తొలి స్వాతంత్య్రపోరాటం రాయలసీమలో జరిగిందా?!

సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తొలి స్వాతంత్య్రపోరాటం రాయలసీమలో జరిగిందనేందుకు మూడు ఆధారాలను రచయిత మనముందుంచారు.

1857 సిపాయిల తిరుగుబాటే తొలి స్వాతంత్య్రపోరాటమని అందరం చరిత్ర చదువుకున్నాం. అది నిజమని కూడా నమ్మాం. కానీ అంతకు ముందే రాయలసీమలో స్వాతంత్య్రపోరాటం జరిగిందని, ఎందరో సమరయోధులు ప్రాణత్యాగం చేశారనే విషయం చరిత్రకారులు ఆధారాలతో సహా తమ పరిశోధనలను వెలికితీసి సమాజానికి అందిస్తే తప్ప నిజమని నమ్మలేదు.

రాయలసీమ జిల్లాల్లో స్వరాజ్యపోరాటం ఆధారంగా వచ్చిన నవలలు కర్నూల్లో మినహా ఇప్పటివరకు నా పరిశీలనకు, నా పరిశోధనకు అందలేదు. ఆధారాలు లభిస్తే వచ్చే శీర్షికల్లో రాసే ప్రయత్నం చేస్తాను. కర్నూలుకు చెందిన చారిత్రక నవలాకారుడు యస్‌డివి అజీజ్‌ లోతుగా పరిశోధించి ఆధారాల కోసం దేశవ్యాప్తంగా తిరిగి మూడు అద్భుతమైన నవలలను అందించారు. ఆ మూడు నవలలు సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తొలి స్వాతంత్య్రపోరాటం రాయలసీమలో జరిగిందనేందుకు మూడు ఆధారాలను రచయిత మనముందుంచారు.

1. తెర్నేకంటి ముట్టడి-ముత్తుకూరు గౌడప్ప

ఈ నవలలో యస్‌డివి అజీజ్‌ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని తెర్నేకల్లు గ్రామంలో ముత్తుకూరు గౌడప్ప గూర్చి నవలగా రాశారు. 1800 లో రాయలసీమలో పాలెగాళ్ళ పాలన కొనసాగుతున్న రోజుల్లో భూములన్నీ పాలెగాళ్ళ అధీనంలో వుండేవి. పాలెగాళ్ళ అధీనంలోని భూములను థామస్‌ మన్రో రైతులకిచ్చాడు. భూమికి యాజమాన్య హక్కును కల్పించాడు. రైత్వారి విధానం ప్రవేశపెట్టాడు. పంటకు శిస్తు రూపంలో డబ్బును గ్రామ కరణాలకు, రెడ్లకు కట్టాలని మన్రో ఆదేశించాడు. ఈ క్రమంలో పత్తికొండ ప్రాంతంలోని తెర్నేకల్లు గ్రామస్తులు వ్యతిరేకించారు. పత్తికొండలో శిస్తులు చెల్లించలేమన్నారు. శిస్తులను శ్రీనివాసరావు అనే రెవెన్యూ అధికారి వసూలు చేసి బ్రిటీష్‌వారికి పంపేవాడు.

పంటపండినా, పండకపోయినా శిస్తు చెల్లించాలంటే తమ వల్ల కాదని తెర్నేకల్లు గ్రామస్తులు తేల్చి చెప్పడంతో గ్రామపెద్ద ముత్తుకూరు గౌడప్పకు శ్రీనివాసరావుకు మధ్య ఘర్షణ జరిగింది. దక్షిణభారతదేశంలో భూమి శిస్తుకు వ్యతిరేకంగా రైతులు చేసిన తొలిపోరాటం కూడా ఇదే. శ్రీనివాసరావు ఘర్షణ విషయాలను బళ్ళారి మిలిటరీ అధికారి థాకర్‌కు చెప్పాడు. కన్నెర్ర జేసిన థాకర్‌ సైన్యంతో తెర్నేకల్లును ముట్టడించాడు. ముత్తుకూరు గౌడప్ప నాయకత్వాన 15రోజుల పాటు హోరాహోరిగా యుద్దం జరిగింది. బ్రిటీష్‌ సైన్యం తుపాకులతో కోటగోడను బద్దలు కొట్టింది. సుమారు 400 మంది తెర్నేకల్లు వాసులు చనిపోయారు. గ్రామంలోని కుక్కలబావిలో శవాలను పారేసి తగులబెట్టారు. ముత్తుకూరి గౌడప్పను ఉరితీశారు. అంటే సిపాయిల తిరుగుబాటు కంటే ముందు జరిగిన స్వాతంత్య్రపోరాటానికి సంబంధించి తొలి ఆధారం ఈ తెర్నెకంటి ముట్టడి.

2. ‘గులాం రసూల్‌ ఖాన్‌’:

యస్‌డివి అజీజ్‌ రెండవ ఆధారమని రాసిన నవల గులాం రసూల్‌ ఖాన్‌. 1799లో కేరళ, తమిళనాడు,కర్నాటకతో పాటు రాయలసీమ కూడా టిప్పు సుల్తాన్‌ అధీనంలో వుండేది. నాల్గవ మైసూర్‌ యుద్ధంలో అందరు కలసి టిప్పును ఓడించారు. రాయలసీమ ప్రాంతం నిజాం అధీనంలోకి వచ్చింది. రాయలసీమలో నిజాం నవాబు బ్రిటీష్‌ వారిని అదనపు బలగాన్ని ఏర్పాటు చేయమన్నాడు. దానికి అంగీకరించిన బ్రిటీష్‌ వారు ఏటా 24 లక్షలు చెల్లించాలన్నారు. కట్టడం చేతకాని నిజాం రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారికి 1800 అక్టోబర్‌ 12న లీజుకిచ్చాడు.

బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ ప్రాంతానికి థామస్‌ మన్రోను 30వేల సైన్యంతో రాయలసీమకు పంపింది. పాలెగాళ్ళపై మన్రో దాడులు చేసి ఎదురుతిరిగిన వారిని గుత్తికోటలో బంధించాడు. ఈ క్రమంలో కర్నూలు, బనగానపల్లె జాగీర్లు బ్రిటీష్‌ వారితో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా పాలన నవాబులది, పర్యవేక్షణ బ్రిటీష్‌ వారిది. 1823లో గులాం రసూల్‌ ఖాన్‌ పాలనకొచ్చాడు. 1832లో సయ్యద్‌ బర్వేలి ఆధ్వర్యంలో వహాభి ఉద్యమం జరుగుతుండేది. ఈ క్రమంలో దక్షిణాదిన ఇద్దరు ప్రతినిధులను నియమించుకున్నారు. నిజాం నవాబు తమ్ముడు ముబరిజు దౌలా, కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు గులాం రసూల్‌ ఖాన్‌కు ఆయుధాలను తయారు చేసే పనిని వారికి అప్పగించారు. దక్షిణ భారతదేశంలో జరిగే స్వాతంత్ర పోరాటానికి గులాం రసూల్ ఖాన్ ఆయుధాలు తయారుచేసి పంపేవారు. గుఢాచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటీష్‌ వారు కల్నల్‌ డైస్‌ను పంపారు.

బళ్ళారి నుంచి బ్రిటీష్‌ సైన్యంతో వచ్చి కర్నూలు కోటను ముట్టడించారు. కర్నూలు దగ్గర జోహరాపురం గ్రామ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో గులాం రసూల్‌ఖాన్‌ పట్టుబడ్డాడు. అతణ్ణి తమిళనాడులోని తిరుచినాపల్లి జైలులో బంధించారు. గులాంరసూల్‌ఖాన్‌ను ఉరితీస్తే ప్రమాదమని భావించి 1840 జూలై 12న సేవకునితో ఆహారంలో పెట్టించి గులాం రసూల్‌ ఖాన్‌ను చంపారు. అది కర్నూలు జిల్లాకేంద్రంలో దేశ స్వాతంత్య్రానికి తుపాకులు సరఫరా చేయడం గమనార్హం. నవలలో అజీజ్‌ దీన్ని రెండో ఆధారంగా పేర్కొన్నారు.

3.పాలెగాడు-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

యస్‌డివి అజీజ్‌ మూడవ ఆధారమని రాసిన నవల పాలెగాడు. ఇది 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రాసిన నవల. ఒక్కోక్క ప్రాంతాన్ని వశం చేసుకుంటున్న ఆంగ్లేయులు ఉయ్యాలవాడనూ వశం చేసుకున్నారు. నరసింహారెడ్డి మాతా మహుడైన నొస్సం జమీందారు జయరామిరెడ్డి నుంచి 22 వేల రూపాయల రెవెన్యూ ఆదాయం వచ్చే జాగీరును సైతం బ్రిటీష్‌వారు లాక్కొని నరసింహారెడ్డికి నెలకు వెయ్యి రూపాయల పింఛన్ను ఏర్పాటుచేశారు.

నరసింహారెడ్డి తనకు రావలసిన పింఛను కోసం కోవెలకుంట్ల తహశీల్దారు వద్దకు బంట్రోతును పంపాడు. తహసీల్దార్ బంట్రోతును తిప్పి పంపాడు. కోపంతో రగిలిపోయిన నరసింహారెడ్డి 1846 జూలై నాటికి ప్రజలను సమీకరించుకొని తిరుగుబాటుకు సమాయత్తమయ్యాడు. దీంతో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనపై నిఘా వుంచింది. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా సైన్యం సిద్ధం చేశాడు. మాన్యాలు పొగొట్టుకున్నవారు, వనపర్తి, మునగాల, పెనుగొండ, అవుకు జమీందారులు హైదరాబాద్‌ గులాంజాన్‌, కర్నూలు పాపాజాన్‌, బనగానపల్లె నవాబు మహమ్మద్‌ అలీజర్‌తోపాటు బ్రాహ్మణులు, బోయలు, చెంచులు, యానాదులు, వడ్డెరులు నరసింహారెడ్డి సైన్యంలో చేరారు.1846 జూలై 7,8 తేదీలలో నరసింహారెడ్డి సైన్యం చాగలమర్రి తాలూకా, రుద్రవరం గ్రామంపై దాడిచేసి వెళ్తుండగా బ్రిటీష్‌ ప్రభుత్వ సిబ్బంది ఎదుర్కొన్నారు. నరసింహారెడ్డి సైన్యం వారిని చంపేసింది.

జూలై 10వ తేదీన కోవెలకుంట్ల ట్రెజరీపై దాడిచేసి అందులోని 805 రూపాయల 10 అణాల 4 పైసల మొత్తాన్ని తీసుకొని పోయాడు. అడ్డొచ్చిన దఫేదారును, ఆరుగురు పోలీసులను చంపేశాడు. అంతేకాక తహశీల్దారు రాఘవచారిని బంధీగా తీసుకుపోయాడు. జమ్మలమడుగు ట్రెజరీపై కూడా కన్నువేశాడు. బ్రిటీష్‌ సైన్యం నలువైపులా వస్తుందని తెలిసి విరమించుకున్నాడు. ఉయ్యాలవాడ అప్పుడు కడప జిల్లాలోనిదే. లెఫ్ట్‌నెంట్‌ వాట్సన్‌ నాయకత్వంలో గిద్దలూరు వద్ద బ్రిటీష్‌ సైన్యానికి నరసింహారెడ్డి సైన్యానికి మధ్య హోరాహోరి యుద్ధం 5 గంటల పాటు జరిగింది. ఈ యుద్ధంలో నరసింహారెడ్డి సైన్యం 5వేల మంది పాల్గొనగా 200 మంది మరణించారు. నరసింహారెడ్డి సమయస్ఫూర్తితో తప్పించుకొని తన ముఠాతో ముండ్లపాడుకు వెళ్ళిపోయాడు. ముండ్లపాడుకు బ్రిటీష్‌ సైన్యం వచ్చింది. ఆ సమయంలోనే కంభం తహశీల్ధార్‌ జంగంరెడ్డి శ్రీనివాసరావును నరసింహారెడ్డి మనుషులు కాల్చి చంపి ఆడవుల్లోకి పారిపోయారు. యుద్ధంలో దొరికిన నరసింహారెడ్డి మనషుల్ని బ్రిటీష్‌ సైన్యం చిత్రహింసలకు గురిచేసింది.

నరసింహారెడ్డి అన్న కుమారుడు మల్లారెడ్డి బ్రిటిష్‌ వారికి అనుకూలంగా పనిచేశాడు. బ్రిటీష్‌వారు నరసింహారెడ్డి కుటుంబాన్ని మిలిటరీ పర్యవేక్షణలో కడపకు తరలించి ఒక బంగళాలో బంధించారు. నరసింహారెడ్డి అన్నకు వస్తున్న పింఛన్‌ను రెండింతలు పెంచారు. ఒక పక్క నరసింహారెడ్డిపై గాలింపు ఆపలేదు. అడవులు, కొండలు వెతికి అనుమానంతో సుమారు 600 మందిని జైళ్ళల్లో బంధించారు.నరసింహారెడ్డిని పట్టించిన వారికి వెయ్యి రూపాయల బహుమతి బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ముఠాలోని గోసాయి వేంకయ్య, కరణం అశ్వత్థామ, దాసరి రోశిరెడ్డి, జంగం మల్లయ్యలలో ఎవరిని పట్టిచ్చినా బహుమతి ఇస్తామని ప్రకటన వేశారు.

నరసింహారెడ్డి బృందంలోని వారిని పట్టుకొని సమాచారం తెలుసుకొని ఎర్రమల కొండల్లోని జగన్నాథ దేవాలయంలో దాగి వున్న నరసింహారెడ్డిని 1846 అక్టోబర్‌ 6వ తేదీన ఆంగ్ల సైనికులు, కలెక్టర్‌ కాక్రేన్‌ చుట్టుముట్టి కాల్పుల వర్షం కురిపించారు. బ్రిటీష్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకు సైన్యంలో కొంతమందిని చంపినందుకు 1847 జనవరి 9వ తేదీన నరసింహారెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ, ఉరి తీసిన తర్వాత తలను కోయిలకుంట్ల దగ్గరి బురుజు వద్ద వేలాడదీయాలని తీర్పు చెప్పారు. చుట్టుపక్కల ప్రతి పల్లెకు చాటింపు వేయించి 1847 ఫిబ్రవరి 22వ తేదీన సోమవారం ఉదయం 7 గంటలకు కలెక్టర్‌ కాక్రేన్‌ రెండువేలమంది ప్రజల సమక్షంలో నరసింహారెడ్డిని ఉరితీసి, శిరస్సును వేలాడదీయించాడు. ఆంగ్ల ప్రభుత్వ దురహంకారికి ఉగ్రనరసింహుడు బలయ్యాడు. ఇది మూడవ ఆధారంగా ఆజీజ్‌ తన తన నవలలో పేర్కొన్నారు.

ఈ మూడు నవలలు సిపాయిల తిరుగుబాటుకంటే ముందు రాయలసీమలో స్వరాజ్య పారాటం సాగించాయని ఆధారాలతో సహా నిరూపించాయి. నాల్గవ నవల వందేమాతరం పేరుతో కర్నూలుకు చెందిన కెయన్‌యస్‌ రాజు రాశారు. ఆ నవల అహింసాయుత స్వాతంత్య్రపోరాటంగా 1905 లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు నిర్వహించిన వందేమాతరం ఉద్యమంగా జరిగిన తీరును వివరిస్తూ నవలీకరించారు. ఇది కూడా స్వాతంత్ర పోరాటం ఆధారంగా రాసిన నవలే.. ఇలా సాహిత్య లోకానికి స్వాతంత్రోద్యమ చరిత్రను అందించిన ఘనత యస్ డీ వి అజీజ్ కే దక్కుతుంది.

*

కెంగార మోహన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలుగు స్వతంత్ర పోరాట యోధులు గురించి వారి పోరాట పటిమ గురించి కూలంకషంగా పరిశోధించి ఎస్ డీ వి అజీజ్ గారు మూడు నవలలపై కెంగార మోహన్ గారు సమీక్షించిన వ్యాసము ఆసాంతం ఆసక్తిదాయకంగా ఉన్నది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు