తేనెరంగు సూర్యుడొచ్చిన వేళ

కొన్ని అనుభూతులూ మెరుపు క్షణాల ఆల్బమ్..తయారు చేసుకోగలిగితే..ఇదిగో ఈ మైక్రో కథలు!

“చెత్తనా…”

ఆకాశంలో మెరుస్తున్న చందమామ చూస్తూ నాలుగోసారి ఆ మాట అనుకున్నాడు. తిట్టుకుంది మరొకర్ని.. చూస్తోంది చందమామని.

పది రోజుల నుంచి ఆ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నాడు. బైక్ నడిపేటప్పుడు, లిఫ్ట్ ఎక్కేటప్పుడు, క్యాంటీన్‌లో టీ తాగేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, చివరికి బాత్రూంలో కూడా ఆలోచనంతా ఆ ప్రాజెక్ట్ గురించే! ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అతను ఆ రెండు పనుల కంటే ఎక్కువగా ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డాడు.

‘గుడ్ వర్క్’

‘ఎక్సలెంట్’

‘హార్డ్ వర్కింగ్ ఎంప్లాయ్’

ఈ మాటలు వినాలని అతను కోరుకోలేదు. అలాంటివి రావని అతనికి తెలుసు.

“ఇంత చిన్న వర్క్ కోసం పది రోజులా?”

“టూమచ్ టైం టేకింగ్! ఇలాగైతే కష్టం!”

“నాట్ అప్ టు ద మార్క్. నీడ్ మోర్ వర్కింగ్ స్కిల్స్”

ఇవి వినిపించాయి. నేరుగా కాదు. క్యాంటీన్‌లో, పార్కింగ్ ఏరియాలో, ఎక్కడెక్కడో వాట్సాప్ ఛాటింగ్‌లలో.

పని పూర్తి చేసిన ఆనందం, పది రోజుల శ్రమ.. మొత్తం ఒక్క రోజులో ఆవిరి.

‘చెత్తనా…’ చంద్రుణ్ణి చూస్తూ మరోసారి అనుకున్నాడు. సగం కాలి ఆరిపోయిన సిగరెట్‌ని రోడ్డు మీదికి​ విసిరేసి, పరుచుకున్న పరుపు, దుప్పటి దగ్గరకు చేరాడు.

అలారం మోగినట్టు భళ్లున తెల్లారింది. మత్తుగా లేచి కళ్ళు నులుముకుని చూశాడు. ఎదురుగా తేనెరంగులో మెరుస్తున్న సూర్యుడు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టైం అంటే టైం అంటూ ఆకాశంలోకి పరుగెత్తుకొని వచ్చిన సూర్యుడు.

ఐదు నిమిషాలు అలా చూస్తుండిపోయాడు. బాగున్నట్టు అనిపించింది. చెవిలో గుసగుసగా కొత్త సంగతులేవో చెప్తున్నట్టుగా ఉంది. నిన్నటి తాలూకు మత్తు వదులుతోంది. హాయిగా, ఆనందంగా ఉంది. కాసేపటికి పైకి లేచి పరుపు, దుప్పటి సర్దుకుని​ ముందుకు నడిచాడు.

*

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good one! మూడేళ్ల క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసిన ఆ రోజులు కళ్లముందు కదలాడాయి.

  • తప్పుల తడక ఇంగ్లీషు వదిలేసి పూర్తిగా తెలుగులో ఏడిసినా బావుండేది. చెత్తనా….

  • విశి గారి మైక్రో కథ పని ఒత్తిడి లో సిగరెట్టులా కాలిపొతుందని రాసినాట్టు అనిపించింది…. తేనెరంగులో మెరుస్తున్న సూర్యుడు లేపి మల్లి కర్తవ్యాన్ని భోదిన్చినట్టు అనిపించినది….. నాకు ఈ కథ అర్మయ్యిందో కాలేదో తెలియదు కాని అది నా ఫీలింగ్.

  • తేనె రంగు సూర్యుడు వర్ణన బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు