అడవిచెట్ల క్రింద
ప్లాస్టిక్ వాసన తెలియని
ఆరుబయళ్ళు.
అన్నీ ఎగుడుదిగుడు
ఆకుపచ్చ మైదానాలే!
దొర్లిదొర్లి అక్కడే నిలిచిపోయిన
నాకళ్ళు గోల్ఫ్ బంతులు.
Lexington ఓ నందనోద్యానం.
ఎరుపునిగ్గులు చిందించే
తెల్లనిపాలరాతి శిల్పాలు.
పొట్టినిక్కరు పడతులు
రంభకు తనూజలు.
సుందరనగరం బోస్టన్!
విశ్వమేధావులు
గూళ్లు నిర్మించుకొనే చోటు.
కులమత ఘర్షణలు,
అరిషడ్వర్గాలు లేని నేల.
స్వేచ్ఛావతి క్రీడాస్థలి.
ఆనందో బ్రహ్మ అంటూ,
పనిలోపనిగా వ్యాయామం.
చిరకాలం జీవించటమే
లక్ష్యం.
వీరికి దేహమే దేవాలయం.
ఉదయస్తమయాల మధ్య
కాలం ఎలానడుస్తుందో
నిరంతరాయంగా,
అంతేనిశ్శబ్దంగా
నిత్యకృత్యాల మధ్య
పరుగెడుతున్న రైలుబండి.
లోపల నేను!
టెక్నాలజీ కంటితో
రాజ్యాంగం పహారాకాస్తుండగా
ఆధునిక ప్రమాణాల
ఆకాశహర్మ్యాల మధ్య
అమెరికన్ జీవితం
తేనె తాగుతున్న
సీతాకోకచిలుక.
*
Add comment