చేస్తే తోక పొడుగ్గా బలంగా తయారవుతుందో రాసుంది. ఇలాంటి తోక లేని స్థితిని కూడా ముందే ఊహించి దానికి కూడా పరిహార వైద్యాన్ని సూచించాడు ఆ మహానుభావుడు. మనం అతని వైద్య విధానాలతో ప్రయోగాలు చేస్తే ఫలితం ఉండొచ్చు” అన్నాడు.

దానికి మురాజీ “గూడెం వైద్యుడా! నేటి నుంచి నువ్వూ, నీ అనుచరులు వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రయోగాలపై దృష్టిపెట్టండి. మీకు కావాల్సిన వనరులు సమకూర్చి పెట్టే బాధ్యత మాది” అన్నాడు.

మురాజీ కొనసాగిస్తూ, “ఈ సమస్యని పరిష్కరించడానికి ఇంకా ఎవరైనా ఏదైనా చేయగలరా?” అని అడిగాడు.

అప్పుడు రాకీ నిలబడి “మురాజీ తాతా! నేను మాట్లాడొచ్చా?” అని ప్రశ్నించాడు.

మురాజీ “చెప్పు బిడ్డా” అన్నాడు.

రాకీ మాట్లాడుతూ “మనం మన సరిహద్దుకి మూడువైపులా సమస్య పరిష్కారానికి ఎన్నో మార్గాలు వెతికాం. మూలికల కోసం అన్వేషించాం. కానీ నాలుగో దిక్కున ఉన్న ఈ నదికి ఆవలకి ఏనాడూ పోలేదు. అక్కడ ఏముందో మనకెవరికీ తెలియదు. ఒకవేళ అక్కడే మన సమస్యకు ఏదైనా మార్గం ఉంటే? ఆ నది అవతల మనకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అనిపిస్తుంది. అందుకని ఈ నదిని దాటి అన్వేషించడానికి నాకు అనుమతివ్వండి” అని అడిగాడు.

మురాజీ అతని వైపు చూస్తూ “రాకీ బిడ్డా! ఇప్పటికే ఒకసారి జాతి నిబంధనలు మీరి గూడెం దాటివెళ్లి మీ తమ్ముడి చావుకి కారణమయ్యావ్. మనవి ఎంతటి కురచ తోకలో శత్రు తెగకి తెలిసేలా చేసి సెంటా జాతి అవమానపడటానికి కారణమయ్యావ్. మళ్లీ తప్పు మీద తప్పు చేయకు. అయినా ఇప్పటిదాకా మన సెంటా జాతిలో ఏ ఒక్కరూ ఈ నదిని దాటింది లేదు. ఆ ప్రయత్నం చేసినవాళ్లు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఈ నదికి ఆవల పిశాచాలు సంచరిస్తూ ఉంటాయని మన గ్రంథంలో ఒకచోట చెప్పబడింది. ప్రాణాంతకమైన పనికి పూనుకుంటా అంటున్నావు. నేనొప్పుకోను” అన్నాడు.

దానికి రాకీ “తాతా! ఈ తోక వల్ల నా తమ్ముడు సాగోని కోల్పోయాను. ఇప్పుడేమో మన జాతిలో పుట్టిన బిడ్డల్ని పుట్టినట్లే మనమే చంపేసుకుంటున్నాం. ఎన్నో అవమానాలు పడుతున్నాం. వీటన్నింటికంటే శాపగ్రస్తుడినైన నా ప్రాణాలు ఎక్కువేం కాదు. నా ప్రాణాలు ఆ తిరస్కృత గుడిసెలోనే కలిసిపోవడం నాకు ఇష్టం లేదు. నా తమ్ముడి చావులాంటివి ఇక మన జాతిలో ఉండకూడదు. మనం మన తోకలను తిరిగి పొందకపోతే మన జాతే మిగలదు. నన్ను వెళ్లనివ్వండి” అన్నాడు.

క్షణం ఆలోచించిన మురాజీ “సరే! అంగీకరిస్తున్నా. నీతోపాటు మరో నలుగురిని తీసుకుని వెళ్లు” అన్నాడు.

ఆ మరుసటి రోజు రాకీ మరో నలుగురితో కలిసి తెప్ప మీద నది దాటే సాహసానికి పూనుకున్నాడు. వైద్యుడు తన ప్రయోగాల్లో నిమగ్నమైతే, పూజారి పూజలు, మంత్రాలు మొదలుపెట్టాడు. ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటే – సెంటా జాతికి తిరిగి తోకని తెచ్చివ్వాలి.

****

కొన్నాళ్లు గడిచాయి. రాకీ తిరిగి రానేలేదు. అతనితోసహా వెళ్లిన వాళ్లందరూ చనిపోయి ఉంటారని గూడెంలో అందరూ నమ్మారు. పూజారి పూజలు ఫలించడం లేదు. ఇంకా తోకలేని బిడ్డలే పుడుతున్నారు. వైద్యుడి పసరు ప్రయోగం వికటిస్తోంది. గూడెం జనాలు నిస్పృహలో ఉన్నారు. తమ సెంటా జాతి ఇక అంతం అయిపోతుందని దిగులుపడుతున్నారు.

****

అలా రోజులు సాగుతున్న సమయంలో వారు ఊహించని విధంగా రాకీ తిరిగి వచ్చాడు. ఆ నదిని దాటి గూడెంలోకి తిరిగి రావడం మొత్తం సెంటా జాతిలోనే ఎప్పుడూ జరగనిది. గూడెం సంబరాలు మొదలుపెట్టింది.  సంగీతం, నృత్యాలతో ఎన్నో ఏళ్ల తరువాత ఆ గూడెం ఒక కొత్త కళని సంతరించుకుంది. నది ఆవల ఏముందో తెలుసుకోవడానికి గూడెం జనాలంతా ఆసక్తిగా ఉన్నారు.

రాకీ చెప్పడం మొదలుపెట్టాడు – “మేము తెప్పమీద నదిలో బయలుదేరినప్పుడు నా మనసులో ఉన్నది ఒక్కటే – ఈ నదిని చూడాలనే కోరికతో అడవిలోకి వచ్చి, ఈ నదిని చూడకుండానే నదిలో కలిసిపోయాడు నా తమ్ముడు సాగో. ఇక నా జాతిలో ఇలాంటి చావులు ఉండకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని నా ప్రయాణం ప్రారంభించాను. ఆ ప్రయాణం సజావుగా సాగలేదు.

ఆ నది ఉధృతికి మా తెప్ప తుత్తునియలు అయిపోయింది. అయినా మమ్మల్ని అది అటు దరికి చేర్చగలిగింది. అటువైపు అడవిలో మేము నడుస్తూ వెళ్లేకొద్దీ అక్కడి క్రూరమృగాల దాడికి మాలో ఇద్దరు, విషకీటకపు కాటుతో ఒకరు చనిపోయారు. అయినా నేను, జుటా పయనం ఆపలేదు. ఆ అడవిని దాటాక ఒక ఎడారి మొదలైంది. అక్కడ దప్పికకి తాళలేక జుటా కూడా చనిపోయాడు. నేను ఒంటరిగా మిగిలాను.

ఆ ఎడారికి తూర్పువైపుకి తిరిగాక నా కన్నులు ఎన్నడూ చూడని అద్భుతాలను చూశాయి. అదొక సుందర నగరం. అక్కడ ఒక విచిత్ర తెగ జీవులు నివసిస్తున్నారు. వాళ్లంతా స్నేహశీలురు. వాళ్లు ఎల్లప్పుడూ సంతోషంగా సంగీత నృత్యాలతో మునిగి తేలుతూ ఉన్నారు. మనం మన శత్రు తెగ కంటే నాగరికులం అయ్యుండొచ్చు గాక, ఈ నది అవతలి జీవులు మనకంటే ఎంతో నాగరికులు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే -” అంటూ ఆపాడు.

అందరూ అతని వంక ఆసక్తిగా చూశారు.

“వాళ్లలో ఒక్కరికీ తోక లేదు” అన్నాడు రాకీ.

గూడెం జనాలంతా నోరెళ్లబెట్టారు.

రాకీ చెప్పడం కొనసాగించాడు. “ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే, వాళ్లలో ఒక్కరికి కూడా తమకి తోక లేదనే బాధ కొంచెమైనా లేదు.”

గూడెంలో జనాలందరూ అలా నిలబడిపోయారు.

“నేను వాళ్లలో ఒకడిని అడిగాను, తోక లేకపోవడం వల్ల మీకు బాధగా లేదా అని?” అన్నాడు రాకీ.

“ఏం అన్నాడు?” అని ఆత్రుతగా అడిగాడు మురాజీ.

“చెప్తా! అతగాడు నవ్వి ‘మొదట్లో బాధపడ్డాం. ఆ తర్వాత అర్థమైందేమిటంటే, ఒకప్పుడు చెట్లపైన బతికేవాళ్లం గనుక మాకు తోక అవసరం ఉండేది. ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకి దూకేటప్పుడు పట్టు కోసం తోక అవసరం. అయితే నేల మీద నివాసం ఏర్పాటు చేసుకున్నాక, నిటారుగా నిలబడి రెండు కాళ్లపై నడవడం మొదలుపెట్టాక, ఇక తోక అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, తోక ఉంటేనే నడవడానికి ఇబ్బంది పడతాం. మనకి అనవసరమైంది పోతే సంతోషపడాలే తప్ప బాధ పడనక్కర్లేదు’ అని ఆ తెగ మనిషి చెప్పాడు” అని ముగించాడు రాకీ.

ఇదంతా వింటున్న గూడెం ప్రజలకి, మురాజీకి పట్టరాని ఆనందం కలిగింది.

“అంటే.. అంటే.. మనకి తోక లేకపోయినా ఫర్లేదన్నమాట! తోక లేకపోయినా ఏమీ కాదన్నమాట” అంటూ మురాజీ గెంతులేశాడు. అతనితోపాటు సెంటా జాతి మొత్తం  ఈలలు వేస్తూ గెంతింది.

“అవును తాతా! మనకి తోక లేకపోవడమే మన ఎదుగుదలకి గుర్తు” అంటూ మురాజీని హత్తుకోవడానికి వెళ్లబోయాడు రాకీ.

హఠాత్తుగా…

రాకీ దవడ పళ్లు ఊడేలా చెంపమీద దెబ్బ పడింది. అల్లంత దూరానికి ఎగిరిపడ్డాడు రాకీ. ఆ దెబ్బ కొట్టింది గూడెం పూజారి.

“వీడిని తాళ్లతో కట్టెయ్యండి” అని గట్టిగా అన్నాడు పూజారి.

“నీకేమైనా పిచ్చి పట్టిందా?” అని అతనిపై అరిచాడు మురాజీ.

“మీకే పిచ్చిపట్టి వీడి మాటలు నమ్ముతున్నారు. అసలు వీడు మన రాకీనే కాదు. మన తెగని అంతం చేయడానికి నది అవతలి దెయ్యాలు, పిశాచాలు వీడ్ని పట్టి ఇలా మాట్లాడిస్తున్నాయి. వీణ్ని వెంటనే చంపేయకపోతే రాత్రికే మన అందరి రక్తం తాగేస్తాడు” అని గట్టిగా అరిచాడు పూజారి.

“అవును. వీడ్ని చంపెయ్యండి” అంటూ పూజారికి వంత పాడాడు వైద్యుడు.

అక్కడ ఏం జరుగుతుందో గూడెం జనాలకి అర్థం కావడం లేదు.

పూజారి ఆగ్రహంగా “వీడి మాటలు మొత్తం మన  తోకశాస్త్రానికి, వనామా గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అవునా, కాదా చెప్పండి. వాటిలో మన తోకల గొప్పతనం గురించి ఎన్నో రాసి లేవా? తోకలేని బతుకు వృథా అని, తోకలేని వాళ్లు మరణశిక్షకి అర్హులని, చిన్న తోక ఉన్న వాళ్లు వనామా దేవతకి అయిష్టులని రాయబడి లేదా?  మన పూర్వీకులు తోక మహత్యం గురించి కథలు కథలుగా చెప్పలేదా? వాళ్ల కంటే గొప్పవాడా వీడు? అంతెందుకు! స్వయానా మన వనామా దేవతే కేవలం తన తోకతో ఎన్నో అద్భుతకార్యాలు చేయలేదా?

ఇప్పుడు వీడు చెప్పేది మన దేవతకి వ్యతిరేకమైనది కాదా? వీడి మాట విని వనామా దేవతకి కోపం తెప్పించి సర్వనాశనం అవుతారా? లేదా దైవదూషణ చేసిన వీడ్ని ఇక్కడే చంపేసి దేవత అనుగ్రహం పొందుతారా? తేల్చుకోండి” అన్నాడు.

ఇంతలో వైద్యుడి అనుచరులు “ఈ దెయ్యాన్ని చంపండి” అంటూ రాకీ మీదకి రాళ్లు రువ్వారు. వారితోపాటు కొందరు గూడెం జనాలూ జత కలిశారు. ఆ రాళ్ల వర్షానికి రాకీ తల నుంచి ధారాపాతంగా రక్తం కారింది.

గూడెం పెద్ద మురాజీకి ఏం చేయాలో పాలుపోలేదు. రాకీ దగ్గరికి వెళ్లి “బిడ్డా! నువ్వు చెప్పేది నిజంగానే మన దేవతకి, గ్రంథానికి, శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. నువ్వు నది అవతలి జీవుల గురించి చెప్పిందంతా అబద్ధం అని ఒప్పుకో. నీ ప్రాణాలు కాపాడుకో” అన్నాడు.

రాకీ తన తల మీద దెబ్బను అదిమిపట్టుకుని “తాతా! నాకిప్పుడు అర్థమవుతుంది. మనకి తోక అవసరం లేదంటే ఇన్నాళ్లు తోక పేరు మీద వీళ్లకి లభించిన ఉచిత సౌకర్యాలన్నీ ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందేమోననే భయంతోనో లేదా తిరస్కృతుడు తెలుసుకున్న సత్యాన్ని అంగీకరించలేని అహంతోనో ఈ పూజారి, వైద్యుడు ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి వీళ్ల వైపు నిలిచి మన జాతిని నాశనం చేయొద్దు” అని వేడుకున్నాడు.

అప్పుడే సరిగ్గా ఉరుములు ఉరిమాయి. ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినిపించింది.

వెంటనే పూజారి “చూశారా! వనామా దేవత ఆగ్రహం. వనామా మన మీద విరుచుకుని పడటానికి సిద్ధంగా ఉంది.  తోక అవసరం లేదు అనడం అంటే మనకిక వనామా దేవత అవసరం లేదు అన్నట్లే! చెప్పండి. దేవత  లేకుండా మీరు బతకగలరా? నది అవతలి ఈ దెయ్యాన్ని చంపకుండా నాశనం అయిపోతారా?” అన్నాడు.

“మీరు చంపినా సరే, నేను సత్యం వైపే నిలబడతాను. మనకి తోక అవసరం లేదు” అని నిశ్చయంగా అన్నాడు రాకీ.

గూడెం జనాలు ఏకకంఠంతో “ఈ పిశాచిని రాళ్లతో కొట్టి చంపండి” అంటూ అరిచారు.

వాళ్లు విసిరే రాళ్లు అతని తలని, దేహాన్ని ఛిద్రం చేస్తున్నాయి.

పుట్టిన వెంటనే చంపివేయబడ్డ ఆ తోకలేని బిడ్డల తల్లులు కూడా అలా తనపైకి రాళ్లు విసరడంలో భాగం కావడాన్ని చూస్తున్న రాకీ కళ్లలోకి రక్తం చేరింది. తన జాతివాళ్ల రూపం మసకబారుతుండగా వేదనతో కళ్లు మూసుకున్నాడు రాకీ.

అతను ఆ క్షణమే చనిపోయాడు.

****

పూజలు, ప్రయోగాలు కొనసాగాయి. కొన్నాళ్లకి సెంటా జాతిలో తోక పుట్టింది. బలంగా, బరువుగా పెరిగింది. మునుపటికంటే చాలా పొడుగ్గా, మనిషికి రెండింతలుగా పెరిగింది.

సెంటా తరువాతి తరం తమ రోజువారీ పనులకు తోక ఎంతో అడ్డంగా ఉన్నా, గుడిసెలో కనీసం ముడుచుకుని పడుకోవడానికి ఇబ్బంది పెడుతూ ఉన్నా దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.

తోకని మోసుకుంటూ తిరుగుతున్నారు.

ఆ తోకని చూసి గర్వపడుతున్నారు.

దాన్ని పొగుడుతూ కథలు అల్లుతున్నారు.

కీర్తిస్తూ పాటలు రాస్తున్నారు.

చివరికి తామే తోకైపోయారు.

****

 

ఫేస్ బుక్ పోస్టులు కొన్ని కథలు కావచ్చు!

* హాయ్ అజయ్! నీ గురించి చెప్పు.

హాయ్! మా అమ్మానాన్న వాళ్లది తూర్పుగోదావరి జిల్లా. నేను పుట్టకముందే వాళ్లు కర్ణాటకలోని మాన్వి ప్రాంతానికి వెళ్లిపోయారు. నేను అక్కడే పుట్టాను. పెరిగింది, చదివింది అక్కడే! ఇప్పుడు మా వాళ్లంతా రాజమండ్రి దగ్గర కడియం అనే ఊళ్లో స్థిరపడ్డారు. నేను విజయవాడలో ఉంటూ ఒక పొలిటికల్ కన్‌సల్టెన్సీలో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను.

* నువ్వు చదివిందంతా కన్నడ మీడియంలో. మరి తెలుగు ఇంత బాగా ఎలా రాయగలుగుతున్నావ్?

ఉన్నది కర్ణాటకలోనే అయినా ఇంట్లో మాట్లాడేదంతా తెలుగే! కన్నడ లిపి, తెలుగు లిపి దాదాపు ఒకేలా ఉంటాయి. చిన్నప్పుడు ప్రతి ఆదివారం పత్రికల్లో వచ్చే పదవినోదం నింపేవాణ్ని. అలా తెలుగు రాయడం, చదవడం అలవాటైంది.

*  చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేవాడివా?

నిజం చెప్పనా? ఇంటర్మీడియట్ పూర్తయ్యేదాకా నేను ఒక్క తెలుగు పుస్తకం కూడా చదవలేదు. కాకపోతే ఈనాడు ఆదివారం అనుబంధం, స్వాతి వారపత్రికల్లో కథలు చదివేవాణ్ని. మా అమ్మకు చదువు రాదు. తనకోసం ఆ కథల్ని గట్టిగా చదివి వినిపించేవాణ్ని. ఇంటర్ తర్వాత ఒకసారి మా ఊర్లో మా ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. వాడు ఎంతకీ రావడం లేదు. పక్కనే మున్సిపల్ లైబ్రరీ ఉంది. అందులోకి వెళ్లాను. అన్నీ కన్నడ పుస్తకాలే ఉన్నాయి. మధ్యలో ఒక తెలుగు పుస్తకం కనిపించింది. అది యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ‘విజయం వైపు పయనం’. తీసి చదవడం మొదలుపెట్టాను. చాలా నచ్చింది. అక్కడికక్కడే లైబ్రరీ కార్డ్ తీసుకుని, ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి చదివాను. అదే నేను చదివిన మొదటి తెలుగు పుస్తకం. ఆ తర్వాత సీఏ చేయడం కోసం విజయవాడ వచ్చాక సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో యండమూరి గారివి ఇంకొన్ని పుస్తకాలు కొన్నాను. అలా పుస్తకాలు చదవడం మొదలైంది.

* మొదటి కథ ఎప్పుడు రాశావ్? ఆ అనుభవం గురించి చెప్పు.

నాకు తెలిసిన ఒక అమ్మాయికి పోలియో ఉంది. తన శరీరానికి అంగవైకల్యం ఉంది కానీ మనసులో కోరికలు అలాగే ఉంటాయి కదా! వాటి సంగతేమిటి? అలాంటి వ్యక్తికి ఒక తమ్ముడు ఉండి తన పరిస్థితి అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించాను. అలా ‘ఊర్మిళక్కతో సెక్స్’ కథ పుట్టింది. 2021 మే 11న దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. చదివిన చాలా మంది బాగుందన్నారు. కథ టైటిల్ విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వేంపల్లె షరీఫ్ గారి సంపాదకత్వంలో వెలువడిన 40 మంది యువ రచయితల కథల సంకలనంలో ఆ కథ ప్రచురితమైంది.

* నీకు బాగా పేరు తెచ్చిన కథ ‘మల్లెపూలు’ కదా? దాని నేపథ్యం ఏమిటి?

‘ఊర్మిళక్కతో సెక్స్’ కథ రాసిన ఏడాది తర్వాత ఈ కథ రాశాను. మా కుటుంబం ప్రస్తుతం కడియంలో ఉంటుందని చెప్పాను కదా! ఆ ఊరు పూలసాగుకు ప్రసిద్ధి. ప్రతి ఇంట్లో పువ్వులు కనిపిస్తాయి. వాటిని చూసిన అనుభవం ఉంది. అలాగే విజయవాడ బందరు కాల్వ దగ్గర కొందరు వేశ్యలు తల్లో పూలు పెట్టుకొని కనిపిస్తారు. అక్కడెక్కడో కడియంలో కట్టిన పూలు ఇక్కడ వీళ్ల తల్లోకి రావడం అనే ఊహతో ఒక కథ అల్లకున్నాను. అలా ‘మల్లెపూలు’ కథ పుట్టింది. 2022 జూన్ 15న సారంగలో ప్రచురితమైంది.

* ‘మల్లెపూలు’ కథలో ప్రధాన పాత్ర మల్లిక పాత్రకు ఏదైనా ఇన్స్‌పిరేషన్ ఉందా?

ప్రత్యేకంగా ఏమీ లేదు. మల్లిక అనే పాత్ర చాలా అమాయకురాలు. తన జీవితంలో తను సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏదీ లేదు. జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లిన మనిషి తను. తనపై అత్యాచారం చేసిన వాళ్లనీ ఏమీ అనదు‌. మరొక అమ్మాయిపై వాళ్లు అఘాయిత్యం చే‌సి ఎన్‌కౌంటర్‌లో చనిపోతే “యే? రోజూ ఆ పనికి నేనెలాగూ వుంటున్నాను, నాతో సరిపెట్టుకోవచ్చు కదా! ఇంకో ఆడపిల్ల జోలికి పోయి ఇలా పేనాలు పోగొట్టుకునే బదులు. పిచ్చినాయాళ్లు కాకపోతీనీ” అనుకుంటుంది. నాలోని కొంత Innocenceనే ఆ పాత్రలో చూపించానేమో అనిపిస్తుంది.

* నీ మూడో కథ ‘తొలి ప్రయోగం’ చాలా భిన్నమైన అంశం. దాని గురించి చెప్పు.

స్వయంతృప్తి/హస్తప్రయోగం(Masturbation) అనేది అత్యంత సహజమైన విషయం. 98 శాతం మంది పురుషులు, అంతకంటే కాస్త తక్కువ స్థాయిలో స్త్రీలు చేసుకుంటారు. కానీ దాని గురించి మాట్లాడటానికి అందరూ వెనుకాడతారు. ఆ అంశంపై నాకు కథ రాయాలనిపించింది. అలా ‘తొలి ప్రయోగం’ రాసి ఫేస్‌బుక్‌లోనే పోస్ట్ చేశాను. ఎక్కడా ఒక్క అభ్యంతరకర పదం ఉండదు. అందులో 90 శాతం నిజంగా జరిగిందే! కర్ణాటక రాష్ట్రం ఎర్రమలదొడ్డిలో నాకు జరిగిన అనుభవం అది. ‘నేను వెళ్లి టిఫిన్ చేసి వస్తాను’ అనేంత మామూలుగా ”నేను వెళ్లి హస్తప్రయోగం చేసుకుని వస్తాను” అని అనగలిగే స్థితి రావాలి.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నేను రాసిన ఫేస్‌బుక్ పోస్టుల్లో చాలా అంశాలు కథలయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్నింటిని కథలు చేయాలని ఉంది.

*

చిన్నీ అజయ్

పేరు అజయ్. మూలాలు తెలుగే అయినా, పుట్టిపెరిగింది, డిగ్రీ వరకు చదువుకున్నది కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి అనే ఊరిలో. బెంగళూరులో ఒక బహుళజాతీయసంస్థలో మూడేళ్లు ఉద్యోగం చేశాను. ప్రస్తుతం కడియం లో ఉంటూ ఒక ఎన్జీవో తరపున మూడేళ్ళ నుంచి ఫ్రీలాన్స్ ట్రైనర్‌గా పని చేస్తున్నాను.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి వైవిధ్యమైన కథ చదివాను. నర్మగర్భంగా చెప్పాల్సింది చెబుతూ సరళంగా సాగిన మీ శైలి చాలా బాగుంది.

  • మానవ పరిణామ క్రమం గురించి కదా ఏమో అనుకున్న చివరికి వచ్చేసరికి తోక సౌకార్యాలు వదులుకోలేని మనుషుల లోగట్టు పై సర్జికల్ స్ట్రైక్ అని అర్ధం అయింది.

  • మానవ పరిణామ క్రమం గురించి ఏమో అనుకున్న చివరికి వచ్చేసరికి తోక సౌకార్యాలు వదులుకోలేని మనుషుల లోగట్టు పై సర్జికల్ స్ట్రైక్ అని అర్ధం అయింది.

  • చాలా బాగుంది కథ. వర్తమాన పరిస్థితిపై మంచి సెటైర్.

  • ఆసక్తిగా వుంది.
    ఆపకుండా చదివించింది.
    మనందరం ప్రస్తుతం బలమైన మూఢ నమ్మకాల తోకలతోనే జీవిస్తున్నాం. ఈ ‘తోక’లు లేని పశ్చిమ దేశాలన్నీ ఎంతో ముందుకెళుతుంటే.. మనం మాత్రం తోకల్ని చుట్టుకుని “ఆహా నా తోకెంత లావో.. ఎంత పొడవో” అని మురిసిపోతూ మన ‘పనామా ‘ దేవతల చెరసాలలో మగ్గిపోతున్నాం.
    రోజు రోజుకు బలీయమవుతున్న తోకలను చూసుకుంటూ మురిసిపోదామా?
    లేక..
    సిగ్గు పడదామా?
    చక్కని సింబాలిక్ కథాంశం.
    అజయ్ కి హృదయపూర్వక అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు