మొదట అచ్చయిన కవిత ఎవరికైనా మురిపెం మూట కడుతుంది. అర్ధ శతాబ్దం తరువాత వెనకకి తిరిగి చూసుకోవటం, తెలిసీ తెలియని ఔత్సాహిక చేష్టలు తలపులోకి తెచ్చుకోవటం చిత్రంగా వుంటుంది. ఒక తన్మయం, అంతటిదే విస్మయం కలుగుతుంది. అచ్చులో పేరు చూసుకోవటం ఎంత హుషారు, ప్రయాణానికి పచ్చ జెండా కదా – మనకు మనమే ఊపుకోవటం, ఉత్సాహ పరచుకోవటం. ఉద్వేగమే లోకం. నడిచి వచ్చిన ప్రయాణాన్ని సమీక్షించుకోవటంలో తొలినాటి మురిపెం విలువ తూచలేనిది.
పద్యం పరిచయమైనంత తొందరగా వచనం పరిచయం కాలేదు. ప్రాథమిక పాఠశాల నుండే పద్యం ఆకర్షించింది. తెలుగులో పద్యం కంఠస్థం చేయించే పధ్ధతి పాఠ్యపుస్తక రూపాకల్పనలోనే ఉన్నది. అప్పటికి ఒకటి రెండు గేయాలు పుస్తకాలలో చోటు చేసుకున్నా వచన కవిత మాట కూడా వినిపించేది కాదు.
మా చిన్న గ్రామంలో పద్యమో, కీర్తనో పాడగా, జానపద గేయాలు పాడగా విన్నాం కానీ – వచన కవితలు చెవిన సోకే అవకాశం లేకపోయింది. ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా వచ్చిన అష్టకాల నరసింహ రామ శర్మ పద్య కవే కానీ – వచన కవితల ప్రస్తావన చేయలేదు. నా పద్య రచన తీరు చూసి ‘ఋతుచేతన’ అనే నలుగురు వచన కవుల సంపుటొకటి యిచ్చాడు గానీ, అంత ప్రభావం చూపలేకపోయింది అప్పట్లో. రేడియోలో సినారే చదివిన మగ్ధూం స్మారక కవిత విన్నా, దాన్ని వచన కవిత అంటారని తెలియదు – తిలక్ కవిత “వెళ్లిపోండి! వెళ్లిపోండి” అనేక మార్లు మా బాపు నోట విన్నా, ఆయన దాన్ని ‘మూగ పాట’ అని రాసుకోవడం వల్ల దాన్ని పాటలాగా పాడటం వల్ల మనసులోకి వచన కవిత చొరబడలేదు.
పోనీ – ఏదో ఒక ప్రక్రియ అనుకున్నా మన రచన పత్రికలు అచ్చు వేస్తాయనే జ్ఞానం కూడా లేదు. ఎవరూ చెప్పలేదు. స్వయంగా ఏ దాత సహాయంతోనో పుస్తకంగా అచ్చు వేసుకునే విషయమే తెలుసు. మా వూర్లో గానీ పక్క వెల్కటూరులో గానీ కవులు ఎవరూ లేరు. ఉపాధ్యాయులెవరూ ‘అచ్చు’ ‘ప్రచురణ’ అన్న మాట తెలిసిన వాళ్లు కాదు. ఏదో ఒక పత్రికలో కవి పేరు కనబడ్డా వాళ్లంతా గొప్ప వ్యక్తులనే భావన వుండేది. కవిత్వం రాస్తే అట్లా మన పేరు కూడా అచ్చులో చూసుకోవచ్చుననే ఊహగాని సోయిగాని లేని రోజులవి. మంచినీళ్ళబాయి సిమెంటు గోడకు చాక్ పీసుతో పేరు రాసుకుని పరవశించే అమాయక బాల్యమది. పంచాయతీ గ్రంధాలయానికి ప్రభుత్వం పంపించిన రెండు వందల గ్రంధాలన్నీ చదివి పడేసినా ‘అచ్చు’ స్పృహ కలగలేదు. పత్రికలల్లో అచ్చు వ్యవహారం తెలియదు. పుస్తకంగా ముద్రించుచుకునే స్థోమత లేదు.
గ్రామాలనుంచి బయల్దేరి సిద్దిపేట లాంటి పట్టణ జీవితంలోకి ఇంటర్మీడియేట్ కోసం వచ్చినప్పుడు అంతా కొత్త. అంతా అబ్బురం. చిందు భాగోతాలు చూసిన అనుభవం తప్ప సినిమా అనుభవం అరుదు. సినిమా విపరీతంగా ఆకర్షించి కవిత్వం వెనుకబడిపోయింది. రెండేళ్ల కాలం శాఖా గ్రంధాలయం, కళాశాల గ్రంధాలయం తెలియకుండా సినిమా మింగింది.
1973లో మళ్ళా మనసు కవిత్వం వైపు మళ్ళింది. శాఖా గ్రంధాలయం ఆకర్షించింది. గ్రంధాలయ వార్షికోత్సవాలలో ఒక రోజు కవి సమ్మేళనం హాజరయ్యాను. నేను చదవలేదు. చొరవలేదు. కానీ – అందరినీ వినే అవకాశం. మహమూద్ పాషా చదివిన తీరు ప్రత్యేకంగా తోచింది. ఏదో ఆకర్షణ. ఏదో గుర్తింపు. కవిత్వం వల్ల గుర్తింపు. స్నేహం. ఉత్సాహం. తపన.
1974 నా జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం. మహమూద్ పాషాతో మైత్రి బలపడింది. కవిత్వమంటే ఎంత మోహమో తనకు. కవులంటే ప్రేమ. పాషా నన్ను తీసుకెళ్లి భగవంత రెడ్డితో బంధం ఏర్పరిచాడు. గ్రంధాలయంలో దొరికిన శ్రీశ్రీ, తిలక్ లు, భగవంతరెడ్డి ద్వారా దొరికిన దిగంబర కవులు, విప్లవ కవులు కవిత్వ రచనను తీవ్రతరం చేసారు. కొత్త ప్రపంచంలో కొత్త మత్తు.
ఒక రోజు మహమూద్ పాషా ఇంటికి వెళ్లాను. కవిత్వ ఉత్సాహ ఉద్వేగ సంభాషణల్లో తను ఒక నోట్ బుక్ చేతికి ఇచ్చాడు. అందులో రాసిన కవితలు తక్కువ. రాయాలని పెట్టుకున్న శీర్షికలు ఎక్కువ. పేజీ పేజీకి శీర్షిక రాసి పెట్టుకున్నాడు. అందులో ఒక పేజీ ‘బిచ్చగాడు’ శీర్షిక కింద ఖాళీ. నన్ను ‘బిచ్చగాడు’ ఆకర్షించాడు. కవిత రాయనా అన్నాను. రాయమన్నాడు. ఐదు లైన్లు రాశాను. పాషాను రాయమన్నాను. నాలుగు పంక్తులు రాశాడు. మరిన్ని పంక్తులు ప్రాసలు కూరుస్తూ రాసి ముగించాను. కవిత పూర్తయింది. ఇద్దరం సంతోషించాం. నేనే ఫెయిర్ చేసాను. జంట రచన.
స్థానికంగా ‘మాతృభూమి’ పక్ష పత్రిక వెలువడేది. డాక్టర్ దామోదర్ రావు సంపాదకుడు. ఆఫీసు తెలుసన్నాడు పాషా. అచ్చుకు ఇద్దామనుకున్నాం. ఇద్దరం వెళ్ళాం. అరగంట నిరీక్షణ తర్వాత దామోదర రావు వచ్చాడు. పాషా నన్ను పరిచయం చేశాడు. కవితను అతనికందించాడు. మెచ్చుకున్నాడు సంపాదకుడు.
పదిహేను రోజులు నిరీక్షణే ప్రతిరోజూ. తరచుగా క్రమం తప్పే పత్రిక అది. నెలకు వచ్చింది. మా కవిత వచ్చింది. పేరు చూసుకొని కవిత చూసుకొని మురిసిపోయాం. మార్చి మార్చి చూసుకున్నాం. మనసంతా ఆనందం. పరవశం.
తొలి అచ్చు ప్రతి నేను పోగొట్టుకున్నాను. పాషా భద్రంగా దాచుకున్నాడు. ఇటీవలే సేకరించాను. అఫ్సర్ అడిగాడు. మొదటి ముద్రణ మురిపానికి తురిమిన వాక్యాలివి.
*
Add comment